మెయన్ ఫీచర్

‘హుందాగా మరణం’ జీవితంలో భాగమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం, మరణం అనే భావనలను నిర్వచించడానికి తత్వవేత్తలు,వైద్యులు,రచయితలు అనాదిగా అనేక ప్రయత్నాలు చేశారు. జీవితాన్ని, మరణాన్ని వెలుగు-చీకట్లతో వర్ణించారు. ‘జీవితం నిరంతరం కాలే దీపం.. వెలుగు కావాలంటే దీపంలోని ఒత్తి కాలిపోవల్సిం దే, ఒత్తి కాలకుండా వెలుగు సాధ్యం కాదు’ అని స్వామి వివేకానంద పేర్కొన్నారు. జీవితం, మరణం పరస్పర సంభవాలు. ప్రఖ్యాత ఆంగ్లకవి జాన్ డ్రైడన్ ‘జీవితం ఒక మోసం’ అంటారు. అన్నీ తెలిసినా జీవితం అంతిమ లక్ష్యం సమాధి అని చాలామంది చివరి క్షణం వరకూ గుర్తించరు.
హుందాగా , సంతోషంగా జీవించడానికి ఎంత హక్కు ఉందో, మరణించడానికీ అంతే హక్కు ఉందని సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు అందరికీ కనువిప్పు చేస్తోంది. 2005లో ‘కామన్ కాజ్’ అనే సంస్థ దాఖలు చేసిన రిట్ పిటిషన్ (000215/2005) ను విచారించి తుది తీర్పు ఇవ్వడానికి సుప్రీంకు 12 ఏళ్లు పట్టిందంటే ఈ కేసులోని అంశాల తీవ్రత ఇట్టే అర్థమవుతుంది. ‘కామన్ కాజ్’ తరఫున ప్ర ముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించగా, యూనియన్ ఆఫ్ ఇండియా తరఫున సుష్మా సూరి హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎ ఎం ఖాన్‌వల్కన్, జస్టిస్ డిఎం చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం వేర్వేరుగా 538 పేజీల తీర్పును వెలువరించింది. ఈ కేసును విచారించిన ధర్మాసనం పి.రతినాం కేసును , జ్ఞాన్ కౌర్ కేసును కూడా పరిశీలించింది. భారత శిక్షాస్మృతిలోని 309, 306 సెక్షన్ల చెల్లుబాటుతో పాటు అరుణా షాన్‌బాగ్‌కు ‘కారుణ్య మరణం’ విషయంలో అనుసరించిన విధానాన్ని ధర్మాసనం పరిశీలించింది. అనాయాస మరణానికి సంబంధించి అంతర్జాతీయంగా ఉన్న నిబంధనలు, యుకె డిక్లరేషన్, ఎయిరీడేల్ కేసు, ఆస్ట్రేలియా చట్టాలు, ఇతర దేశాల్లోని పద్ధతులు, మానవ హక్కుల కేసుల్లో అంతర్జాతీయ నిర్ణయాలు, యురోపియన్ దేశాల్లో పాటిస్తున్న విధానాలు, లా కమిషన్ అనాయాస మరణాలపై ఇచ్చిన 241వ రిపోర్టు అంశాలను, చికిత్సను నిరాకరించే హక్కు, రాజ్యాంగంలోని 21వ అధికరణం,సామాజిక నైతికత, వైద్యపరమైన నైతికత, వివిధ రాష్ట్రాలు చేసిన సూచనలు, ‘ సొసైటీ ఫర్ ద రైట్ టు డై విత్ డిగ్నిటీ ’ వంటి సంస్థలు చేసిన వాదనలు పరిశీలించాక ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది.
పరోక్ష కారుణ్య మరణాలపై సుప్రీం ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు పెను సంచలనమే. జీవిత చరమాంకంలో ఉన్న రోగి లేదా దీర్ఘకాలంగా అచేతన స్థితిలో ఉన్న వ్యక్తి వైద్య చికిత్సను నిరాకరిస్తూ ముందస్తు వైద్య నిర్దేశం లేదా సజీవ వీలునామా రాయవచ్చని ధర్మాసనం తేల్చి చెప్పింది. హుందాగా జీవించే హక్కులో మరణ ప్రక్రియను సాఫీగా సాగేలా చూడటం ఒక భాగమేనని పేర్కొంది. ముందస్తు వైద్య నిర్దేశాలకు చట్టబద్ధ గుర్తింపు ఇవ్వకుంటే మరణ ప్రక్రియను సాఫీగా సాగేలా చూసే హక్కును కల్పించకపోవడం అవుతుందని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ముందస్తు నిర్దేశం లేదా సజీవ వీలునామాకు సంబంధించి కొన్ని సూత్రాలను రూపొందించి రోగి ముందస్తు సూచనలు ఉన్నపుడు లేని సందర్భాల్లోనూ పరోక్ష మరణం అమలుపై వేర్వేరుగా మార్గదర్శకాలను నిర్దేశించింది. వీటిపై నిర్ణయాధికారాన్ని వైద్య బోర్డులకు అప్పగించింది. ఈ అంశంపై సమగ్రమైన చట్టం వచ్చేవరకూ ఈ మార్గదర్శకాలు అమలులో ఉంటాయని ధర్మాసనంలో తన తరఫున మరో న్యాయమూర్తి జస్టిస్ ఎ ఎం ఖాన్ విల్కర్ తరఫున తీర్పును రాసిన జస్టిస్ దీపక్ మిశ్రా పేర్కొన్నారు. వీరిద్దరు 192 పేజీల తీర్పును వెలువరించారు. మిగతా ముగ్గురు వేర్వేరుగా తీర్పులు వెలువరించినా ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయాలతోనే ఏకీభవించారు.
జీవనం, మరణం అనేవి వేరు చేయడానికి వీలులేని అంశాలనీ తన 134 పేజీల తీర్పులో జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. జీవన సంధ్యలో బతుకు ముగిసిపోయినట్టు అనిపించినపుడు స్వీయ మరణానికి సంబంధించిన ప్రశ్నలు తలెత్తిన సందర్భాల్లోనూ పౌరుల హుందాతనానికి రాజ్యాంగం పరిరక్షణ కొనసాగుతుందని కోర్టు గుర్తించడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. మరణంలో హుందాతనం అనేది రాజ్యాంగంలోని 21వ అధికరణంలో పేర్కొన్న జీవన హక్కులో భాగమే అవుతుందన్నారు. జీవిత చరమాంకంలో ఒక వ్యక్తి హుందాతనాన్ని నిరాకరించడం అంటే అతడికి అర్థవంతమైన మనుగడను తిరస్కరించడమేనని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. వేదన కాలాన్ని తప్పించడానికి ఇది తప్పదని , జీవితానికి గౌరవార్హత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ తిరిగి కోలుకుంటారనే ఆశ లేని వారి విషయంలో ముందస్తు నిర్దేశానికి, స్వీయ నిర్ణయాధికార హక్కుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. వైద్య పురోగతి కారణంగా ప్రాణాధార యంత్రాల సాయంతో రోగుల మరణాన్ని నెలలు, సంవత్సరాలు పాటు సాగదీసే వీలుంది, ఇలాంటి దశలోనే వైద్య చికిత్సను నిరాకరించే హక్కు తెరపైకి వస్తుంది, దీనిని వినియోగించుకునే వ్యక్తి జీవించాలని కోరుకుంటున్నప్పటికీ దీర్ఘకాల యాతనను తప్పించుకోవడానికి శస్తచ్రికిత్సలు , ఔషధాలు లేదా ఇతర చికిత్సల నుండి తనకు విముక్తి కల్పించాలని వాంఛిస్తున్నాడని న్యాయమూర్తి పేర్కొన్నారు. తన శరీరాన్ని ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకునే హక్కు మానసిక ఆరోగ్యం సరిగా ఉన్న ప్రతి వయోజనుడికీ ఉంటుందనే అమెరికా కోర్టువ్యాఖ్యను కూడా ప్రధాన న్యాయమూర్తి ఉదహరించారు. అవసాన దశలో వైద్య చికిత్సకు నిరాకరించడం ఆత్మహత్య కిందకు రాదని స్పష్టం చేశారు. ప్రధాన న్యాయమూర్తి మార్గదర్శకాలతో ఏకీభవిస్తూ 112 పేజీల తీర్పును జస్టిస్ సిక్రీ వెలువరించారు. సజీవ వీలునామా, ముందస్తు నిర్దేశం వంటి అంశాల్లో ఒక సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి శాసనవ్యవస్థ సత్వర చర్యలు చేపడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తద్వారా కారణ్య మరణంపై ఆందోళనలు దూరం అవుతాయన్నారు. ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ, జస్టిస్ అశోక్ భూషణ్ విడిగా వంద పేజీల తీర్పు చెప్పారు. హుందాతనంతో మరణించడం అనేది ప్రాథమిక హక్కు కిందకు వస్తుందని 1996లో రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించిందని గుర్తుచేశారు. అవగాహనతో నిర్ణయాన్ని తీసుకునే మానసిక సామర్ధ్యమున్న వయోజనులకు ప్రాణాధార వైద్య సాధనాల ఉపసంహరణ సహా వైద్య చికిత్సను నిరాకరించే హక్కు ఉందని స్పష్టం చేశారు. న్యాయస్థాన షరతులకు అనుగుణంగా ముందస్తు వైద్యనిర్దేశాన్ని జారీచేసే హక్కు మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉన్న ప్రతి వ్యక్తికీ ఉంటుందని ఉద్ఘాటించారు. ముందస్తు వైద్య నిర్దేశానికి సంబంధించి భారత్‌లో ఎలాంటి న్యాయ కార్యాచరణ లేనప్పటికీ రాజ్యాంగంలో 21వ అధికరణాన్ని సంరక్షించుకోవల్సిన బాధ్యత సుప్రీంపై ఉందని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. కాగా, ముందస్తు వైద్య నిర్దేశాన్ని ఎవరు చేయాలి? ఏమి ఉండాలి? దానిని ఎలా నమోదు చేయాలి ఎలా పరిరక్షించాలి ? దానిని ఎవరు అమలుచేయాలి? వంటి అంశాలపై చర్చ కొనసాగింది. ఒక వేళ దీని అమలుకు వైద్య బోర్డు నిరాకరిస్తే ఏం చేయాలనే అంశాలపై ధర్మాసనం మార్గదర్శకాలను జారీ చేసింది. ముందస్తు వైద్యనిర్దేశం లేని కేసులకు సంబంధించి కోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. అవసాన దశకు చేరుకున్న రోగి లేదా దీర్ఘకాలంగా అచేతనంగా ఉన్న వ్యక్తి కోలుకుంటారనే ఆశ ఏ మాత్రం లేని సందర్భాల్లో మరణ ప్రక్రియను వేగవంతం చేసి, వేదన కాలాన్ని తగ్గించడం హుందాతనంతో జీవించడంతో సమానమనేది న్యాయస్థానం భావన. వ్యక్తిగత హుందాతనానికి చోటు కల్పించకుంటే జీవన హక్కు స్వేచ్ఛ అనేవి అర్థరహితం అయిపోతాయి.
ఒక రోగి మానసిక పరిస్థితి సక్రమంగా ఉన్న స్థితిలోనే ఈ వీలునామాను రాస్తారు. భవిష్యత్‌లో శాశ్వత కోమాకు వెళ్లిపోయినపుడు తనకు కృత్రిమ ప్రాణాధార వ్యవస్థను కొనసాగించాలా? వద్దా? అనేది కూడా ముందుగానే స్పష్టం చేస్తారు ఈ పత్రంలో. పరోక్ష కారుణ్య మరణం అంటే అచేతనంగా ఉన్న వారు చికిత్స లేని వ్యాధులతో బాధపడుతూ అవసాన దశకు చేరిన వారికి నొప్పి లేకుండానే మరణానికి గురిచేయడమే కారుణ్య మరణం. ఇందులో ప్రత్యక్ష, పరోక్ష అనే రెండు రకాలుంటాయి. క్రియాశీల కారుణ్య మరణంలో హానికర పదార్థాన్ని ప్రయోగించి కానీ బలవంతంగా కానీ రోగిని వైద్యులు మరణానికి గురిచేస్తారు. పరోక్ష విధానంలో జీవనం కొనసాగించడానికి అవసరమైన ప్రాణాధార వైద్య తోడ్పాటు వ్యవస్థను ఉపసంహరిస్తారు.
అరుణా షాన్‌బాగ్ కేసు..
సుప్రీం ధర్మాసనం తన తీర్పులో అరుణా షాన్‌బాగ్ కేసును ప్రస్తావించింది. కారుణ్య మరణాల చట్టాలకు మార్పులు చేయాలనే స్పృష కలిగించింది ఈ కేసే. అరుణ రామచంద్ర షాన్‌బాగ్ ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్సు ఆస్పత్రిలో నర్సులో పనిచేసింది. 1973 నవంబర్‌లో షోహన్‌లాల్ భరత వాల్మీకి అనే వార్డ్ బోయ్ ఆమెపై అత్యాచారం చేశాడు. కుక్కను కట్టే గొలుసుతో ఆమె మెడను కట్టేశాడు. దాంతో మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. ఆమె అచేతనంగా ఉండిపోయింది. 42 ఏళ్లపాటు ఆమె ఆదే స్థితిలో ఉండిపోయింది. దాంతో ఆమెకు అదే ఆస్పత్రి నర్సులు సపర్యలు చేశారు. అరుణకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ పింకీ విరానీ అనే సామాజిక కార్యకర్త సుప్రీంలో పిటిషన్ వేశారు. ఆమెకు ఆహారాన్ని నిరాకరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ఆమె బ్రెయిన్ డెడ్ కాలేదని, కొన్ని సందర్భాల్లో స్పందిస్తోందని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన వైద్య బోర్డు పేర్కొంది. వారి సూచనకు అనుగుంణగా అరుణకు కారుణ్య మరణానికి వీలు కల్పించడం కుదరదని 2011లో కోర్టు నిరాకరించింది. అయితే దేశంలో పరోక్ష కారుణ్య మరణాలకు మాత్రం వీలుకల్పిస్తున్నట్టు చెప్పింది. 2015 మే 18న అరుణ మరణించింది. కాని ఆమె ఎంతో మంది జీవితాలకు వెలుగు నింపే సంచలన తీర్పుకు మూలం అయింది.

- బీవీ ప్రసాద్ 98499 98090