ఎడిట్ పేజీ

మోదీజీ.. ఇకనైనా స్పందిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి నమస్కారములు, శుభాకాంక్షలు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న సందర్భంగా మీ కోసం రాసిన ఈ బహిరంగ లేఖను చిత్తగించండి. తమకు తెలుగు భాష రాకపోయినా ఇంటెలిజన్స్ వర్గాలు, భాజపా కార్యకర్తలు ఈ లేఖ సారాంశాన్ని మీకు అందజేస్తారన్నది నా ఆశ.
2014 మే 26న మీరు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు మతాబులు వెలిగించి, టపాసులు పేల్చి, మిఠాయిలు పంచిన కోట్లాది దేశ ప్రజలలో నేనూ ఒకడిని. గత నాలుగేండ్ల పాలనలో ‘నరేంద్ర మోదీ మచ్చలేని రాజకీయ నాయకుడు’ అనే పేరు కూడా తెచ్చుకున్నారు. ప్రపంచమంతా పర్యటించి భారత్‌కు దౌత్యపరంగా మద్దతును కూడగట్టడంలో ఘన విజయం సాధించారు. మీరు చేపట్టిన ‘స్వచ్ఛ్భారత్’ చాలా మంచి పథకం. ఇది 1930లో ‘నిర్మల భారత్’ పేరుతో మహాత్మాగాంధీ అమలు చేసిందే. 1980 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘జన్మభూమి’ పేరుతో ఇలా స్వచ్ఛ కార్యక్రమాలకే శ్రీకారం చుట్టారు. భౌతికంగా మాత్రమే కాదు, మానసికంగాను పవిత్ర భారత్‌ను నిర్మించాల్సిందే. కాని అది ఆచరణలో జరగలేదు.
నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 12వేల కోట్లకు టోపీ పెట్టిన ఘనత ఇటీవలిదే. కొఠారీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీ వంటి ఘరానా మోసగాళ్ల ఆర్థిక అవినీతి, కార్తి చిదంబరం నేరాలు మరీ ఇటీవలి వ్యవహారాలే. దుబాయిలో అగ్రనటి మరణం వెనుక 200 కోట్ల హవాలా మాఫియా కేసు ఉన్నదన్న వార్తలపై ఎలాంటి విచారణ జరగనేలేదు. 2014 ఎన్నికలకు ముందు మీరు ప్రతి పౌరుని బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తామని గొప్పగా ప్రకటించారు. స్విస్ బ్యాంకు మొత్తాలు, పనామా కుంభకోణాలు, వికీలీక్స్ (జూలియస్ అసాంజే) వెలువరించిన వారి పేర్లపై విచారణ ఇంతవరకూ లేదు. పాయల్ ఝుంకార్, స్వర్ణలాభ్, ముసద్దీలాల్ వంటి వారి నగల వ్యాపారుల పేర్లు పెద్ద నోట్ల రద్దు సందర్భంగా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి కేసులు ఏమైనాయి? కనీసం ఒక్కరైనా జైలుకు పోయిన దాఖలాలు లేవు. ఎందుకని?
పెద్దనోట్ల రద్దువల్ల వందలాది మంది బ్యాంకు ఖాతాదారులు ప్రాణాలు కోల్పోయారు. అలా చనిపోయినవారిలో అంబానీలు, అద్వానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు, దాల్మియాలు లేరు. చనిపోయిన వారందరూ అతి సామాన్యులే. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు నోట్ల రద్దు వల్ల తాను సాధించిన విజయాలేమిటో ప్రజలకు చెప్పడంలో కేంద్రం విఫలమైంది. ఏదైనా ఆర్థిక సంస్కరణ జరిగినపుడు అతి సామాన్యునికి సైతం మేలు జరిగేలా ఉండాలి. జిఎస్‌టి బిల్లు ఆమోదించిన తర్వాత అన్ని వస్తువులపై సుంకం పెరిగింది. వర్తకులు, కొనుగోలుదారులు సంతృప్తిని వ్యక్తం చేయటం లేదు. మరి ఈ ఆర్థిక సూత్రాల మతలబు ఏమిటో ప్రజలకు తమరు స్పష్టంగా వివరించలేకపోయారు.
ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హార్దిక్ పటేల్, జిగ్నేష్, అహమ్మదాబాద్ బిషప్ వంటి వారు జాతి వ్యితిరేక ధోరణిని ప్రదర్శించారు. వారిపై మీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీసుకున్న చ ర్యలేమిటో తెలుసుకోవలసిన అవసరం ప్రజలకు ఉంది. కాంగ్రెస్ బహిష్కృత నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి ‘ఇండియా కంటే పాకిస్తాన్ చాలా స్నేహ సౌహార్ర్దాలు ప్రదర్శించే దేశం’ అన్నాడు. మిమ్మల్ని నీచ కులస్థుడు అని ఆమధ్య తిట్టాడు. వీర సావర్కార్ స్మృతి చిహ్నాన్ని పగలకొట్టి వచ్చాడు. కరాచీ వెళ్లి ఇండియాలో మోదీ పాలనను తుద ముట్టించడానికి సహాయం కావాలని ఐఎస్‌ఐ సంస్థను కోరుతూ, దునియా టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాడు. మరి అతణ్ణి మీ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేకపోయింది? భార్య హత్య కేసులో నిందితుడైన శశిధరూర్‌పై మీరు ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోయారు?
భారతీయ జనతా పార్టీకి తనదైన ఎన్నికల ఎజెండా ఉంది. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణం, కామన్ సివిల్ కోడ్, సంస్కృతాన్ని జాతీయ ‘ఉత్సవ’ భాషగా చేయటం, పాక్ ఆక్రమిత కాశ్మీరును ఇండియాలో చేర్చడం, బెలూచిస్తాన్, టిబెట్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తించటం. ఇలాంటి ఒక్క అంశంపైనా ఈ నాలుగేండ్లలో కదలిక లేదు. 2019 ఎన్నికలకు మీ ఎజెండా ఏమిటి? ఏ సమస్యలను ప్రజల ముందుంచి ఓట్లు అడగబోతున్నారు? ‘మాకు ఓటేస్తే దేశం దశ, దిశ మారుస్తాం’ అని మీ పార్టీకి చెందిన ఏపీ నాయకుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు చాలాకాలం క్రితం అన్నారు. మరి దశ-దిశ ఎంతవరకు మారిందో తమరు చెప్పాలి. కేంద్ర సంగీత, సాహిత్య, నాటక అకాడమీ అవార్డులు, పద్మ, ఫాల్కే పురస్కారాలు పైరవీకారులకు అందుతున్నాయని లోకం కోడై కూస్తున్నా మీలో స్పందన లేదు. మీరు ‘ఎర్రదండు’ దాడి నుంచి సాంస్కృతిక కళ విద్యా రంగాలను, పాఠ్య ప్రణాళికలను విముక్తం చేయటంలో విఫలం కాలేదా? తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం మతతత్వ మజ్లిస్‌తో పొత్తు పెట్టుకుంది. అలాంటి ప్రభుత్వాన్ని మీ క్యాబినెట్‌లోని మంత్రులు పొగడ్తలతో ముంచివేశారు. ఫలితంగా తెలంగాణలో బిజెపి కార్యకర్తలు నైతిక స్థైర్యాన్ని కోల్పోయారు. ఏపీలో తెదేపాతో తెగతెంపులు చేసుకోవటం ద్వా రా ఓ బలమైన సామాజిక వర్గం, వారికి చెందిన ప్రచార సాధనాలు బిజెపికి వ్యతిరేకంగా అపుడే ప్రచారం మొదలుపెట్టాయి. మీ రు ఉదారంగా ఇచ్చిన పద్మ పురస్కారాలు వారిని సంతృప్తి పరచలేకపోయాయి. ‘అవార్డు వాపసీ’ ఉద్యమాన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. కేరళలో ప్రస్తుత సీఎం విజయన్ ప్రభుత్వం, అంతకుముందున్న ప్రభుత్వాలు దాదాపు 300 మంది హిందూ సామాజిక కార్యకర్తలను, అణగారిన వర్గాల వారిని హత్యచేస్తే మీ ప్రభుత్వం ఏం చేయగలిగింది? ‘మా కార్యకర్తలు అవినీతిపరులైనా, గాంగ్‌రేప్‌లు చేసినా వారిపై కేసులు నమోదు చేయవద్దు’ అని విజయన్ స్పష్టంగా పోలీసు అధికారులకు ఆదేశాలు పంపినట్లు ఆరోపణలున్నా, వాటిపై మీ స్పందన శూన్యం.
త్రిపురలో బిజెపి సాధించిన విజయం వెనుక కమ్యూనిస్టుల వైఫల్యం ఉంది. అంటే అది ‘నెగెటివ్’ ఓటు. అక్కడ భారీగా పరిశ్రమలు మూతపడ్డాయి. నిరంతర సమ్మెల వల్ల అభివృద్ధి రేటు ఆగిపోయింది. కమ్యూనిస్టు యువకులతో పాటు లక్షలాదిమంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులైనారు. ట్రిపుల్ తలాక్‌పై మీరు తీసుకున్న చర్యలు ముస్లిం మహిళలను బిజెపికి అనుకూలంగా మార్చిన మాట నిజమే. కాని- అజంఖాన్‌లు, ఓవైసీలు వంటి నేతలు పాక్ అనుకూల ధోరణిని వీడుతారని మీరు భావిస్తే అది నిజంగా పొరపాటే.
2018 తొలిభాగంలో జరిగిన ఒక సర్వే మేరకు ఎన్‌డిఏ కూటమి 300 స్థానాలు 2019 ఎన్నికలలో గెలుచుకోబోతున్నారని చెప్పింది. కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న 44 సీట్లను పెంచుకోబోతున్నది. యుపి, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో బిజెపికి కొన్ని సీట్లు తగ్గవచ్చు. మహారాష్టల్రో శివసేన బిజెపికి సహకరించదు. గుజరాత్‌లో హార్దిక్ పటేల్ బిజెపి ఓట్లను చీలుస్తాడు. ఈ లోటును భర్తీ చేసుకోవటం కోసం ఈసారి బిజెపి దక్షిణాది రాష్ట్రాల వైపు దృష్టి సారించింది. తెలంగాణలో కొన్ని పార్లమెంటు స్థానాలు గెలుచుకోవాలని యోచిస్తున్నది. సీమాంధ్రలో తెలుగుదేశంతో పొత్తు లేకపోవటం బిజెపికి కొంత నష్టం తప్పదు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం బాగా అపఖ్యాతి పాలైంది. కాబట్టి అక్కడ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను గెలుచుకోవటం ద్వారా ఉత్తరాది లోటును పూరించుకోవాలని బిజెపి ప్రయత్నిస్తున్నది. ఆచరణలో బిజెపి తన ఎన్నికల ఎజెండాను ఎంతవరకు అమలు చేసింది? అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. ప్రజలకు కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం, ఉపాధి ముఖ్యావసరాలు. వాటిని కల్పించలేని ఏ ప్రభుత్వమైనా నిష్ప్రయోజనకరమైనదే. ఇక రక్షణ రంగంలో నిర్మలా సీతారామన్ నేతృత్వంలో భారత్ అజేయ శక్తిగా ఎదిగిన మాట నిజమే కాని పాకిస్తాన్ సరిహద్దులలో రోజూ భారత సైనికులు రక్తతర్పణం చేయవలసి వస్తున్నది. ఆక్రమిత కాశ్మీరులో 200 ఉగ్రవాద స్థావరాలున్నాయని ప్రపంచానికి తెలుసు. వాటిని నిర్మూలించవలసిన బాధ్యత భారత్‌పైన ఉన్నది.
త్రిపురలో అధికారం కోల్పోయిన సిపిఎం కార్యకర్తలు దోపిడీలు, గృహదహనాలకు దిగుతున్నారు. కలకత్తాలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని కూల్చివేయటం ద్వారా కొందరు జాతి వ్యతిరేకులు దేశ ఐక్యతకు సవాలు విసిరారు. దీనిని మీరు ఎలా ఎదుర్కొనబోతున్నారు? తమిళనాడులో మొన్న సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్న ఆర్ష ధర్మీయులపై దాడి జరిగింది. స్టాలిన్ అనే విదేశీయుని పేరు పెట్టుకున్నవాడు తమిళనాడును పరిపాలించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. రాబోయే పది నెలలు భారత రాజకీయాలల్లో చా లా పరిణామాలు రావచ్చు. వాటిని ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668