మెయన్ ఫీచర్

ఆత్మపరిశీలనకు భాజపా సిద్ధమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపఎన్నికల ఫలితాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అవి తాత్కాలికంగా ప్రకంపనా లు సృష్టించినా, రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపే అవకశం ఉండదు. గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఇటీవల తమిళనాట ఆర్కే నగర్ నుంచి దినకరన్ విజయం సాధించడం.. ఇలాంటి ఉదంతాల ప్రభావం దీర్ఘకాలం కనిపించదు. అయితే, మోదీ ప్రధాని పదవి చేపట్టడంలో నిర్ణయాత్మక మద్దతు అందజేసిన ఉత్తరాదిలో జరుగుతున్న ఉప ఎన్నికలలో వరుస పరాజయాలతో బిజెపి షాక్‌కు గురైంది. మోదీ అధికార పగ్గాలు చేపట్టాక ఢిల్లీ, బిహార్ మినహా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఎక్కడా చెప్పుకోదగిన ప్రతికూల ఫలితాలు ఎదుర్కొన లేదు. పంజాబ్‌లో ఓటమి ఎదురైనా అక్కడి బిజెపి భాగస్వామ్య పక్షమే గాని ఎన్నడూ ప్రధాన పక్షంగా లేదు. గుజరాత్‌లో అతి కష్టమీద ఒడ్డుకు చేరగలిగింది. గుజరాత్ మినహా మరే ఎన్నికలు కూడా మోదీ జనాకర్షణ శక్తి పట్ల ఎటువంటి అనుమానాలు కలిగించలేదు. ఆయనను ఢీకొట్టగలమన్న ధైర్యం మరే నాయకుడికి, పార్టీకి కలగడం లేదు.
వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొంటూ వస్తున్న మోదీ ప్రభ ఉపఎన్నికలలో మాత్రం అంతగా పనిచేయకపోవడంతో లోతుగా ఆలోచించవలసిన అవసరం ఇప్పుడు ఆ పార్టీకి ఏర్పడింది. ఇప్పటివరకు బిజెపి అధికారం గురించి ఊహలలో కూడా ఆలోచింపలేని త్రిపుర వంటి రాష్ట్రాలలో ఘన విజయాలు సాధించడానికి ఉపయోగపడుతున్న మోదీ ప్రభంజనం ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అంతగా పనిచేయడం లేదని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సహా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో ఉపఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
రాజస్థాన్‌లో అహంకారానికి మారుపేరైన వసుంధర రాజే ముఖ్యమత్రిగా ఉన్నంతకాలం అక్కడ అధికారం కాపాడుకోవడం అసాధ్యం అని బిజెపి అగ్ర నాయకత్వం ఎప్పుడో గ్రహించింది. అయితే ఆమెను మార్చే ప్రయత్నం చేస్తే తిరుగుబాటు చేయగలదన్న భయంతో ఎటువంటి తీవ్ర చర్య తీసుకోలేకపోతున్నది. దీంతో రాజస్థాన్ ఉప ఎన్నికలలో పరాజయాలు పెద్దగా ఆందోళన కలిగించనే లేదు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ తన సీట్లను తానే గెలిచిందని, ఆ పార్టీ ఆధిక్యతను గణనీయంగా తగ్గించగలిగామని బిజెపి సంబరపడుతున్నది. ఇక బిహార్‌లో ఆర్‌జెడి పార్టీ గతంలో తాను గెల్చుకున్న సీట్లనే తిరిగి గెల్చుకొంది.
ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోటగా పేరొందిన గోరఖ్‌పూర్‌లోను, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ వౌర్య ప్రాతనిధ్యం వహించిన ఫూల్‌పూర్‌లో ఎదురైనా పరాజయాలే బిజెపిని కుంగదీస్తున్నాయి. ఈ పరాజయాలకు ఆ పార్టీ సిద్ధంగా లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. మూడు దశాబ్దాలుగా బిజెపి గెలవడమే కాదు, వరుసగా ఐదుసార్లు తాను గెలిచిన గోరఖ్‌పూర్‌లో మెజారిటీ తగ్గకుండా చూడాలని యోగి ఆరాటపడ్డారు. గత ఎన్నికలలో తనకు 3.3 లక్షల ఓట్ల ఆధిక్యత లభించగా, తాజా ఉపఎన్నికలో సమాజ్‌వాదీ అభ్యర్థి 21వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడంతో యోగి షాక్‌కు గురయ్యారు.
ఫూల్‌పూర్‌లో బిజెపి మొదటిసారిగా 2014లోనే గెలుపొందింది. అక్కడ ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉండడంతో, ఆ వర్గానికి చెందిన జైలులో ఉన్న నేరచరిత్ర కలిగిన ఒక వ్యక్తిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేటట్లు చూడడం ద్వారా ఎస్పీ అభ్యర్థికి ముస్లింల ఓట్లు పడకుండా చూసే ప్రయత్నం చేసి, ఇక తమదే గెలుపు అనే ధీమాతో ఉన్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో పరాజయానికి ఎస్పీ, బీఎస్పీల మద్య సయోధ్య కారణమని, ఇటువంటి సయోధ్య 2019 ఎన్నికలలో సాధ్యం కాదు కాబట్టి రాష్ట్రంలో బిజెపి ధాటికి తిరుగే ఉండబోదనే తేలికైన సూత్రీకరణ చేయడం బిజెపి వర్గాలలో నెలకొన్న అతి విశ్వాసాన్ని వెల్లడి చేస్తున్నది.
మొదటిసారిగా ఎస్‌పి, బిఎస్పీలు కలవడం కొంతమేర ఓటర్లపై ప్రభావం చూపినా, బిజెపి పాలన పట్ల ప్రజలలో నెలకొన్న అసంతృప్తి ప్రధాన కారణమనే విషయాన్నీ గుర్తించడానికి బిజెపి నాయకత్వం తిరస్కరిస్తున్నట్లు వారి ధోరణి వెల్లడి చేస్తున్నది. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు ఏర్పాటుచేసుకొని, ఇక అధికారం తమదే అనే ధీమాను వ్యక్తం చేసి బోల్తాపడిన విషయాన్నీ మరచిపోతున్నారు. గతంలో తమకు మద్దతు అందజేసిన పలు వర్గాలు ఇప్పుడు ఆ పార్టీ పట్ల ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నాయనే విషయాన్నీ భాజపా నేతలు తెలుసుకోలేకపోతున్నారా? ప్రజలలో ఎన్నో ఆశలు కల్పించిన జన్‌ధన్ యోజన, పెద్దనోట్ల రద్దు, జిఎస్టీ వంటి కార్యక్రమాల ఫలితాల అనుభవాలలోకి రావడం లేదు. మోదీ పాలనలో తమ జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని, అవకాశాలు పెరిగాయని ఏ వర్గం కూడా భావించడం లేదు. వ్యవసాయ రంగంలో సంక్షోభం, నిరుద్యోగం, అధిక ధరలు పట్ల ప్రజలు విసుగు చెందారని గుర్తించాలి. 2019 ఎన్నికల నాటికి మోదీని సవాల్ చేయగల ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రతిపక్షాలు చూపలేవనే ధీమా మరోవంక బిజెపి నాయకత్వంలో కనిపిస్తున్నది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రతిపక్షాలు ఆమోదించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ కారణంగా తమకు తిరుగులేదని మితిమీరిన విశ్వాసాన్ని కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రజలు ప్రతికూల తీర్పు ఇవ్వదలచినప్పుడు అధికారంలో ఉన్నపార్టీకి వ్యతిరేకంగా వోట్ వేస్తారుగాని, ప్రతిపక్షంలో ఎవరున్నారని చూడరని గ్రహించాలి. 2004 ఎన్నికలలో నాటి ప్రధాని వాజపేయికి ధీటైన ప్రధానమంత్రి అభ్యర్థి ప్రతిపక్షాలలో లేడు. కాంగ్రెస్ కూడా ఎవరినీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రజలముందు ఉంచలేదు. కానీ నాడు ‘అంతా వెలిగిపోతుంది’ అంటూ బిజెపి చేసిన ప్రచారంతో విసుగు చెందిన ప్రజలు బిజెపి ప్రభుత్వాన్ని ఓడించారు. ఇప్పుడు కూడా మోదీ చేస్తున్న ‘అచ్ఛాదిన్’ ప్రచారం అట్లాగే వెగటు కలిగిస్తున్నది. 1971 తర్వాత ఒక ప్రధానమంత్రికి అనుకూలంగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది కేవలం 2009 ఎన్నికలతోనే కావడం గమనార్హం. నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసం చూపించారు. మిగిలిన ఏ ఎన్నికలో కూడా పరిపాలన చూసి ప్రజలు ఓట్లు వేయలేదు.
2019లో మోదీ గెలవాలంటే ఉద్వేగపూరిత అంశాలద్వారా కాకుండా సుపరిపాలన అందించడం ద్వారానే సాధ్యం కాగలదని బిజెపి నాయకత్వం గ్రహించాలి. వాస్తవానికి మోదీ అభివృద్ధి అజెండాను ప్రజల ముందుకు తెచ్చి 2014లో అధికారంలోకి వచ్చారు. ఆవేశాలు రెచ్చగొట్టే అంశాలకు దూరంగా ఉంటూ వచ్చారు. గోహంతకుల పేరుతో అమాయకులను నిర్ధాక్షిణ్యంగా వధిస్తూ ఉంటే తీవ్రంగా స్పందించారు కూడా. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన ఆదిత్యనాథ్‌ను ప్రధాన ప్రచార ఆయుధంగా ఉపయోగించడం కోసం పార్టీ చేస్తున్న ప్రయత్నాల పట్ల తన అభ్యంతరాలను కూడా వ్యక్తం చేశారు. తాను ‘హిందూ హృదయ్ సామ్రాట్’ పేరును పోగొట్టుకొని, ‘గుజరాత్ మోడల్’ పేరుతో అభివృద్ధి అజెండాతో ప్రజల ముందుకు రావడానికిపుష్కర కాలం పట్టినదని, ఇప్పుడు భావోద్వేగాలతో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేసి తీవ్ర నష్టాలకు గురికాగలమని కూడా మోదీ తన సహచరులను హెచ్చరించారు. అయితే పార్టీని నడిపిస్తున్న వారు ఆయన వాదనలను వినడానికి సిద్ధంగా లేరు. పైగా గుజరాత్ ఎన్నికల అనంతరం మోదీ ఇమేజ్ తగ్గిపోతే ఆదిత్యనాథ్ తమకు ఉన్నారులే అనే ధీమాను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
ఇటువంటి పరిస్థితులలో గోరఖ్‌పూర్‌లో ఎదురైన పరాజయం బిజెపికి రెండు విధాలుగా షాక్‌లకు గురిచేస్తున్నది. మొదటగా కొత్త ప్రాంతాలలో బిజెపి తేలికగా విజయాలు సాధిస్తున్నా తమకు బలమైన చోట ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తున్నది. రెండోది మోదీ ప్రభంజనం తగ్గినా తమకు ప్రధాని అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారులే అనే ధీమాను బ్రద్దలు చేసింది. ఆదిత్యనాథ్ పాలన పట్ల సొంత పార్టీలోనే సంవత్సరం తిరిగే లోపుగానే అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. నేరుగా అసెంబ్లీలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వపాలనను తప్పుపడుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఉపఎన్నికల ఫలితాల సరళి కొనసాగితే 2019లో బిజెపి గెలిచే సీట్లు 71 నుండి 23వరకు తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు, ఎస్పీ 26, బీఎస్పీ 25, కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకోగలదని పరిశీలకులు అంచనావేశారు. బిహార్‌లోనూ ఇటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజస్థాన్, హర్యానా, ఛత్తీస్‌గఢ్‌లలో బిజెపి పరిస్థితులు సవ్యంగా లేవు. మధ్యప్రదేశ్‌లో మెజారిటీ ఎంపీ సీట్లు పొందాలంటే ఇప్పటివరకు పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణ, తూర్పు రాష్ట్రాలలో ఘనవిజయాలు సాధించక తప్పదు.
అమిత్‌షా బిజెపి అధ్యక్ష పదవి చేపట్టగానే ఇప్పటివరకు తమ పార్టీ ఒకసారి కూడా గెలుపొందని ఏడు రాష్ట్రాలలో గల 125 లోక్‌సభ సీట్లను గెల్చుకోవడమే లక్ష్యంగా ప్రకటించారు. 2015 జనవరిలో అధ్యక్ష హోదాలో మొదటిసారిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పర్యటనలు జరిపిన ఆయన 2019లో అధికార పార్టీగా ఈ రాష్ట్రాలలో మార్చడమే తన లక్ష్యంగా ప్రకటించారు. అయితే ఎందుకనో ఆ తర్వాత ఆయన ఈ రెండు రాష్ట్రాలలో పెద్దగా దృష్టి పెట్టలేదు. అంటే తెలుగు రాష్ట్రాలలో బిజెపి ఎదుగుదలపై ఆశలు వదులుకున్నారా?
త్రిపురలో ఘన విజయం తర్వాత పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, కర్ణాటకలలో విజయం సాధించిన తర్వాతనే బిజెపి విజయ యాత్ర పరిపూర్ణం కాగలదని పేర్కొన్నారు. కానీ, తెలుగు రాష్ట్రాలను ప్రస్తావించక పోవడం గమనార్హం. అంటే ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీని బలోపేతం చేయడం అసాధ్యమని అమిత్‌షా భావిస్తున్నారా? వాస్తవానికి ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాలలోకన్నా బిజెపికి తెలుగు రాష్ట్రాలలో బలమైన పునాదులు ఉన్నాయి. 1998 ఎన్నికలలో సొంతంగా 20 శాతం ఓట్లతో నాలుగు లోక్‌సభ సీట్లను గెల్చుకొంది. దక్షిణాదిన మొదటి మేయర్ పదవిని బిజెపి గెల్చుకున్నది విశాఖపట్నంలోనే కావడం గమనార్హం. బిజెపి నాయకత్వంలో ‘ఉత్తరాది అహంకారం’ కారణంగా తెలుగు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తూ ఉండడంతో పార్టీ తన పునాదులను పటిష్ట పరచుకోలేదని చెప్పవచ్చు. అటువంటి ప్రయత్నాలు చేస్తున్నా కేరళలో అక్కడ నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా చెప్పుకోదగిన ఫలితాలు సాధించలేక పోతున్నారు. తమిళనాడులో తగు వ్యూహం లేకుండా శశికళతో లాలూచీ పడి కొందరు నాయకులు వ్యవహరించిన తీరు కారణంగా ‘ఉత్తరాది’ నాయకుల తెరవెనుక ఉండి తమ నాయకులను కీలుబొమ్మలుగా చేసి ఆడించే ప్రయత్నం చేస్తున్నారనే అపోహలకుగురి కావలసి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నా తమకు మద్దతు ఇవ్వక తప్పదులే అనే తప్పుడు అంచనాతో పార్టీ ప్రయోజనాలను మెరుగు పరచడంలో, పార్టీలో ప్రజలలోబలం గల నాయకులను ప్రోత్సహించడం పట్ల కేంద్ర నాయకత్వం దృష్ట సారించడం లేదు. ప్రజలలో బలం గల నాయకులు తమ చుట్టూ తిరుగుతూ భజన చేయరనే భయం సహితం అందుకు కొంత కారణం అవుతున్నది. గత రెండు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నాయకత్వం అంతా హైదరాబాద్ నగరానికి పరిమితం కావడంతో జిల్లాలో మంచి నాయకత్వం ఏర్పర్చుకోలేకపోయారు. కొద్ది మంది నాయకులు ఉన్నా వారిని వెంటాడి, పార్టీకి దూరంగా వెళ్ళేటట్లు హైదరాబాద్ నాయకత్వం చేసింది. దానితో నేడు బిజెపి నాయకత్వ సంక్షోభం ఎదుర్కోవలసి వస్తున్నది.
ఇటువంటి సమస్యలపై అమిత్‌షా దృష్టిసారించి ఉంటే, ఈసరికి తెలుగు రాష్ట్రాలలో బిజెపి బలమైన శక్తిగామారడమే కాకుండా త్రిపురలో వలే నిర్ణయాత్మక శక్తిగా మారి ఉండేది. దక్షిణాది ప్రజల భావావేశాలు అర్థం చేసుకోవడంలో బిజెపి అగ్ర నాయకత్వం విఫలం అవుతున్నదా? అనే అనుమానం కలుగుతున్నది. ఇప్పటికైనా మించిపోయినది లేదు. ప్రత్యర్థి పార్టీలనుండి ఫిరాయింపులను ప్రోత్సహించడం పట్ల చూపుతున్న శ్రద్ధను పార్టీలో బలమైన నాయకత్వాన్ని ప్రోత్సహించడం పట్ల, ప్రజల అసంతృప్తిని నివారించే విధంగా పరిపాలన పట్ల దృష్టి సారించాలి. రాజ్యసభలో పీఠం వేస్తున్న రాజ్యసభ సభ్యుల ఆధిపత్యం నుండి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి.

- చలసాని నరేంద్ర, సెల్ : 98495 69050