మెయన్ ఫీచర్

శతాధిక కాంగ్రెస్‌తో జట్టుకట్టేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దే శ రాజధానిలో ఉగాది నాడు జరిగిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీకి ఎంతో రాజకీయ ప్రాధాన్యత ఉంది. సోనియా గాంధీ నుండి రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన ప్రథమ సభలివి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ సభలకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ 20 రాష్ట్రాలలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ నామావశిష్టంగా ఉంది. కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం పరాజయం చెందటం దాదాపు ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. ఇక పంజాబులో అమరేందర్ సింగ్ ప్రభుత్వం ‘డ్రగ్స్’ ముఠాలను అదుపు చేయలేకపోతున్నది. అమరేందర్‌ను భాజపా వారు ఆకర్షిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఒక పుకారు షికారు చేసింది.
మన దేశంలో రెండు పార్టీల వ్యవస్థకు తెరపడిందని చెప్పవచ్చు. భాజపా దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇది మితవాద జాతీయ పక్షం. శివసేన, బజరంగ్ దళ్ వంటివి అతివాద జాతీయ పక్షాలు. ఇక కొన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతీయ పార్టీ రాజ్యమేలుతున్నది. ఒకప్పుడు జాతీయ పార్టీలుగా ఉన్న సీపీఐ, సీపీఎంలు దాదాపు అంతరించిపోయాయి. కాంగ్రెస్ హవా తగ్గడంతో జాతీయ స్థాయిలో భాజపాకు సరైన జాతీయ ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్లీనరీలో షీలా దీక్షిత్ అశోక్ గెహ్లాట్, అంబికా సోనీ, రేణుకా చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మన్‌మోహన్‌సింగ్ వంటి వృద్ధనేతలే ప్రధానంగా కన్పించారు. పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ- తాము తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతటి అసంభవమో వేరే చెప్పనక్కరలేదు. తెలంగాణలో తప్ప కాంగ్రెస్‌కు మరెక్కడా కూడా బలమైన నాయకత్వం లేదు. లోగడ జరిగిన 10 ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినమాట నిజమే కాని అందుకు బిజెపి అతిశయం, నిర్లక్ష్యం కారణాలని చెప్పాలి. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఒకప్పుడు భాజపా కార్యకర్త. అనుకున్న పదవి లభించలేదని కాంగ్రెస్‌లో చేరాడు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్లీనరీలో మాట్లాడుతూ, ‘మోదీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం’ అన్నారు. ఈ వాక్యంతో మనం ఏకీభవించవచ్చు. మోదీ ప్రభుత్వం నిజంగా చేతల ప్రభుత్వమే అయితే ఈపాటికి- యూపీఎ సర్కారు హయాంలో జరిగిన అక్రమాలకు మన్మోహన్‌సింగ్ వంటివారు తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతూ ఉండేవారు. హెలికాప్టర్ల కుంభకోణం, కోల్ గేట్, వాయుతరంగాల కుంభకోణం, గన్‌షిప్‌ల కొనుగోలు, బోఫోర్స్ కుంభకోణం- ఇలా దాదాపు 10 ప్రముఖ కుంభకోణాలు మన్మోహన్ ఆమోదంతోనే జరిగాయి. బోఫోర్స్ కుంభకోణంలో స్వయంగా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ముంబయిలోని ఒక హవాలా బ్యాంక్‌కు చెందిన పాకిస్తాన్ బ్రాంచిలో డబ్బు జమ చేశాడు. అపుడు మన్మోహన్‌సింగ్ ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్నాడు. అంటే భోక్తలు సోనియా, రాజీవ్, రాహుల్ కుటుంబ సభ్యులే అయినప్పటికీ అనుమతించినవాడు మన్మోహన్ సింగ్ అన్నది తేటతెల్లం. కాబట్టి ‘నేరం నాది కాదు.. టెన్ జనపథ్’ది అని ఆయన తప్పించుకోజాలడు.
మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ ఇటీవల ఆర్థిక నేరస్థులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విదేశీ బ్యాంకులలో దాగివున్న లక్షల కోట్ల ధనం వివరాలు ఇప్పుడు వెలికివస్తున్నాయి. ‘ఇది కక్షసాధింపు చర్య’ అని నిందితులు ఆరోపించినంత మాత్రాన నేరం తొలగిపోదు. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాపై హర్యానా కేసులు, రాహుల్‌జీ లండన్ హవుస్ కొనుగోలు కేసు, అమేథీలో సమ్రాట్ సైకిల్ ఫ్యాక్టరీ కేసులు ఏమైనట్లు? ఈ కేసులను నీరుకార్చాలంటే మరోసారి కాం గ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావలసి వుంది.
ఇక రెండవ అంశం దేశంలో భాజపా బలపడటం పాకిస్తాన్, చైనా, అమెరికా, రష్యా వంటి దేశాలకు ఇష్టం లేదు. కాబట్టి జాతీయ శక్తిగా అవతరించిన భాజపాను బలహీనం చేయడం కోసం ఆయా దేశాలు రకరకాల వ్యూ హాలు పన్నుతున్నాయి. సంఘ్ పరివార్ కనుక లేకుంటే ఈపాటికి ఈశాన్య రాష్ట్రాలన్నీ చైనా పాలనలోకి వెళ్లి వుండేవి. ఇక, కాంగ్రెస్ ప్లీనరీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ‘తెలంగాణ సీఎం కెసిఆర్‌ను ఎదుర్కోగలం’ అనే ధైర్యాన్ని టీ-కాంగ్రెస్ నేతలు పొందారు. కానీ సీమాంధ్ర పరిస్థితి అలా లేదు. అక్కడ సమీప భవిష్యత్తులో చేతి గుర్తుతో పోటీ చేసే పార్టీ కనీసం ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలుచుకునే అవకాశం లేదు. రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రకు అన్యాయం జరిగిందనేది కఠోర సత్యం. అందుకు చాలామంది విలన్‌లు ఉన్నారు. చాలాకాలం క్రితం కాకినాడ భాజపా ప్లీనరీలో ‘ఒక ఓటు- రెండు రాష్ట్రాలు’ అనే తీర్మానం ఆమోదించారు. ఒకప్పుడు సోనియాను విమర్శించిన సుష్మా స్వరాజ్ రాష్ట్ర విభజనను పార్లమెంటులో బలపరిచింది. రాష్ట్ర విభజన అవసరమే అని తొలి లేఖ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే. సిపిఎం తప్ప తక్కిన వామపక్షాలన్నీ రాష్ట్ర విభజన పోరాటాన్ని బలపరిచాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ మాత్రం సమైక్యాంధ్ర కావాలని కోరుకున్నాడు. విభజన హామీలు అమలు కాలేదు. రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాలేదు. విశాఖకు రైల్వే జోన్ రాలేదు. ప్రత్యేక హోదా హక్కును కేంద్రం ఆమోదించలేదని నిరసన వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ ఇపుడు కేంద్రాన్ని దుయ్యపడుతున్నది.
రాజకీయ ప్రాధాన్యం గల మరొక తాజా సంఘటన- తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పశ్చిమ బెంగాల్ వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసి తృతీయ ఫ్రంట్ గూర్చి మాట్లాడిరావడం. ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి తృతీయ ఫ్రంట్‌గా ఏర్పడితే అపుడు తమ అస్తిత్వం కోసం కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తృతీయ ఫ్రంట్‌ను సమర్థిస్తాయా? అనేది అనుమానమే. ఎందుకంటే తెలంగాణలో కెసిఆర్‌కు కాంగ్రెస్ ప్రధాన శత్రువు గనుక. కాంగ్రెస్ రహిత, భాజపా రహిత తృతీయ ఫ్రంటు మాత్రమే తాము సాధించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ శారదా చిట్‌ఫండ్ స్కాం, కలకత్తా ఫ్లైఓవర్ బ్రిడ్జి స్కాం వంటి ఆరోపణల్లో పీకల లోతు ఇరుక్కుపోయారు. ఆమె మంత్రివర్గ సహచరులను సిబిఐ విచారిస్తోంది. కమ్యూనిస్టుల వైఫల్యంతో ఆమె నెగెటివ్ ఓటుతో అధికారంలోకి వచ్చింది. బంగ్లాదేశ్ సరిహద్దులో కోట్లాది మంది నిర్వాసితులున్నారు. వారిలో చాలామంది దొంగ నోట్ల చెలామణి, మాదక ద్రవ్యాల వ్యాపారం వంటివి చేస్తున్నారు. బెంగాల్‌లో మాల్దా వంటి పది జిల్లాలు మాఫియా ముఠాల చేతిలో వున్నాయి. వీరి బలంతో మమతా బెనర్జీ తన ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నది. ఇపుడు కేసీఆర్ నెలకొల్పే తృతీయ ఫ్రంట్‌ను మమత బలపరచడానికి ప్రధాన కారణం ఇదే. తమ రాజకీయ అస్తిత్వం కోసం కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మమతకు మద్దతునిస్తాయా? అనే విషయం మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. అంటే రాబోయే రాజకీయ కురుక్షేత్ర సంగ్రామంలో దేశభక్తులు ఒకవైపు, అవకాశవాద పార్టీలన్నీ మరొకవైపు మోహరించగలవు. 2019 నాటి ఎన్నికల ముఖచిత్రం ఈ విధంగా ఉంటోంది. కాకుంటే కేసీఆర్ తాను ప్రధాని పీఠాన్ని అధిష్ఠించాలని కోరుకుంటే మమతా బెనర్జీ, మాయావతి, రాహుల్ బాబు, ములాయం సింగ్ యాదవ్ వంటి వారు కూడా అదే పదవిని కోరుకుంటున్నారు. తృతీయ ఫ్రంట్ ‘విఘటన’కు ఇదే ప్రధానమైన విఘాతం. తెలంగాణలో మొత్తం లోక్‌సభ స్థానాలన్నింటినీ తెరాస గెలుచుకున్నా కేసీఆర్ ప్రధాని అయ్యే అవకాశాలు శూన్యం.
ఏపీ సీఎం చంద్రబాబు లోగడ కేంద్రంలో చక్రం తిప్పినవాడే. కాబట్టి ఆయన తన పుత్రరత్నమైన లోకేశ్ బాబుకు రాష్ట్రంలో అధికారం కట్టబెట్టి తాను కేంద్రానికి వెళ్లాలని ఆలోచిస్తున్నారట! ఇది కొందరికి సమంజసంగానే కనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో జగన్ అధికారంలోకి వస్తే- ఈ ఇద్దరు ‘చంద్రుల’ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమే. సీమాంధ్రలో భాజపాకు పరిస్థితి దయనీయంగానే ఉంది. కాని తెలంగాణలో ‘కాషాయ’ పతాకం కాస్త రెపరెపలాడే అవకాశం ఉంది.
చత్తీస్‌గఢ్‌లో ఉగ్రవాదులు మందుపాతరలు పేల్చి జవాన్లను చంపిన తరువాత ఆ రాష్ట్రంలో రమణ్ సింగ్ ప్రభుత్వం జనంలో విశ్వసనీయతను కోల్పోయింది. రాజస్థాన్‌లో వసుంధర రాజె రాజరికపు పోకడలు భాజపాను దెబ్బతీస్తున్నాయి. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం మరీ బలహీనపడటంతో సామంత రాజులు విజృంభించడం సహజమే. భారతదేశ చరిత్రలో ఇలా చాలాసార్లు జరిగింది. ఇప్పటికి భాజపాకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కాకపోయినా మరొక రాజకీయ శక్తి ఎదగటం అవసరమే. అమెరికాలో డెమోక్రట్లు, రిపబ్లికన్లు ఉన్నట్టే ఇండియాలో కూడా రెండు పార్టీల విధానం అవసరమే అయినా ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రంలో అది అసాధ్యమే. ప్రాంతీయ పార్టీ ఒక రాష్ట్రానికే పరిమితమై ఉంటే- లోకసభ ఎన్నికలలో ఆ పార్టీ పోటీ చేయకుండా రాజ్యాంగాన్ని సవరించటం బాగుంటుందేమో అని రాజ్యాంగ నిపుణులు, మేధావులు ఆలోచించాలి. ఏపీలో భాజపా నేత రామ్‌మాధవ్ బృందం ప్రవేశించింది. అక్కడ బిజెపి-జగన్ పార్టీల మధ్య మంతనాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ పరిణామాలు చంద్రబాబు, సోనియాను కలవరపెట్టడం సహజం. రాజకీయాల్లో హరిశ్చంద్ర పాత్రను పోషించడం కష్టం. జూలియస్ సీజర్ నాటకంలోని బ్రూటస్ పాత్రను లోగడ మన ఇద్దరు ‘చంద్రులు’ సమర్థవంతంగా పోషించారు. ఈ నాటకాలు చూస్తున్న ప్రేక్షకులు ‘ఫెడరల్’ ఫ్రంటు దిశగా అడుగుపడిందని సోషల్ మీడియాలో కొత్త పల్లవిని అందుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల అధినాయకత్వాలు అభద్రతాభావంతో ఉన్నాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో సర్జికల్ స్ట్రయిక్ పాకిస్తాన్ మీదే కాదు.. ‘ఫెడరల్ ఫ్రంట్’ మీద కూడా జరగవచ్చు!

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668