మెయన్ ఫీచర్

చట్టం గొప్పదే.. ఆచరణ ఉత్తదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో, నేరాలు లేని అవినీతి రహిత ఆహ్లాదకర వాతావరణంలో జీవించే సమాజమే ఏ ప్రభుత్వానికైనా అంతిమ లక్ష్యం. ఇది సాకారం కావాలంటే అవినీతిని రూపుమాపాల్సిందే. అవినీతిని అదుపుచేయడానికి చ ట్టాలు, వ్యవస్థలూ చాలానే ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల విచారణ చట్టం- 1850, భారత శిక్షాస్మృతి-1860, స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్- 1941, ఢిల్లీ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం-1946, అవినీతి నిరోధక చట్టం-1988, కమిషన్స్ ఆఫ్ ఎంక్వయిరీస్-1952, అఖిల భారత సర్వీసుల ప్రవర్తన చట్టం-1968, కేంద్ర సివిల్ సర్వీసెస్ ప్రవర్తన చట్టం- 1964, రైల్వే సర్వీసుల ప్రవర్తన చట్టం-1966 వంటివి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అంబుడ్స్‌మన్ పేరుతో లోక్‌పాల్, లోకాయుక్త వ్యవస్థలు శతాబ్దాలుగా పనిచేస్తున్నాయి. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు గడుస్తున్నా, అవసరమైన చట్టాలు ఉన్నా- నేటికీ చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేకపోయాం. సుప్రీం కోర్టు ఈ నెల 23న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు షోకాజ్‌లు ఇస్తూ, లోకాయుక్త స్థితి గతులను వివరించమనడంతో మళ్లీ అది తేనెతుట్టలా కదిలింది. ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త, ఉప లోకాయుక్త చట్టాన్ని 1983లోనే చేశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఈ చట్టం అమలులో లేదు.
అశ్విని ఉపాధ్యాయ 2016 సెప్టెంబర్‌లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్‌లతో కూడిన డివిజన్ బెంచ్ అదే ఏడాది కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రాలకూ షోకాజ్‌లు జారీ చేసింది. తక్షణమే కేంద్రంలో లోక్‌పాల్‌ను, రాష్ట్రాల్లో లోకాయుక్త వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 2013లో చేసిన లోక్‌పాల్, లోకాయుక్త చట్టానికి రాష్టప్రతి 2014 జనవరి 1న ఆమోద ముద్ర వేసినా ఆ చట్టానికి కదలిక లేకుండా పోయిందని అశ్విని ఉపాధ్యాయ తన ‘పిల్’లో పేర్కొన్నారు. చట్టం అమలులోకి వచ్చిన తేదీ నుండి (2016 జనవరి 16) ఏడాది కాలంలో ప్రతి రాష్ట్రం లోకాయుక్తను ఏర్పాటు చేయడం రాజ్యాంగపరమైన విధి అని సెక్షన్ 63లో స్పష్టంగా పేర్కొన్నా చాలా రాష్ట్రాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. సెక్షన్ -3 ప్రకారం కేంద్రం కూడా లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని రాష్ట్రాలు లోకాయుక్తను ఏర్పాటుచేసినా నిధులు, సిబ్బంది, సౌకర్యాలు కల్పించకుండా ఉద్దేశ పూర్వకంగానే ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. జిల్లాల్లో లోకాయుక్తకు అనుబంధంగా పోలీసు అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాల్సి ఉండగా, ఒకరిద్దరిని ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయి. సిబ్బంది కొరతతో లోకాయుక్త పని మందగిస్తోంది. రాష్ట్రాలు కోరుకునేది కూడా అదే కావడం గమనార్హం. ఈ తతంగం చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. మార్చి 23న జస్టిస్ రంజన్ గగోయి, ఆర్. భానుమతిలతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులే లోకాయుక్త నియామకానికి సంబంధించి సవివర ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని షోకాజ్‌లు జారీ చేసింది.
సుప్రీం కోర్టులో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 12రాష్ట్రాలు లోకాయుక్తను లేదా ఉప లోకాయుక్తను ఇంత వరకూ నియమించలేదు. కొన్ని రా ష్ట్రాలు ఈ విషయమై ఎలాం టి చట్టాన్ని తీసుకురాలేదు. ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్, జ మ్మూ కాశ్మీర్, మేఘాలయ, మణిపూర్, ఢిల్లీ, మిజోరం, నాగాలాం డ్, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్, తెలంగాణ, త్రిపుర ఉన్నా యి. రెండు వారాల్లో ప్రమాణ పత్రాలను సమర్పించాలని అత్యన్నత న్యాయస్థానం రాష్ట్రాలను ఆదేశించింది. చాలా రాష్ట్రాల్లో లోకాయుక్త , ఉప లోకాయుక్త చట్టాలు ఉన్నా న్యాయమూర్తులను నియమించకపోవడం, కొన్ని సందర్భాల్లో నియామకం పూర్తయినా, నిధులు, సౌకర్యాలు కల్పించకపోవడం కూడా సుప్రీం దృష్టికి వచ్చింది. ఆర్టికల్ -21 ప్రకారం ప్రతి సేవకూ కాల పరిమితిని నిర్ణయించాలని, తద్వారా మరింత జవాబుదారీతనంతో పాలన సాధ్యమవుతుందని పిటిషనర్ కోరారు.
‘అంబుడ్స్‌మన్’ అనే మాటను తొలుత స్కాండినేవియాలో వినియోగించారు. 1809లో స్వీడన్‌లో, 1919లో ఫిన్లాండ్‌లో, 1953లో డెన్మార్క్‌లో అంబుడ్స్‌మన్ వ్యవస్థ అమలులోకి వచ్చింది. ఈ వ్యవస్థను 1962లో ‘పార్లమెంటరీ కమిషన్ ఫర్ ఇన్విస్టిగేషన్’ పేరుతో మొదటగా ఏర్పాటు చేసుకున్న కామనె్వల్త్ దేశం న్యూజిలాండ్. 1967లో పార్లమెంటరీ కమిషన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో యుకె ఏర్పాటు చేసింది. 1963లో నార్వే, 1967లో ఇంగ్లాండ్, 1983లో పాకిస్తాన్‌లో అంబుడ్స్‌మన్ అమలులోకి వచ్చింది. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్’ ఇచ్చిన నివేదిక ప్రకారం అవినీతి దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. అవినీతిని మట్టుబెట్టాలంటే భారత్‌లో కూడా అంబుడ్స్‌మన్ వ్యవస్థ ఉండాలని 1960లోనే అప్పటి కేంద్ర న్యాయశాఖా మంత్రి అశోక్ కుమార్ సేన్ గుర్తించారు. 1963లో అప్పటి పార్లమెంటు సభ్యుడు ఎల్ ఎం సింఘ్వి ‘లోక్‌పాల్’ అనే మాటను వినియోగించారు. ఈ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి చైర్మన్‌గా సింఘ్వి కుమారుడు డాక్టర్ అభిషేక్ సింఘ్వి నియమితులయ్యారు. 1966 అక్టోబర్ 26వ తేదీన పరిపాలనా సంస్కరణల కమిటీ దేశంలో అం బుడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. 1968లో కేంద్రప్రభు త్వం లోక్‌పాల్ బి ల్లును తొలిసారి ప్ర వేశపెట్టింది. 1969లో లోక్‌పాల్ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. అదే ఏడాది పార్లమెంటు రద్దు కావడంతో ఆ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టకపోవడంతో దానికి చట్టబద్ధత లభించలేదు. తిరిగి 1971లో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా దానికి ఆమోదం లభించలేదు. దాంతో జనతా ప్రభుత్వం బిల్లులో కొన్ని స్వల్పమార్పులు చేసినా, పార్లమెంటు రద్దు కావడంతో ఆ బిల్లుకు మోక్షం లభించలేదు. తిరిగి ఆ బిల్లును 1985లో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈసారి బిల్లు పరిధి నుండి ప్రధానమంత్రిని మినహాయించడాన్ని విపక్షాలు అడ్డుకోవడంతో బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపించారు. 1988లో అప్పటి ప్రభుత్వం ఈ బిల్లును ఎలాంటి కారణాలు చెప్పకుండానే మినహాయించుకుంది. 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం బిల్లును తిరిగి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రిని కూడా లోక్‌పాల్ పరిధిలోకి తీసుకువచ్చారు. 1990లో కేంద్రప్రభుత్వం రద్దు కావడంతో బిల్లు వెలుగుచూడలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన పీవీ నరసింహారావు ప్రభుత్వం బిల్లు గురించి ప్రస్తావించకున్నా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఐకె గుజ్రాల్ ప్రభుత్వం బిల్లును ప్రతిపాదించినా సభ వరకూ వెళ్లలేదు. తర్వాత వాజపేయి ప్రభుత్వం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగానే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలింది.
హాంగ్‌కాంగ్‌లోని ‘అవినీతి వ్యతిరేక కమిషన్ చట్టం’లోని అంశాలన్నింటినీ లోక్‌పాల్‌లో చేర్చారు. అంటే ఈ బిల్లు 1969 నుండి 2011 వరకూ డింకీలు కొట్టింది. చివరికి 2011 ఆగస్టు 4వ తేదీన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కొన్ని సవరణలతో డిసెంబర్ 27న ప్రవేశపెట్టగా లోక్‌సభ ఆమోదం లభించింది. అయితే, ‘116వ రాజ్యాంగ సవరణ బిల్లు’- రాజ్యాంగ సవరణకు సరిపడా మెజార్టీ లేక ఆమోదం పొందలేదు. లోక్‌పాల్, లోకాయుక్త బిల్లును ఆమోదించడానికి 2011 డిసెంబర్ 29న ప్రారంభించిన చర్చలు అర్ధరాత్రి అసంపూర్తిగా నిలిచిపోయాయి. 2012 మే 21న బిల్లును రాజ్యసభలో అభిప్రాయ సేకరణకు సెలక్ట్ కమిటీకి పంపించారు. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత ఆ బిల్లును 2013 డిసెంబర్ 17న రాజ్యసభ ఆమోదించింది. పాతబిల్లులోని అనేక అంశాలను సవరించాక లోక్‌సభ డిసెంబర్ 18న ఆమోదించింది. దీనికి రాష్టప్రతి 2014 జనవరి ఒకటో తేదీన ఆమోద ముద్ర వేశారు. దీంతో ‘లోక్‌పాల్- లోకాయుక్త చట్టం- 2013’ పేరుతో 2014 జనవరి 16 నుండి అమలులోకి వచ్చింది.
రాష్ట్రాల్లో లోకాయుక్త చట్టాన్ని తొలుత ఒరిస్సా 1970లో అమలుచేయగా, మహారాష్టల్రో 1971, రాజస్ధాన్‌లో 1973, మధ్యప్రదేశ్‌లో 1975, యుపి లో 1975, కర్నాటకలో 1979, ఎపిలో 1983లో లోకాయుక్త చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం కింద లోకాయుక్త, ఉప లోకాయుక్తలను నియమించే వీలుంది. లోక్‌పాల్ చట్టం ప్రకారం ఒక చైర్మన్, గరిష్టంగా 8 మంది సభ్యులను నియమించవచ్చు. అందులో నలుగురు న్యాయవ్యవస్థలో పనిచేసిన వారై ఉండాలి, సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారై ఉండాలి. మైనార్టీలు, మహిళలకూ ప్రాధాన్యత ఇవ్వాలి. చట్టంలోని సెక్షన్ -6 కాలపరిమితిని, సెక్షన్ -7లో జీతభత్యాలను వివరించారు. లోక్‌పాల్ , లోకాయుక్తల నియామకాలతో అవినీతి నియంత్రణ జరుగుతుందనడం నిస్సందేహం.

-బీవీ ప్రసాద్ సెల్: 98499 98090