ఎడిట్ పేజీ

స్వరం ఫెంచినా.. వరం దక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ గత ఎన్నికలకు ముందు గిరిజనులకు, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని చెబుతూ, ఈ మూడు అంశాలపై అసెంబ్లీలో తీర్మానాలను చేసి కేంద్రానికి పంపింది. ఈ విషయమై కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు భాజపాతో జతకట్టి అధికారంలోకి వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన సమయంలో భాజపా హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ హామీ రకరకాలుగా రూపాంతరం చెంది ‘ప్యాకేజీ’గా మారి, అసలు వాగ్గానం అమలుకు నోచుకోలేదు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు సహజంగానే రాజకీయంగా కేంద్రంపై వత్తిడి తెస్తాయి. ప్రాంతీయ పార్టీలు తమ మనుగడ కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో ఇంతకాలం ఎంతగా స్నేహం చేసినా, హామీలు నెరవేరని పక్షంలో, మళ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు పోరుబాటను ఎంచుకుంటాయి. దీని కోసం పార్లమెంటును వేదికగా చేసుకుంటాయి. తెరాస, తెదేపా, వైకాపా, అన్నా డీఎంకే పార్టీలకు పార్లమెంటులో చెప్పుకోదగ్గ బలం ఉంది. అందుకే రోజుల తరబడి పార్లమెంటు సమావేశాలను ప్రతిష్టంభింపచేస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, కేంద్రం వద్ద ఈ అంశాలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రీకృతమై ఉంటే, కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఉద్యమిస్తాయి.
రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలో ధర్నా చేసేందుకు వెనుకాడే ప్రసక్తి లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఢిల్లీలో దీక్ష చేయాలని అమరావతిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సూచనలు వచ్చాయి. జాతీయ స్థాయిలో ఇతర రాజకీయ పార్టీలకు, ప్రజలకు తమ సమస్యలను వివరించే ప్రయత్నం చేయవచ్చు. కేంద్రం కూడా ఈ అంశాలపై చర్చించేందుకు సిద్ధం కావాలి. అంతేకాని తమకు సంబంధం లేనట్లుగా మెలిగితే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినట్టే.
తెలంగాణ సీఎం కేసీఆర్ రిజర్వేషన్లు, నీటి వినియోగంపై ప్రస్తావించిన కొన్ని అంశాలకు జాతీయ స్థాయిలో ఇప్పటికిప్పుడు స్పందన లభించకపోయినా, రానున్న రోజుల్లో చర్చకు రావడం అనివార్యంగా కనపడుతోంది. ఈ రెండు అంశాలూ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడేవి. రిజర్వేషన్లు పెంచుకొనే హక్కు రాష్ట్రాలకు ఉండాలని తెరాస డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్‌పై బహిరంగ చర్చకు సాధారణంగా రాజకీయ పార్టీలు ఇష్టపడవు. రిజర్వేషన్లు అనే అంశం తేనెతుట్టె లాంటిది. దీని జోలికి వెళితే బలైపోతామనే భయం చాలా రాజకీయ పార్టీలను వెంటాడుతుంటుంది. త్వరలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఉన్న కేసీఆర్ రిజర్వేషన్లు, నదీజలాల వినియోగంపై కేంద్రం వైఖరిని తూర్పారబడుతున్నారు. ఒకే దేశం, ఒకే రిజర్వేషన్ల విధానం అమలు చేయాలని ఆయన కోరుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో సామాజిక వర్గాలు కూర్పు, ఆర్థిక పరిస్థితి, వెనకబాటు తనం ఒక్కో రకంగా ఉంటాయి. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జనాభా 90 శాతానికి పైగా ఉంది. అందుకే తెరాస నాయకత్వం- ‘మేము పంపిన తీర్మానంపై మీరిచ్చే బదులేంటి?’ అని కేంద్రాన్ని అడిగింది. సుప్రీం కోర్టు ఇందిరా సహానీ కేసులో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పు ఇచ్చింది. కానీ తమిళనాడులో 69 శాతం మేరకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
ఎస్సీ వర్గీకరణ ఉద్యమం రెండు దశాబ్దాలుగా జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఇప్పుడు బిజెపి ఉన్నా ఫలితం లేదు. ఎస్సీ వర్గీకరణకు ఇప్పుడు బిజెపి, గతంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కేసీఆర్ చెప్పినట్లుగా దేశంలో 70వేల టిఎంసి నీటి లభ్యత ఉంటే, ఏ మేరకు నీటిని ఉపయోగించుకుంటున్నాం ? కేంద్రం అన్ని వనరులను సమీకరించి బ్రహ్మపుత్ర, గంగానదుల నుంచి కావేరి దాకా నదుల అనుసంధానం చేసేందుకు యుద్ధప్రాతిపదికన ప్రయత్నిస్తే రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు ఉండవు. తెలంగాణలో నీటి లభ్యత, వినియోగం, ఏపీతో నీటి తగాదాలను చూసిన తర్వాత కేసీఆర్ కరీంనగర్ సభలో దేశంలో నీటి లభ్యతపై గొప్ప ప్రకటన చేశారు.
రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఉండాలని, జాతీయ స్థాయిలో నదీ జలాల వినియోగానికి నిర్దిష్ట ప్రణాళిక ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ కొత్త కూటమి ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీనికి ఛత్తీస్‌గఢ్ పూర్వ ముఖ్యమంత్రి అజిత్ జోగీ మద్దతు లభించింది. ఈ కూటమిని ప్రజలు ఆదరిస్తారా? లేదా? అనే సంగతి పక్కనపెడితే, అజెండాలోని అంశాలు స్పష్టంగా దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చేవి. రానున్న రోజుల్లో దేశ ప్రధానిగా ఎవరు వచ్చినా, ఈ రెండింటిపై నిర్ణయం తీసుకోక తప్పదు.
15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే, నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక వేత్తలు, రిటైర్డు న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చర్చించేందుకు ఏప్రిల్ 10న కేరళ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కుటుంబ నియంత్రణ పథకాలను దక్షిణాది రాష్ట్రాలు చక్కగా అమలు చేశాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక కారణాల వల్ల కుటుంబ నియంత్రణ పథకాలు విఫలమవుతున్నాయి. దక్షిణాదిన జనాభా తగ్గడం వల్ల పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన సమయంలో కూడా అన్యాయం జరుగుతుందంటున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ సమస్యలు భవిష్యత్తులో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
తమ డిమాండ్ల సాధనకు కేంద్రంపై వత్తిడి తెచ్చే పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అప్పుడే ప్రజలకు ఆ పార్టీల పట్ల నమ్మకం కలుగుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలో అప్పటి యుపిఏ ప్రభుత్వాన్ని భాజపా కోరింది. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా ఇవ్వలేమని, ప్యాకేజీ ఇస్తామని చెప్పి 45 నెలలుగా భాజపా నాయకత్వం కాలక్షేపం చేస్తోంది. చంద్రబాబు కూడా హోదా సంజీవిని కాదని, ప్యాకేజీ చాలని కొన్నాళ్లన్నారు. ఆ తర్వాత యూ టర్న్ తీసుకుని బిజెపికి ‘రాం రాం’ చెప్పారు. 45 నెలలపాటు కేంద్ర మంత్రివర్గంలో టిడిపి మంత్రులున్నారు. మూడున్నరేళ్లకుపైగా ఎన్డీఏలో ఉన్న టిడిపి ఈ రోజు బయటకు వచ్చిన వెంటనే బిజెపిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూడా బిజెపిని ఈ స్థాయిలో విమర్శించిన దాఖలాలు లేవు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఏప్రిల్ మొదటి వారం వరకు పొడిగించారు. చంద్రబాబు అసెంబ్లీని వేదికగా చేసుకుని బిజెపి, వైకాపా, జనసేనను చీల్చిచెండాడుతున్నారు. వైకాపా సభ్యులు అసెంబ్లీకి రావడం లేదు. జనసేన పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. బిజెపి బలం నామమాత్రమే. ‘హోదా’పై పట్టుదల చంద్రబాబుకు 2014లోనే ఉంటే బాగుండేది. హోదా, ప్యాకేజీల్లో ఏది అవసరమో తేల్చుకోలేక గందరగోళంలో చిక్కుకున్న చంద్రబాబు చివరికి భాజపాను విభేదించారు. తనను రాజకీయంగా ఒంటరివాడిని చేసేందుకు వైకాపా, జనసేనతో భాజపా దోస్తీ చేస్తోందనే సంకేతాలు బలంగా ఉండడంతోనే చంద్రబాబు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. హోదా డిమాండ్‌పై చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం మంచి పరిణామమే. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు? ఇవ్వకూడదనేందుకు ఉన్న హేతుబద్ధత ఏమిటి? ప్యాకేజీ విషయమై స్పష్టమైన ప్రకటన చేయకపోవడానికి కారణమేంటి? 2014లో రాష్ట్ర విభజనకు లేని సాంకేతిక సమస్యలు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు, రైల్వే జోన్ ఏర్పాటుకు అడ్డేమిటి? అనే సామాన్య ప్రజల సందేహాలకు బిజెపి నుంచి జవాబు లేదు. కేంద్రం ఇచ్చిన నిధులకు వినియోగ పత్రాలు పంపడం లేదన్న బిజెపి వాదనకు దీటైన జవాబు ఇవ్వడంలో టిడిపి విఫలమైంది. ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణలో రిజర్వేషన్ల పెంపుదల అంశాలనేవి రాజకీయ కోణంలో కాకుండా జాతీయ దృక్పథంతో భాజపా సర్కారు, అధికారంలోకి రావాలని ఉత్సాహపడుతున్న కూటములు పాజిటివ్‌గా ఆలోచించాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097