ఎడిట్ పేజీ

దీక్షలకు దిగిరాని అవినీతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి దేశ రాజధానిలో ‘సత్యాగ్రహ’ దీక్ష చేయడం జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయ నేతల్లో అవినీతి అంతానికి దేశవ్యాప్తంగా లో క్‌పాల్, లోకాయుక్త వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆయన మరోసారి దీక్ష ప్రారంభించి, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఇచ్చిన హామీతో నిరశన వ్రతాన్ని ముగించారు. అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా ఈయన లోగడ ఇలాగే హస్తినలో ‘సత్యాగ్రహం’ చేశాడు. అప్పుడు ఆయన వెంట ప్రస్తుత ఢిల్లీ సీఎం, ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ అధినేత అరవింద్ కేజ్రీవాల్ , ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఆ తర్వాతి కాలంలో వారంతా వేరే రాజకీయ పక్షాలలోకి వెళ్లిపోయారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం సాగిస్తున్న అవినీతిని చూచి అన్నా హజారే ముక్కుమీద వేలువేసుకున్నాడు. ఇదంతా ఇటీవలి చరిత్రే. ఆయన ఆకాంక్షలకు విరుద్ధంగా సొంత అనుయాయులే ఇలా ఎందుకు చేస్తున్నారు? అన్నా హజారే మహారాష్టక్రు చెందిన వయోవృద్ధ సామాజిక కార్యకర్త. అక్కడ ఆయన పట్ల చాలా గౌరవం ఉంది. గ్రామీణ ప్రాంతాలకు ఎన్నో సేవలను అందించాడు. మరొక గాంధీగా హజారే పేరుపొందాడు. గాంధీజీ అంటే ఎవరో? ఆయన చూపిన మార్గమేమిటో ఈతరం వారికి తెలియదు. అలా తెలియకుండా చేసిన ఘనత మన రాజకీయ నాయకులదే. నాధూరాం గాడ్సే గాంధీజీని భౌతికంగా చంపితే, రాజకీయ నాయకులు ఆయనను నూరు అడుగుల కింద పాతివేశారు. గాంధీ అంటే సోనియాగాంధీ అని ఈ కాలపు కుర్రాళ్లు అనుకుంటున్నారు. ఇంతకూ అన్నా హజారే, వినోబా భావే, నానాజీ దేశ్‌ముఖ్, దీనదయాళ్ ఉపాధ్యాయ, పవనార్ యోగి వంటివారు ప్రతిపాదించింది ఏమిటి? స్థూలంగా చెప్పాలంటే విలువలతో కూడిన రాజకీయం. అనైతిక మార్గాల్లో నేతలు చట్టసభలకు ఎన్నిక కారాదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆర్థిక లాభాలు పొందకూడదు. పాతతరం నేతల నిజాయితీని, నిబద్ధతను నేటి పాలకులు పట్టించుకోవడం లేదు. దీనదయాళ్ ఉపాధ్యాయ వద్ద కేవలం రెండు జతల బట్టలు మాత్రమే ఉండేవి. పాసింజర్ రైలులో ప్రయాణం చేసేవాడు. ఒక పూట తింటే రెండవ పూట తినేవాడుకాదు. మహాత్మా గాంధీని ప్రముఖ కవి బెర్నార్డ్‌షా ‘ఆఫ్ నేకెడ్ ఫకీర్ ఆఫ్ ఇండియా’ అని పిలిచాడు. దేశంలో సగం మంది ప్రజలకు కూడు, గూడు, గుడ్డ లేనప్పుడు తాను సూటు బూటు ధరించి తిరగడం దుర్మార్గం అని గాంధీ భావించాడు. అవినీతిపై పోరాటంలో అన్నా హజారే విజయం సాధించకపోవచ్చు.
‘కాన విజయంబు ముఖ్యంబుకాదు మనకు
ధర్మ సంరక్షణంబె కర్తవ్యమిపుడు’- అన్నాడు రాణాప్రతాప్. తాను గెలిచినా, ఓడినా కర్తవ్య నిష్ఠతో పనిచేస్తానని ఆశించాడు. ఇదే భగవద్గీత సారాంశం. ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే మహాత్మా గాంధీ నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వాళ ఎట్టి దుస్థితిలో ఉందో చూడండి. ‘గాంధీభవన్ కాదు ఇది బ్రాందీ భవన్’ అని గతంలో నన్నపనేని రాజకుమారి వంటి నేతలు వ్యాఖ్యానించారు. అన్నా హజారే ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ విదేశాల్లోని ఎన్‌ఆర్‌ఐల నుంచి భారీగా నిధులు వసూలు చేసి లెక్కలు చెప్పలేదు. ఆయన పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురై, ఎన్నికల కమిషన్ తీర్పుతో పదవులు కోల్పోవలసి వచ్చింది.
స్వదేశీ సిద్ధాంతం ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీకి ఇటలీకి చెందిన సోనియా గాంధీ ఆధిపత్యం వహించటం ఏమిటి? ఆమె తండ్రి నియంత ముస్సోలినీ వద్ద పనిచేశాడు. ముస్సోలినీ, హిట్లర్‌లు ఫాసిస్టులు అని కమ్యూనిస్టులు నిరంతరం ఆడిపోస్తూ ఉంటారు. మరి అలాంటి ఫాసిస్టుకు సీపీఎం నేత ప్రకాశ్‌కారత్ ఎలా మద్దతు నిచ్చాడు? రాజకీయాల్లోకి సత్యం, అహింస, అస్తేయం వంటి నైతిక సూత్రాలు గాంధీజీ ప్రవేశపెట్టాడు. హిందువులు, ముస్లిములు కలిసి ఒకే జాతిగా జీవించాలని ఆశించాడు. ఆయన ఆశలు ఫలించలేదు. అంతమాత్రాన గాంధేయ మార్గం విఫలమైందని చెప్పలేము. గాంధీ సిద్ధాంతాలు ఇవ్వాళ ప్రజలు ఆచరించలేకపోయినంత మాత్రాన ఆ మూలసూత్రాలు పనికిమాలినవి అనలేము. వర్తమాన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పట్టిన ప్రధాన జాడ్యం ఎన్నికలు. ఒక సామాన్యుడు ఎన్నికలలో నిలబడి నెగ్గలేడు. ఒక లోక్‌సభ స్థానానికి పోటీ చేసి నెగ్గాలంటే వంద కోట్లు కావాలి. అందుకే అన్ని పార్టీలూ కోటీశ్వరులను రంగంలోకి దింపుతున్నాయి. నూరు కోట్లు ఖర్చుబెట్టి ఎన్నికలలో నెగ్గినవారు తప్పనిసరిగా తన ఖర్చును సంపాదించుకోవాలని ప్రయత్నించటం సహజం. ఇవ్వాళ అదే జరుగుతున్నది.
ఇక రెండవ అంశం నిరాడంబరత. ఎవరూ ఇతరుల ధనాన్ని ఆశించకపోవటం. అసెంబ్లీ, పార్లమెంటు టిక్కెట్లు అమ్ముకొని కోటానుకోట్లు సంపాదించుకుంటున్నారు. నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో పరకాల ప్రభాకర్ సభ్యుడు. ఆ తర్వాత ఇలా అన్నాడు- ‘సినిమా టిక్కెట్లు బ్లాకులో అమ్ముకున్నట్లు వీరు పార్టీ టికెట్లు విక్రయించి డబ్బు పోగుచేసుకుంటున్నారు. అసలు ఆ పార్టీ అవతరణకు కారణమే ధన సంపాదన.’ దళితుల పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మాయావతి వద్ద పెద్దనోట్ల రద్దు తర్వాత కోటాను కోట్ల సంపద దొరికింది. న్యూఢిల్లీలోని ఆమె తమ్ముడి అకౌంట్‌లో రద్దయిన పెద్దనోట్లు కోట్లు జమచేయబడ్డాయి. తమిళనాడులోని జయలలిత పోయెస్ గార్డెన్‌లో గదుల నిండా వజ్రాలు, బంగారు దిమ్మెలు లభించాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ధరించిన రిస్ట్‌వాచీ ఖరీదు అక్షరాలా ఎనభై లక్షలు. మహాత్మాగాందీ చెప్పిన నిరాడంబరత ఇవాళ రాజకీయాలల్లో ఎక్కడ ఉంది?
మరో ప్రధానాంశం నైతికత. ఒక వ్యక్తి ఒక పార్టీ టిక్కెట్టుమీద ఎన్నిక అయినాడు. ఆ పార్టీకి ఏ కారణం చేతనో గుడ్‌బై చెప్పి మరో పార్టీలో చేరాడు. అప్పుడు తప్పనిసరిగా తన సభ్యత్వానికి రాజీనామా చేసి తీరాలి. నెహ్రూ, నేతాజీలకు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నేతాజీ తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు. టంగుటూరి ప్రకాశం పంతులు, ఆచార్య రంగా వంటి వారు అలాగే చేశారు. కాని ఇవ్వాళ పరిస్థితి ఇందుకు భిన్నం. మూకుమ్మడిగా ఎంఎల్‌ఏలు ‘అధికార పార్టీ’ ఏదైతే అందులోకి చేరిపోతున్నారు. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోమాత్రమే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుమీద ఎన్నిక అయినవారు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ గుర్తు మీద ఎన్నికయి వారు టిఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ గుర్తుమీద ఎన్నికయిన వారు బిజెపిలో చేరారు. ఇది అనైతికం. గాంధేయవాదం రాజకీయాల్లో అంతరించిందనడానికి ఇది మరొక నిదర్శనం. ‘మనవారు కలము పట్టినప్పుడు బ్రాహ్మీమయమూర్తులు- నిత్య జీవితంలో భ్రష్టులు’ అన్నారు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఖద్దరు ధరించినంత మాత్రాన, తెల్లని బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆ తెలుపు వెనుక చిదంబరాలు ఎందుకు ఉంటున్నారో నేతలు చెప్పాలి. కర్ణాటక అసెంబ్లీలో ఒక పార్టీ సభ్యుడు సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూస్తూ పట్టుబడటం ఇటీవలి సంఘటనయే. అలాంటి వ్యక్తులకు నీతులు వల్లించే పార్టీలు టిక్కెట్లు ఎలా ఇచ్చాయి? ఇటీవల ‘కాస్టింగ్ కోచ్’ అనే పదం ఫిలిం ఫీల్డులో, రాజకీయాల్లో బాగా ప్రచారంలోకి వచ్చింది. మద్యం అమ్మకాల మీద వచ్చే ధనంతోనే ప్రజాప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇది వర్తమాన యుగంలో గాంధేయ మార్గానికి అంతిమ దశ. తిరిగి సమాజంలో గాంధేయ విలువలను ప్రచారం చేయగలమా? అని అన్నాహజారే పగటి కలలుకంటున్నాడు. అది జరిగే పనికాదు. గాంధీజీ గోరక్షణను ప్రోత్సహించాడు. ఇవ్వాళ గోరక్షణోద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వారిలో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ‘నేను గోమాంస భక్షణ చేస్తే తప్పేమిటి?’ అని కేరళ సీఎం, సిపీఎం నేత పినరయి విజయన్, కర్నాటక సీఎం సిద్దరామయ్య (కాంగ్రెస్) ప్రశ్నిస్తున్నారు. ‘మా భోజనపు అలవాట్లను నియంత్రించేందుకు మీరెవరు? మాకు హాస్టల్స్‌లో బ్రాహ్మణ భోజనం ఇష్టం లేదు’ అని కంచె ఐలయ్య- బీఫ్ ఫెస్టివల్స్‌ను యూనివర్సిటీ కాంపస్‌లో ఘనంగా నిర్వహించాడు.
‘వందే మాతరం’- అంటే పాపం, ‘మందే మాతరం’ అంటే పుణ్యం. జాతీయ గీతం పాడాలంటూ మమ్మల్ని ఎందుకు నిర్బంధం చేస్తారు? అని మజ్లిస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు 15న మా పార్టీ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎందుకు ఎగురవెయ్యాలి? అని కమ్యూనిస్టులు అడుగుతున్నారు. తాను చైనా ఏజెంటునని కేరళ సీఎం బహిరంగంగా ప్రకటించాడు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చైనా దిగుమతులపై నిషేధం విధించలేకపోయింది. అంటే ప్రవచించే జాతీయవాదం ఎన్నికల మేనిఫెస్టోలకే పరిమితమా? మహాత్మా గాంధీ పల్లీలు తిని బ్రతికేవాడు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవరావు బలీరాం హెడ్గేవార్ తినడానికి తిండిలేకపోయినా మరమరాలు తిని, హిందూ సంఘటనను సాధించారు. వి.ఎల్.దేశముఖ్ మహారాష్ట్ర నుండి హైదరాబాదు వచ్చి భారతీయ జనసంఘ్ పార్టీకి ప్రచారం చేశారు. తిండి దొరక్కపోతే వీధిలోని పంపుకింద నీళ్లుతాగి కడుపు నింపుకునేవారు. 1940లో ఎర్రటి మేనెల ఎండల్లో చద్దిమూటలు కట్టుకొని కమ్యూనిస్టులు రైతుకూలీ ఉద్యమాల కోసం గ్రామగ్రామానికి తిరిగి ప్రచారం చేశారు. ఇవ్వాళ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లండి- అక్కడ విమానాల నుండి కాంగ్రెసు, బిజెపి, కమ్యూనిస్టు నాయకులంతా ఖరీదైన బట్టలు వేసుకొని విమానాలు దిగే దృశ్యం కన్పడుతుంది. కాంగ్రెసులో ఇప్పుడు మరొక గాంధీని, ప్రకాశం పంతులును, దుగ్గిరాల గోపాలకృష్ణయ్యలను చూడగలమా? కమ్యూనిస్టులలో మరొక పుచ్చలపల్లి సుందరయ్య, మరొక ఇఎంఎస్, మరొక నానాజీ దేశముఖ్, ఇంకొక దత్త్‌పంత్‌జీ ఠేంగ్టీలు రాగలరా? నిన్నటి వరకు న్యూస్‌పేపర్ కూడా చదివే అలవాటులేనివారు ఇవ్వాళ రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తారని మనం ఆశించగలమా?
1940వ దశకంలో మానవేంద్ర రాయ్ అనే ఒక మేధావి ఉండేవాడు. అతడు కమ్యూనిస్టు హింసా రాజకీయాలను అసహ్యించుకొని రాడికల్ హ్యూమనిష్టు పార్టీ స్థాపించారు. అదే దశకంలో జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ ఉద్యమం మొదలుపెట్టాడు. ఇవ్వాళ ఈ నేతల సిద్ధాంతాలు ఏమైనాయి? 1975లో ఇందిరాగాంధీ జయప్రకాశ్ నారాయణ్‌ను జైలులోపెట్టి దేశంపై ఎమర్జెన్సీని విధించింది. ఈరోజు జయప్రకాశ్ ఎవరికీ ఆదర్శం కాదు. కాని ఇందిరమ్మ పేరుమీద అంతర్జాతీయ విమానాశ్రయాలు, రాజీవ్ గాంధీ పేరు మీద రహదారులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మరొక కృపలానీ, మరొక లాల్‌బహదూర్ శాస్ర్తీ, మరొక గోవింద వల్లభపంత్‌లు రాగలరా? తెలంగాణలో మరొక రామానందతీర్థ, సీమాంధ్రలో మరొక గోపరాజు రామచంద్రరావు, మాదాల వీరభద్రరావు, వావిలాల గోపాలకృష్ణయ్య, మరొక మూర్తిరాజులు పుట్టగలరా? ఇంకొక తెనే్నటి విశ్వనాథం వంటివారిని ఈ తరం చూడగలదా?
ఎట్టి సైద్ధాంతిక సారూప్యత లేకుండా ఎన్నికలు ముంచుకొస్తున్నాయనే భయంతో పొత్తులు పెట్టుకోవటం అనైతికం. ‘చెట్టుమీద కొంగ.. చంద్రబాబు దొంగ’- అని తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన టిఆర్‌ఎస్ ఇపుడు అదే చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటోందట! ‘బ్రహ్మదేవుడు చంద్రబాబుకు ఒక శాపం ఇచ్చాడు. నీవు నిజం చెపితే నీ తల పగిలిపోతుంది- అని అందుకని బాబు ఎప్పుడూ అబద్ధాలే చెపుతుంటాడు’- అని వైకాపా నాయకురాలు రోజా గతంలో విమర్శించారు. జగన్ పార్టీ, తెలుగుదేశం, కాంగ్రెస్‌లు బిజెపి సర్కారుకి వ్యతిరేకంగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఇలాంటి అనైతిక కలయికలు, అవకాశవాదాలు ఎవరిని మభ్యపెట్టడానికి? యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి బిఎస్‌పికి ఉప్పు-నిప్పు. అలాంటిది గోరఖ్‌పూర్ ఉపఎన్నికలో ఇరు పార్టీలూ కలిశాయి. ఇక్కడ సైద్ధాంతిక సారూప్యత ఏముంది?

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668