ఎడిట్ పేజీ

వచ్చేస్తోంది.. ఉమ్మడి పౌరస్మృతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉమ్మడి పౌరస్మృతి’ అంటే మతాతీతమైన ఆధునిక చట్టాన్ని ఆమోదించడమేనా? ఇస్లాంలోనైనా, మరే ఇతర మతంలోనైనా మహిళల పట్ల వివక్ష చూపే అంశాలను కచ్చితంగా తొలగించాల్సిందే. ఇందుకు చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వం భావించడం హర్షణీయమే. ఈ క్రమంలోనే ఉమ్మడి పౌరస్మృతి దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి పౌరస్మృతిలో ఏయే అంశాలకు వెసులుబాటు ఇవ్వాలి? ఏయే అంశాల్ని చేర్చాలనేది నిర్ణయించడం కష్టం. హిందువులు ఏ మేర మార్పు చెందారో ప్రామాణికంగా తీసుకుని ఇతర మతాలను శాసించడం లేదా వేధించడం జరుగుతుందనే భయాలు లేకపోలేదు.
భారతీయ సమాజంలో ఎంతో భిన్నత్వం ఉంది. పట్టణాల్లోని వారికి, గ్రామాల్లో ఉన్నవారికి సంప్రదాయాల్లో వ్యత్యాసం ఉంటుంది. ఆధిపత్యవర్గం మిగిలిన మతాల ఒత్తిడిని ఆమోదించడం సహజంగానే జరగదు. ఉమ్మడి పౌరస్మృతి ఎలా ఉండబోతోంది? మతాతీతమైన ఆధునిక చట్టం రాబోతోందా? అంతకంటే ముందే ‘ట్రిపుల్ తలాక్’ నేరమని పేర్కొంటున్న బిల్లు కూడా అమలులోకి రాబోతోంది. ఈ రెండు కీలక నిర్ణయాలతో దేశంలోని మతానికి ఉన్న ప్రాతిపదికలో మార్పు రానుంది. రెండు దశాబ్దాలుగా అందరి మనసుల్లో ఉన్న ‘ఉమ్మడి పౌరస్మృతి’ అంశంపై కేంద్రం ముందడుగు వేయనుంది. ఈనెల 6వ తేదీ వరకూ దేశ ప్రజల అభిప్రాయాలను ‘లా కమిషన్’ స్వీకరించనుంది. కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి పౌరస్మృతిపై 2016 అక్టోబర్ 7 నుంచి వివిధ వర్గాల అభిప్రాయాలను ‘లా కమిషన్’ తీసుకుంటోంది. ప్రజలు, వివిధ భాగస్వామ్య సంస్థల నుండి సలహాల స్వీకరణకు ప్రశ్నావళిని తీర్చిదిద్దింది.
ట్రిపుల్ తలాక్, బహు భార్యత్వం, నిఖా హలాలా, నిఖా మట్టా, నిఖా మిస్యార్ వంటివి పార్లమెంటు, సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున వాటిని మినహాయించి మిగిలిన అంశాలపై అభిప్రాయ సేకరణ జరుగుతోంది. ముస్లిం సమాజంలో అమలులో ఉన్న తాత్కాలిక, ఒప్పంద వివాహాల సంస్కృతిపై విచారణ జరిపేందుకు ఫిబ్రవరి 26న సుప్రీం కోర్టు అంగీకరించడంతో ఆ అంశాలపైనా ‘లా కమిషన్’ ఎవరి నుండీ అభిప్రాయాలను తీసుకోవడం లేదు. దత్తత, వారసత్వ అంశాలను మాత్రం ‘లా కమిషన్’ పరిశీలిస్తోంది. ఇంత వరకూ దేశవ్యాప్తంగా లక్ష మంది తమ అభిప్రాయాలు చెప్పారు. ముస్లింలకు వర్తించే చట్టంలో ఆస్తిపాస్తులు, వివాహాలు, విడాకులు, వారసత్వం వంటి అంశాలు ఉన్నాయి.
ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి వస్తే దేశ ప్రజలందరికీ చట్టాలు ఒకే విధంగా అమలు జరుగుతాయి. ముస్లింలకు అమలు అవుతున్న చట్టాలు ఆ మతంలోని మహిళలకు అన్యాయం చేసేవిగా ఉన్నాయంటూ ఉద్యమకారులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహు భార్యత్వం, ట్రిపుల్ తలాక్ సంప్రదాయాలు ముస్లిం మహిళలను నిస్సహాయిలుగా మారుస్తున్నాయన్నది వారి వాదన. హిందూ కుటుంబ చట్టాలను 1950లో మార్చారు. ముస్లింలు, క్రైస్తవుల చట్టాలు మాత్రం వలసవాదుల కాలం నుండి కొనసాగుతున్నాయి. అందుకే ఒకే పౌరస్మృతి ఉండాలనేది ప్రముఖుల అభిప్రాయం మాత్రమే కాదు, కొన్ని రాజకీయ పార్టీలు సైతం ఇందుకు సుముఖంగా ఉన్నాయి. మతపెద్దలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చట్టాల ద్వారా మతస్వేచ్ఛకు కళ్లెం వేసినట్టవుతుందని వారి వాదన. ఎప్పటి నుండో బీజేపీ మాత్రం ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని కోరుతోంది. మతపరమైన అస్తిత్వాలను రూపుమాపేందుకు ఇది ఓ ప్రయత్నమేనని ఆ పార్టీ చెబుతున్నా, మైనార్టీలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
1985లో షాబానో కేసుతో ఉమ్మడి పౌరస్మృతిపై చర్చ మొదలైంది. తన మాజీ భర్త నుండి భరణం పొందవచ్చని సుప్రీం కోర్టు షాబానో కేసులో తీర్పు చెప్పింది. ఉమ్మడి పౌరస్మృతిని మాత్రం ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు’ వ్యతిరేకించింది. లా కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్‌ను 12 మంది బోర్డు సభ్యులు కలిసి తమ వ్యతిరేకతను లిఖిత పూర్వకంగా తెలిపారు. వాస్తవానికి ఇంత వరకూ 21 లా కమిషన్లు పనిచేసినా, ముస్లిం పర్సనల్ బోర్డు సభ్యులు ‘లా కమిషన్’తో భేటీ కావడం ఇదే ప్రధమం. ముస్లిం మహిళల్లో వివక్ష పోవాలంటే ఉమ్మడి పౌరస్మృతి అవసరమేనని ప్రఖ్యాత బంగ్లా రచయిత తస్లీమా నస్రీన్ , సినీతారలు షబానా అజ్మీ, దియా మీర్జా సహా అనేక మంది ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఉమ్మడి పౌరస్మృతిని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శిస్తున్నారు. ఇది ముస్లింలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించడమేనన్నది ఆయన వాదన. ముస్లింల దృక్కోణంలో దీనిని చూపడం సరికాదని, హిందూమతంలోనూ వివిధ సంప్రదాయాలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. ముస్లింలపైనే దృష్టి పెట్టి, ఆ వర్గాన్ని చీల్చాలన్నది ప్రభుత్వ అసలు అజెండా అని ఆయన ఆరోపిస్తున్నారు. వివిధ కమ్యూనిటీలు, గ్రూపులకు వేర్వేరుగా పర్సనల్ చట్టాలు ఉన్నందున భారత్ వంటి దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయడం కష్టమని కాంగ్రెస్ నేతల వాదన. సుప్రీం కోర్టు దీనిపై స్పందించడం ‘పర్సనల్ లా బోర్డు’కు చెంపదెబ్బ అని వారంటున్నారు. చట్టం చేసినా దానిని అమలు చేయడం చాలా కష్టమన్నది వారి అభిప్రాయం. రానున్న ఎన్నికల్లో జనంలో చీలికలు తీసుకువచ్చేందుకే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఉమ్మడి పౌర స్మృతి వస్తే దేశంలో వైవిధ్యానికి, బహుళత్వానికి సమాధి వేసినట్టేననేది కాంగ్రెస్ వాదన. జాతీయ సమగ్రతకు ఉమ్మడి పౌరస్మృతి అవసరమేనని అయితే దీనిపై విస్తృత సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర న్యాయ శాఖామంత్రి డి వి సదానంద గౌడ ఇప్పటికే ప్రకటించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఉమ్మడి సివిల్ కోడ్ ఉండాలనే చెబుతుందని , ఎప్పటికైనా దీన్ని తేవాల్సిన అవసరం ఉందన్నదే కేంద్రం ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు.
సమగ్ర దృక్పథంతో చూస్తే కేంద్రం అత్యంత ఇబ్బందికరమైన మూడు కీలక అంశాలను నెత్తికెత్తుకుంది. ఒకటి- రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దు, రెండు- అయోధ్యలో రామమందిరం నిర్మాణం, మూడు- ఉమ్మడి పౌరస్మృతి. ఈ మూడూ కేంద్రాన్ని ఇరకాటంలో పట్టేవే. కాశ్మీర్‌లో మెజారిటీగా ఉన్న ముస్లింలు రాజ్యాంగబద్ధమైన రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని వదులుకోవల్సి వస్తుంది. ఉమ్మడి పౌరస్మృతి కోసం సొంత పౌరస్మృతిని వదులుకోకతప్పదు. ప్రతికూలాత్మక అధిక సంఖ్యాకవర్గం నుండి పుట్టుకొచ్చినవిగా భావించే ఈ మూడు డిమాండ్లు అంత సానుకూలమైనవి కాదు. అధికరణం 370కి సంబంధించి జమ్మూ కాశ్మీర్‌ను పూర్తిగా విలీనం చేసే విషయంలో కూడా న్యాయపరమైన చిక్కులు చాలానే ఉన్నాయి. ట్రిపుల్ తలాక్ విషయం కూడా అంతే. ప్రపంచంలోని చాలా ముస్లిం దేశాలు ట్రిపుల్ తలాక్‌ను అంగీకరించవు. ఒక విధంగా చెప్పాలంటే పురుషాధిక్య ముస్లిం లా బోర్డు అమలులోకి తెచ్చిన ఈ నిబంధనకు కూడా చరమాంకం పాడాల్సిందే. ఇంకో ప్రధాన సమస్య ముస్లింలలో బహు భార్యత్వం. దీనివల్ల దేశంలో వేగంగా ముస్లిం జనాభా పెరుగుతోంది. ఇదే కొనుసాగుతూ పోతే ఈ దేశం ఏదో ఒక రోజు ముస్లిం జనాభా మెజార్టీగా మారిపోవడం ఖాయం అనేది విశే్లషకుల భావన. బహు భార్యత్వం హిందువుల్లోనూ ఎక్కువగానే ఉందన్న విషయం ‘ఆధార్’ కోసం ఐరిష్ డేటా నమోదు సందర్భంగా వెలుగు చూసింది. ఐరిష్ ఒకే సారి నమోదవుతుందని తెలియక, ఇద్దరు ముగ్గురు భార్యలతోవచ్చి దొరికిపోయిన పురుషులపై కొన్ని నగరాల్లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
చరిత్రకారుడు రామచంద్ర గుహ సైతం దీనిని విశే్లషించారు. ఉదారవాదులు, వామపక్షవాదులు ఉమ్మడి పౌరస్మృతిని ఎందుకు సమర్ధించాలో కూడా ఆయన చెప్పారు. ఒక మతం చేస్తున్నది తప్పు, మరో మతం చేస్తున్నదంతా ఒప్పు అని చెప్పడానికి వీలులేదు. ఇరు మతాల సొంత పౌరస్మృతులలో మహిళలకు ఇబ్బందికరమైన అంశాలు లేకపోలేదు. సతీ సహగమనం వంటి పురాతన సిద్ధాంతాలు కాలగర్భంలో కలిసిపోవడంతో చాలా తేలికగానే స్ర్తి లేదా పురుషుడు తమ భార్య లేదా భర్త మరణించగానే మరో వివాహాన్ని అధికారికంగానే చేసుకోగలుగుతున్నారు. ఈ విషయంలో ముస్లిం చట్టాల్లో కొన్ని ఆంక్షలు ఉన్నా, వాటిని సైతం అధిగమిస్తున్నారు. ఇక అనధికారికంగా వివాహాలు , ఉమ్మడి అంగీకారంతో సహజీవనం చేస్తున్నవారున్నారు. హిందు వివాహాల్లో అనధికారికంగా కట్నం తీసుకుంటుండగా, ముస్లిం వివాహాల్లో అధికారికంగానే ‘మెహర్’ చెల్లిస్తారు. దీనిపై కూడా కొత్త చట్టంలో ఏ విధమైన మార్పులు తెస్తారనేది వేచి చూడాలి. ఇన్ని అంశాలను గమనించిన తర్వాతనే సుప్రీంకోర్టు ఉమ్మడి పౌరస్మృతిపై కేంద్రాన్ని ఆదేశించలేమని పేర్కొంది. కేంద్రం ఆలోచన ఎలా ఉందో తెలుసుకోదలిచినట్టు తమ తీర్పులో పేర్కొంది. చట్టాలు చేసే అధికారం పార్లమెంటుదేనని, అలాగే ఆదేశిక సూత్రాలకు చట్టబద్ధత లేదనేది గమనించాలని సుప్రీం వేర్వేరు సందర్భాల్లో పేర్కొంది. అధికరణం -44లో ఉమ్మడి పౌరస్మృతి రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఉందని గుర్తుచేస్తూ కేంద్రప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నెరవేర్చేలా ఆదేశించాలని ఉపాధ్యాయ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అధికరణం -44 ఆదేశిక సూత్రాలలో భాగం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న అంశాలు ప్రభుత్వానికి కొన్ని ఆదర్శాల గురించి చెబుతాయే తప్ప వాటిని కోర్టుల ద్వారా అమలుచేసేందుకు చట్టబద్ధత కల్పించలేదు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. చట్ట సమ్మతం కాని వాటిని అనుమతిస్తే ఇటువంటి పిటిషన్లు కుప్పలు తెప్పలుగా వస్తాయని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి ఉండాలనే వాదన స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో రాజ్యాంగ రచన జరిగినపుడే చర్చకు వచ్చింది. ముస్లింల నుంచే గాక హిందూ సంస్థల నుండి కూడా ఆనాడు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అప్పట్లో పలు సంఘాలు సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాయి. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న లౌకిక శక్తుల ఒత్తిడితో వివాహం, విడాకులు, బహుభార్యత్వం, వారసత్వం వంటి అంశాలకు సంబంధించి ఎన్నో సంస్కరణలు చట్టాల రూపంలో తీసుకువచ్చారు. ఇక, కేంద్రం తీసుకురాబోతున్న ఉమ్మడి పౌరస్మృతి చట్టం ఎవరి ఆకాంక్షలను నేరవేర్చనుందో వేచి చూడాల్సిందే.

- బీవీ ప్రసాద్ 98499 98090