మెయన్ ఫీచర్

రోస్టర్‌కూ లెక్క ఉండాల్సిందేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ ధర్మానికి నాలుగు పాదాలు’ అంటారు. అంటే- సత్యం, దయ, తపస్సు, దానం అనే గుణాలతో కూడిందని అర్థం. ధర్మాన్ని అనుసరించి న్యాయం కూడా ఈ నాలుగుపాదాలతో నడుస్తోందని సామాన్య భారతీయుడు భావిస్తున్న సమయంలో అలాంటిదేమీ లేదని సర్వోన్నత న్యాయమూర్తులే తేల్చి చెప్పారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ‘ఇలా జరుగుతోందా..?’ అంటూ ప్రపంచం నివ్వెరపోయింది. ప్రధాన న్యాయమూర్తి సహా అంతా సమానులేనని ఒక పక్క చెబుతూనే మరో పక్క సీనియర్లు, జూనియర్లు అంటూ వారే విభజన రేఖను గిరిగీసుకుని కీలక కేసులను తామే వాదించాలన్న వాదన లేవనెత్తిన తర్వాత మన న్యాయవ్యవస్థ పెద్ద కుదుపునకే గురైంది. ఇది కేసులకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రధాన న్యాయమూర్తికి ఉన్న విస్తృతాధికారాలను ప్రశ్నించింది. హైకోర్టుల నుండి సుప్రీం కోర్టుకు, జిల్లా కోర్టుల నుండి హైకోర్టులకు న్యాయమూర్తులను ఎంపిక చేసే ప్రక్రియలో లోటుపాట్లను బహిర్గతం చేసింది. న్యాయవ్యవస్థ కార్యకలాపాల్లో తరచూ కార్యనిర్వాహక వ్యవస్థ రూపంలో ప్రభుత్వం తలదూర్చడాన్ని తూర్పారబట్టింది. అన్నీ ప్రభుత్వమే నిర్ణయిస్తే- సర్వోన్నత న్యాయస్థానానికి రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛకు అర్థం ఏముందనేది ప్రశ్నార్థకమైంది.
కొలీజియం వచ్చినా- కార్యనిర్వాహక వ్యవస్థ రూపంలో ప్రభుత్వాలు న్యాయమూర్తుల నియామకాల్లో తలదూర్చినపుడు కేసుల పరిష్కారంలో సహజ న్యాయసూత్రాలు ఎలా అమలు అవుతాయనే ప్రశ్న కూడా తలెత్తింది. దీనికి తగ్గట్టే సుప్రీంలో రెండో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఇటీవల ఢిల్లీలోనూ, అమరావతిలోనూ మాట్లాడినపుడు వెళ్లబుచ్చిన అభిప్రాయాలు అయితేనేమీ, రోస్టర్ విధానంపై తనకున్న అభిప్రాయాలను నిక్కచ్చిగా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి మూడు పేజీల లేఖలో తీసుకువెళ్లడంతో సుప్రీంలో లుకలుకలు ఇంకా సద్దుమణగలేదనేది సుస్పష్టం. జనవరిలో నలుగురు సుప్రీం జడ్జీలు బహిరంగంగా మీడియా సమావేశం నిర్వహించి- కొలీజియం నిర్మాణం, అధికారాలు, పరిధితో పాటు న్యాయమూర్తుల నియామకాలు, అందుకు అనుసరిస్తున్న విధానం, కేసుల కేటాయింపు, రోస్టర్ విధానం, జూనియర్ న్యాయమూర్తులకు సీనియర్ల కంటే అధిక ప్రాధాన్యం తదితర అంశాలపై మాట్లాడారు. దీనిపై సుప్రీం చీఫ్ జస్టిస్ చొరవ తీసుకుని రోస్టర్‌కు తానే ‘మాస్టర్’నని, తన విస్తృతాధికారాల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తూనే సుప్రీంలో ఉన్న 24 మంది న్యాయమూర్తులకు సబ్జెక్టులను కేటాయించారు. చీఫ్ జస్టిస్ అధ్యక్షత వహించే రాజ్యాంగ ధర్మాసనంలో తనకు నచ్చిన న్యాయమూర్తులను భాగస్వామ్యం చేయడాన్ని కూడా సీనియర్లు ప్రశ్నించడంపై రగడ కొనసాగుతునే ఉంది.
సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా తీర్పులు ఇవ్వాల్సిన న్యాయమూర్తులే ఫలానా కేసును తమకే ఇవ్వాలంటూ యాగీ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచే అంశమే. వారు ఇలా ఎందుకు కోరుతున్నారు? తమ స్వార్థం కోసమా? లేక మరో న్యాయమూర్తి ఆ కేసును స్వార్థానికి వినియోగించుకోకుండా అడ్డుకునేందుకా? ఇదే అందరి ముందు మెదిలే ప్రశ్న. అంటే- ఎక్కడో ఒక చోట ఎదో ఒక ప్రయోజనం ఉనికి కనిపిస్తోంది. ఇలాంటి మకిలి అత్యున్నత న్యాయస్థానానికి అంటడం లేదా అంటగట్టడం ఎంత వరకూ భావ్యం? శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల్లో అత్యున్నతస్థానాల్లో ఉన్న వారికి రాజ్యాంగం విస్తృతాధికారాలు కల్పించింది. ఆ అవకాశం దిగువస్థాయి వరకూ అందరికీ ఎంతో కొంత వెసులుబాటుతో కూడిన విస్తృతాధికారం ఇచ్చింది. రాష్టప్రతి తన విస్తృతాధికారాలతో తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. శాసన వ్యవస్థల్లో స్పీకర్లు, చైర్మన్లు తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదనే సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. సుప్రీం చీఫ్ జస్టిస్ తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. రాజ్యాంగంలో విస్తృతాధికారాలపై స్పష్టత లేకున్నా, సంప్రదాయాలను అనుసరించారు.
సమాజంలో చైతన్యం పెరగడం, సమాచారం తెలుసుకునే హక్కు కల్పించడం వంటి పరిణామాలతో న్యాయమూర్తుల నియామకాల్లో అనుసరిస్తూ వస్తున్న పాత విధానాలకు స్వస్తిపలకాల్సి వచ్చింది. కొలీజియం వ్యవస్థను తొలగించి, 99వ రాజ్యాంగ సవరణ ద్వారా 2014 ఆగస్టులో కేంద్రప్రభుత్వం జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి)ను తీసుకువచ్చింది. దీనిపై ఇటు కార్యనిర్వాహక వ్యవస్థకూ , న్యాయవ్యవస్థకూ మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడిచింది. 2015 అక్టోబర్ 16న ఎన్‌జెఎసి వ్యవస్థను సుప్రీంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం కొట్టివేసింది. రాజకీయ ప్రమేయం ఉన్నంత కాలం సుప్రీం కోర్టు సర్వోన్నత స్వయం ప్రతిపత్తి ప్రవర్ధిల్లడం కష్టమనే భావనతో న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ఎన్‌జెఎసిని సమర్ధించగా, మిగిలిన నలుగురు న్యాయమూర్తులు జెఎస్ కేహర్, ఎంబి లోకుర్, కురియన్ జోసఫ్, ఆదర్శ కుమార్ గోయల్‌లు కొలీజియం వైపు మొగ్గు చూపారు. మరింత విస్తృత పారదర్శకత పాటించగలిగే కొలీజియం వ్యవస్థను రూపొందించాలని 2015 నవంబర్ 3న సుప్రీంకోర్టు ప్రకటించి, అందుకు మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ క్రమంలోనే కొలీజియం సమావేశమై వాటి తీర్మానాలను నిర్ణయాలను బహిర్గత పరుస్తూ సుప్రీం కోర్టు తన వెబ్ పోర్టల్‌లో ఉంచుతోంది. అందరూ ఆశించిన పారదర్శకత కొలీజియం సమావేశాల్లో ఉండటం లేదని, హైకోర్టులో లేదా సుప్రీం కోర్టులో ఒక న్యాయమూర్తిని నియమించాలంటే అందుకు పరిశీలనకు వచ్చిన వారి పూర్వ చరిత్రను సమగ్రంగా లోతైన అధ్యయనం చేయడం లేదని, కేవలం ప్రధాన న్యాయమూర్తికి ఉన్న విస్తృతాధికారాల మేరకు కొనసాగడం వల్ల ప్రయోజనం లేదని, కొలీజియం సమావేశంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలను రికార్డు చేసినపుడే భవిష్యత్ పరిశీలనలకు దోహదం చేసిన వారవుతామన్నది జస్టిస్ చలమేశ్వర్ అభిప్రాయం. ఇదే విధానాన్ని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి నియామక విషయంలోనూ పాటించాలన్నది ఆయన భావన.
ఈ ఏడాది సుప్రీం కోర్టులో సీనియర్లు అంతా రిటైరవుతున్నారు. న్యాయమూర్తులు ఆర్ కె అగర్వాల్ మే 4న, చలమేశ్వర్ జూన్ 22న పదవీ విరమణ చేస్తారు. ఆదర్శకుమార్ గోయల్ జూలై 6న, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అక్టోబర్ 2న, కురియన్ జోసఫ్ నవంబర్ 29న, మదన్ భీం రావు లోకూర్ డిసెంబర్ 30న పదవీ విరమణ చేస్తారు. వచ్చే ఏడాది మార్చి 6న అర్జన్ కుమార్ సిక్రీ పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుతం సుప్రీంలో 31 జడ్జి పదవుల్లో 24 మంది మాత్రమే ఉన్నారు. ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఈ ఏడాది మరో ఏడుగురు పదవీ విరమణ పొందితే న్యాయమూర్తుల సంఖ్య 17కు పడిపోతుంది. గత మూడేళ్లలో 12 మంది న్యాయమూర్తులు రిటైరయ్యారు. 2011లో నలుగురు, 2012లో ఆరుగురు, 2013లో ఆరుగురు, 2014లో తొమ్మిది మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. తాజాగా చంద్రచూడ్ నియమితులయ్యారు. అత్యవసరంగా సుప్రీంలో కనీసం 10 మంది న్యాయమూర్తులను నియమించాల్సి ఉంది. 24 హైకోర్టుల్లో 410 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ వారమే జమ్మూ కాశ్మీర్, గుజరాత్ హైకోర్టుల్లో ఆరు పోస్టులను, గౌహతి హైకోర్టులో రెండు న్యాయమూర్తి పదవులను భర్తీ చేసేందుకు కొలీజియం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యమే సుప్రీం కోర్టులో కొలీజియం పారదర్శకతను నిలదీస్తోంది.
రోస్టర్‌కు ‘మాస్టర్’ చీఫ్ జస్టిస్ కావచ్చని, అయితే ఆయనకు ఉన్న విస్తృతాధికారాలు వ్యక్తిగతమైనవి కావని, న్యాయవ్యవస్థగా దానిని పరిగణించాలని, ఏకపక్ష నిర్ణయాలు సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం అవుతుందని జస్టిస్ చలమేశ్వర్ ఇటీవల ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా అన్నారు. ఇంకో పక్క రోస్టర్ ఖరారులో ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారాలను ప్రశ్నిస్తూ, ఇది సుప్రీం స్వయం ప్రతిపత్తినే బీటలు వారేలా చేస్తోందని అశోక్‌పాండే , శాంతిభూషణ్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. న్యాయమూర్తుల మీడియా సమావేశం తర్వాత ప్రధాన న్యాయమూర్తి రోస్టర్‌ను రూపొందించి ఫిబ్రవరి 5నుండి అమలులోకి తీసుకువచ్చారు. తాజా పరిణామాలతో ప్రధాన న్యాయమూర్తి మరో మారు రోస్టర్‌లో మార్పులు చేస్తూ కొత్త రోస్టర్‌ను మార్చి 9 నుండి అమలులోకి తీసుకువచ్చారు. ఫిబ్రవరిలో రోస్టర్ ప్రకటించడంతో సమస్య పరిష్కారం అయిందని న్యాయ నిపుణులు ఎవరూ భావించలేదు, తాజా రోస్టర్‌తో కూడా సమస్య పరిష్కారం అయిందని ఎవరూ భావించరనేది నిస్సందేహం. ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్’గా ప్రధాన న్యాయమూర్తి అధికారాలు ఆయన ఒక్కరికే పరిమితం కాకూడదని శాంతి భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ భాగస్వామిగా ఉన్న రాజ్యాంగ ధర్మాసనం ముందుకు తన పిటిషన్ వెళ్లరాదని, వేరే ధర్మాసనం ముందుంచాలని కూడా ఆయన సుప్రీం రిజిస్ట్రార్‌ను కోరారు.
ఏ పిటిషన్‌ను ఎవరు విచారించాలో నిర్ణయించే హక్కు న్యాయవాదికి ఉండదని, ఆ నిర్ణయం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి తీసుకుంటారని దీపక్ మిశ్రా చాలా ఘాటుగానే బదులిచ్చారు. ఇతర బెంచ్‌లలోని న్యాయమూర్తులకు కేసులను కేటాయించే విధానంలో పారదర్శకత అవసరమని , చీఫ్ జస్టీస్ ఆఫ్ ఇండియా అంటే సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియంగా భావించాలన్నది శాంతి భూషణ్ వాదన. కేసుల కేటాయింపుపై సంపూర్ణ్ధాకారం కొలీజియంకే ఉండాలని ,ప్రధాన న్యాయమూర్తి ఒక్కరే ఏకపక్షంగా బెంచ్‌లను నిర్ణయించడం, వాటికి న్యాయమూర్తులు కేటాయించడం సరికాదన్న వాదన వివాదానికి ఆజ్యం పోసింది. దీంతో దీపక్ మిశ్రా రోస్టర్‌లో మళ్లీ మార్పులు చేశారు. అందులో కీలకమైన మార్పులు ఉండటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామకంపై ప్రభావం పడేలా ఉంది. దీపక్ మిశ్రా పదవీ విరమణ చేస్తే ఆయన తర్వాత అత్యంత సీనియర్ అయిన రంజన్ గొగాయ్ 2019 నవంబర్ 17 వరకూ అత్యున్నత పదవిలో ఉంటారు. ఆ తర్వాత సీనియర్‌గా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే 2021 ఏప్రిల్ 23 వరకూ, జస్టిస్ ఎన్ వి రమణ 2022 ఆగస్టు 26 వరకూ పదవిలో కొనసాగుతారు. ఈ క్రమంలోనే సీనియర్లకు అవకాశం రావల్సి ఉంది, వస్తుందా? రాదా? అన్నది కాలం చెప్పాలి. మరక మంచిదేనా? మంచిదే.. ఒక్కోమారు ప్రక్షాళనకు అవకాశం ఇస్తుంది. నూతన ఒరవడికి మార్గం సూచిస్తుంది.

-బీవీ ప్రసాద్ 98499 98090