ఎడిట్ పేజీ

ఐక్యత లోపించిన ‘హోదా పోరు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఉద్యమాలకు బలమైన నాయకత్వం అవసరం. ఆ నాయకుడు లక్ష్యసాధన దిశగా ఎవరినైనా కలుపుకునే విధంగా మసలుకోవాలి. రాజకీయ పార్టీ వాసనలు ఉన్నా, ప్రత్యర్థి పార్టీ నేతలతో కలసి ప్రయాణం చేసే చొరవ, ఐక్యతతో అడుగులు వేసే మనస్తత్వం నాయకుడికి ఉండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 46 నెలలు గడచింది. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర సాధనకు 58 ఏళ్ల పాటు చేసిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా తమ ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన, రాజకీయ ప్రయోజనాలు అనే అంశాలను ప్రతి ఒక్క నాయకుడు ఎంచుకున్నాడు. దీనివల్ల అన్ని రాజకీయ పార్టీలూ ఒక వేదికపైకి వచ్చేందుకు పరిస్థితులు దోహదపడ్డాయి.
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం అధికార టిడిపి, ప్రతిపక్ష వైకాపా, వామపక్ష పార్టీలు, జనసేన, ఇంకా అనేక ప్రజాసంఘాలు ఎవరికి తోచినట్లుగా వారు ఉద్యమిస్తున్నారు. ఎటువంటి చర్చ లేకుండానే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు ఆ ప్రాంత నాయకులు, ప్రజలు అవలంబించిన విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు అర్థం చేసుకోలేకపోయాయి. రాష్ట్ర విభజనను సమర్థించినా, వ్యతిరేకించినా, తెలంగాణ ప్రజలు ఉద్యమించిన తీరు, నాయకత్వం ప్రజలను నడిపించిన విధానం, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి నేతలంతా చేతులు కలిపిన వైనం చూస్తే, ఇందులో ఒక్క లక్షణమైనా ప్రత్యేక హోదా ఉద్యమంలో మచ్చుకైనా కనిపించడం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలు ఇప్పుడున్న యువతరానికి కొత్త కావచ్చు. కాని ఆంధ్ర ప్రాంత రాజకీయ చరిత్రను చూస్తే మొదటి నుంచీ ఇంతే. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు రాజకీయ పార్టీలు నడుచుకుంటాయి. ఒకరి పొడ మరొకరికి గిట్టదు. సమష్టి లక్ష్యంపై ఒక వేదికపై గొంతు కలిపి ఎవరూ మాట్లాడరు. పరస్పరం రోడ్డెక్కి విమర్శించుకుంటారు. చివరకు దేశం దృష్టిలో పల్చనై పోతారు.
1953 ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయే సమయంలో మద్రాసు నగరంలో వాటా కోసం చేసిన ప్రయత్నాల్లో సమష్టి పోరాటం ఆంధ్ర నాయకత్వంలో లోపించిన విషయం తెలిసిందే. చివరకు రాజధానిగా విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు పేరిట ఎవరికి వారు ఎత్తుగడలు వేశారు. రాష్ట్రం వచ్చినట్లే వచ్చి, ముందూవెనక చూడకుండా 1956లో హైదరాబాద్ రాష్ట్రంలో విశాలాంధ్ర పేరిట కలిపేశారు. 1972 నాటి ప్రత్యేక ఆంధ్ర పోరాటం కూడా అంతే. వామపక్ష పార్టీలు విశాలాంధ్ర అని, మిగిలిన పార్టీలు ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాడి రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడి ఢిల్లీ దృష్టిలో చులకనయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఏ ఉద్యమంలో కూడా రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కాలేదు. నాయకుల మధ్య అధికారం కోసం పెనుగులాట, స్వార్థ ప్రయోజనాలు, కులాధిపత్యం, రాష్ట్రప్రయోజనాల ముసుగులో వ్యక్తిగత పాపులారిటీకి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రతిభ ఉన్న నాయకులను తొక్కేయడం లాంటి దుర్లక్షణాలు ఆంధ్ర రాజకీయ పార్టీల్లో ఎక్కువ.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగానే పూర్వ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సైతం తన ఎన్నికల ప్రణాళికలో ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు భాగస్వామిగా ఉన్న టిడిపి 45 నెలలు గడిచాక- కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. వైకాపా ఎంపీలు ‘హోదా’ పోరులో రాజీనామాలు చేశారు. తెదేపా ఎంపీలు లోక్‌సభ స్పీకర్ చాంబర్‌లో బైఠాయిస్తే మార్షల్స్ రంగప్రవేశం చేసి బయటకు లాగేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు సార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించినా వైకాపా, జనసేన తదితర పార్టీలు హాజరు కాలేదు.
తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్ర నాయకత్వం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్రం 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటించినప్పటి నుంచి ప్రజలు, రాజకీయ పార్టీలు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా ఐక్యతతో ఉద్యమించారు. తెలంగాణ ఉద్యమంలో 2009 డిసెంబర్ 9వ తేదీ కీలక మలుపు. టిఆర్‌ఎస్ పార్టీ రథ సారథి, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పక్షాలనూ కలుపుకుని కేంద్రంపై వత్తిడి తెచ్చారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇంటికి స్వయంగా కేసీఆర్ పలుసార్లు వెళ్లి మాట్లాడారు. తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దుపెట్టుకుంటానని ఆయన అన్నారు. ఇది నిజంగా అక్షర సత్యమైన మాట. లక్ష్యసాధనలో ఈ తరహా చొరవ ఆంధ్ర నేతల్లో లోపించింది. తెలంగాణ జేఏసీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ సారథ్యంలో అన్ని పార్టీలనూ ఒక వేదికపైకి తేవడంలో కేసీఆర్ సఫలమయ్యారు. సకల జనుల సమ్మె విజయవంతం చేయడంలో కీలకపాత్ర వహించారు. ఉద్యమం లేకుండా ఏ ఒక్క రోజూ గడవలేదు. తెలంగాణ ప్రజలు తమ రాజకీయ అభిప్రాయాలను, అనుబంధాలను పక్కనపెట్టి రాష్ట్ర సాధనకు అంకితమయ్యారు. విద్యార్థులు, కర్షకులు,నిరుద్యోగులు, ఉద్యోగులు కదం తొక్కారు. కేంద్రం మెడలు వంచడంలో తెలంగాణ నేతల వ్యూహం ఫలించింది. అదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం జరిగినా ఆశించిన ప్రయోజనాలు దక్కలేదు. ‘మీ కోర్కెలు ఏమిటి ? మీకేమి కావాలి ?’ అని కాంగ్రెస్ నాయకత్వం కోరినా అప్పటి ముఖ్యమంత్రి, ఏపీ కాంగ్రెస్ నేతలు స్పందించలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, వైకాపా కూడా ‘సమైక్యం’ పేరిట తలోరకం ప్రకటనలు చేశాయి. తెలంగాణ ప్రజలకు ఎక్కడ కోపం వస్తుందోననే అనుమానంతో విభజనకు అనుకూలమే కాని ‘సమన్యాయం’ చేయండనే డిమాండ్లను తెరపైకి తెచ్చారు. విభజన అనివార్యమని తెలిసినా ఒక వేదికపైకి రాజకీయ పార్టీలకు రాలేకపోయాయి.
ఏపీలో రాజకీయ పార్టీలు వ్యక్తిగత స్పర్థలను వదులుకుని ఒక వేదికపైకి తెలంగాణలో మాదిరిగా రాలేకపోతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నాయి. తెలంగాణ ఏకరూప సమాజం. ఆంధ్రప్రదేశ్ బహుముఖ సమాజం. ప్రజలను ఏకత్రాటిపైకి తీసుకురావడం రాజకీయ పార్టీలకు కత్తిమీద సాములాంటిదే. ఏపిలో అధికారంలో ఉన్న టిడిపి కూడా అనేక నెలల జాప్యం తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు మిగతా రాజకీయ పార్టీలు దూరంగా ఉంటున్నాయి. ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిన కాంగ్రెస్, బిజెపిలపై విమర్శలు చేయకుండా తెదేపా, వైకాపా పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడం వల్ల సాధించిందేముంది? అధికార, విపక్ష పార్టీలు గంటల తరబడి ఎదుటి పార్టీని నిందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. పార్లమెంటు లోపల, వెలుపల కూడా వేరువేరుగా నిరసనలు నిర్వహించారు. ప్రజా ఉద్యమాలు బలమైన నాయకత్వంతోనే సఫలమవుతాయన్న వాస్తవాన్ని విస్మరించడం సరికాదు. ప్రజల భాగస్వామ్యం కూడా స్వచ్ఛందంగా ఉండాలి. రాజకీయ ప్రయోజనాలు లక్ష్యంగా చేపట్టే ఉద్యమాలు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేవు. 1975లో ఎమర్జన్సీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. మహారాష్టల్రో రైతాంగ ఉద్యమాన్ని చేపట్టి పోరాడిన యోధుడు శరత్ అనంత్ జోషి, నర్మద బచావో ఆందోళనను నిర్వహిస్తున్న మేధా పాట్కర్ లాంటి పోరాట పటిమ ఉన్న నేతలు ఇపుడెంతో అవసరం. రాజకీయాధికారం లక్ష్యంగా సాగే పోరాటాల్లో జనం ప్రయోజనాలకు చోటు ఉండదు. ఈ తరహా పోరాటాలు ఏవీ ఫలించిన ఉదంతాలు చరిత్రలో లేవు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇచ్చే నిర్ణయాధికారం బిజెపి ప్రభుత్వం చేతిలో ఉంది. రానున్న రోజుల్లో అనేక ఆసక్తికరమైన పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097