మెయన్ ఫీచర్

‘లండన్ హౌస్’ సుడిలో కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిశోర్ చంద్రదేవ్ ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకుడు. కొద్దిరోజుల క్రితం ఆయన ఇలా అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ పతనానికి సీనియర్లు కారణం. వారు సోనియాగాంధీకి తప్పుడు సలహాలిచ్చి పార్టీని భ్రష్టు పట్టించారు.’’ ఆ ప్రకటనలో నిజం ఉన్నదా? సీనియర్లు అంటే ఎవరు? దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, ఎకె ఆంటోని, కమలనాథ్, జైరాం రమేశ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, పళనియప్పన్ చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, మన్మోహన్ సింగ్, అభిషేక్ సింఘ్వి ఇత్యాదులు. వీరిని పార్టీ బాధ్యతలనుంచి తప్పించాలని యువనాయకత్వానికి పగ్గాలను అప్పగించాలని రాహుల్ గాంధీ యోచిస్తున్నారు. ఇదుగో ఇదే అభిప్రాయం కిశోర్ చంద్రదేవ్ ప్రకటనలో వ్యక్తమయింది. వీరిలో చాలామంది మీద ఇప్పటికే రకరకాల కేసులున్నాయి. ‘‘అరవింద కేజ్రీవాల్ రక్తం కళ్ల చూడండి’’ అని తన అనుయాయులను కోరిన మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ న్యూఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ విజయానికి పాత్రధారి అయ్యాడు. ఎందుకు? ‘మతతత్వ’ బిజెపిని ఓడించడంకోసం! హిందూమతత్వ బిజెపిని ఓడించడానికి ప్రకాశ్ కారత్, 2014, ఏప్రిల్1న తన న్యూఢిల్లీ పార్టీకార్యకర్తలకు పిలుపునిచ్చాడు. బుద్ధిగా వారంతా తమ ఓట్లు కేజ్రీవాల్‌కు బట్వాడా చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మొన్న బెంగాల్‌లో అదే జరిగింది. కాంగ్రెస్‌కు సిపిఎం తన ఓట్లు బట్వాడా చేసింది. ఐతే కాంగ్రెస్ వారు మాత్రం సిపిఎంకు ఓటు వేయలేదన్నది గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఆ ఓట్లన్నీ తృణమూల్ కాంగ్రెస్‌కు వెళ్లాయి. అంతేకాదు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని సిపిఎం ఓటర్లు తమ ఓట్లను మమతకు వేశారు. సిపిఎంలో అంతర్మథనం జరుగుతున్నది. బెంగాల్ ఓటమికి ఏచూరి సీతారామ్ వ్యూహం బెడిసికొట్టడమే ప్రధాన కారణమని ప్రకాశ్ కారత్ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ‘‘వ్యూహాత్మకంగా మేము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం. ఆ పార్టీతో మాకు అంతకు మించి ఎట్టి సంబంధం లేదు. సరికదా మ్యానిఫెస్టో కూడా లేదు’’ అని ఎన్నికల ఫలితాలు వెలువడగానే రాజా (సిపిఐ) కారత్ (సిపిఎం) సంజాయిషీ ఇవ్వడం మనకు తెలుసు. కాంగ్రెస్‌ను అంటరాని పార్టీగా నిజంగానే వామపక్షాలు భావిస్తున్నాయా? అంటే సందేహమే.
కాంగ్రెస్‌కు సంబంధించి పూటకో కుంభకోణం వెలుగులోకి వస్తున్నది. ఆ మసి తమకు అంటుకోకూడదని కారత్ భావం. కాని అగస్టా కుంభకోణం ట్రైనీ విమానాల కొనుగోళ్లు, ఐఎన్‌ఎస్ దీపక్, విక్రమాదిత్యల నాసిరకం ఫిరంగులకొనుగోళ్లు కారత్ మద్దతిచ్చిన యుపిఎ కాలంలోనే జరగడం గమనార్హం. ఇవ్వాళ మరో కుంభకోణం బయటకు వచ్చింది. ఇది నలభై కోట్ల రూపాయల విలువైన లండన్ హౌస్ కుంభకోణం. దీని ఓనర్ ఎవరో ఎవరికీ తెలియదు. అంటే బినామీ పేరుమీద ఈ భవంతిని రాబర్ట్ వాద్రా కొనుక్కున్నారు. ఇందుకు కావలసిన నిధులు అక్రమ ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీ అందించారు. దీన్ని రూ.19కోట్లు పెట్టి కొనుగోలు చేసి, 16వేల పౌండ్లతో నవీకరించినట్టు చెబుతున్నారు. భవనం మొత్తం ఖరీదు 4 మిలియన్ పౌండ్లు అని మరో కథనం! విచిత్రమేమంటే దీన్ని అలంకరించడానికి దుబాయ్ నుంచి లక్షల ఖరీదైన షాండ్లియర్లను తెప్పించారు. ఆదాయపు పన్ను శాఖవారు ఏదో విచారణ జరుపుతున్న తరుణంలో ఈ లండన్ హౌస్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సరిగ్గా అగస్టా హెలికాప్టర్లను కొనుగోలు కాలానికి చెందినదే ఈ కుంభకోణం.
సుమిత్ చెడ్డా, రాబర్ట్ వాద్రా ఆయన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మనోజ్ చెడ్డాల మధ్య జరిగిన లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆస్తి లండన్‌లోని ఖరీదైన బ్రియస్టన్ స్క్వేర్‌లో ఉంది. ‘‘షాండ్లియర్స్ ఇంకా రాలేదా’’ అంటూ రాబర్ట్ వాద్రా పంపిన ఎస్‌ఎంఎస్ సందేశాలు వెలుగులోకి వచ్చాయి. రాబర్ట్ వాద్రాకు లండన్ భవనాన్ని బహూకరించిన భండారీ పరారీలో ఉన్నాడు. ఈ అంశంపై సోనియాగాంధీ స్పందిస్తూ, ‘‘్భజపా రోజుకో కట్టుకథ సృష్టిస్తూ నా కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేస్తోంది. ప్రధానమంత్రి అంటే నియంత కాదు. ఆధారాలుంటే విచారణ జరుపవచ్చు.’’ దీనికి భాజపా అధికార ప్రతినిధి ‘‘ 1975లో ఎమర్జెన్సీ విధించిందెవరు?’’ అని ప్రశ్నించారు. ఆ మరునాడే పార్లమెంటును స్తంభింపజేశారు. ఇదెంతవరకు సమంజసం? ‘‘లండన్ హౌస్’’ నాటకం కాంగ్రెస్ ముక్త భారత్ ఉద్యమంలో అంతర్భాగం అంటూ సోనియాగాంధీ ఆరోపించారు. అంటే రాబర్ట్ వాద్రాపై విచారణ జరిపితే దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందనేగా అర్థం. రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ పార్టీలు పర్యాయపదాలు అని ఆమె చెప్పినట్లయింది. ఇది తగునా?
మరి అగస్టా కుంభకోణం, నేషనల్ హెరాల్డ్, బొగ్గుగనుల కేటాయింపులు, వాయు తరంగాల కేటాయింపులు, ట్రైనీ విమానాల కొనుగోళ్లు, లండన్ హౌస్ కుంభకోణాలన్నీ కట్టుకథలేనా? ఈ కుంభకోణాలపై విచారణ మొదలైంది. లండన్‌లో విజయ్ మాల్యా దాక్కొని ఉన్నాడు, లలిత్ మోదీ కూడా అక్కడే ఉన్నాడు, సంజయ్ భండారీ పారిపోయాడు. దొరికితే ఏం చెబుతాడో తెలియదు. కేసుల విషయంలో బ్రిటిష్ ప్రభుత్వం సహకరించడం లేదు. ఎందుకని? సంజయ్ భండారీ ద్వారా రూ.4000 కోట్ల ట్రైనీ విమానాల కొనుగోలు అగ్రిమెంట్‌పై 2012లో సంతకాలు జరిగాయి. అలాగే వేలకోట్ల విలువైన మిరేజ్ విమానాల కొనుగోళ్లలో కూడా సంజయ్ భండారీ హస్తం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆ కొనుగోళ్లను యుపిఎ ప్రభుత్వం ద్వారా ఆమోదింపజేయడానికి రాబర్ట్ వాద్రా సహాయపడ్డాడనేది ఆరోపణ. ఒకవేళ ఆ నేరం రుజువైతే సంజయ్ భండారీకి శిక్ష పడుతుంది. లండన్ హౌస్ వాద్రా పేరుమీద లేదు కదా అన్నది సోనియాగాంధీ ధీమా. ఇది కేవలం లండన్ హౌస్‌కు మాత్రమే పరిమితం కాదని, ఇంకా పెద్ద కుంభకోణాలు జరిగాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. కాగా సంజయ్ భండారీతో భాజపా నాయకుడు సిద్ధార్ధ సింగ్‌కు పరిచయం ఉన్నదని కాంగ్రెస్ ఆరోపించింది. ‘నిజమే ఆయన పిల్లలూ, మా పిల్లలూ ఒకే స్కూలులో చదువున్నారు. అదీ సంబంధం’’అని సిద్దార్ధ సింగ్ సమాధానం చెప్పారు.
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆత్మావలోకనం వలన ఇక ప్రయోజనం లేదు. పార్టీకి శస్తచ్రికిత్స జరగాల్సిందే’’ అన్నారు దిగ్విజయ్ సింగ్. అంటే దీని అర్థమేంటి? ఇటీవల మధ్యలో సోనియాగాంధీ, అటు వాద్రా, ఇటు రాహుల్ చిత్రాలతో ‘సేవ్ డెమోక్రసీ’ అనే బ్యానర్లు ఢిల్లీలో వెలువడ్డాయి. దీని అర్థమేంటి? వాద్రాకు సంబంధించి హర్యానా, రాజస్థాన్‌లలో రెండు భూమి కుంభకోణాలున్నాయి. లండన్ హౌస్ ఉదంతం మూడవది. విచారణలో వాద్రా నిర్దోషిగా తేలితే సంతోషమే. కాని సోనియా ఎందుకింత ఆందోళన చెందుతున్నది? లండన్ హౌస్ ఉదంతం వెలుగులోకి రాగానే సోనియా వాద్రాను వెనకేసుకొని రావడం ఏమిటి? కపిల్ సిబాల్, మనీష్ తివారీ, సుప్రియ చతుర్వేది వంటి పార్టీ ప్రవక్తలతో మాట్లాడిస్తే సరిపోయేది కదా! ఏకంగా సోనియా ఎందుకు రంగంలోకి దిగింది? సుధాంశు త్రివేది కథనం ప్రకారం రాబర్ట్ వాద్రాకు సోనియా ఆర్థిక లావాదేవీలన్నీ తెలుసు. తనను కాపాడకపోతే ఇవన్నీ బయట పెడతానని బ్లాక్‌మెయిల్ చేసి ఉంటాడని సుధాంశు చతుర్వేది అన్నారు. మరి ఇప్పుడు పార్టీ కార్యకర్తలు లండన్ హౌస్ కుంభకోణాన్ని ఏవిధంగా అర్థం చేసుకుంటారు?
సంజయ్ భండారీ రహస్య నిధులు బ్రిటన్, వర్జిన్ ఐలాండ్, దుబాయిల్లో ఉన్నాయని నిఘా విభాగాలకు తెలిసింది. ఆయనకు ధేల్స్ గ్రూపు, యూరోపియన్ ఏరోనాటికల్ డిఫెన్స్ స్పేస్ కంపెనీతో ప్రత్యక్ష లింకులున్నాయి. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి సీబూ సొరేన్, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీలో ఉన్న అప్పారావుకు, కేంద్ర ఆర్థిక శాఖలో ఒక ప్రధాన ఉద్యోగి (2015లో రిటైర్ అయినాడు)కి సంజయ్ భండారీతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. అంటే మనీ లాండరింగ్‌లో వీరి సహాయ సహకారాలు లభించాయా? అని నిఘా విభాగాలు విచారిస్తున్నాయి.
కాంగ్రెస్ అంటే లక్షలాది మంది కార్యకర్తలు అంతేకాని రాబర్ట్ వాద్రా కాదు. ఈ సందర్భంలో బెంగాల్‌లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకోవాలి. ఇటీవల జరిగిన బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ సభ్యులంతా అఫిడవిట్లు సమర్పించారు. ‘‘తాము సోనియాగాంధీకి విధేయులమై ఉంటామని, మా విధేయత తొలగిపోతే మా పదవులకు రాజీనామా చేస్తామని’ అ బాండ్ పేపర్లపై వ్రాసి ఉంది. ఇలా బాండ్లు తీసుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదు. అయినా తాము పార్టీకి విధేయులమని కాక సోనియాకు విధేయులమంటూ అఫిడవిట్లు తీసుకున్నారు. దీని సారాంశమేమంటే వ్యక్తికి, కుటుంబానికి మొత్తం పార్టీ దాసోహమంటోంది. అదే రాబర్ట్ వాద్రావిషయంలో కూడా జరుగుతోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ పార్టీని అవినీతి రహితంగా పునర్నిర్మిస్తానంటున్నారు. ఇది సాధ్యమేనా? కొయ్యగుర్రం పరిగెత్తుతుందా? వాయుతరంగాల కేసులో కనుమొజి గతంలో తీహార్ జైలుకెళ్లింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న డిఎంకె మొన్న తమిళనాడు ఎన్నికల్లో ఓటమిపాలైంది. లల్లూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో గతంలో జైలుపాలయ్యారు. బిహార్‌లో ఆయనతో కాంగ్రెస్ అంటకాగింది. బెంగాల్‌లో ప్రత్యక్షంగా కమ్యూనిస్టులతో చేతులు కలిపి, మొత్తం 30 స్థానాల్లో వారి సీట్లకు గండికొట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం మారితే పార్టీ పునరుజ్జీవిస్తుందా? ఏది ఏమైనా రాహుల్, సోనియా ఛరిష్మా ఇక పనిచేయదన్నది స్పష్టమైపోయింది.
నరేంద్ర మోదీ ఇప్పుడు ఏం చేస్తారు? దొంగలలో కొందరు అస్మదీయులు ఉన్నారని భోగట్టా! అందుకని విచారణ ఆగిపోతుందా? అదే జరిగితే మోదీ అప్రతిష్ఠ మూటకట్టుకుంటారు. పాలనాకాలం హారతి కర్పూరంలా హరించుకుపోతున్నది. సంజయ్ భండారీని పట్టుకుంటే లండన్ హౌజ్ నిజానిజాలు వెల్లడవుతాయి.

- ముదిగొండ శివప్రసాద్