మెయిన్ ఫీచర్

సమానత్వంలోనే గౌరవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘యాత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’’ (ఎక్కడ స్ర్తిలు పూజింపబడతారో, అక్కడ దేవతలు సంతోషిస్తారు),
‘అర్థరాత్రి ఆడది ఒంటరిగా తిరుగాడినప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం’ అన్నారు మహాత్మాగాంధీ- 70 ఏళ్ళ స్వాతంత్య్ర భారతావనిలో పైమాటలు శిథిలమవుతున్న పునాదిరాళ్ళుగానే మిగిలాయి. క్రీ.పూ. 6వేల సంవత్సరాలకు పూర్వమే భారతీయులు స్ర్తిలను గౌరవిస్తూ, పూజిస్తూ ఉండేవారు. స్ర్తిలకు తగిన పాత్రను కల్పించే సదాశయంతో మొట్టమొదటగా ‘మహాత్మా జ్యోతీరావు పూలే’ స్ర్తి విద్యను ఉద్యమ స్పూర్తితో చేపట్టారు. తద్వారా రాజారామ్ మోహన్‌రాయ్, కందుకూరి వీరేశలింగం, టంగుటూరి ప్రకాశం, దుర్గ్భాయ్ దేశ్‌ముఖ్, దాదాబాయి నౌరోజీ వంటి పలువురు సంఘ సంస్కర్తలు భారతదేశంలో స్ర్తిల అభ్యున్నతికై పలు సంస్కరణలు చేపట్టి ప్రజా చైతన్యం గావించారు. భారతదేశ మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపాలాని (ఉత్తరప్రదేశ్), మొదటి మహిళా సెక్రటరీ జనరల్ రాజ్యసభ వి.ఎస్.రమాదేవి (ఆంధ్రప్రదేశ్ వాసి), మొదటి మహిళా ఐపిఎస్ కిరణ్‌బేడి, అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ వనిత కల్పనాచావ్లా, మొదటి మహిళా రాష్టప్రతి ప్రతిభా పాటిల్ వంటి వారు వనితాలోకానికి స్ఫూర్తిప్రదాతలయ్యారు. అటువంటి భారతావనిలో ఆడవారికి రక్షణ కరువైపోతోంది. కనీస దయార్ద్ర హృదయాలు కరువైన క్రూరులు మానవ మృగాలుగా, మృగాళ్ళుగా మారిపోతున్నారు. 2012 డిసెంబర్ 16వ తేదీ.. 23 ఏళ్ళ మెడికో విద్యార్థిపై అత్యంత దారుణంగా ఆరుగురు కసాయి యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. సామూహిక అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె సింగపూర్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. 2013లో విచారణ కోర్టు ఈ కేసులో అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్‌లను దోషలుగా నిర్థారిస్తూ ఉరిశిక్ష విధించింది. నిర్దయగా జరిగిన నిర్భయ ఘటనపై లోకమంతా వెల్లువెత్తిన నిరసన ఫలితంగా 2013 ఏప్రిల్ 3న నిర్భయ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోని 326ఎప్రకారం యాసిడ్ దాడి చేస్తే పదేళ్లకు తక్కువ కాకుండా తీవ్రతను బట్టి యావజ్జీవ శిక్ష కూడా విధించేందుకు అవకాశం వుంది. 354ఎ ప్రకారం లైంగిక వేధింపులకు పాల్పడితే తీవ్రతనుబట్టి 3 ఏళ్ళ నుండి గరిష్ట కారాగారం, నష్టపరిహారం లేదా రెండూ విధించే అవకాశం ఉంది. 354 బి ప్రకారం చెడు ఉద్దేశ్యంతో తాకితే 3 ఏళ్ళనుండి 7 ఏళ్ళ వరకు శిక్ష విధిస్తారు. కాని చట్టాలెన్ని చేసినా అందులోని లోపాలు మానవ క్రూరులకు మరిన్ని అవకాశాలుగా మారుతున్నాయి. చట్టాలను గౌరవించి, అమలుచేయాల్సిన అధికారులే కీచక పర్వాలకు వత్తాసు పలుకుతుంటే ఆ చట్టాలు అటకెక్కక మానవు. ఆసిఫా బానో.. జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో ముక్కుపచ్చలారని 8 వసంతాల బాల్యం మృగాళ్ళ చేతుల్లో నలిగి లోకం విడిచింది. 2018 జనవరి 10వ తేదీన మహమ్మద్ యూసుఫ్ పుజ్వాలా కుమార్తె ఆసిఫా కనిపించకుండా పోయింది. మేతకోసం అడవికి వెళ్లిన గుర్రాలను ఇంటికి తోలుకొచ్చేందుకు వెళ్లిన ఆసిఫా తిరిగి రాలేదు. జనవరి 12న పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. పైగా ‘ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయి ఉంటుంది’ అని తిలక్ రాజ్ అనే పోలీసు అధికారి అవహేళనగా మాట్లాడటం పోలీసు వృత్తికే కళంకం. గుజ్జర్లు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగిన ఫలితంగా ఆసిఫా జాడ కనిపెట్టేందుకు ప్రభుత్వం ఇద్దరు పోలీసు అధికారులను నియమించింది. ఆ ఇద్దరి పోలీసు అధికారుల్లో ఒకరు ఈ కేసులో నిందితుడిగా ఉన్న దీపక్ ఖజురియా (28). కేసు నమోదు చేసిన పోలీసులు అంతా వెదికారు. ఆసిఫా హత్యకు ప్రణాళిక రచించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ మాజీ ఉద్యోగి ఇల్లు, గ్రామంలోని గుడిలో మాత్రం పోలీసులు వెదకలేదు. 7 రోజులు గడిచిన అనంతరం హృదయ విదారకమైన స్థితిలో ఆసిఫా శవం దొరికింది. ఘోరాతిఘోరంగా హింసించి కాళ్లు విరిచేసి చంపేశారు. జనవరి 23న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి దర్యాప్తునకు ఆదేశించారు.
ప్రత్యేక దర్యప్తు బృందం కథనం ప్రకారం 8 ఏళ్ల అసిఫాకు మత్తు మందులు ఇచ్చి ఆలయంలో నిర్బంధించారు. ఆ తదుపరి ఏడు రోజులపాటు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేశారు. చివరికి హింసను తట్టుకోలేని స్థితికి చేరిన చిన్నారిని బండరాయితో రెండుసార్లు తలపై కొట్టి చంపేశారని తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన 8 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో అత్యధికులు పోలీసులే ఉండడం గమనార్హం. ఖాకీ అంటే ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. కాదు కాదు రాబందుల్లా మారి పసిప్రాయంపై ఘోరకృత్యాలకు పాల్పడిన పోలీసు క్రౌర్యం సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేదిగా చేసింది. ఇది పోలీసు వ్యవస్థకు మాయని మచ్చ. చిన్నారి ఆసిఫా మృతదేసానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా హిందూ మితవాద గుంపులు అడ్డు చెప్పారు. అక్కడ అంత్యక్రియలు జరిపితే విధ్వంసం సృష్టిస్తామన్నారు. దాంతో 7 కిలోమీటర్ల దూరంలోని మరో ఊరిలో అంత్యక్రియలు చేశారు. ఈ విషయం జనవరి చివరలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో చర్చకొచ్చింది. ఎమ్మెల్యే, గుజ్జర్ల నేత మియాన్ అల్త్ఫా ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. చిన్నారిపై జరిగిన అత్యాచార, హత్యాంశాన్ని కథువా జిల్లాకు చెందిన బిజెపి ఎమ్మెల్యే రాజీవ్ జస్రోటియా కుటుంబ వ్యవహరమంటూ వ్యాఖ్యనించడమేగాక గుజ్జర్లు కావాలనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అరెస్టయిన పోలీసు అధికారులను విడుదల చేయాలంటూ సంజీవ్‌రామ్, అంకుర్ శర్మల నేతృత్వంలో ‘హిందూ ఏక్తా మంచ్’ అనే బ్యానర్లు పట్టుకుని భారీ ర్యాలీ చేశారు. వీరికి మద్దతు పలుకుతూ ఇద్దరు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మంత్రులు జాతీయ జెండాలతో మరో ర్యాలీలో పాల్గొన్నారు. అసిఫాపై అకృత్యానికి పాల్పడిన వారికి మద్దతు పలుకుతూ బిజెపి మంత్రులు జాతీయ జెండాలతో ర్యాలీలు తీయడంపై యూసఫ్ పుజ్వాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ‘‘నా బిడ్డ మరోసారి అత్యాచారానికి, హత్యకు గురైనట్లు’’ అనిపించిందన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ఈ కేసుపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, 90రోజుల్లో కేసు విచారణ పూర్తయ్యేలా చూడాలని హైకోర్టు జస్టిస్ రాజలింగంకు లేఖ రాశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన దోషులకు సౌదీ అరేబియా, యుఎఈ, ఈజిప్టు, చైనా, ఉత్తరకొరియా, ఫ్రాన్స్, అప్ఘానిస్తాన్, ఇరాన్, అమెరికా, గ్రీస్, రష్యా, ఇజ్రాయెల్‌లలో కఠిన శిక్షలు అమలు చేస్తారు. నెదర్లాండ్స్‌లో ఫ్రెంచ్ కిస్ ఇచ్చినా దాన్ని రేప్ కిందే చూస్తారు. దోషి వయసును బట్టి 4 నుండి 15 ఏళ్ళ వరకు శిక్ష పడుతుంది. కాని మన భారతదేశంలో నిర్భయ వంటి కఠిన చట్టం చేసినా మహిళలు, బాలికలపై ఘోరమైన నేరాలు తగ్గడంలేదు. ప్రపంచ దేశాలన్నీ భారతీయ స్ర్తిని, సంప్రదాయాలను గౌరవిస్తూ వుంటే, మన దేశంలో స్ర్తిలపై నీచాతినీచమైన ఘటనలు జరగడం సిగ్గుచేటు. ఇవి కథువాలోనో, ఉన్నావ్‌లోనో, సూరత్‌లోనో, ఢిల్లీలోనో జరిగిన ఘటనలు మాత్రమే కావు. స్వతంత్ర భారతావనిలో ఆడవారికి రక్షణ కరువైంది. ఎందరో వనితలు పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ప్రేమ పేరిట అఘాయిత్యాల బారిన పడుతూనే ఉన్నారు. వరకట్న వేధింపులకు గురవుతూనే ఉన్నారు. బడిలో, గుడిలో సైతం ఆడవారు ఆటంకాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. క్రూర మృగాళ్ళ చేష్టలకు బలవుతూనే ఉన్నారు.
ఆకాశంలో సగం, అవనిలో సగం అనుకుంటున్న స్ర్తిలు ప్రస్తుతం భారతదేశంలో 50 కోట్లకుపైగా ఉన్నారు. కాని స్ర్తిల ప్రాతినిధ్యం, హక్కులు నేడు ప్రశ్నార్థకంగా మారాయి. ఎందుకంటే 105 కోట్ల జనాభాలో స్ర్తిలు సగభాగమయినా వారికి ఉద్యోగాల్లో, విద్యావకాశాల్లో, చట్టసభల్లోగాని తగిన ప్రాతినిధ్యం లేదు. భారత రాజ్యాంగంలోని 14, 15 అధికరణలు స్ర్తిలకు పురుషులతో సమానత్వాన్ని కల్పించాయి. కాని ఆచరణకు నోచుకోలేదు. 1956లో హిందూత్వ వారసత్వ చట్టం ప్రకారం కుమారునితోపాటు కుమార్తెకు కూడా సమాన వారసత్వ హక్కు కల్పించబడింది. 1961లో వరకట్న నిషేధ చట్టం చేయబడింది. కాని అమలులో లోపాలు జరుగుతున్నాయి. 2006 అక్టోబర్ 25 నుండి గృహహింస చట్టం అమలులోకి వచ్చింది.
స్ర్తి సంక్షేమానికి పాటుపడుతున్న మొదటి మూడు దేశాలు అతి చిన్న దేశాలైన స్వీడెన్, నార్వే, డెన్మార్క్- కాని భారతదేశ స్థానం అట్టడుగునుండి రెండో స్థానంలో ఉంది. స్ర్తిలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిన నాడే దేశం అభివృద్ధి సాధిస్తుందనేది అక్షర సత్యం.
తరతరాలుగా తాము చేతగానివారిగా, పురుషాధిక్య సమాజంలో కొవ్వొత్తులుగా సమిధలవుతన్న అబలలంతా సబలలుగా మారాలి. నరమేధాలకు పాల్పడే రాక్షసుల పని పట్టాలి. పసిమనసులను నలిపేసే, మహిళలపై క్రూరత్వాలకు పాల్పడే మగ అసురులపై తక్షణ, కఠిన శిక్షలు అమలు చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. నేరస్థులకు సహకరించిన అధికారులను విధులనుండి తొలగించి, వారి కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం లేకుండా చూడాలి. నేరం ఎలా జరిగిందో పదే పదే చూపించే ప్రసార మాధ్యమాలు, నేరగాళ్ళకు పడే కఠిన శిక్షలను ప్రత్యక్ష ప్రసారం చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అప్పుడే సమాజంలో నేరం చేయాలంటే భయం. స్ర్తిని గౌరవించాలనే అభిప్రాయం బయటికొస్తాయి.
అమ్మలేనిదే జన్మ లేదనే విషయాన్ని గ్రహించాల్సిన ఇంగిత జ్ఞానం ప్రతి మనిషికి ఉండాలి. పరాయ స్ర్తిని తల్లిగా, చెల్లిగా స్ర్తి భావింపబడిననాడే మన దేశానికి నిజమైన స్వాతంత్య్రం.

-యడ్ల కృష్ణకిషోర్