మెయన్ ఫీచర్

‘అభిశంసన’పై పంతాలు, పట్టింపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం తిరస్కరిస్తున్నట్టు ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్ హోదాలో ప్రకటించారు. ఇపుడు ఏం జరగబోతోంది? దీనిని సుప్రీం కోర్టులో సవాలు చేసే అవకాశం ఉందా? ఉంటే ఎంతవరకూ ఉంది? ఆ తర్వాత ఏం జరగబోతోంది? అనే ప్రశ్నలు రాజ్యాంగం న్యాయవ్యవస్థకు ఇచ్చిన స్వేచ్ఛను నిలదీస్తున్నాయి. విపక్షాలు ఈ అంశంపై సుప్రీంను ఆశ్రయిస్తామని అంటున్నాయి. ‘మాస్టర్ ఆఫ్ ద రోస్టర్’ సుప్రీం చీఫ్ జస్టిస్ కనుక విపక్షాలు దాఖలు చేసే పిటిషన్ ఆయన వద్దకే వెళుతుంది. కాని అభిశంసన ఆయనపైనే కనుక ఆ కేసును సహజంగానే తన తర్వాతి సీనియర్‌కు అప్పగించే వీలుంది. ఆ సీనియర్ జడ్జి నేతృత్వంలో ముగ్గురు న్యాయమూర్తులుంటారా? ఐదుగురు న్యాయమూర్తులు ఉంటారా? కేసు ఏమవుతుంది? అది ఎలాంటి మలుపు తీసుకోబోతోంది? నిన్నటి వరకూ ఉన్న ఈ ఉత్కంఠ ఇపుడు మరింత రెట్టింపైంది. ఇది ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగుతుంది. ఇప్పటికే తాను ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్’ అని దీపక్ మిశ్రా ప్రకటించి , సమానుల్లో తానే ప్రథముడినని, పరోక్షంగా ఉన్నతుడినని స్పష్టం చేశారు. అంతే కాదు, కార్యనిర్వాహక వ్యవస్థ తీరుతెన్నులను చీల్చి చెండాడి ఆ వ్యవస్థ కంటే న్యాయవ్యవస్థదే పైచేయి అని కూడా తేల్చిచెప్పారు.
గత జనవరి 12న నలుగురు న్యాయమూర్తులు నేరుగా మీడియా ముందుకు వచ్చి సుప్రీం కోర్టు పనితీరుపై అసహాయత వ్యక్తం చేయడంతో మొదలైన ఈ వివాదం అనేక మలుపులు తిరిగి చివరికి అభిశంసన వరకూ వచ్చింది. మనదేశ చరిత్రలో ఇలాంటి ఉత్కంఠ ఇదే తొలిసారి కాదు, చివరిసారి కూడా కాబోదు. ఎప్పటికప్పుడు విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి వచ్చినపుడు న్యాయవ్యవస్థ పునీతం కావడం, తన సచ్ఛీలతను రుజువుచేసుకోవడం స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుండి కొనసాగుతున్నదే. అవినీతి, ఆశ్రీత పక్షపాతం, అక్రమాల వంటి ఆరోపణలు ఎంతో మంది న్యాయమూర్తులపైనా, సుప్రీం ప్రధాన న్యాయమూర్తులపైన వచ్చాయి. అభిశంసనను కూడా ఇప్పటికే చాలా మందిపై ప్రతిపాదించారు. కొన్ని ప్రతిపాదనలు ఆదిలోనే ఆగిపోగా, మరికొన్ని పార్లమెంటు గడప వరకూ వెళ్లి ఆగిపోయాయి. మరికొన్ని పార్లమెంటులో చర్చకు కూడా వచ్చాయి.
సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు ఇవ్వడం ఇదేం మొదటిసారి కాదు. 1990లో జస్టిస్ రామస్వామి దుబారా ఖర్చులపై మీడియాలో వార్తలు వచ్చాయి. 1991 ఫిబ్రవరి 1న సుప్రీం బార్ అసోసియేషన్ ఒక తీర్మానం చేస్తూ, సుప్రీం కోర్టుకు పదోన్నతిపై వచ్చిన రామస్వామికి ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని, ఆయనను తొలగించాలని కోరింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వామపక్షాలతో కలిసి ఈ తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అప్పటి లోక్‌సభ స్పీకర్ ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీని వేసి అధ్యయనం చేయించారు. 14 ఆరోపణల్లో 11 ఆరోపణలు వాస్తవమే అని తేలడంతో 1993 మే 10న అభిశంసన తీర్మానంపై ఓటింగ్ నిర్వహించగా, తీర్మానానికి అనుకూలంగా 196 ఓట్లు వచ్చాయి. కాని మెజార్టీగా ఉన్న 205 మంది కాంగ్రెస్ సభ్యులు సభకు గైర్హాజరయ్యారు. తగినన్ని ఓట్లు రాకపోవడంతో ఆ అభిశంసన తీర్మానం వీగిపోయింది. 2011లో కోల్‌కత హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్‌పై ఆర్ధిక పరమైన ఆరోపణలు వచ్చాయి. దానిపై అభిశంసన తీర్మానం లోక్‌సభలో ఓటింగ్‌కు వచ్చింది. ఫలితాన్ని ముందుగానే ఊహించిన సౌమిత్ర సేన్ తన పదవికి రాజీనామా చేశారు. 2011లో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పీడీ దినకరన్‌పై అవినీతి ఆరోపణలు రాగా, ప్రాథమిక విచారణలోనే అవి వాస్తవమని తేలింది. సెలవుపై వెళ్లాలని ఆదేశించినా ఆయన వినకపోవడంతో కర్నాటక హైకోర్టుకు ఆయనను బదిలీ చేశారు. అభిశంసన ప్రక్రియకు పావులు కదులుతుండటంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. 2016లో అధికార దుర్వినియోగం ఆరోపణలతో జస్టిస్ నాగార్జున రెడ్డిపై అభిశంసన తీర్మానం పెట్టారు. దానిని బలపరిచిన వారిలో 19 మంది తమ సంతకాలను వెనక్కు తీసుకోవడంతో ఆ అభిశంసన తీర్మానం వీగిపోయింది. ఇవన్నీ పార్లమెంటు గడపకు ఎక్కిన అంశాలు, అంతవరకూ పోకుండానే జస్టిస్ కర్నన్ ఉదంతాల వంటివి ఎన్నో ఉన్నాయి. నేరుగా అవినీతి నిరోధక బృందాలకు దొరికిపోయిన నాయమూర్తులు ఎందరో ఉన్నారు. న్యాయవ్యవస్థ సైతం అవినీతికి అతీతం కాదనే విషయాన్ని స్పష్టం చేసే వాస్తవాలు ఇవి. అంత మాత్రాన న్యాయమూర్తులు అంతా అవినీతి పరులే అని ఎవరూ చెప్పలేరు, చెప్పరు కూడా.
దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ఓటింగ్‌కు రాకుండానే రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్టు కేసులో మిశ్రా ముడుపులు తీసుకున్నారనేది ఆ అభిశంసన తీర్మానంలో ఒక ఆరోపణ. అయితే పార్లమెంటు సభ్యులు ఈ ఆరోపణలను నేరుగా చేయకపోవడం గమనార్హం. ఎవరో అన్న మాటలు, పత్రికల్లో చూసినవి ఆరోపణ పత్రంలో చేర్చడంతో వాటి నిష్పాక్షికతపై ఉప రాష్టప్రతి అనుమానం వ్యక్తం చేశారు. ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్టు కేసు విషయంలో రిటైర్టు హైకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు సుప్రీం చీఫ్ జస్టిస్ అనుమతి ఇవ్వలేదని, ట్రస్టుపై విచారణకు సంబంధించి పిటిషన్‌ను ముందు తేదీకి మార్చడం నేరమని ఎంపీలు ఆరోపించారు. రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్నా, ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు సంబంధించిన విచారణను తన బెంచ్‌కు కేటాయించడం సంప్రదాయానికి విరుద్ధమని, న్యాయమూర్తిగా ఉన్నపుడు జస్టిస్ దీపక్ మిశ్రా తప్పుడు అఫిడవిట్‌తో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారని, సుప్రీం న్యాయమూర్తిగా దీపక్ మిశ్రా పదోన్నతి పొందినపుడు దీనిని సరెండర్ చేశారని, 1985లోనే ఫ్లాట్ కేటాయింపు నిబంధనలను రద్దుచేశారని, అప్పటి నుండి వీటిని సిజే ఉల్లంఘించారని , తనకున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అధికారాలను కూడా దుర్వినియోగం చేశారని, సున్నితమైన అంశాలను కొన్ని ప్రత్యేక ధర్మాసనాలకు కట్టబెట్టారని ఎంపీలు ఆరోపించారు. రాజ్యాంగంలోని 124(4) అధికరణం ప్రకారం సుప్రీం న్యాయమూర్తులతో పాటు ప్రధాన న్యాయమూర్తిని కూడా తొలగించే వీలుంది.
న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియను పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రారంభించవచ్చు. రాజ్యసభలో అయితే ఈ ప్రతిపాదనపై కనీసం 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి. లోక్‌సభలో అయితే కనీసం 100 మంది సభ్యులు సంతకాలు చేయాలి. లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ఈ తీర్మానాన్ని ఓటింగ్‌కు ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. తీర్మానాన్ని తిరస్కరిస్తే అది వీగిపోయినట్టే భావించాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి నిర్ణయమైనా న్యాయ సమీక్షకు వీలుకల్పించే వుంటుంది. అభిశంసన తీర్మానం తిరస్కరించిన వెంటనే కాంగ్రెస్ సహా మిగిలిన పక్షాలు కొన్ని ఈ అంశంపై సుప్రీంకు వెళ్తామని ఇప్పటికే ప్రకటించాయి. రాజ్యసభ చైర్మన్ అభిశంసన నోటీసులను తిరస్కరిస్తే దానిని కోర్టులో సవాలు చేసేందుకు వీలుందని న్యాయనిపుణలు చెబుతున్నారు. అయితే దుష్యంత్ దవే మాత్రం రాజ్యసభ చైర్మన్ తిరస్కరించిన మీదట వాటిని సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం లేదని చెబుతున్నారు.
2011 అక్టోబర్ 10వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన దీపక్ మిశ్రా గత ఏడాది ఆగస్టు 28న ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఏడేళ్ల క్రితం మిశ్రా సుప్రీం కోర్టుకు వచ్చే సరికి హెచ్‌ఎస్ కపాడియా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన కళ్ల ముందే ఏడుగురు ప్రధాన న్యాయమూర్తులు మారారు. ఈ ఏడుగురు కేసుల విషయంలో అనుసరించిన రోస్టర్‌పైనా, న్యాయమూర్తుల నియామకం, పదోన్నతుల్లో అనుసరించిన విధానంపైనా మిశ్రా ఎంతో అనుభవాన్ని గడించారు. చాలా కీలకమైన కేసుల కేటాయింపులోనూ , జస్టిస్ బాలకృష్ణన్‌పై ఆరోపణలు వచ్చినపుడు సుప్రీంలో జరిగిన మేధో మథనంలో ఆయన ప్రత్యక్ష సాక్షి. ఏడేళ్ల అనుభవంతో మిశ్రా కొన్ని కీలక కేసుల విషయంలో సమతూకం పాటిస్తూ, పెను సంచలనాలకు అవకాశం లేకుండా సగటు భారతీయుడు కోరుకునే సమన్యాయంవైపే మొగ్గుచూపుతూ సుప్రీంను గాడిలోపెట్టడంలో సఫలీకృతం అయ్యారు. గాడిలో పెట్టే క్రమంలో ఊపిరి ఆడక కొంత మంది న్యాయమూర్తులు తమ ఇబ్బందులను నేరుగా దేశ ప్రజల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ రగడలో ఎవరు విజయం సాధించారనే దానికి ప్రాధాన్యత ఇవ్వడం కంటే దేశ పౌరులు ఉంచిన గట్టినమ్మకాన్ని సుప్రీం రుజువు చేసుకున్నపుడు అంతకంటే కావల్సింది ఏముంటుంది? దీపక్ మిశ్రా ఈ ఏడాది అక్టోబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. ఆ విషయం తెలిసినా ఇంత పట్టుదలకు రాజకీయ పార్టీలు ఎందుకు పోతున్నాయి? ఏ ఆశయంతో విపక్ష పార్టీలు ఈ పోరును సాగిస్తున్నాయి? ఇది ఆలోచించదగిందే. ఉన్న క్రమం చూస్తే దీపక్ మిశ్రా తర్వాత జస్టిస్ రంజన్ గొగాయ్ ప్రధాన న్యాయమూర్తి కావచ్చు. ఆయన వచ్చే ఏడాది నవంబర్ 17 వరకూ ఆ పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం శరద్ అరవింద్ బాబ్డేకు, అనంతరం జస్టిస్ ఎన్ వి రమణకు దక్కుతుంది. కొద్ది రోజులు ఉమేష్ లలిత్‌కు అవకాశం లభించినా తర్వాత డివై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఈ క్రమాన్ని మార్చాలన్నదే పార్టీల ఆకాంక్షగా ఉందా? ఆ ఆకాంక్ష నెరవేరుతుందా? న్యాయవ్యవస్థలో రాజకీయాలను స్వాగతించాలా? రాజకీయాలు లేకుండానే న్యాయవ్యవస్థ పనిచేస్తోందా? ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. పేరుకే స్వయం ప్రతిపత్తి అని చెబుతున్నా, దిగువస్థాయి న్యాయస్థానాలు ప్రభుత్వాల గుప్పిట్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయనేది విష్పష్టం. ఉన్నత న్యాయస్థానాల్లో సైతం రాజకీయాల ప్రభానం నేడు కళ్లారా చూస్తున్నాం.

-బీవీ ప్రసాద్ 98499 98090