మెయన్ ఫీచర్

లౌకిక పార్టీల్లో ఆత్మ పరిశీలన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవి అయినవాడు తన కావ్యరచనను కుకవి నిందతో ఆరంభించాలి. తర్వాత గొప్ప కావ్యం ఒకటి రచించి పండితులను, పామరులను మెప్పించాలి. అపుడు లోకం ‘్భళిరా, కవిరాజా’ అని కీర్తిస్తుంది. మన ప్రతిపక్షాలకు కుకవి నింద బాగా తెలుసు. కాని సత్కావ్య రచనలోకి ఎట్లా వెళ్లాలో తెలియదు. కనుక తమ వాక్‌ప్రగాల్భ్యమంతా కుకవి నింద చుట్టూనే పరిభ్రమిస్తుంటుంది. తర్వాత రాయవలసింది కవితా రూపం తీసుకోకుండా ‘అకవిత’గా మిగులుతుంది. ప్రతి పక్షాలు సమస్య ఇంతమాత్రమే కాదు. ఇపుడు ఎవరినైతే కుకవులని నిందిస్తూ వారి కావ్యాల తాళపత్రాలను, హోమకుండంలోకి విసురుతున్నారో, అంతకు ముందు తాము సైతం అదే తరహా కుకవితలను ఎడ్లబండ్లకొద్దీ రాసినవారే.
ఇందుకు మనదేశంలోని ఏ రాజకీయ పార్టీలూ మినహాయిపు కాదు. అన్నీ కూడా ఎపుడో ఒకప్పుడు అధికారంలో, ఎప్పుడో ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండినవే. కనుక ప్రతిపక్షాలు అని ఇక్కడ అంటున్నది ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నవారి గురించి మాత్రమే కాదు. నిన్న ఉండిన వారు, రేపు ఉండగలవారి గురించి కూడా. అందరి కావ్యరచనలు అకవితలుగా ఉంటున్నాయి కనుకనే, ప్రజలు పరిస్థితిని బట్టి ఎవరినో ఒకరిని ఎన్నుకున్నా, హోమగుండాలకు ఆహుతి చేయకుండా ఎవరి కవితా పత్రాలనూ వదలడం లేదు.
ఈ సాధారణ స్థితిని అట్లుంచితే, ఇపుడు మాట్లాడుకుంటున్నది ప్రస్తుత సందర్భంలో అయినందున, దానిపై దృష్టి ఉంచుదాం. మనకు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ/ బడుగువర్గాల పార్టీలున్నాయి. జాతీయ అధికారానికి సంబంధించి ఇవి ప్రతిపక్షాలు. వీరంతా లోగడ జాతీయాధికారం నెరపినవారే. వివిధ రాష్ట్రాలలో ఇపుడు కూడా ప్రభుత్వాలను నిర్వహిస్తున్నవారే. కాని వీరంతా గతంలో గాని, ప్రస్తుతం గాని ఉత్తమ కావ్య రచన చేయనిది ఎందువల్ల? కుకవి నిందపట్ల గల అభినివేశాలు సత్కావ్యరచనలో ఎందుకు కన్పించవు? ఈ ప్రశ్నలు ఇప్పుడు కొత్తగా వేస్తున్నవి కావు. కోటి మంది కోటిసార్లు వేసినవే. కాని కోటిసార్లు కూడా వారినుంచి మనకు వౌనాలు, సాకులు ఎదురయ్యాయి తప్ప, హేతుబద్ధమైన వివరాలు కనిపించలేదు. అంతేకాదు, ఒకసారి అధికారానికి వచ్చి తమ నికృష్ట కావ్యరచన వల్ల ప్రజలనుంచి ఛీత్కరింపులకు గురైన మీదనైనా సవరణలు చేసుకోలేదు. అవే దుష్ట రచనలను తిరిగితిరిగి ఆవిష్కరిస్తూ పోయారు. ప్రజలకు ప్రత్యామ్నాయం లేకపోవడమన్నది ఒక్కటే వారి మురికి సాహిత్యాన్ని పునర్ముద్రణకు తెస్తూ పోయింది.
ప్రతిపక్షాలలో ముందు వామపక్షాల విషయం చూద్దాం. ముందుగా వీరెందుకంటే, సైద్ధాంతిక నిష్టాపరులంటూ వీరికొక ప్రతిష్ట ఉంది. అటువంటిది మరెవరికీ లేదు. దాని అర్థం, ఇతరుల కావ్యాలు ఎంత దుర్గంధాన్ని వెదజల్లినా వీరివి మాత్రం సుగంధాలతో గుబాళించాలి. కాని అట్లా జరుగుతూ వచ్చిందా? వామపక్షాలు ప్రధానంగా పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో చిరకాలం అధికారాన్ని నెరపాయి. పరిపాలనలు మాత్రం తమ సిద్ధాంతాలకు గాని, ప్రజలకు ఇచ్చిన హామీలకు గాని అనుగుణంగా లేవు. ఫలితంగా ఆ పార్టీలు ప్రస్తుతం ఎక్కడికి పతనమయ్యాయో కనిపిస్తున్నదే. కేరళలో గెలుపు వారి కవితా గానానికి ప్రజలు చరచిన చప్పట్లు కావని అక్కడి రాజకీయాలతో పరిచయం ఉన్నవారికి తెలిసిందే. కేవలం యుడిఫ్ గానంలోని కర్ణకఠోర అపస్వరాల వల్ల, మరొక ప్య్రామ్నాయం లేనందువల్ల, సోకాల్డ్ విజయమన్నది వీరిని వరించింది.
ఇంతకాలం వారి పరిపాలనల్లో జరుగుతూ వచ్చిందేమిటి? పశ్చిమ బెంగాల్‌లో 34 సంవత్సరాలు పరిపాలించి రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. ప్రపంచ ప్రజాస్వామిక వ్యవస్థలలో ఎవరూ ఎక్కడా ఇంతకాలం వరుసగా అధికారంలో లేరు. అది ఒక రికార్డు కాగా, వామపక్షాలు ఉండటమన్నది రెండవ రికార్డు. ఇది నిస్సందేహంగా ఘనకార్యమే. కాని కొద్దిగా లోతుకు వెళ్లి చూస్తే వారి పాలనలు ప్రజారంజకంగా సాగి ఉంటే 2009, 2011, 2014, 2016 సంవత్సరాల లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో, ఇదే కాలంలో జరిగిన వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎందుకు ఎదురైనట్టు? ఓట్లు, సీట్ల సంఖ్యలు నానాటికి ఎందుకు తగ్గుతున్నట్లు? పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున ఇతర పార్టీల్లోకి వెళ్లడం, కొత్తవారి రాక తగ్గడం ఎందువల్ల? భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతున్నది ఎందుకు?
ఇందుకు స్పష్టమైన సమాధానాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 34 సంవత్సరాల పాలన అల్లసాని వారి ప్రబంధంమంత రసవత్తరంగా ఏమీ సాగలేదు. ఆమాట అనేందుకు ఉదాహరణలు కోకొల్లలు. అందుకు ఊహాగానాలతోగాని, ప్రతిపక్షాలు కమ్యూనిస్టులపై చేసిన కుకవి నిందలతో కాని పనిలేదు. స్వయంగా లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వ నివేదికలను, కేంద్ర ప్రణాళికా సంఘపు గణాంకాలను, అమర్త్యసేన్ వంటి వారు చేయించిన అధ్యయనాలను, జస్టిస్ రాజేందర్ సచార్ అధికారిక పరిశీలనను గమనిస్తే సరిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సైద్ధాంతిక నిష్టాగరిష్టుల సుదీర్ఘపాలన ఒక మేడిపండు వలె సాగింది. 1977లో అధికారానికి వచ్చిన వెనుక మొదట కొంత కాలాన్ని మినహాయిస్తే ఆ తర్వాత నుంచి అన్నింటా క్షీణతలే. ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి సూచీ లు, సామాజిక సమన్యాయం, వెనుక బడిన సమతులనాభివృద్ధి, ఎస్సీ-ఎస్టీ-మైనారిటీల పురోగతి అన్నీ అధ్వాన్నమే. విద్య, వైద్యాలు, పేదల ఆహార భద్రత, సమాజంలో శాంతి భద్రతలు, మహిళలకు భద్రత, పర్యావరణ పరిరక్షణ, పౌరహక్కులు, అవినీతి నిరోధం, ఎందులోను చాటి చెప్పుకునేందుకు ఏమీ లేదు. లజ్జతో తలవంచుకునేందుకు తప్ప. ఇవన్నీ ప్రభుత్వ పాలనకు సంబంధించిన విషయాలు కాగా, పార్టీ వ్యవస్థలు కూడా ఇదే తరహా పతనాల నుంచి దూరంగా ఉండలేకపోయాయి. బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు లభించిన చోటు అతిస్వల్పం. పార్టీ యంత్రాంగాలు అధికారానికి,అ వినీకి, ఆశ్రీత పక్షపాతానికి, బలంతుల ఆధిపత్యానికి నిలయమైపోయాయి. ఇది క్రమంగా శ్రామికులు, కార్మికులు, బలహీన వర్గాలను భయపెట్టి అణచివేసే స్థాయికి పతనమైంది. అందువల్లనే ఇనిన్ని క్షీణతలు, దారుణ పరాజయాల దుస్థితి ఎదురవతున్నది తప్ప, నిష్కారణంగా కాదు.
కేరళలో పరిస్థితి ఇంతకన్నా ఒక రవ్వ మెరుగు అయినా, వౌలిక పరిస్థితులలో తేడా లేదు. సమస్య ఏమంటే, వామపక్షాలు, కుకవి నిందలో ప్రావీణ్యాన్ని, అనుభవాన్ని బాగానే సంపాదిస్తున్నాయి గాని తమ ఇంటిని ఆత్మపరిశీలనతో చక్కబెట్టుకునే పని చేయడం లేదు. వారి తీరును గమనించగా, ఆపని చేయడం ఎట్లాగో కూడా వారికి బోధపడుతున్నట్టు తోచదు. కనుక తమ శక్తియుక్తులను, సమయాన్నంతా ఇతరులను విమర్శించడంలోనే వెచ్చిస్తున్నాయి. అటువంటప్పు వారికి విలువ ఇచ్చే ది ఎట్లా?
సరళి వేరైనా సారంలో కాంగ్రెస్ తీరు కూడా ఇటువంటిదే. దేశంలోని అన్ని వర్గాలను వెంట తీసుకొని మహత్తర స్వాతంత్య్రోద్యమాన్ని సాగించిన ఆ పార్టీ, అందుకు తగిన రాజ్యాంగ రచన చేసుకుని అభివృద్ధి, సామాజిక సంక్షేమం, అన్ని ప్రాంతాల పురోగతి, బలహీనుల సాధికారత వంటి మహత్తర లక్ష్యాలతో తన ప్రయాణాన్ని ఆరంభించిన తర్వాత, ఆమార్గం నుంచి ఎంతగా వైదొలగి ఉండకపోతే ఈస్థాయికి క్షీణిస్తుంది? నాలుగైదు దశాబ్దాల క్రితం నుంచే ప్రమాద ఘంటికలు మొదలైనా వాటిని అవివేకంతో ఉపేక్షించడమే ఇప్పుడింత దైన్య స్థితికి కారణం. కాంగ్రెస్ సుదీర్ఘపాలనలో జరిగిన మంచి శూన్యమనటం లేదు. తగినంత మంచి జరిగి మరెంతో మంచికి పునాదులు కూడ పడ్డాయి. కాని, మంచి జరగగల అవకాశాలతో, ప్రజలకు వారిచ్చిన హామీలతో ప్రజలు వారిపట్ల ఉంచిన విశ్వాసంతో పోల్చినప్పుడు మిగిలిన అసంతృప్తి అంతకు కొన్ని రెట్లున్నది. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ యంత్రాగాలు అనే మహావృక్షాలను ఆలవాలం చేసుకొని సాగించిన అవినీతి, మహాదుర్మార్గాలు ప్రజలకు జగుప్సాకరంగా మారాయి. పార్టీ బలం పడిపోవడం వేగాన్ని పుంజుకుంటున్నది. అయినా ఆ పార్టీకి ఢిల్లీనుంచి రాష్ట్ర రాజధానుల వరకు కుకవి నిందలో ఉన్న మాధుర్యం, తమంతట తాము ఒక్క రసాత్మక వాక్యమైనా రాయటంలో లేదు.
ప్రాంతీయ పార్టీలు, బలహీన వర్గాల పార్టీలు ముప్పయి సంవత్సరాలకు పైగా బలమైన గాడిలోనే పడ్డాయి గాని, తాము ప్రకటించిన లక్ష్యాల సాధనలో మాత్రం విఫలమవుతున్నాయి. వారి ఆవిర్భావానికి గల కారణాలు శక్తివంతమైనవి. నిజానికి వారు ప్రకటించే లక్ష్యాలు ఆ కారణాలను పూర్తిగా ప్రతిఫలించడంలేదు. ఆ కారణాలు ఏమిటో వారికి సరిగా అవగతమైనాయా అనేది సైతం అనుమానమే. కాని ప్రకటించిన లక్ష్యాల మేరకు కూడా ఆ పార్టీలు సాధించలేకపోతున్నాయి. కొన్ని అంశాలలో వారి వైఫల్యాలు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు తీసిపోవడం లేదు. కనుకనే అవి కొన్ని అదేతరహా పరాజయాలను, పార్టీ పరమైన క్షీణతలను ఎదుర్కొంటున్నాయి. కాని ఆత్మ పరిశీలనలు తక్కువ. కుకవి నిందలకు కొరతలేదు. దేశంలోని అన్ని పార్టీల ధోరణులు ఇట్లా ఒకే విధంగా ఉన్నప్పుడు దేశ రాజకీయం బాగుపడేది ఏవిధంగా? కనీసం దశాబ్దాలు గడిచే కొద్దీ మెరుగుదల కనిపిస్తే భవిష్యత్తుపై ఆశపెట్టుకొని బతకవచ్చు.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)