మెయన్ ఫీచర్

స్నేహం మాటున ఆధిపత్య వ్యూహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటువంటి నిర్దేశిత అజెండా, దౌత్య ప్రణాళిక లేకుండా ప్రధాని మోదీ చైనాలో పర్యటించి, ఆ దేశ అధ్యక్షుడు జింగ్ పింగ్‌తో సమాలోచనలు జరపడాన్ని చారిత్రక సంఘటనగానే భావించాలి. ఈ సమావేశం జరగడానికి చైనా వైపు నుంచే చొరవ ఉన్నట్లు తెలుస్తున్నది. 1962 యుద్ధం తర్వాత బహుశా తొలిసారి చైనా భారత్‌తో సంబంధాలను మెరుగు పరచుకోవాలనే ఆసక్తిని కనపరచిన్నట్లు కనిపిస్తున్నది. మన సరిహద్దుల వెంట సేనలను మోహరింప చేస్తూ, డోక్లాం వద్ద యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన చైనా తరచూ కవ్వింపు చర్య లకు పాల్పడుతూనే ఉన్నది. అంతర్జాతీయ వేదికలపైనా భారత్ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తోంది. భారత్‌కు ఇబ్బంది కలిగేలా పాకిస్తాన్‌ను కౌగలిం చుకొంటూ, భారత్‌పై విషం విరజిమ్మడానికి అవసరమైన మద్దతు అందజేస్తున్నది. ఇటువంటి సమయంలో భారత్ పట్ల చైనా ఆసక్తిగా చూడటం ఆశ్చర్యమే కలిగిస్తున్నది.
అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఎదగడంతో భారత్‌తో ఆ దేశపు ఆర్ధిక సంబంధాలు, రాజకీయ పరమైన ప్రతిబంధకాలు పెరుగుతూ వస్తున్నా యి. 2017లో భారత్ - చైనా ద్వైపాక్షిక వాణిజ్యం గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 84.4 బిలియన్ డాలర్లకు చేరుకొంది. ఒక వంక చైనాకు భారత్ నుండి ఎగుమతులు గణనీయంగా పెరుగుతూ ఉండగా, మరోవంక భారత్‌లో చైనా పెట్టుబడులు 8 బిలియన్ డాలర్ల మేరకు పెరిగాయి.
ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో సార్క్ దేశాధినేతలు అందరినీ ఆహ్వానించి దౌత్య పరంగా సంచలనం సృష్టించిన మోదీ ఆ తర్వాత వేర్వేరు కారణాలతో ఆయా దేశాలతో సంబంధాలను చెప్పుకోదగిన రీతిలో మెరుగు పరచుకోలేక పోతున్నారు. అందుకు వ్యూహాత్మకంగా ఆసియాలో పెద్దన్న పాత్ర వహించడం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలు కూడా ఒక ముఖ్య కారణం. నిత్యం సరిహద్దులలో ఘర్షణలకు దారితీస్తున్న పాక్, చైనాలతో సంబంధాలు మెరుగు పడకపోవడం ఒక విధంగా ఎన్డీయే ప్రభుత్వానికి రాజకీయప్రతికూలతకు దారితీస్తుంది. ఇటువంటి సమయంలో చైనాతో సం బంధాలు సాధారణ స్థితికి చేరుకోవడం రాబోయే ఎన్నికల సమయంలో మోదీకి రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. చైనా రక్షణ పరంగా, పారిశ్రామికంగా పెద్ద ఎత్తున సంస్కరణలను, ఆధునీకరణను చేబడుతూ ప్రపంచం మొత్తానికి ఆందోళన కలిగించే రీతిలో ముందడుగు వేస్తున్నది. ఈ పరిస్థితులు ఒక విధంగా తీవ్రమైన భయాందోళనలకు భారత్ వంటి దేశాలలో దారితీస్తున్నాయి. చైనా కవ్వింపు చర్యలకు దిగడం, కాల్పులు జరపడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది.
ఇప్పుడు మోదీ పర్యటన కారణంగా తొలిసారి సరిహద్దు వివాదం పరిష్కారానికి నిర్దుష్టమైన ఏర్పాట్లు జరు పుకోవాలని నిర్ణయించుకోవడం, మోదీ పర్యటనకు ఒక రోజు ముందే రెండు దేశాల సైనిక అధికారులు కలుసుకొని సరిహద్దులో పరస్పరం విశ్వాసం నెలకొల్పడం కోసం అదనపు చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం రెండు దేశాల సంబంధాలలోనే కాకుండా, మొత్తం దక్షిణ ఆసియా ముఖచిత్రంలోనే పెనుమార్పులకు దారితీసే అవకాశం ఉంది. మోడీ - జింగ్‌పింగ్ సమావేశం తర్వాత రెండు దేశాల సైనిక ప్రధాన కార్యాలయాల మధ్య హాట్ లైన్ సమాచార వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. సరిహద్దు వ్యవహారాలలో పరస్పరం విశ్వాసం, సమాచారం పంపిణీ, అవగాహనను పెంపొందింప చేసుకోవడం కోసం ఇప్పుడు విశేషమైన ప్రయత్నాలు ప్రారంభం కానున్నట్లు సంకేతం ఇచ్చారు.
భారత్ తన నావికాదళాన్ని ఆధునీకరణ చేసుకొనే ప్రయత్నాలు చేస్తుండటం, విదేశాంగ విధానంలో ఒక విధంగా స్వతంత్ర విధానాన్ని ఏర్పాటుచేసుకుని క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉండడంతో దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం వహించడం కోసం చైనా కుయుక్తులకు చెక్ పెట్టిన్నట్లు అవుతున్నది. ఆసియాలో చైనా ఆధిపత్య ధోరణులకు అడ్డకట్టు వేసిన్నట్లు అవుతున్నది. ఆసియాలో తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి భారత్ తో సంబంధాలను మెరుగు పరచుకోవడం కన్నా చైనాకు మరో గత్యంతరం లేదు. శ్రీలంక, మాల్దీవుల వంటి చోట్ల చైనా ఆధిపత్య ధోరణుల పట్ల భారత్ వౌనం వహించడం గమనార్హం. భారత్ గతంలో వలే క్రియాశీలకంగా వ్యవహరిస్తే చైనా ప్రతిబంధకాలు ఎదుర్కొనవలసి వచ్చెడిది.
ఇండో-పసిఫిక్ గ్రూపింగ్‌లో భారత్ క్రియాశీల పాత్ర వహిస్తూ ఉండటం సహితం చైనా ఆధిపత్య ధోరణులకు చెక్ పెట్టిన్నట్లు అవుతున్నది. అందుకనే భారత్ ప్రయోజనాలకు తాను అడ్డు రాబోమనే హామీ ఇవ్వడం ద్వారా, భారత్ నుండి కూడా తగు రీతిలో సహకారం కోరడం కోసం ఈ శిఖరాగ్ర సమావేశం ఉద్దేశించినట్లు కనబడుతున్నది. అంతర్జాతీయ రాజకీయ, వాణిజ్య వ్యవహారాలలో పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా ఆధిపత్య ధోరణులను అడ్డుకొని, తమ జాతీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఒక వంక చైనా, మరో వంక భారత్ తమవైన శైలిలో కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలు చేతులు కలిపితే అంతర్జాతీయంగా నూతన ఒరవడిని ఏర్పర్చడంలో విజయం సాధించే అవకాశం ఉంది.
భారత్ - చైనా ల మధ్య రాజకీయ, ఆర్ధిక సంబంధాలు పెంపొందుతున్న కొద్దీ పాక్ విషయంలో చైనా పాత్రను పరిమితం కావడానికి దారితీసే అవకాశం ఉంటుంది. అప్పుడు సీమాంతర ఉగ్రవాదంలో పాక్ పాత్ర పరిమితం అవుతుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని కట్టడి చేయగలిగితే భారత్‌లో అంతర్గత భద్రతా పరిస్థితులు గణనీయమైన పురోగతి సాధించే అవకాశం ఏర్పడుతుంది. అందుకనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడటం ఇద్దరికీ ఎంతో ప్రయోజనం కలిగించగలదు.
చైనాను నమ్మగలమా..?
చైనాతో సంబంధాలను మెరుగు పరచుకోవడం జాతీయ, అంతర్జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఎంతో ప్రాధాన్యత సంతరింపచేసుకున్నా, చైనా మాటలను నమ్మగలమా? అన్నది నేడు ప్రశ్నార్థకరంగా మారుతున్నది. తనను తానే జీవితకాలం దేశాధ్యక్షుడిగా ప్రకటించుకొని, విశేషమైన నిరంకుశ, ఆధిపత్య ధోరణులను ప్రదర్శిస్తున్న జింగ్ పింగ్ తాను అన్నమాటలకు ఏమాత్రం కట్టుబడి ఉంటారు అన్నది దౌత్యవర్గాలలో తీవ్రమైన అనుమానాలకు దారితీస్తుంది. శాంతి, సహకారం సూత్రాలతో భారత్ స్నేహ హస్తం అందిస్తే తన అధిపత్యాన్నికి భారత్ లొంగిన్నట్లు భావించి, భారత దేశపు బలహీనతగా పరిగణించే అవకాశం లేకపోలేదు. డోక్లాంలో యుద్ధసన్నాహాలను ఏమాత్రం తగ్గించుకున్న సూచనలు కనబడటం లేదు. పైగా హిందూ మహాసముద్రంలో ఆధి పత్యం కోసం భారత్, చైనా ప్రయోజనాల మధ్య ఘర్షణ అనివార్యంగా కనిపిస్తున్నది.
చైనా ఆధిపత్య ధోరణులను ఎదుర్కోవడంలో నేడు పలు ఆసియా దేశాలు భారత్ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో చైనా స్నేహ హస్తం అందించడం వ్యూహాత్మక ఎత్తుగడగానే భావించాలి. గత సంవత్సరం సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలు దిగుతూ ఉండడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టినవని చెప్పవచ్చు. ప్రస్తుతం సరిహద్దుల్లో ప్రశాంతత కనిపిస్తున్నా చైనా ఉద్దేశ్యాలను పసిగట్టలేము. 2019 ఎన్నికల సమయానికి తిరిగి ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం ద్వారా భారత్ ఎన్నికలపై ప్రభావం చూపడం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా చైనా ప్రయత్నం చేయదనే హామీ లేదు.
బౌద్ధ గురువు దలైలామా, కేంద్ర టిబెటియన్ పరి పాలన వ్యవస్థ భారత్ లో ఉండడంతో చిరకాలంగా అంతర్జాతీయ వ్యవహారాలలో చైనాపై కొంత మేరకు భారత్ ఆధిపత్యం వహించ గలుగుతున్నది. అయితే పెద్ద ఆర్ధికశక్తిగా ఎదిగినప్పటి నుండి తన ఆర్ధిక వనరులను ఎరగా చూపుతూ అంతర్జాతీయంగా దలైలామా ప్రభా వాన్ని కట్టడి చేయడంలో చైనా విజయం సాధిస్తున్నది. ఒక విధంగా టిబెట్ పై చైనాకు పరిపూర్ణ ఆధిపత్యం లభించినట్లయింది. దానితో ఈ అంశంలో మరెంత మాత్రం భారత్ ప్రయోజనం పొందే పరిస్థితుల్లో లేదని గమనించాలి. భారత్- చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరుగుతున్నా అవన్నీ చైనా ప్రయోజనాలకు అనుగుణంగానే పేరుగుతూ ఉండడం గమనార్హం. చైనానుండి తక్కువ ధరలకు పలు వస్తువులు మన మార్కెట్ లపై దండెత్తుతూ ఉండడంతో స్వదేశీ ఉత్ప త్తులకు ప్రతిబంధకరంగా ఉంటున్నట్లు పలు వర్గాల నుండి ఆందోళనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ విషయంలో భారత్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం మినహా ఏమీ చేయలేక పోతున్నది. మరోవంక భారత్ కు ప్రయోజనం కలిగించే రీతిలో చైనా మార్కెట్ లలో అవకాశం కల్పించడం లేదు. పండ్లు, ఆహార ఉత్పత్తుల విషయంలో చైనా మార్కెట్ లలో మనకు ప్రవేశం లభించడం లేదు. ఎక్కువ ధరలు పెట్టి ఇతర దేశాల నుండి వాటిని దిగుమతి చేసుకోవడానికే చైనా ప్రాధాన్యత ఇస్తున్నది. అంటే భారత్ ఆర్ధిక ప్రయోజనాలకు ప్రయోజనం కలిగించే అంశాలలో చైనా ప్రతికూలంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.
చైనా మన దేశంలో పెడుతున్న పెట్టుబడులు చాల నెమ్మదిగా, షరతులతో కూడుకొని ఉంటున్నవి. 2014లో భారత్ పర్యటన సందర్భంగా జింగ్ పింగ్ వచ్చే ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్ లో పెట్టబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఈ విషయంలో పురోగతి నెమ్మదిగా జరుగుతున్నది. పైగా చైనా పెట్టుబడుల షరతులు పలు అంశాలలో ప్రోత్సాహకరంగా ఉండటం లేదు. వౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ ల విషయంలో తమ కాంట్రాక్టుదారులు, కార్మికులనే వినియోగించుకొనేటట్లు చేస్తున్నారు. మే, 2017లో సిల్క్ బెల్ట్ రోడ్ విషయంలో చైనా ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించడం ద్వారా దక్షిణ ఆసియాలో చైనా ఆధిపత్య ధోరణులను కట్టడి చేయడం కోసం ధృడంగా నిలబడుతున్నామనే సంకేతాన్ని భారత్ ఇవ్వ గలిగింది. కానీ ఇప్పుడు చైనాతో చేతులు కలిపితే మన విదేశాంగ విధానం నీరు కారుతున్నట్లు భావించే ప్రమాదం కూడా లేకపోలేదు. మరోవంక గత రెండు దశాబ్దాలుగా విశేష ప్రగతి సాధిస్తున్న భారత్ - అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై సహితం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును కట్టడి చేయడంలో అమెరికా భాగస్వామిగా భారత్ పలు అంశాలలో నిలబడుతున్నది. కానీ ఇప్పుడు చైనాకు దగ్గరయితే భారత్ నిజాయతీ పట్ల అంతర్జాతీయ వ్యవహారాలలో అనుమానాలు చెలరేగే అవకాశం లేకపోలేదు. భారత్ రక్షణ ఆధునీకరణ, అత్యున్నత సాంకేతికత గల పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
చైనాతో సంబంధాలు ఎంతగా మెరుగు పడినా ప్రపంచంలో బలమైన సైనిక శక్తిగా ఎదగడం కోసం ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలు, సరిహద్దు వెంబడి సేనల మోహరింపు సాగిస్తూ ఉండడంతో చైనా భద్రత రీత్యా ప్రమాదకారిగానే ఉంటుంది. చైనా స్నేహహస్తాన్ని చూసి మనం ఆదమరిస్తే 1962లో వలే మరో పెనుముప్పు ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు. అందుకనే చైనా ఎత్తుగడలను గమనిస్తూ మనం కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేయక తప్పదు.

--చలసాని నరేంద్ర 98495 69050