మెయిన్ ఫీచర్

పాప పుణ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మన జన్మను మనమే ఎన్నుకుని వచ్చాం’! మన జీవితాలకు మనమే బాధ్యులం. మరెవ్వరూ కాదు. మన తల్లిదండ్రుల ద్వారా మనం ఈ భూమిమీదకు వచ్చాం- మన తల్లిదండ్రులవల్ల రాలేదు. ఎవరి జీవన ప్రణాళికలు వారివే. అయితే కుటుంబ నేపథ్యంలో ‘తల్లి - తండ్రి- మిగిలిన కుటుంబ సభ్యులు- భార్య- భర్త- పిల్లలు’- ఈ బాధ్యతలు ఉంటాయి, అంతే! అదే జీవితం కాదు.
‘ఉద్ధరేత్ ఆత్మానాత్మానాం’ అన్నారు యోగీశ్వరుడైన శ్రీకృష్ణులవారు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి! ఎవరూ మరెవ్వరినీ ఉద్ధరింపజాలరు. ఎవరి జీవితాలు వారివే! ఇందాక చెప్పినట్లు ఎవరి జీవన ప్రణాళికలు వారివే!
తల్లి పెంచి పెద్ద చేస్తుంది- అన్ని సేవలూ చేస్తుంది. కడుపులో పెట్టుకుని కాపాడుతుంది. ప్రేమను పంచుతుంది! తండ్రి కుటుంబాన్ని పోషించడంతోబాటు విద్యాబుద్ధులు చెప్పిస్తాడు. క్రమశిక్షణ నేర్పిస్తాడు- అవసరమైతే దండిస్తాడు. తాను సంపాదించి పిల్లలకు పంచుతాడు. ఆ తర్వాత తరం కూడా అలాగే జీవిస్తుంది. ఇదంతా బాధ్యత. బంధం ఏ మాత్రం కాకూడదు. బంధం బరువును పెంచుతుంది. బాధ్యత బరువును దింపుతుంది.
ఒక వ్యక్తి పెద్ద కుటుంబంలో, సంపన్న కుటుంబంలో పుట్టి కూడా నీచబుద్ధులతో జీవిస్తాడు. మరొక వ్యక్తి బీద కుటుంబంలో పుట్టి, సరికాని ఎన్విరాన్‌మెంట్‌లో పెరిగి కూడా బురదలో కమలంలా వికసిస్తాడు. ఏమిటి దీనికంతా కారణం!
హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల తండ్రి కశ్య ప్రజాపతి. తల్లి దితి. తండ్రి ఎంత గొప్పవాడైనా హిరణ్యక్ష హిరణ్య కశిపులిద్దరూ పరమ దుర్మార్గులు. తపస్సు చేసి బ్రహ్మతో అమోఘ వరాలు పొంది లోక కంటకులయ్యారు. మరి హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం పరమ భాగవతోత్తముడయ్యాడు.
దీన్ని బట్టి తెలుస్తుంది కదా మనం తల్లిదండ్రుల ద్వారా వచ్చాం! తల్లిదండ్రులవల్ల రాలేదు. తండ్రి హిరణ్యకశిపుడు పరమ దుర్మార్గుడైన రాక్షసుడు- కొడుకు ప్రహ్లాదుడు పరమ పావనుడై దివ్యత్వ స్థితి కలిగివున్నవాడు- జన్మలవల్ల కలిగిన కర్మ పరంపర ఇలా ఉంటుంది.
కుడిచేదన్నము కొకచుట్టెడిది- నడుమంత్రపు పని నాటకము
వొడిగట్టుకొనిన ఉభయ కర్మముల గడి దాటినపుడే కైవల్యము! అన్నమయ్య పాట ఇది. రోజంతా విలాసాలతోటే జీవిస్తే మన జీవితమంతా వ్యర్థమై పోతుందేమో! ఈ జీవితం ఒక నాటకం. ఈ నాటకానికి ఇంత ఆర్భాటం- పరితపించడం- దుఃఖించడం! అందుకే అన్నమయ్య అన్నారు- ఈ నడమంత్రపు నాటకాన్ని పూర్తిచేయాలి. ఉభయ కర్మములూ దాటాలి అని! ‘ఉభయ కర్మములు’ అంటే మనమెంత చెడు చేశామో, ఎంత మంచి చేశామో.. ఆ చిట్టా! పర అపకారం చెడు; పర ఉపకారం మంచి! ఈ ఉభయ కర్మలు ఎనె్నన్ని జన్మలుగానో సంచితంగా (బాలెన్స్) మనం ఈ జన్మలోకి తెచ్చుకున్నాం. వాటి వాటి పర్యవసానాలు అనుభవిస్తున్నాం. మంచి చెడుల ఫలాలు ఒడిలో కట్టుకుని వన్నాం. మంచి కర్మలు బంగారు సంకెళ్ళు- చెడు కర్మలు ఇనుప సంకెళ్ళు. ‘శుభాశుభ పరిత్యాగీ’ అన్నారు శ్రీకృష్ణులు- ‘శుభం - అశుభం’ రెండూ పరిత్యజించాలి. మనకు మనమే మంచి చేసుకుంటున్నాం- మనకు మనమే చెడు చేసుకుంటున్నాం. అంతే తప్ప, ఒకరు ఇంకొకరికి చెడు చేయడం కానీ, మంచి చేయడం కానీ అన్న భావనే ‘బంధం’. అసత్య భావనే బంధం. భావ బంధమే భవబంధంగా మార్పు చెందుతుంది. అసత్యభావన నుండి ముక్తి.. భవముక్తిగా తయారవుతుంది. కనుక మన ఆలోచనా సరళి మారి ఎవరికివారు అద్వైతస్థితిని పొందాలి.
పాపం తీరదు- పుణ్యం తీరదు. కనుక ఈ తీరని పాప పుణ్యాల ప్రసక్తి నుండి బయటికి వచ్చేయాలి. పుణ్యభావన నుండి బయటికి వస్తేనే పాప భావన నుండి బయటకు రావడం సాధ్యమవుతుంది.
మనం ఆత్మపదార్థం- ఈ ఆత్మ పదార్థం శాశ్వతమైనది- పుట్టనిది- చావనిది అని తెలుసుకున్నపుడే ఈ పాప పుణ్యాల ప్రసక్తి నుండి బయటికి వస్తాం. మనం దేహ పదార్థం అనుకున్నంతకాలం మనిషిలో ఏ మార్పూ ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది.
నా మనస్సు తలచవలసిన విషయాలను మాత్రమే తలుస్తుంది! నా ఆత్మ వీటన్నిటినీ ద్రష్టగా పరికిస్తుంది అని నుడివారు మహాయోగీశ్వరుడైన సంత్ జ్ఞానేశ్వర్.మనం ఆత్మ పదార్థం అని దీని ద్వారా తెలుసుకోవాలి. ఆత్మకు మంచి చెడులు లేనే లేవు. కేవలం సత్యంతో ఉంటుంది ఆత్మ. మనస్సు - శరీరం చేసినవన్నీ అంగీకరిస్తుంది. అవసరమైనపుడు మాత్రమే జోక్యం చేసుకుంటుంది.

-మారం శివప్రసాద్ 9618306173, 8309912908