మెయిన్ ఫీచర్

కలలు నేర్పిన కథల రారాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పుస్తక పఠనం పోలేదు. ప్రతి పదేళ్ళకూ ఓ మార్పు వస్తుందంతే..
ఆ మార్పులో మరో మాధ్యమం ద్వారా అది ప్రజలకు చేరుతుంది. ఇప్పుడు టీవీ ప్రధాన మాధ్యమమైంది. అందుకే కథలు దాని ద్వారా ప్రజల్లోకి వెళుతున్నాయి.. నవలల శకం ముగిసిపోలేదు.. ముగిసిపోదు కూడా.. మనిషి
మస్తిష్కంలో చదవాలనుంటుంది. ఆ కోరిక ఎప్పుడూ తొలుస్తూనే ఉంటుంది. దాన్ని తీర్చుకోవడానికి మనిషి పుస్తకానికి బదులు కంప్యూటర్‌ను
వాడతారు.. అంతే తేడా..’’
*
కలల రాకుమారుడిని పరిచయం చేసి,
మధ్యతరగతి అమ్మాయిల హృదయాల్లో
మధురోహల మల్లెలు పూయించి, స్వప్న
పరిమళాలను పరివ్యాప్తింపచేసిన
‘వెనె్నల మల్లిక’ సులోచనారాణి.
యద్దనపూడి తొలి సీరియల్ ‘సెక్రటరీ’ ధారావాహిక పత్రికా పాఠకులకి ఆనంద వల్లరి. యాజమాన్యానికి సర్క్యులేషన్ సునామీ పుట్టించిన పుత్తడి. కథానాయిక ఆడపిల్లల ఆత్మవిశ్వాస ప్రతీక పతాక.
జస్ట్ ఒక టైపిస్టు జీవిత కథ అది. అపుడపుడే టైపు, షార్ట్‌హ్యాండ్‌లు నేర్చుకుని, విద్యావంతులైన ఆడపిల్లలు ఉద్యోగపర్వంలో ప్రవేశించి ఆఫీసులకి వెళ్తున్న నియో కల్చర్‌కి ప్రారంభ దశ. ‘సెక్రటరీ’ టైటిల్ పెద్ద ఆకర్షణ. అప్పటివరకు నవలల్లో వచ్చిన కథానాయికలకు భిన్నంగా ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, నిటారైన వ్యక్తిత్వంతో ఎక్కడికక్కడ సమస్యల్ని, సంఘర్షణల్ని ఛేదించుకుంటూ తననితాను కోల్పోకుండా నిలబడిన సెక్రటరీ జయంతి. ప్రేమకి అనేక పార్శ్వాలు. కథానాయకుడు రాజశేఖరం మీద ప్రేమ, ద్వేషం, గౌరవం, సందేహం వంటి విభిన్న భావ సమ్మిశ్రీత అనురాగంతో జయంతి. మధ్యతరగతి బీదరాలు, ధనికుడయిన అందగాడు. చుట్టూ అనేక పాత్రలు. సస్పెన్స్, రీడబిలిటీ వగైరాలతో సెక్రటరీ నవల గొప్ప సెలబ్రిటీ. 1963-64 జ్యోతి మాసపత్రికలో వచ్చిన సీరియల్ 1966 పుస్తక రూపం దాల్చి వేలాది పాఠకులకి చేరువై వంద ప్రచురణలు పొందింది. ఆపైన ఆమె నిరవధికంగా కథలు, నవలలు, సీరియల్స్ వెలువరించారు. నవలా రాణిగా స్థిరపడ్డారు. అయినా ఇప్పటికీ సులోచనారాణి అంటే సెక్రటరీ గుర్తురాక మానదు.
కాల్పనిక కథలతో కలల ప్రపంచం సృష్టించి జీవిత సత్యాలకి పాఠకుల్ని దూరంచేసే మాయాజాలం ఆవిడ రచనలని అన్నవారున్నారు. అది సరిగ్గా, లోతుగా ఆవిడ రచనల్ని చదివి, పాత్రల్ని అర్థంచేసుకోని వారనే మాటలు. సెక్రటరీ సహా అన్ని నవలల్లోని స్ర్తిపాత్రలు వ్యక్తిత్వ స్పృహతో వ్యవహరించినవే. సులోచనారాణి రచనల్లో అంతర్లీనంగా స్ర్తివాదం కనిపిస్తుంది. ఆశలు, కలలు, కోరికలు అందరికీ వుంటాయి- కలలు కనడం నేర్పించిన ఆ కలం ఆలోచనల్ని, ఆకాంక్షల సాకారాల్ని, ఆవేదనల అంతు చూసే తత్వాన్నీ కూడా నేర్పించింది. కుటుంబం, పిల్లలు, భార్యాభర్తల అనుబంధాలు, మానవ సంబంధాలు దాటిపోనివ్వని కథనాలు. ఏ నవలకి ఆ నవలే ప్రత్యేకం. ఇది మన కథే అనిపించే రచనా సంవిధానం, ప్రేమకథా వస్తువులను ఎంపిక చేసుకుని మురిపిస్తూ మెప్పించే ధోరణి, కంటి తడి పెట్టించే సన్నివేశాలు, సంభాషణలతో కూడిన బతుకు నిజాలు సులోచనారాణి శైలీ సొబగులు. అశేషంగా పాఠకుల్ని పెంచి, విశేషంగా అనేకమంది రచయిత్రులయ్యేలా ప్రభావితం చేసిన ట్రెండ్ సెట్టర్ నవలాకారిణి సులోచనారాణి. అమ్మాయిలకి సంపాదన, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం వుండి తీరాలనేవారావిడ. సాటి మనిషిని, మంచితనాన్నీ గుర్తించాలి. చేతనైనంత సాయంచేయాలి అన్న తపన నిరంతరం ఆవిడ ఆ దిశగా ప్రయాణించేలా చేసింది. అది తనలోని ఇంకో పార్శ్వం.
మనసు సున్నితం. మాట మృదువు, మెత్తని నవ్వు. ఎన్నో వౌనభాష్యాల విజేత. 1980 చివర్లో ఈనాడు ఆదివారంకోసం ఆవిడ ఇంటర్వ్యూకి ఇంటికి వెళ్ళాను. ఆనాటి చెలిమి ఈనాటి దాకా సౌగంధ సుకుమారంగా అలాగే ఉంది. అంతటి నిరాడంబరత ఆవిడ స్వంతం. అపుడు WIN (WOMEN IN NEED) స్థాపించి క్యాసెట్ విడుదల చేశారు. ఆ సందర్భంగా కలిశాం.
నిరంతరం నిస్సహాయులకు, పిల్లలకు, ఆడవారికి, వృద్ధులకు ఏదో చేయాలన్న ఉద్దేశ్యంతో ఎన్నో సేవాకార్యక్రమాలు తనవంతుగా చేసేవారు. మహిళా సంస్థలకు చేయూతనిచ్చారు. నిశ్శబ్దంగా సహాయం అందించారు. వైఎస్‌ఎస్ అంటే వై సులోచనారాణి శైలజ పేరుతో వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు.
అందరి మాటలు వినడం ఇష్టం. కళలు, కళాకారులంటే ఇష్టం. కొండపల్లి బొమ్మలు, నర్సాపురం లేసులంటే ఇష్టం. ఆ లేసుల్ని అంత చకచకా, అంత గట్టిగా ఎలా అల్లుతారో! కదా! అని ఆశ్చర్యానందాలు ప్రకటించే స్నేహశీలి. మానవి సులోచనారాణి.
‘ప్రతి అందం, సుఖం వెనక ఎంతో శ్రమ ఉంది. ఎటుచూసినా బతుకు చిత్రాలే కనిపిస్తాయి నాకు.’ ఇది కావాలని, ఇలా ఉండాలని నేనెపుడూ అనుకోలేదు. అదృష్టం రాసినవన్నీ మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే చాలా రాశాను. ఇంక మానసికంగా వానప్రస్థం తీసుకున్నాను.’ అని ఆ సమయాన్ని సేవాకార్యక్రమాలకి, స్నేహితులతో సత్కాలక్షేప సమావేశాలకి కేటాయించారావిడ. అలాంటి స్నేహితుల సమావేశం ఈ సంవత్సరం, అంటే 2018 జనవరి ఇరవైయవ తేదీ సులోచనారాణి ఇంట్లో జరిగింది. సమావేశం సాయంత్రం 4 గంటలకి హైటీ. ఓ పది మంది ఆత్మీయులు. టాపిక్ ‘సింగిల్ ఉమన్’- ‘ఒంటరిగా ఆడవాళ్ళు ఎలా ఉంటున్నారన్న చిన్నపాటి వేదనతో విషయం తెల్సుకుందామని, వట్టి ఉబుసుపోక కబుర్లతో కాకుండా’ అన్నారు మెత్తని నవ్వుతో. తనూ పాలుపంచుకున్నారు. వచ్చినవారు ఆత్మీయంగా, అరమరికలు లేకుండా కష్టాలు, సుఖాలు, నష్టాలు, ఇష్టాలు ఆర్థికంగా, హార్దికంగా, హృదయం గతంగా గుండె తలుపులు తట్టేలా భావావేశాల్ని మాటల కుప్పలుగా పేర్చారు. ‘‘ఏమున్నా లేకపోయినా ఆత్మస్థయిర్యం, ఆశావహ దృక్పధం వుండి తీరాలి’’అంటూ ముక్తాయింపు ఇచ్చారు సులోచనారాణి. ఆవిడ నవలల చౌర్యం (తమిళనాట ఒక ప్రముఖ తెలుగు రచయిత నిర్వాకం) గురించి అడిగి, ఎందుకలా ఊరుకున్నారు? మీ నవలల్ని తమిళంలో అనువదింప చేసుకుని తన పేర చలామణి చేస్తూ పేరు, డబ్బుకొట్టేస్తుంటే? అని అడిగిన వారికి ‘‘అలా చేశాడని అందరికీ తెలుసుగా! అది చాలదా? అది ఆ రైటర్‌కి అవమానమేగా? కోర్టులు, గొడవలు, హంగామా నేను భరించలేను. అలాంటి చర్యవల్ల నాకేం నష్టం లేదు’’అన్నారావిడ. ఆవిడ సంస్కారానికి అందరూ హేట్సాఫ్ అన్నారు.
ఇంచుమించు తెలుగు పాఠకులందరికీ ఆవిడ రచనలు ఏదో విధంగా సుపరిచితమే! నవలలు సినిమాలుగా, టివి సీరియళ్ళుగా వచ్చాయి. వస్తున్నాయి. నిన్నమొన్నటి రాధ-మధు, పునఃప్రసారమవుతున్న మొగలిపూలు, చక్రవాకం వంటి టివి ధారావాహికలతో సులోచనారాణి ప్రేక్షకులకి ఇంకా దగ్గరగానే వున్నారు. ‘మీ పేరు ఇవ్వండి తర్వాత ‘కథ’ (సీరియల్‌కోసం బోల్డన్ని మార్పులు చేసేయాలి కదా) మేం చూసుకుంటాం’అనే సీరియల్ నిర్మాతల్ని కూడా ఆవిడంత సీరియస్‌గా తీసుకోరు మరి!
జీవనశైలి గురించీ, రాగద్వేషాల గురించి ఖచ్ఛితమైన అభిప్రాయాలున్నాయి! ‘రచయితలూ, మనుషులేగా! అన్నీ సమతూకంగా చూసుకొంటూనే రచనలు సాగించాలి.’ ప్రపంచం గుప్పిట్లోకి వచ్చింది. నిజమే! దాన్ని అలాగే గుప్పిట్లో ఉంచేసుకుంటే బైటి ప్రపంచం ఎలా చూడగలం?’’అని నవ్వుతూ ప్రశ్నించే సులోచనారాణి 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలం ‘కాజ’అనే కుగ్రామంలో జన్మించారు. టీనేజ్‌లో రాసిన కథకి 15 రూపాయల పారితోషికం, కథ కింద యద్దనపూడి సులోచనారాణి అని ఈ చివరనించి ఆ చివరి దాకా తన పేరు అచ్చులో ఇచ్చిన థ్రిల్ ఆ తర్వాత ఇంకేదీ ఇవ్వలేదన్న నవలారాణి స్ర్తిల సమస్యల్ని హైలైట్ చేసిన ‘కీర్తికిరీటాలు’ నవలకి సాహిత్య అకాడమీ అవార్డ్ పొందారు. సినిమాలకి సాహిత్యానికి వచ్చిన అనేక గౌరవ పురస్కార సత్కార అవార్డులు ధనంతోపాటు సాటి రచయిత్రి మాలతీ చందూర్ అవార్డు ఇటీవల అందుకున్నారు. ఆవిడ నవల ఒక నటిని దర్శకురాల్ని చేసింది. అది మీనా నవల. దర్శకురాలు శ్రీమతి విజయనిర్మల. ఆంగ్ల రచయిత్రి జేన్ ఆస్టిన్ తరహా రచనాశైలిని పుణికిపుచ్చుకున్నారని విమర్శకుల ప్రశంస. రాజశేఖరాలు దొరికినా దొరక్కపోయినా కలలు కనడంలోని కమనీయ రొమాంటిసిజాన్ని చవిచూపి, జీవన తరంగాలలోని ఆటుపోటుల్ని నవలలుగా అందించి, తనదైన శకానికి నాంది పలికి చరిత్ర సృష్టించిన సాహిత్య విప్లవ వాహిని సులోచనారాణి. జనవరిలో కలిసినపుడు ఫిబ్రవరి పనె్నండున అమ్మాయి శైలజ దగ్గరికి వెళ్తానని, మనమడు హర్షని చూడాలని ఉందని, అల్లుడు రవి కొడుకులేని లోటు తీర్చే మంచి వ్యక్తి అని దిరిసెన పువ్వులాంటి నవ్వుతో చెబుతూ మా అందరితో ప్రేమగా ఫొటోలకి ఫోజిచ్చి, భుజంమీద చెయ్యేసి గేటువరకూ సాగనంపిన సులోచనారాణి మే పదమూడు తారీఖున ఇండియా వస్తానన్నారు. అది మరో పది రోజులు వాయిదాపడిందని వార్త. ఆ తర్వాత మే 21న కాలిఫోర్నియా కుపర్టినోలో అమ్మాయి ఇంట్లో గులాబీ లాంటి గుండె ఆగిపోతే అంత సునాయాసంగానూ జీవిత కథకి ముగింపు పలికారు. ‘‘మీరు మీ ఆత్మకథ రాయాలి’’-అంటే నేనంత గొప్పదాన్ని కాదు. ప్రతి మధ్యతరగతి మహిళ జీవితం ఒక ఆత్మకథే’’అన్న తత్వమసి సులోచనారాణి.
**

-డా. కె.బి.లక్ష్మి