మెయన్ ఫీచర్

గవర్నర్ విచక్షణకు పరిమితి లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక రాజకీయాలు రాజ్యాంగంలోని పలు అంశాల స్పష్టతపై అనేక ప్రశ్నలు సంధించాయి. రాజ్యాంగం ఏం చెబుతోంది? గవర్నర్ విచక్షణకు హద్దులు లేవా? చట్టం ముందు అందరూ సమానమే అయినపుడు గవర్నర్ రాజకీయ పార్టీల విషయంలో ‘అంబుడ్స్‌మన్’ పాత్ర పోషించే అవకాశం ఉందా? రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరే దశలో గవర్నర్ తీసుకునే నిర్ణయాల విచక్షణాధికారాన్ని ప్రశ్నించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఎవరిని పిలవాలి? రాజ్యాంగంలో ఈ స్పష్టత ఉందా అనే అనేక ప్రశ్నలకు కర్నాటక రాజకీయాలు నాంది పలికాయి.
కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా అస్తశ్రస్త్రాలతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయించి యడ్యూరప్ప ప్రభుత్వం కొనసాగకుండా అడ్డుకోగలిగిన కాంగ్రెస్- జేడీఎస్‌లు ఇపుడు కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సిందే.
కాంగ్రెస్- జేటీఎస్ కూటమి నాయకుడు హెచ్‌డి కుమారస్వామి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ వజుభారుూవాలా ఆహ్వానించారు. 23వ తేదీ మధ్యాహ్నం కుమారస్వామి కర్నాటక 24వ ముఖ్యమంత్రిగా సహచరులు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి గవర్నర్ ఇచ్చిన ఆహ్వానాన్ని కొట్టివేయాలని సుప్రీంకోర్టులో తాజాగా పిటీషన్ దాఖలైంది. అఖిల భారత హిందూ మహాసభ ఈ పిటీషన్‌ను దాఖలు చేసింది. కాంగ్రెస్ -జేడీఎస్‌లు ఎన్నికల అనంతరం పొత్తు కుదుర్చుకున్నాయని ఈ పిటీషన్‌లో పేర్కొంది. ఈ రెండు పార్టీల మధ్య సాగిన మోసపూరిత అవకాశవాద కుమ్మక్కు, ఎత్తుగడల వల్ల కర్నాటకలో ఓటర్లు మోసపోయారని ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటీషన్‌లో పేర్కొంది.
గతంలో అనేక రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయ సంక్షోభం ఏర్పడటం, పార్టీలు కేంద్రప్రభుత్వం వద్దకు, రాష్టప్రతి వద్దకు వెళ్లి మొరపెట్టుకోవడం చూసినవే. రాజ్యాంగంలోని విభాగం -6లో అధికరణం 152 నుండి 161 వరకూ గవర్నర్ అధికారాలను పేర్కొన్నారు. 162లో రాష్ట్రప్రభుత్వ అధికార పరిధి ఏమిటో కూడా వివరించారు. 163, 164 అధికరణంలో రాష్ట్ర మంత్రి మండలి, గవర్నర్‌కు సలహాలు ఇవ్వడం, మంత్రి మండలి ఏర్పాటుపై స్పష్టత ఇచ్చారు. ఇక అధికరణం 165 నుండి 177 వరకూ శాసనసభ సాధారణ అంశాలు, 178 నుండి 186 వరకూ శాసనసభ, శాసనపరిషత్‌ల వ్యవహారాలపైనా, 168 నుండి 212 వరకూ శాసనసభ కార్యకలాపాలపైనా రాజ్యాంగం చాలా స్పష్టంగా వివిధ అంశాలను నిర్వచించింది. అధ్యాయం -4, అధికరణం 213లో గవర్నర్ విశేష అధికారాలు, విభాగం 15, 18లలో కూడా చట్టసభల అంశాలపై రాజ్యాంగంలో వివరించారు. అయితే దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల పాలనకు సంబంధించి మరింత స్పష్టమైన నిర్వచనాలు లేకపోయినా ఎప్పటికపుడు న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వాటినే మార్గదర్శకాలుగా భావిస్తున్నారు. రాజ్యాంగంలోని విభాగం 22లో వివిధ షెడ్యూళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సఖ్యత, రాష్ట్రప్రభుత్వాల విశేష అధికారాలపై వివరణ ఉంది. అయితే గవర్నర్లకు ఉన్న విచక్షణాధికారాలపై మాత్రం ఇంకా స్పష్టత లేదన్నది సుస్పష్టం. దీనికి కారణం వివిధ సందర్భాల్లో ఆయా రాష్ట్రాల గవర్నర్లు అనుసరిస్తున్న భిన్నమైన పంథాయే కారణం. గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో ఏ ప్రభుత్వానికీ స్పష్టమైన మెజార్టీ రాని సందర్భాల్లో గవర్నర్లు పూర్వానుభవాలకు కాకుండా, స్వీయ నిర్ణయాలకు పట్టం కట్టారు. దాంతో విరుద్ధమైన సంప్రదాయాలు తెరమీదకు వచ్చాయి.
ఇది ఈ రోజు మాటే కాదు, 1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తన శాసనసభ్యులతో పెరేడ్ చేయించారు. దాంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సెప్టెంబర్ 16న ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రి స్థానంలో ప్రతిష్టించాల్సి వచ్చింది. సరిగ్గా పదేళ్ల తర్వాత 1995 సెప్టెంబర్‌లో చంద్రబాబునాయుడు నాయకత్వంలో అభిశంసించినపుడు మాత్రం ఎన్టీఆర్ తప్పుకోక తప్పలేదు. అదే రోజు ఎన్ చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అప్పటి హోటల్ వైస్రాయ్‌లో జరిగిన విడిది రాజకీయాలు ఎవరూ మరిచిపోలేరు. ఇలాంటి ప్రయత్నాలు దక్షిణాదిలో తమిళనాడులోనూ, కర్నాటకలోనూ అంతా చవి చూసినవే. కర్నాటకలో 14 ఏళ్ల క్రితమే ఈ సంప్రదాయం మొదలైంది. 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 79 స్థానాలను సాధించగా, కాంగ్రెస్ 65, జేడీఎస్ 58 సీట్లు సాధించాయి. ఎన్నికల అనంతరం కాంగ్రెస్, జేడీఎస్‌లు పొత్తుపెట్టుకున్నాయి. బలపరీక్షకు ముందు జేడీఎస్ తమ ఎమ్మెల్యేలను గోల్డెన్ పామ్ రిసార్టుకు తరలించి విడిది రాజకీయం చేసింది. అదే పరిస్థితి 2006లోనూ ఎదురైంది. కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్న తర్వాత బీజేపీతో జతకట్టి 2006 ఫిబ్రవరి 9న బలపరీక్ష నిర్వహించే వరకూ జేడీఎస్ ఎమ్మెల్యేలను గోల్డెన్ పామ్ రిసార్టులోనూ, బీజేపీ సభ్యులను డాడీస్ రిసార్టులోనూ విడిది ఉంచారు. 2007లో జేడీఎస్-బీజేపీ సర్కార్ కుప్పకూలి యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా జేడీఎస్ తమ ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్టుకు తరలించింది. 2008లో బీజేపీకి సీట్లు తగ్గడంతో నెల మంగళ, బిడది, యెల్హంకిలలో ఎమ్మెల్యేలను ఎవరూ ఆకర్షించకుండా కట్టుదిట్టంగా స్టార్ హోటళ్లలో విడిది ఉంచారు. 2009లో యడ్యూరప్పకు, గాలి జనార్దనరెడ్డికి మధ్య విబేధాలు పొడసూపడంతో గాలి తన వర్గం ఎమ్మెల్యేలను గోవాలోనూ, హైదరాబాద్‌లోనూ స్టార్ హోటళ్లకు తరలించారు. 2010లో బీజేపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో చెన్నై, కోచి, గోవా, బెంగళూరులోని హోటళ్లకు వివిధ పార్టీలు తమ ఎమ్మెల్యేలను తరలించాయి. 2011లో అవినీతి కేసులో యడ్యూరప్ప రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి పదవికి డివి సదానందగౌడ, జగదీష్ శెట్టర్, కేఎస్ ఈశ్వరప్పలు పోటీ పడటంతో మరోమారు యడ్యూరప్ప వర్గం ఎమ్మెల్యేలను గోల్డెన్ పామ్ రిసార్టుకు తరలించారు. 2012లో సదానంద గౌడను గద్దెదించేందుకు యడ్యూరప్ప వర్గం ప్రయత్నించి తమ ఎమ్మెల్యేలను యల్హంకిలోని రమణశ్రీ కాలిఫోర్నియా రిసార్టుకు తరలించారు. తాజాగా జెడీఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కొద్ది రోజులు కోచిలోనూ, హైదరాబాద్‌లోనూ ఉంచారు.
బలపరీక్షను ఎదుర్కోలేక బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం వచ్చింది. కర్నాటక 24 వ ముఖ్యమంత్రిగా హెడ్ డి కుమారస్వామి, ఆయన మంత్రివర్గంతో 23వ తేదీ సాయంత్రం గవర్నర్ వజాభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా హేమా హేమీలు అంతా రానున్నారు.
ఇంత వరకూ బాగానే ఉన్నా కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై తాజాగా దాఖలైన పిటీషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి. అధికరణం 163 ప్రకారం మంత్రిమండలి గవర్నర్‌కు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రతి రాష్ట్రంలో ఒక మంత్రి మండలి ఉంటుంది. ఆ మంత్రిమండలికి ముఖ్యమంత్రి నాయకుడిగా ఉంటారు. రాష్ట్ర అధిపతిగా విధి నిర్వహిస్తున్న గవర్నర్‌కు మంత్రి మండలి తగిన సహకారాన్ని, సూచనలను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రాజ్యాంగం ప్రకారం గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించే అంశాలకు ఈ అధికరణం (163) వర్తించదు. అందులో సబ్‌సెక్షన్ 2 ప్రకారం ఏదైనా ఒక అంశంపై స్వతంత్రంగా వ్యవహరించే అధికారం గవర్నర్‌కు ఉన్నదా లేదా అన్న విషయం ప్రశ్నార్ధకమైనపుడు, ఆ అంశంపై గవర్నర్ తీసుకునే చర్యలను ఎవరూ ప్రశ్నించరాదని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. సెక్షన్ 3 ప్రకారం ఏ అంశానికి సంబంధించిన మంత్రిమండలి గవర్నర్‌కు ఎలాంటి సలహా ఇచ్చిందనే విషయంపై కూడా ఏ న్యాయస్థానం విచారణ జరపరాదనే విచక్షణాధికారాన్ని గవర్నర్‌కు రాజ్యాంగం కల్పించింది. అధికరణం 164 ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నరే నియమిస్తారు. అలాగే ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను కూడా గవర్నరే నియమిస్తారు. గవర్నర్ ఇష్టం మేరకే మంత్రులు తమ పదవుల్లో కొనసాగుతారు. ఈ నిబంధనల కిందే అఖిల భారత హిందూ మహాసభ (ఎఐహెచ్‌ఎం) సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఎన్నికల ముందు రెండు విరుద్ధమైన పార్టీలు ఎన్నికల అనంతరం అధికారం కోసం పొత్తు కుదుర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అఖిల భారత హిందూ మహాసభ చెబుతోంది. అతిపెద్దపార్టీగా అవతరించిన బీజేపీ తన మెజార్టీని రుజువు చేసుకోలేని పక్షంలో ప్రజల ఆకాంక్ష మేరకు గవర్నర్ తన విచక్షణ వినియోగించి నిర్ణయం తీసుకోవాలే తప్ప తక్కువ మెజార్టీ ఉన్న పార్టీని అధికారంలోకి ఎలా ఆహ్వానిస్తారని ఎఐహెచ్‌ఎం వాదిస్తోంది. మెజార్టీ ఉందని చెప్పినంత మాత్రాన వారినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరాల్సిన విధి గవర్నర్‌కు లేదని, గవర్నర్ తన విచక్షణను వినియోగించుకోవచ్చని పిటీషన్‌లో పేర్కొంది. బి ఆర్ కపూర్ వెర్సస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జేడీఎస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం రాజ్యాంగ విరుద్ధం. కర్నాటక ప్రజలు వద్దనుకున్న పార్టీ అధికారంలోకి రావడం కోసం కర్నాటక ప్రజలు తిరస్కరించిన మరోపార్టీతో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించినపుడు గవర్నర్ రాజ్యాంగ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్నది పిటీషనర్ వాదన. దీంతో రాజ్యాంగంలోని లొసుగులు ఒకొక్కటి వెలుగుచూస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచిన అతి చిన్నపార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చా? రాజ్యాంగానికి రాజ్యాంగంలోని నిబంధలకు భిన్నమైన రీతిలో అతిపెద్ద రాజకీయ పార్టీ చేసిన సూచన మేరకు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు వారిని ఆహ్వానించవచ్చా? రామేశ్వర ప్రసాద్ (6) వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2006 (2 ఎస్‌సీసిఐ) కేసులో స్ఫూర్తిని అనుసరించే కాంగ్రెస్ -జేడీఎస్‌లను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారా అనేది ఇపుడు పెద్ద ప్రశ్నగా మారింది. 224 స్థానాలున్న కర్నాటకలో బీజేపీ 104, కాంగ్రెస్ 78, జనతాదళ్ (సెక్యూలర్) 37 స్థానాలను గెలుచుకున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఒకరు, కర్నాటక ప్రజ్ఞావంత జనతాపార్టీ నుండి ఒకరు, స్వతంత్ర అభ్యర్ధి ఒకరు గెలుపొందారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్, జేడీఎస్, బిఎస్‌పి పొత్తు కుదుర్చుకోవడంతో వారి బలం 116కు చేరింది. అయితే గవర్నర్ అత్యధిక మెజార్టీ ఉన్న కూటమిని మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రామేశ్వర ప్రసాద్ కేసులో తీర్పుచెప్పింది. గోవాలో బీజేపీ నాలుగుపార్టీలతో కలిసి 21 మందితో ఏర్పాటుచేసిన కూటమినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారే తప్ప 18 స్థానాలతో అతిపెద్ద ఏకైక పార్టీని మాత్రం ఆహ్వానించలేదు. అధికరణం 14లో చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తిని ఉల్లంఘించి గవర్నర్ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారన్న కాంగ్రెస్ వాదనలను నేడు అఖిల భారత హిందూ మహాసభ కొట్టిపారేస్తోంది. ఈ క్రమంలో గవర్నర్ విచక్షణకు పరిమితి ఉందా లేదా అనేదానిపై మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

- బీవీ ప్రసాద్ 98499 98090