మెయన్ ఫీచర్

నత్త నడకన నదుల అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం జరిగితే దేశం సుభిక్షంగా మారుతుంది. మంచినీటి కొరతను నివారిస్తుంది. దేశం తరచుగా కరవుకాటకాల బారిన పడకుండా నదుల అనుసంధానం నిరోధిస్తుంది. మన దేశంలో నదుల అనుసంధానం విధానం మొదటి నుంచి నత్తనడకన సాగుతోంది. వాజపేయి ప్రభుత్వ హయాంలో నదుల అనుసంధానంపై కొంత చర్చ జరిగింది. ఆ తర్వాత మళ్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వం నదుల అనుసంధానం కల సాకారమయ్యేందుకు కసరత్తును ప్రారంభించడంతో, ఆ పథకానికి ప్రాణం వచ్చినట్లయింది. దక్షిణ భారతదేశంలో కావేరీ జలాల కోసం తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా ఘర్షణ నెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల పంపకంపై ఆంధ్ర, తెలంగాణ మధ్య సయోధ్య లేదు. తెలుగు రాష్ట్రాలకు గుండెకాయ లాంటి నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పుడు ఎడారిని తలపిస్తున్నాయి. సెప్టెంబర్ వస్తే కాని ఈ రెండు ప్రాజెక్టుల్లోకి వరద నీరు వస్తుందా? రాదా? అనేది చెప్పలేం. ఎగువ రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్టల్రోని ప్రాజెక్టులు నిండి వారికి ఎక్కువైన నీటిని దిగువకు వదిలితే ముందుగా శ్రీశైలం నిండాలి. ఆ తర్వాత అదే సమయంలో భారీ వర్షాలు కురిస్తే ఎగువ నుంచి వచ్చే వరద నీరు, స్థానిక వరద నీటితో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండుతాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 35 లక్షల ఎకరాల భూములు, దాదాపు 30 మున్సిపాలిటీలు, వేల గ్రామాలు కృష్ణా నీటిపై ఆధారపడి ఉన్నాయి. రెండు రాష్ట్రాలు భేషజాలకు పోకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువకు గోదావరి జలాలను తరలించే విధంగా ఒక పథకాన్ని చేపడితే తప్ప ఆ ప్రాజెక్టుకు పూర్వటి వైభవం రాదు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టులు యుద్ధప్రాతిపదికన నిర్మాణమవుతున్నాయి. ఇదొక మహాద్భుతమైన పథకంగా పేర్కొనవచ్చు. కేసీఆర్ స్వయంగా ప్రతి రోజూ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. దీనికి కారణం రాజకీయ నాయకత్వానికి నీటి విలువ, లెక్కలు తెలిసి ఉండడమే. న్యాయ, రాజకీయపరంగా వివాదాలు చుట్టుముట్టినా లెక్కచేయకుండా పట్టుదలతో కేసీఆర్ ముందడుగు వేయడం వల్లనే ఈ రోజు తెలంగాణ సస్యశ్యామలం కావాలన్న కల సాకారమవుతోంది. గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలించడమంటే, గోదావరి బేసిన్ నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించడమే. గొప్ప రాజకీయ సంకల్ప బలం ఉంటే తప్ప ఇటువంటి బృహత్తర నిర్మాణాలు సాధ్యం కావు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు గురించి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది నేతలు ఊరించే ప్రకటనలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కార్యదీక్ష వల్లనే ఎవరి సహకారం లేకుండానే పోలవరం కుడి, ఎడమకాల్వలు సాధ్యమయ్యాయి. ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా మరో ముందడుగు వేసి పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించి కృష్ణా డెల్టాను రక్షించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుపై చర్చ పక్కనపెడితే, పట్టిసీమ తరహా ప్రాజెక్టులను నిర్మించాలంటే అధికారంలో ఉన్న నాయకత్వానికి సాహసం, తెగువ, పట్టుదల ఉండాలి. అవసరమైతే కొన్ని సంక్షేమ పథకాలను నిలిపివేసి ప్రాజెక్టులకు నిధులను మళ్లించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే ధైర్యం ఉండాలి. ఇటీవల కరీంనగర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నదుల అనుసంధానంపై చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గంగానది నుంచి కొన్ని వేల టిఎంసిల నీళ్లు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయి. ఆ నీటిని తూర్పు, దక్షిణాది రాష్ట్రాలకు అనుసంధానం ద్వారా మళ్లిస్తే భారత్‌ను కరవుకాటకాల నుంచి శాశ్వతంగా పరిరక్షించవచ్చన్నారు.
మన దేశంలో సాలీనా కురిసే వర్షపాతం జలాల పరిమాణం దాదాపు 1,37,000 టిఎంసి. ఇందులో 66వేల టిఎంసి నీరు సముద్రంలో కలుస్తోంది. హిమాలయాల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే గంగానది జలాల్లో 4వేల టిఎంసి తక్కువగా ఉపయోగించుకుంటున్నారు. దాదాపు 10వేల టిఎంసికిపైగా గంగాజలాలు సముద్రంలో కలుస్తున్నాయి. దేశంలో ఆరు కోట్ల భూములు కాల్వ నీరు అందుతోంది. నదుల అనుసంధానం చేస్తే దాదాపు 9 కోట్ల భూములకు కొత్తగా సాగునీటిని అందించవచ్చు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో కావేరి,పెన్నా,కృష్ణా బేసిన్‌లో జలకళ తప్పింది. పంట భూములు బీడువారుతున్నాయి. సాగు, తాగునీటికి ఏటా కటకటే. గంగా-కావేరి నదులను అనుసంధానం చేస్తే దేశం సుభిక్షమవుతుందని 1972లోనే ప్రముఖ ఇరిగేషన్ ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు చెప్పారు. ప్రస్తుతం నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ దేశంలో 137 బేసిన్లు, ఉప బేసిన్లు, 71 నీటి మళ్లింపు పాయింట్లపై అధ్యయనాలు చేసింది. నదుల అనుసంధానానికి 30 ప్రదేశాలను గుర్తించింది. పీఠభూమి ప్రాంతంలో 16 చోట్ల, హిమాలయ ప్రాంతంలో 16 చోట్ల నదుల అనుసంధానానికి యోగ్యమైన ప్రదేశాలు ఉన్నాయని ఎన్‌డబ్ల్యుడిఏ గుర్తించింది. పీఠభూమి ప్రాంతాల్లో నాలుగు నదుల అనుసంధానం అవసరమని తేల్చారు. వీటికి సంబంధించి నివేదికలు తయారువుతున్నాయి. కెన్-బెట్వా లింక్ ప్రాజెక్టు ఫేస్-1,2, దామనగంగ-పింజల్ లింక్ ప్రాజెక్టు, పర్- తపతి-నర్మద లింక్ ప్రాజెక్టు, మహానది-గోదావరి లింక్ ప్రాజెక్టు యోగ్యమైనవిగా ఖరారు చేశారు. ఇందులో మొదటి మూడు ప్రాజెక్టులకు నివేదికలను తయారుచేశారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.40 వేల కోట్లు ఖర్చవుతాయని 2015-16లో అంచనా వేశారు. దామన్‌గంగ- పింజల్ అనుసంధానంపై సాంకేతిక, ఆర్థిక క్లియరెన్సు లభించనుంది. తపతి-నర్మద డిపిఆర్‌లను కేంద్ర జలసంఘానికి ఇచ్చారు. మహానది-గోదావరి అనుసంధానం మాత్రం ఒక్క అంగుళం కూడా జరగలేదు. మహానది-గోదావరి నది అనుసంధానానికి ఒడిశా ప్రభుత్వం ఆంగీకరించలేదు. మహానది-గోదవారి, కృష్ణా, పెన్నార్, కావేరి, వైగై (మధురై), గుండార్ నదుల అనుసంధానం వల్ల దక్షిణ భారతం సస్యశ్యామలమవుతుంది. నీటి ముంపు ఎక్కువగా ఉంటుందనే కారణంతో ఒడిశా ఈ ప్రతిపాదనకు సమ్మతించలేదు. కేంద్రం వత్తిడి మేరకు ఒడిశాప్రభుత్వం ఇచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర వాటర్ డెవలప్‌మెంట్ అథారిటీ తాజాగా మరో నివేదిక రూపొందించింది. కేంద్రం ఆదేశాల మేరకు నదుల అనుసంధానంపై పర్యావరణ అనుమతులకు సంబంధించి అన్ని రకాల అధ్యయనాలను చేపట్టారు. మహానది (మణిభద్ర) నుంచి గోదావరి (్ధవళేశ్వరం) లింక్, గోదావరి (ఇచ్చంపల్లి) నుంచి కృష్ణా (పులిచింతల), గోదావరి (ఇచ్చంపల్లి) కృష్ణా (నాగార్జునసాగర్) లింక్, గోదావరి (పోలవరం), కృష్ణా (విజయవాడ) లింక్, కృష్ణా (ఆల్మట్టి) పెన్నార్ లింక్, కృష్ణా (శ్రీశైలం) పెన్నార్ లింక్, కృష్ణా (నాగార్జునసాగర్) పెన్నార్ (సోమశిల)లింక్, పెన్నార్ (సోమశిల) కావేరి లింక్, కావేరి(కట్టాలై), వైగై-గుండార్ లింక్ చాలా ప్రధానమైనవి. ఈ ప్రాంతంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. వివిధ అధ్యయనాలపై కేంద్రం అనేక రకాలైన సబ్ కమిటీలను వేసింది. ఇవన్నీ నిర్దేశించిన అంశాలపై అధ్యయనాలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నదుల అనుసంధానానికి సంబంధించిన షరతులపై సమ్మతి తెలియచేయడం శుభ పరిణామం. తెలంగాణకు 1600 టిఎంసి జలాలు అవసరమని, ఈ మేరకు ప్రాజెక్టుల్లో నిల్వ అనంతరం మాత్రమే నదుల అనుసంధానానికి నిరభ్యంతరంగా మద్దతు ఇస్తామని ఇటీవల కేంద్రానికి తెలంగాణ తెలియచేసింది. మహానది గోదావరి ఫేజ్-1లో చేపట్టాలని దీని వల్ల అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలంగాణ పేర్కొంది.
రైతాంగాన్ని క్షామం కోరల నుంచి రక్షించాలన్నా, దాహార్తితో అల్లాడే ప్రజలకు గుక్కెడు నీళ్లు దక్కాలన్నా, తక్షణమే నదుల అనుసంధాన ప్రక్రియకు కేంద్రం రంగంలోకి ఉరకాలి. దక్షిణ భారతదేశంలోనే నదుల అనుసంధాన ప్రక్రియకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒడిశాతో పాటు ఈ ప్రాంతంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అందరికి ఉపయోగపడే విధంగా నదుల అనుసంధాన ప్రణాళికను ఖరారు చేయాలి. ప్రయోజనం లేని పథకాలకు స్వస్తి చెప్పి నిధులను నదుల అనుసంధానికి మళ్లించాలి. సాలీనా బడ్జెట్‌లో విదిలించినట్టు నిధులు ఇస్తే మరో వెయ్యేళ్లు గడచినా నదుల అనుసంధానం కదలదు. బ్రిటీష్ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం కాకపోవచ్చు. రైలు మార్గాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఆ ప్రభుత్వం నిధులను, నిపుణులను, కార్మికులను ఒక చోటకు తరలించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసింది. అందుకే ఈ రోజుకు మనం ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించిన కాటన్ మహాశయుడి పేరును తలుచుకుంటున్నాం. భారీ సాగునీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానం జరగాలంటే రాజకీయ సంకల్ప బలం ఉండాలి. ఎన్నో విమర్శలు, ఆరోపణలు వస్తుంటాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమనేది ఒక మహా యజ్ఞం. జాతీయ నదుల అనుసంధానం నత్తనడకన నడిచేటట్లుంటే, తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకత్వం ముందుకు వచ్చి ఇరు ప్రాంతాల రైతులకు ప్రాణధారమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను తరలించే విషయమై ఉమ్మడిగా ప్రణాళికను ఖరారు చేసుకుని నిధులు కేటాయించాలి. దీని వల్ల తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అనావృష్టి బారిన పడవు. లేని పక్షంలో రానున్న రోజుల్లో రెండు ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097