మెయన్ ఫీచర్

‘అసహనం’తో మోదీ హత్యకు మావోల కుట్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టుల్లో ‘అసహనం’ తారస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. సిద్ధాంతాల ఆధారంగానే తాము పోరాటాలు చేస్తున్నామని చెప్పుకునే మావోలు ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారు. చాలాకాలంగా పాలకుల అసహనం గురించి మావోలు భూనబోనాంతరాలు దద్దరిల్లేలా ప్రచారం చేశారు. కాని ఎవరు అసహనంతో రగిలిపోతున్నారో మహారాష్టల్రో తాజాగా బహిర్గతమైంది. మావోల గత చరిత్ర చూస్తే కుట్రలు వారి నైజమని తెలుస్తుంది. ‘ప్రజారాజ్యం’ కోసం కుట్ర చేయడం తప్పుకాదని వారి వాదన. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి తరహాలో మోదీపై దాడికి మావోల పథక రచన జరిగిందని కొన్ని ఆధారాలు మహారాష్ట్ర పోలీసుల చేతికి చిక్కాయి. ఎల్‌టిటిఇ ఓ ఉగ్రవాద సంస్థ. దానికి సిద్ధాంతాలు లేవు, మావోయిస్టు పార్టీకి స్పష్టమైన సిద్ధాంతాలున్నాయి. వాస్తవానికి ఎల్‌టిటిఈ నుంచి మావోలు (అప్పటి పీపుల్స్‌వార్) ఆయుధ శిక్షణ పొందారు, ఆయుధాలు సేకరించారు. మందు పాతరల తయా రీ, పేల్చడంలో ‘టైగర్ల’ దగ్గరే తర్ఫీదు పొందారు. ఈ విషయాన్ని మావోయిస్టు నేతలే పలుమార్లు అంగీకరించారు. ఎల్‌టిటిఈ టైగర్ల మాదిరి ఆత్మాహుతి దాడి చేసి మోదీని హత్య చేసేందుకు కుట్ర చేయడంలో ఆశ్చర్యమేముంది? అలాంటి కుట్ర ఏమీ లేదని పట్టణ మావోయిస్టులు (అర్బన్ నక్సల్స్) బుకాయించడం షరా మామూలే!
ప్రజాస్వామ్యంలో ఒక నేతను పొట్టన పెట్టుకుంటే ఒరిగేది ఏమిటి? వ్యవస్థ తలకిందులేమీ కాదు, మావోల రాజ్యం ఏర్పడదు. అయినా ప్రధానిని హత్య చేసి అధికారానికి దగ్గరవుతామన్న అర్బన్ నక్సల్స్ ఆలోచన పూర్తిగా ఆత్మహత్య సదృశమే. అందుకు తెగించడం, కుట్రలు పన్నడం వారి మస్తిష్కాల్లో గల లోపాన్ని, అసహనాన్ని బయటపెడుతోంది.
వర్గ శత్రు నిర్మూలన
కొనే్నళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి వి.సి.శుక్లాను, కొందరు కాంగ్రెస్ నేతలను హతమార్చినంత మాత్రాన ఎన్నికలు ఆగాయా? యథావిధిగా అన్నీ సవ్యంగా కొనసాగాయి. బిజెపి ప్రభుత్వం గద్దెనెక్కింది. దీంతో ఏమర్థమవుతుంది? దాడుల వల్ల ఒరిగేది ఏమీ ఉండదు! వ్యక్తుల నిర్మూలన కన్నా వ్యవస్థ మార్పు ముఖ్యమని మావోయిస్టులు పైకి చెబుతూనే- లోలోపల వ్యక్తుల నిర్మూలనకు ప్రాధాన్యతనిస్తున్నారు. తమ విరోధులను, తమకు సహకరించమని వారిని హతమార్చిన సంఘటనలు వేలల్లో ఉంటాయి. ఆ సమయానికి లాభదాయకం అనిపించిన ఏ పనైనా చేయడానికి వెనుకాడని వైనం మావోల్లో కనిపిస్తుంది. తాజాగా మోదీ హత్యకు కుట్ర అందులో అంతర్భాగమేనని సులువుగానే బోధపడుతోంది.
మోదీ ప్రాభవం ఇలాగే కొనసాగితే తమ పార్టీకి మనుగడ కష్టమని మావోలు భావిస్తున్నారు. అంతిమంగా మరో రూపంలో వర్గశత్రు నిర్మూలన కొనసాగించాలన్న ‘్ధ్వని’ మహారాష్ట్ర పోలీసులకు లభించిన పత్రాల్లో వినిపిస్తోంది. కవులు, కళాకారులు, లాయర్లు, ప్రొఫెసర్లు, సానుభూతిపరులు ఇప్పుడు ఏ రకమైన బుకాయింపులకు పూనుకున్నా వాస్తవాల్ని కప్పిపుచ్చలేరు. 2014 ఎన్నికల్లో మోదీ ఘన విజయం మోయిస్టుల, వారి మద్దతుదారుల గొంతు దిగలేదు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు ఆయనపై వ్యతిరేక ప్రచారం భారీగా జరిగినా గెలవడమేమిటి అన్న ఉక్రోషం మావోల్లో గూడుకట్టుకుంది. ఆ కుట్ర నేడు బద్దలైంది.
మావోయిస్టు ఖైదీల విడుదల కోసం ఉద్యమించే రోనా విల్సన్, మరాఠీ పత్రిక ‘విరోధి’ సంపాదకుడు సుధీర్ ధవాళే, దళిత హక్కుల కోసం పనిచేస్తున్న న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, నాగపూర్‌లో ఆంగ్ల ప్రొఫెసర్ షోమాసేన్ (బెంగాలీ), అర్బన్ నక్సల్స్- దండకారణ్య నక్సల్స్ మధ్య వారధిగా పనిచేస్తున్న మహేశ్ రౌత్ మోదీ హత్యకు జరిగిన కుట్రలో భాగస్వాములుగా ఉన్నారని వారిని పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరూ విషయ పరిజ్ఞానం, ఆధునిక సాంకేతిక తెలియని వారు కాదు. అయినా వీరు మావోయిస్టు సిద్ధాంతాలు ఆధునిక సమజానికి అన్వయమవుతాయని విశ్వసించి వారికి సహకరిస్తూ, ఎలాగైనా మావోలు అధికారంలోకి వచ్చేలా సహకరిస్తుండడం విషాదకరం.
లక్షల తూటాల కొనుగోలు
ప్రకాశ్ అనే మావోయిస్టు అగ్రనేతకు ‘ఆర్’ అనే వ్యక్తి (రోనా విల్సన్) రాసిన లేఖలో ఎం-4 తుపాకీ, 4 లక్షల తూటాల కొనుగోలు కోసం రూ.8 కోట్లు సమకూర్చాలని విజ్ఞప్తి చేశాడు. ఆ లేఖలోనే- మోదీ విజయ పరంపర ఇలాగే కొనసాగితే మన పార్టీకి అపార నష్టం జరుగుతుందని వాపోయారు. కోట్ల రూపాయల లావాదేవీలు కొనసాగుతున్నాయి. అవన్నీ ఆయుధాల కోసమే. ఇంత ధనం వీరికి ఎక్కడి నుంచి వస్తోంది? అదంతా ప్రజల ధనమే కదా? ఈ సూక్ష్మ విషయం తెలిసిన మావోలు, వారి సానుభూతులు కోట్ల రూపాయలను ఏటా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మిలటరీ శిక్షణకు ఖర్చుచేస్తున్నారు. ఇది ఏ రకంగా ప్రజలకు ఉపయోగం?
భీమా కోరెగావ్ అల్లర్లు
గత ఏడాది డిసెంబర్ 31న ‘ఎల్గార్ పరిషత్’ సంస్థ ఆధ్వర్యంలో భీమా కోరెగావ్ వద్ద సంస్మరణోత్సవం జరిగింది. మరాఠా పీష్వా బ్రాహ్మణులపై బ్రిటీషువారితో కలిసి దళితులు రెండొందల సంవత్సరాల క్రితం సాధించిన విజయానికి చిహ్నం జరుపుకునే ఈ సంస్మరణోత్సవాలకు ఈసారి మావోల ఆర్థిక సాయంతోపాటు వారి మార్గదర్శనం జరిగిందని భావిస్తున్నారు. మరుసటి రోజు జరిగిన హింసలో ఒక వ్యక్తి మరణించాడు. ‘ఎల్గార్ పరిషత్’ నాయకుడు, గుజరాత్ దళిత నేత జిగ్నేశ్ మెవానీ రెచ్చగొట్టే ఉపన్యాసాల కారణంగానే హింస జరిగిందని భావిస్తున్నారు. దీని వెనుక మావోల హస్తముందని తాజాగా లభించిన పత్రాల ద్వారా అవగతమవుతోంది. ఈ చర్య ఎవరి అసహనాన్ని వ్యక్తపరుస్తుందో ఇట్టే తెలుస్తోంది. ఇది మామూలు అసహనం కాదు. శతాబ్దాలుగా కలిసి జీవిస్తున్న వ్యక్తుల, సమూహాలకు చెందిన ఆస్తిని బుగ్గి చేసేందుకు ఆయుధాలు చేపట్టి వీరంగం చేస్తే దాన్ని ‘సహనం’గా మనం తర్జుమా చేసుకోవాలా? కుట్రగా భావించాలా? తమ ప్రాబల్యం పెంచుకోవడానికి ఇలాంటి దాడులు చేయించడం మావోలకు వెన్నతో పెట్టిన విద్య. ఛత్తీస్‌గఢ్‌లో సల్వాజుడుంకు వ్యతిరేకంగా ఇలాంటి దాడులు ఎన్నో జరిగాయి.
చంద్రబాబుపై దాడి
ఉమ్మడి ఏపీలో అప్పటి పీపుల్స్‌వార్ నక్సల్స్ తిరుపతిలోని అలిపిరి వద్ద మందుపాతర పేల్చగా- రెప్పపాటులో బుల్లెట్ ఫ్రూఫ్ కారు నుంచి చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారు. అలాగే మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిపైనా హత్యాయత్నం జరిగింది. మంత్రి మాధవరెడ్డిని మందుపాతరలో బలిగొన్నారు. నర్సిరెడ్డి లాంటి ఎందరో నాయకులను, ప్రజాప్రతినిధులను పొట్టన పెట్టుకున్నారు. తాజాగా మోదీపై ‘గురి’ పెట్టారు. పై సంఘటనలను గమనిస్తే మోదీపై హత్యకు కట్ర బూటకమని చెబితే ఎవరైనా విశ్వసిస్తారా? మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు మావోల నుంచి బెదిరింపు లేఖలు అందాయి. గడ్చిరోలి జిల్లాలో 39 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే ఫడ్నవీస్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు హాని తలపెడతామని బెదిరింపు లేఖలు రాశారు. ఇదీ వారి సంస్కృతి, పని విధానం. కుట్ర జరగలేదని బుకాయించేవారి వ్యక్తిత్వం, మానసిక పరిస్థితి ఎలాంటిదో ఇట్టే అర్థమవుతోంది.
కొసమెరుపు..
దేశంలో ఎక్కడ మావోలకు ఆపద వచ్చినా, వారికి చీమ కుట్టినా వెంటనే మీడియా ముందు ప్రత్యక్షమయ్యే ‘విరసం’ నేత పెండ్యాల వరవరరావు పేరు సైతం తాజా కుట్రలో వినిపిస్తోంది. ఆయనకు నిధులు సమకూర్చిన సంగతి ఓ లేఖలో ‘రికార్డు’ అయింది. అదిప్పుడు పోలీసుల చేతికి దొరికింది. మావోలు జరిపే దాడులకు జాతీయ స్థాయి ప్రాముఖ్యత తెచ్చిపెట్టే వ్యక్తుల్లో వరవరరావు ఒకరని మరోసారి వెల్లడైంది. మావోయిస్టు పార్టీలో ఆయనది కీలక స్థానమని చాలాకాలంగా ప్రచారమూ జరుగుతోంది. పట్టణ మావోయిస్టు నాయకుల్లో ఆయన అగ్రజుడన్న సంగతి చాలామందికి తెలుసు. అయినా, మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని తాను భావించడం లేదని ఆయన ప్రకటించారు. ‘కుట్ర’ వార్తలు అవాస్తవమని, ప్రజల కోసం పోరాడుతున్న వారి గొంతు నొక్కడానికే పాలకులు ఇదంతా చేస్తున్నారని ఆయన చెప్పారు. సికింద్రాబాద్ కుట్రకేసు, రాంనగర్ కుట్రకేసు వంటి అనేక కుట్ర కేసుల్లోనూ ఇదే విధానం, వైఖరిని ఆయన అనుసరించారు.
ఏదిఏమైనా ఈ దాగుడుమూతలు ఇలాగే కొనసాగుతాయి. నష్టపోయేవారు నష్టపోతున్నారు. అవస్థలకు గురయ్యేవారు క్షోభకు గురవుతున్నారు. మావోయిస్టు నేతలు, కవులు మాత్రం రాజ్యాధికారం సాధించే కలగంటున్నారు. కలలు అందరూ కనాలి, కాని కాళ్లు భూమీద ఉండాలి. విఫలమైన మార్క్సిజం ఆసరాగా, మార్కెట్ రహిత ఎకానమీ ఆధారంగా జనతన సర్కార్ ఏర్పాటు చేయాలన్న ఆకాంక్ష పగటికలగానే మిగులుతుందని పరిస్థితులు చెబుతున్నా పట్టించుకోకపోతే ఎలా? ఇలా హత్యలకు కుట్రలు పన్నితే ఏమిటి ప్రయోజనం?

-వుప్పల నరసింహం 99857 81799