మెయన్ ఫీచర్

ఐసిస్ మారణకాండలో మహిళలే సమిధలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఎక్కడ ఘర్షణ పూర్వక వాతావరణం నెలకొన్నా ఎక్కువగా నష్టపోయేది మహిళలు, బాలలే. ప్రస్తుతం ఇస్లామిక్ ఉగ్రవాద భూతం ఐఎస్‌ఐఎస్ సాగిస్తున్న మారణకాండలో సహితం వీరే సమిధలవుతున్నారు. ఇంగ్లాండ్‌లోని మిర్రర్ పత్రిక కథనం ప్రకారం రాబోయేతరం హంతక ఉగ్రవాదులకు జన్మ ఇవ్వడానికి 31 వేలమంది గర్భిణి స్ర్తిలను ఐఎస్‌ఐఎస్ సిద్ధంగా ఉంచింది. నేడు ప్రపంచంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితిగా ఆ కథనం దీన్ని పేర్కొన్నది.
ఉగ్రవాదంలో మానభంగం, లైంగిక అత్యాచారాలను వ్యూహాత్మక ఆయుధంగా ఐఎస్ వాడుతున్నది. 1971 యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ సైన్యం కూడా బంగ్లాదేశ్ మహిళలపై ఇటువంటి అత్యాచారాలను వ్యూహాత్మక ఆయుధంగా ప్రయోగించింది. రువాండా మారణకాండలో కూడా క్రూరమైన అత్యాచారాలు మహిళలపై జరిగాయి. ఇప్పుడు ఈ వరసలో ఐఎస్ చేరుతున్నది.మహిళలను ముఖ్యం గా మజాది మహిళలను ఐఎస్ బానిసలుగా భావిస్తున్నది. వారికన్నా విదేశీ వనితలకు కొంచెం మెరుగైన స్థానం కల్పిస్తున్నారు. విదేశీ వనితలను ‘జిహాదీ బ్రైడ్‌లు’గా మారుస్తు న్నారు. మాజిది మహిళలను లైంగిక బానిసలుగా భావిస్తే వారికి బలవంతపు గర్భవిచ్ఛిన్నం కావిస్తున్నారు. పాశ్చాత్య మహిళలల్లో తమ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఐఎస్ రెండు విధాలుగా ఉపయోగించుకుంటున్నది. మొదటగా వారిని సోషల్ నెట్‌వర్క్‌లో క్రియాశీలకంగా ఉంచి, ఆయుధాలు ధరించి వీరోచితంగా పోరాడుతున్న చిత్రాలను ప్రదర్శించి ఇతరులను ఆకట్టుకోవడానికి ఒక మాయా ప్రపంచం సృష్టించే విధంగా చేస్తారు. ఇతర ఇస్లామిక్ ఉగ్రవాద బృందాలకు భిన్నంగా ఐఎస్ తమ ప్రచారానికి మహిళలను పలువిధాలుగా ఉపయోగించుకుంటున్నది. అరబ్, పాశ్చాత్య మహిళలను ఆకర్షించి వారిని ‘జిహాదీ బ్రైడ్’ (పెళ్లికూతురు)గా మారుస్తున్నారు. మాజిది మహిళలను మిగతావారి సెక్స్ బానిసలుగా చేస్తున్నారు.
టీనేజ్ బాలికలను సోషల్ మీడియాలో ఊహాజనిత ఇస్లాం రాజ్యం పర్యటనకోసం సైనికులుగా రోమాంచిత ఆలోచనలు కలిగించడం ద్వారా ఆకట్టుకొని, తమలో చేర్చుకుంటారు. వారికి ప్రయాణ ఖర్చులు, తగు ఆధునిక సదుపాయాలతో ఇల్లు, బిడ్డను కనడానికి ఆర్థిక సహాయం, జిహాదీని వివాహం చేసుకుంటే ఆకర్షణీయమైన జీతం ఇస్తామని హామీలు ఇస్తారు. వారు ఇవ్వజూపే ప్రధాన పరిహారం ఒక జిహాదీకి భార్య కావడం. ఆవిధంగా వారి పతనానికి మార్గం ఏర్పరుస్తారు. ఐఎస్‌లో చేరిన వారికి ఇరాన్, సిరియాలలో జిహాదీలకోసం పనిచేస్తే 10వేల డాలర్ల జీతం సమకూర్చుతారు. వారు డాక్టర్, కంప్యూటర్ నిపుణులు అయితే మరింత ఎక్కువ జీతం ఉంటుంది. ఎక్కువగా ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, బెల్జి యం దేశాలనుండి, కొద్ది మంది ఆసియా దేశాలనుండి చేరుతున్నారు. బెల్జియం నుండి అత్యధికంగా 500 మంది చేరినట్టు తెలుస్తున్నది.
చాలామంది టీనేజ్ బాలికలు ఫేస్‌బులో ఐఎస్‌తో సంబంధం ఏర్పరచుకొని ఇళ్లలో చెప్పకుండా జిహాదీలను వివాహం చేసుకోవడానికి పారిపోతున్నారు. కొంతమంది తమ భర్తలను సైతం వదలివేసి వెడుతున్నారు. కొద్ది రోజుల తర్వాత అక్కడ పరిస్థితులను తట్టుకోలేక ఆందోళన చెంది తిరిగి వెనక్కు రాలేకపోతున్నారు. ఐఎస్‌లో చేరిన కొందరు మహిళలు ఎకె-47 తుపాకులు ధరించి వీరోచితంగా ఫేస్‌బుక్‌లో ఫోటోలు ఉంచుతున్నారు. విద్యావంతులైనవారే కాకుండా తమ కుటుంబంలో లభించని స్వాతంత్య్రం, సమానత్వం అక్కడ లభిస్తుందని ఒక వీరోచిత సాహస ప్రయాణం అనే ఆసక్తితో కూడా పలువురు వనితలు ఐఎస్‌లో చేరుతున్నారు.
ఐఎస్ అంటే ఒక అరాచక సంస్థగా చాలామంది విస్తుపోతున్నారు. అయితే తాము ఊహించే ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు పట్ల, అందుకు అవసరమైన వివిధ సంస్థల ఏర్పాటు పట్ల తీవ్రమైన ఆలోచనలు కూడా చేస్తున్నట్టు తెలుస్తున్నది. ‘ఇస్లామిక్ రాజ్యంలో మహిళలు’ అనే శీర్షికన ఒక 41 పేజీల పత్రాన్ని విడుదల చేశారు. ఐఎస్ మహిళా ఉగ్రవాద బృందం అయిన అల్-ఖన్సా బ్రిగేడ్‌ను తయారు చేసినట్టు భావిస్తున్న ఈ పత్రంలో గృహిణిగా, బార్యగా, తల్లిగా మహిళల నిర్దుష్ట పాత్రను వివరించారు. అయితే లైంగిక సమానత్వం మానవ హక్కులు అనే పాశ్చాత్య భావనను తీవ్రంగా నిరసించారు. ఒక బాలికలు తొమ్మిదేళ్ల వయసులో వివాహం చేయడం చట్టబద్ధం అని పేర్కొన్నారు. ఒక మహిళ పూర్తిగా నల్ల వస్త్రం ధరించాలని, మగవాడు లేకుండా ఇల్లు దాటి బయటకు రారాదని, ప్రాథమిక పరిజ్ఞానం మినహా ఉన్నత విద్య వారికి కూడదని స్పష్టం చేశారు. ఒక మహిళ బాధ్యత భర్తకు సేవ చేయడం, పిల్లలను కనడం, ఇంటిపనులు చూసుకోవడమేనని వివరించారు.
మహిళలనుండి ఏమి ఆశిస్తున్నామో అన్న అంశాలను ఐఎస్ ఈ పత్రంలో స్పష్టం చేసింది. అయితే పాశ్చాత్య దేశాలనుండి చేరిన మగువల పట్ల కాకుండా సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలనుండి చేరిన మహిళలనుండి ఈ లక్షణాలను ఆశిస్తున్నారు. ముఖ్యంగా అరబ్ మహిళలు సిరియాకు వచ్చి హురియత్‌లో దేవుడు చెప్పిన విధంగా జీవనం సాగించి, తమ గృహ బాధ్యతను నెరవేర్చాలని ఐఎస్‌ఐఎస్ ప్రోత్సహిస్తున్నది. పైగా సౌదీ అరేబియాలోని మహిళలు అటవిక అన్యాయాలకు గురవుతూ పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారని, క్రిమినల్ జస్టిస్ విధానం వారిపట్ల వివక్షత చూపుతున్నదని అంటూ ఐఎస్ ఆక్రమిత ప్రాంతాలకు వచ్చి హుందాగా జీవించమని ఆహ్వానిస్తున్నది.
మరోవంక పాశ్చాత్య విధానంలో మహిళలు ఉద్యోగం చేయవలసి వస్తున్నదని, ఆధునికత పట్ల ఆకర్షణ, ఫ్యాషన్ వారిని పతనం వైపునకు నెట్టుతున్నదని ఈ పత్రం ఆవేదన వ్యక్తం చేసింది. భర్త, పిల్లలతో కలిసి ఇంట్లో ఉండడం మహిళల ప్రాథమిక విధి అని స్పష్టం చేశారు. మహిళ ఇల్లువిడిచి ఎప్పుడు బయటకు రావాలో కూడా పేర్కొన్నారు. మగవారు లేనప్పుడు, జిహాదీ పోరాటానికి, మతం గురించి చదవడానికి, మహిళా వైద్యులు, ఉపాధ్యాయుల వద్దకు మాత్రమే హురియత్ మార్గదర్శకు సూత్రాను అనుసరిస్తూ బయటకు రావ చ్చు. ఒకసారి ఐఎస్‌లో చేరిన తరువాత మహిళలు వెనుకకు వెళ్లే అవకాశాలు చాలా అరుదుగా లభిస్తాయి. ఆవిధంగా వెడుతూ పట్టుబడిన మహిళలకు కఠిన శిక్షలు ఉంటాయి. ఐఎస్‌లో చేరగానే వారి పాస్‌పోర్ట్‌ను తీసేసుకుంటారు. ఇంటర్‌నెట్‌ను వాడనీయరు. బయటివారితో ఎటువంటి సం బంధాలు పెట్టుకోనీయరు.
మజాది సెక్స్ బానిసలు ఎప్పుడు ఏవిధంగా ఎవరు సెక్స్ సంబంధాలు పెట్టుకోవచ్చో వివరిస్తూ సవివరమైన మార్గదర్శక సూత్రాలను జారీ చేశారు. పోరాటం చేసిన వారిలో చాలామందికి రివార్డ్‌గా వారిని ఇస్తుండడం పరిపాటి. శతాబ్దాల క్రితం నాటి బానిస, లైంగిక సంబంధాలకు సంబంధించిన ఫత్వాను ఆధునిక కాలానికి వర్తింపజేస్తూ ఐఎస్ జారీ చేసింది. ఒక పోరాట వీరుడు వారిని ఎప్పుడు ఏవిధంగా మానభంగం చేయవచ్చో అందులో వివరించారు. ఒక మహిళ గర్భిణిగా ఉన్నా, రుతుక్రమంలో ఉన్నా మానభంగం చేయరాదు. ఒకరికి తల్లి కూతుళ్లు బానిసలుగా ఉంటే ఇద్దరినీ ఒకేసారి మానభంగం చేయరాదు. ఒక బానిస మహిళతో తండ్రి కొడుకు సెక్స్ సంబంధాలను నెరపడం కూడా నిషేధించారు.
ఐఎస్ వేలాది మంది బాలికల, 12 సంవత్సరాల వయస్సులో కూడా వ్యవస్థాగతంగా అపహరించి అత్యాచారాలకు పాల్పడుతున్నట్టు ఐక్యరాజ్య సమితి మానవహక్కుల బృందాలు ఆరోపిస్తున్నాయి. ప్రపం చ వ్యాప్తంగా ప్రతి రంగంలో మహిళలకు మెరుగైన, గౌరవ ప్రదమైన స్థానం కల్పించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భద్రతాపరమైన సమస్యలు తలెత్తిన సమయంలోముందుగా మహిళలు, బాలలను రక్షించాలన్న ప్రయత్నం జరుగుతున్నది. అయితే కరడుగట్టిన ఇస్లామిక్ తీవ్రవాదులు ఐఎస్‌లో మాత్రం ముందుగా మహిళలు, బాలలపై దాడులు జరుపమని రెచ్చగొడుతున్నారు. ప్రపంచంలో అత్యంత క్రూరమైన ఉగ్రవాద బృందంగా ఐఎస్ మారుతున్నది. లైంగిక బానిసలుగా ఉన్న మహిళలను గర్భిణులుగా చేసి, వారి ద్వారా కన్న బాలలను పుట్టినప్పటి నుంచి ఉగ్రవాదులుగా తయారు చేయడానికి ప్రయత్నాలు నాజీ కాలంనాటి కిరాతక చర్యలను గుర్తుకు తెస్తున్నాయి. రష్యా, అమెరికాలు సాగిస్తున్న వైమానిక దాడులతో, ఆర్థిక దిగ్బంధం చేయడం ద్వారా త్వరలో ఐఎస్‌ను మట్టుబెట్టగలమన్న విశ్వాసాన్ని అగ్రరాజ్యాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే అంతకన్నా లోతుగా వారు బలం పుంజుకున్నట్టు కనబడుతున్నది. వారివద్ద బందీలుగా వేలాదిమంది మహిళలు ఉన్నట్టు అందరికీ తెలుసు. వారిపట్ల మొత్తం ప్రపంచం సానుభూతి చూపుతున్నది అయితే వారి బంధిఖానా నుండి విడిపించే యత్నాలు మాత్రం చెప్పుకోదగ్గ విజయం సాధించడం లేదు.
అపహరించిన తన 11 సంవత్సరాల బాలికను తిరిగి తెచ్చుకోవడం కోసం ఇరాక్ పౌరుడు ఒకరు ఉగ్రవాదులను బ్రతిమిలాడగా, ‘‘నీ కూతురు నావద్ద ఉన్నది, నీకు కావాలంటే అమ్ముతాను కొనుక్కో’’ అని సమాధానం వచ్చింది. కూతురిని కొనుక్కోవడానికి రెండువేల డాలర్లు లేక సహాయం కోసం ఆ తండ్రి అందరిని యాచిస్తున్నాడు. తమ జిహాదీలకు సెక్స్ బానిసలుగా మారడానికి తిరస్కరించిన కనీసం 250 మంది బాలికలను ఐస్ వధించి వారి శరీర అవయావలను అమ్ముకున్న నికృష్ట ఉదంతం ఆమధ్య వెలుగులోకి వచ్చింది. ఇటువంటి అరాచకాలను ఒకపెద్ద మారణహోమంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి కెర్రీ తీవ్రం గా ఖండించారు. హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక ప్రకారం సెక్స్ బానిసలుగా ఉన్న ఆడవారిని కొనడానికి మగవారు వచ్చి తీసుకెళతారు. వారిపై అత్యాచారం జరిపిన తర్వాత తీసుకువచ్చి వేరేవారిని తీసుకెళతారు. బానిసలుగా ఎనిమిది నుంచి ముప్పయ్యేళ్ల వయస్సు వరకు మహిళలు ఉన్నారని వారి నుండి తప్పించుకు వచ్చిన ఒక యాజాది బాలిక తెలిపింది.
ఇక 12 ఏళ్ల బాలిక కథనం ప్రకారం ఒక ఇస్లామిక్ పోరాట యోధుడు తనను తీసుకెళ్లి తనపై అత్యాచారం జరపడానికి, జరిపిన తర్వాత దైవ ప్రార్థన చేసేవాడు. తనపై అత్యాచారం జరపడం ద్వారా దైవానికి మరింత దగ్గర అవుతున్నాను అని ఆమెకు చెప్పేవాడు. నేటి ఆధునిక యుగంలో వ్యవస్థాగతమైన అంతర్జాతీయనెట్‌వర్క్ కలిగిన ఒక సంస్థ మహిళల హక్కులను, ఉనికిని ఇంత ఘోరంగా అవహేళన చేయడం, వారిని సైద్ధాంతికంగా లైంగిక బానిసలుగా మార్చడం ఇటీవల చరిత్రలో జరగలేదు. ఒక క్రూరమైన నేర సంస్కృతిని మహిళల పట్ల ఐఎస్ వ్యాప్తి చేస్తున్నదని చెప్పవచ్చు.

- చలసాని నరేంద్ర