మెయన్ ఫీచర్

దాతృత్వ ఉద్యమం జిందాబాద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాతృత్వ నినాదం మరోసారి మార్మోగింది. తాజా గా మాజీ ఎంపీ నందన్ నీలేకని, ఆయన భార్య రోహిణీ నీలేకని తమ సంపదలో సగభాగాన్ని ‘గివింగ్ ప్లెడ్జ్’కు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. వీరితోపాటు భారత సంతతికి చెందిన మరో ముగ్గురు కుబేరులు ఇదే మాదిరి తమ సమ్మతిని ప్రకటించారు. ఇది ఈనాటి కొందరు సంపన్నుల ఆలోచనా సరళికి అద్దం పడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి సమస్యల పరిష్కారానికై మైక్రోసాఫ్ట్ సంస్థ అధిపతి బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ నాయకత్వంలో బఫెట్ లాంటి 40 మంది కుబేరులతో ‘గివింగ్ ప్లెడ్జ్’ 2010 సంవత్సరంలో ప్రారంభమైంది. తమ సంపదలో సగానికి పైగా విరాళం ఇచ్చేవారిని ఆ సంస్థ ఆహ్వానించింది. ఆ పిలుపు మేరకు 22 దేశాల నుంచి చాలామంది ముందుకొచ్చారు. తమ దాతృత్వాన్ని చాటుకునేందుకు కుబేరులు విరాళాలు ప్రకటిస్తున్నారు. పేదరిక నిర్మూలన, వైద్యం, ఆరోగ్య సంరక్షణ, పరిశోధనలు, సమస్యల పరిష్కారానికి అనే్వషణ.. ఇలా వివిధ అంశాలపై ‘గివింగ్ ప్లెడ్జ్’ పనిచేస్తోంది, ఆర్థికంగా ఎందరినో ఆదుకుంటోంది. ఈ భావనను బలపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు తమ సంపదలో సగానికి పైగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా, ‘ఆధార్’ వ్యవస్థ రూపశిల్పిగా మన్ననలు పొందిన నీలేకని తన హృదయం విశాలమైనదని విరాళం ప్రకటించి మరోసారి నిరూపించుకున్నారు.
నీలేకని దంపతులతోపాటు అనిల్ అల్లీసన్ భుస్రీ, శంషీర్- షబీనా వయాలిల్, బిఆర్ శెట్టి- చంద్రముఖి రఘురామ్‌శెట్టిలు తమతమ సంపదలో సగానికి పైగా విరాళం ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. వాస్తవానికి భారతదేశ సంస్కృతిలో దాతృత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. తమకు కలిగినది పదిమందితో పంచుకోవాలన్న ఆలోచన అతి పురాతనమైనది. ఆ వారసత్వం ఇప్పటికీ సజీవంగా ఉండటం అభినందనీయం. ఆ బాట విస్తృతమవడం మరెంతో సంతోషదాయకం. అందుకే నందన్ నీలేకని ఈ సందర్భంగా భగవద్గీతలోని శ్లోకాన్ని ఉటంకించారు. దాన్ని స్ఫూర్తిగా భావిస్తున్నట్టు చెప్పారు. సంపదను అందరూ సృష్టించలేరు. అది కొందరికే చేతనవుతుంది. అలాగని వారిని ఆడిపోసుకోవడం ఆధునిక కాలంలో అర్థం లేనిదే అవుతుంది. వర్తమాన కాలంలో జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, దూరదృష్టి, నిరంతర పరిశ్రమ సంపద సృష్టికి ఆధారాలుగా నిలుస్తున్నాయి. ఈ లక్షణాలు ఎవరివద్ద ఉంటే వారు కుబేరులవుతున్నారు. అలాపోగైన సంపదను కేవలం ఆ కుటుంబమే ఆస్వాదించే అవకాశం లేదు. తప్పనిసరిగా మరికొందరితో పంచుకోవడం అనివార్యం. ఇంకా ఎక్కువగా ఆ సంపద ఫలాలు అవసరమైనవారికి అందాలంటే ‘గివింగ్ ప్లెడ్జ్’లాంటి సంస్థలకు విరాళాలను అందిస్తున్నారు. ఆ రకంగా తమ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. నిరర్థక ఆస్తిగా సంపద లేకుండా చెలామణిలో ఉన్నప్పుడు దాని జీవలక్షణాన్ని అది చాటుకుంటుంది. అందుకు నేటి కుబేరులు చోదకులవుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం 5వ అవతరణ దినోత్సవం సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంపద సృష్టించి పంచే విషయమై నొక్కి చెప్పారు.
విచిత్రమేమిటంటే సంపదగల వారిని, ధనవంతులను తూలనాడుతూ- వారిని అమర్యాదకరంగా చూసే విధానం, వామపక్ష రాజకీయ చైతన్యం సమాజంలో కనిపిస్తోంది. కాని ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి, నందన్ నీలేకని లాంటి ఎంతోమంది సంపన్నులు అతి సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవారే. ఎంతో కృషిచేసి వారు కుబేరులయ్యారు. ఆ అవకాశాలు అందరికీ అందుబాటులో ఉన్నవే.. కాని కొందరే వాటిని ఒడిసిపట్టుకుని సంపదను సృష్టించగలిగారు. ఇది ఎవరి తప్పు? ఎవరిదీ దోషం?.. ఈ అంశంపై అనాదిగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మార్క్సిస్టులు-మావోయిస్టులు ఈ ఎదుగుదలకు భిన్నమైన ‘్భష్యం’ చెప్పుకుని అలా కొందరు మాత్రమే సంపన్నులుగా ఎదిగే వ్యవస్థను కూలదోయాలని పిలుపునిస్తున్నారు. అందుకోసం దశాబ్దాలుగా కృషిచేస్తున్నారు.
ధీరూభాయి అంబానీ ఒక పెట్రోల్ బంకులో గుమస్తా, నారాయణమూర్తి ఓ బడిపంతులు కుమారుడు, విప్రో ప్రేమ్‌జీ ఓ చిన్న వ్యాపారుని కుమారుడు. ఇలా ఎందరో అతి సాధారణ వ్యక్తులు స్వశక్తితో కుబేరులుగా ఎదిగారు. కోట్లాది మంది అతి సాధారణ వ్యక్తుల్లో వారు కొందరు. వారి చైతన్యం, జ్ఞాన బలిమి, అవకాశాలను ఒడిసిపట్టుకునే నైపుణ్యం, పట్టుదల, శ్రమ, అంకితభావం వారిని ఆ దశకు చేర్చింది. ఈ ప్రక్రియను, ఈ తపనను పట్టించుకోకుండా వారిని తూలనాడటంలో, నిందించడంలో, ఏహ్యభావంతో చూడ్డంలో సహజ న్యాయం కనిపించదు. కాని కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైనవారు మాత్రం అలా ఎదిగేందుకు అవకాశమిచ్చిన వ్యవస్థ లోపభూయిష్టమైనదని ఎగబడడంలో అర్థం కనిపించదు.
ఈ వైఖరి, ప్రక్రియ, విధానం వేల సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. ‘సిల్క్ రూట్’ నాటి కాలంలోనూ, సు గంధ ద్రవ్యాల వ్యాపారం ప్రారంభ సమయంలోనూ ఇదే ధోరణి వేళ్ళూనింది. ఇదేదో తొలి పారిశ్రామిక విప్లవానంతరం పొడసూపిన లక్షణం కాదు. మానవ స్వభావంలో అంతర్లీనంగా ఉన్న లాభాపేక్ష వీటిని నడిపిస్తోంది. ఈ ఆపేక్ష కేవలం కొందరికే పరిమితం కాదు. కొంతమంది వ్యక్తులకు సంబంధించింది కాదు. కాని కొందరిలోనే ఆ ఆకాంక్షను సాకారం చేసుకునే నైపుణ్యం, ఒడుపు ఉండటం, జ్ఞానం అందుకు ఉపకరించడం కారణంగా వారు ఉబికివస్తున్నారు. దీన్ని విస్మరించి, ఆవేశంతో ఏవేవో అంచనాలకొచ్చి వ్యవస్థను ధ్వంసం చేయాలనుకోవడం, జరిగిన అభివృద్ధిని నాశనం చేసి ఆ పునాదులపై కొత్త వ్యవస్థ నిర్మాణానికి పిలుపునివ్వడం ఆమోదయోగ్యం కాదు. అలా పిలుపునిచ్చి కొత్త వ్యవస్థను రష్యా, చైనా, తూర్పు యూరప్ దేశాల్లో ‘మార్కెట్ రహితం’గా రూపొందించినా చివరికి ఏమైంది? కథ మళ్లీ మొదటికొచ్చింది. ఆ దేశాలూ మార్కెట్ ఎకానమీలో భాగమయ్యాయి. మరింత కసితో దూసుకుపోతున్నాయి. చైనా అయితే రెండాకులు ఎక్కువే చదివినట్టు ప్రపంచ మార్కెట్లను చుట్టేస్తోంది. ‘డ్రాగన్’ తన పట్టును బిగిస్తోంది. అతి సాధారణమైన ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా మార్కెట్ రహిత ఆర్థిక వ్యవస్థ కోసం ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రాణాలను బలిగొనడం, మానవ వనరులను దుర్వినియోగం చేయడం ఏ రకంగా సమర్ధనీయం?
4.0 పేరిట నాల్గవ పారిశ్రామిక విప్లవం పురివిప్పి ప్రజల దరిచేరుతోంది. అత్యాధునిక సాంకేతిక ప్రభంజనం వీస్తోంది. సైబర్ విజ్ఞానం విస్తరిస్తోంది. కాగ్నిటివ్ కంప్యూటింగ్ పద్ధతి ప్రవేశంతో కృత్రిమ మేధ మరో మెట్టు ఎక్కింది. రోబోలు నిజజీవితంలో అంతటా దర్శనమివ్వనున్నాయి. నానో టెక్నాలజీ, త్రిడీ ప్రింటింగ్ ప్రజల జీవితాన్ని విప్లవీకరిస్తోంది. 5జి (్ఫఫ్త్ జనరేషన్) వేగం మొబైల్ ఫోన్ ఈ ప్రపంచాన్ని మరింత చిన్నదిగా చేస్తోంది. ఈ పరిణామాలన్నీ సరికొత్త ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తున్నాయి. దీన్ని చాకచక్యంగా పట్టుకోగలిగినవారు, దర్శించినవారు ఆర్థికంగా ఎదుగుతున్నారు. కుబేరులవుతున్నారు.
ఈ పరిణామాన్ని, ప్రపంచ గతిని అర్థం చేసుకోవడంలోనే భవిష్యత్ ఆధారపడి ఉంది. అంతేగాని మార్క్స్ ఆర్థికసూత్రాల దగ్గరే ఆగిపోవడం వల్ల ఎవరికీ ఒరిగేది ఏమీ ఉండదు. ఆ అభిప్రాయాలకు, ఆలోచనలకు కాలం చెల్లింది. ఈ విషయాన్ని సూక్ష్మదృష్టితో దర్శించిన ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి మార్క్స్ ఆలోచనలను పక్కనపెట్టి సంపద సృష్టించి, దాన్ని పంచే కార్యక్రమంలో మునిగిపోయారు. ఆయన సహచరుడు నందన్ నీలేకని, మరెందరో ఆ దారిలోనే నడుస్తున్నారు.
ఈ విధానం, వైఖరి కేవలం భారతదేశంలోనే గాక, చైనా తదితర దేశాల్లోనూ విస్తరిస్తోంది. అందుకే 22 దేశాల కుబేరులు ‘గివింగ్ ప్లెడ్జ్’కు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ‘దాతృత్వ జెండా’ను సమున్నతంగా ఎగరేస్తున్నారు. పేదల సమస్యల పరిష్కారానికి తమవంతు పాత్రను వారు ఆ విధంగా పోషిస్తున్నారు. భారతదేశంలో జెంషెట్జీ టాటా ప్రారంభించిన ఈ దాతృత్వ విధానమిప్పుడు వెయ్యి రేకలుగా విరాజిల్లుతోంది. మరిన్ని రేకలు మొగ్గతొడగాలని అభిలషిద్దాం!

--వుప్పల నరసింహం 99857 81799