మెయిన్ ఫీచర్

ప్రపంచ గాథ.. శ్రీశ్రీ గాథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలంగారి మహాప్రస్థానం ముందుమాటల్లో ఒక ప్రఖ్యాత వాక్యం కొంత సవరిస్తే, ఈ వ్యాసం శీర్షిక అవుతుంది. జూన్ 15న శ్రీశ్రీగారి 35వ వర్ధంతి. కొత్త తరాలు శ్రీశ్రీ రచనా విశ్వాన్ని తెలుసుకునేలా వారి జన్మస్థలం, మహాప్రస్థాన ప్రసూతి పట్టణం విశాఖలో, 2010లో శత జయంతికి అయిదేళ్ళ ముందునుంచే కౌంట్‌డౌన్ (అధోగణనం) ఇచ్చి సాహిత్య సాంస్కృతికోత్సవాలుగా, పుట్టినరోజు ఏప్రిల్ 30, వర్ధంతి జూన్ 15న కొత్తగా సంజనితమైన కార్యక్రమాలుగా జరుపుతూ, మొజాయిక్ సాహిత్య సంస్థ, ఈ రంగాల్లో అదనపు విలువల జోడింపుకు కృషిచేస్తూ వస్తున్నది. ఆకాశవాణి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాలాంధ్ర సంస్థ, ఇతర సాంస్కృతిక వేదికలు, పత్రికలు, ఈ నిరంతర కోలాహలంలో తోడ్పాటునిచ్చాయి. శతాబ్ది శ్రీశ్రీ సంగీత నివాళి, శ్రీశ్రీ విశ్వం పేరిట ఆయన అనువాదం చేసిన ప్రపంచ రచయితల ఫొటోల ప్రదర్శన, మహాప్రస్థానంకోసం మీ జీవితంలో ఓ గంట, బాలల మహాప్రస్థానం పేరిట పవర్ పాయింట్ ప్రదర్శనలు, నాటికల ప్రదర్శన, ఎందరో సాహిత్యవేత్తలు శ్రీశ్రీ శత జయంతి ప్రసంగధారలో పాల్గొని విలువైన ప్రసంగాలు చేయడం, శ్రీశ్రీ రచనలపై భిన్న పరిశోధనలు, శ్రీశ్రీ మోనోగ్రాఫ్ మలయాళ అనువాదం, మహాప్రస్థానంపై చిత్రాల ప్రదర్శన, ‘కవితా ఓ కవితా’ గీతంపై పవర్ పాయింట్, ఎట్టకేలకు మహాప్రస్థాన, ఆంగ్ల, ఉర్దూ, హిందూస్తానీ అనువాదాలను సిద్ధంచేయడం, పదుల సంఖ్యలో తెలుగు, ఆంగ్ల వ్యాసాలు, శ్రీశ్రీ సాహిత్యం ఎంత విస్తృతమో, మొజాయిక్ జరుపుతున్న ఉత్సవ హేల కూడా అంత సజీవంగా, అందర్నీ కలుపుకుంటూ, వాడి ముమ్మొనవాలుగా సాహిత్య సంపన్నత, సాంకేతిక సమర్థత, సాంస్కృతికోత్సాహాల మేళవింపుగా విశాఖ వాసులకు ప్రత్యక్ష అనుభవంలో ఉన్న హెపెనింగ్ లిటరేచర్ (ఘటిస్తున్న సాహిత్యం).
ఆంగ్ల, ఉర్దూ, హిందూస్తానీ అనువాదాలుగా ‘మహాప్రస్థానం’ ఉత్తర భారతదేశం తలుపులుకొట్టి, హిమానీ ప్రాంతాలకు, మేరోర్ ఉత్తర దిగ్భాగానికి విజయం చేయడానికి సన్నాహాల సందర్భం ఇది. ‘ప్రతి ఏటా చేస్తూనే ఉన్నాం కదా, కొత్తగా ఏముందీ’ అడిగారొకరు. సమాధానం ఉంది. అది తొలుత వేర్వేరు పుస్తకాలుగా విరసం వారూ, అటుపై మరికొన్ని రచనలు లభ్యమైనవి, కలిపి మనసు ఫౌండేషన్ శత జయంతి ప్రచురణగా, మూడు భాగాలుగా శ్రీశ్రీ ప్రస్థానత్రయం ప్రస్తుతానికి, సర్వలభ్య రచనల సంకలనం. దీన్నిదాటి ఇంకా ఏమన్నా శ్రీశ్రీ రచనలు ఉంటాయా- ఆ దిశగా ఎవరూ చూడలేదు. ఆలోచన చేయలేదు. అనవసర వివాద వాతావరణం, గమ్యాలను మసకబరుస్తుంది. అయితే అలా చూడ్డానికి ముందు శ్రీశ్రీ రచనలను సాకల్యంగా చదవాలి. అప్పుడే అందులో లేనివి ఏమన్నా ఉంటే, వాటిని చదివితే, అరె ఇవి ఈ సర్వ లభ్య రచనల్లో లేవే అనే తలంపు, దానికి తగు పరిశోధక శక్తి, ఆసక్తి ఉంటే, అపుడే ముందడుగు సాధ్యం. పరిశోధక లక్షణం అందరూ సాహిత్యకారులకు ఉండదు. కొందరు రాస్తారు. కొందరు పరిశీలిస్తారు. కొందరు రెండు పనులూ చేస్తారు. అయితే పరిశీలనకు పరిశోధనకుగల తేడా ఆధునిక తెలుగు సాహిత్యం మొత్తంలో ఒక్క బంగోరె (బండి గోపాలరెడ్డి) కృషి. అది తొలి కన్యాశుల్కం ఇంచుమించు ఇక దొరకదు అనుకున్న కాలంలో, మదరాసు ప్రభుత్వ ప్రాచ్య / కనె్నమేరా గ్రంథాలయాలలో వెదికి ఆ 1897 ప్రతి సాధించి, జెరాక్స్ సౌకర్యాలు లేని కాలంలో, ప్రతి పేజీ నకలు రాసుకున్న ఓపికను పరిశోధన అంటాము. ఒక పరిశోధన ఎన్నో పరిశీలనాలకు దారి తీస్తుంది.
భౌతికంగా అంత కష్టం, క్లిష్టం కాకున్నా, రామతీర్థ, కవి, విమర్శకుడు, అనువాదకుడు, కాలమిస్ట్ పాత్రలతోపాటు ఇష్టంగా నిర్వహించేది పరిశోధకుడి పాత్ర. అందుకు ఈ 35వ వర్ధంతి కొత్తగా ఎనిమిది శ్రీశ్రీగారి నూతన లభ్య రచనలను వెలికితీశారు. ఇవి ఇంతవరకూ విరసం, మనసు ఫౌండేషన్ సంకలనాలలోకి రాలేదు. ఆధునిక తెలుగు సాహిత్యానికి ఇరవయ్యో శతాబ్దానికి సంబంధించి ఇది చరిత్రాత్మక ఘట్టం. మహాకవి శ్రీశ్రీ నూతన రచనల పరిచయ సభ జూన్ 14 సాయంత్రం విశాఖలో మొజాయిక్ సంస్థ జరుపుతున్నది. ఈ రచనలను ఈ సభలో లోకార్పణ చేస్తారు.
వీటిలో కొంపెల్ల జనార్దనరావుపై శ్రీశ్రీ 1958లో రేడియో ప్రసంగంగా చేసిన ‘ఆంధ్ర రచయితలు - కొంపెల్ల జనార్దనరావు’ అనే పెద్ద వ్యాసం, ‘్భగ్యలక్ష్మి’ పేరిట 1883లో రడ్యార్డ్ భారతీయ రైతాంగం గూర్చి ‘ది మాస్క్ ఆఫ్ ప్లెంటీ’ బ్రిటిష్ పాలన వ్యతిరేక రచనకు శ్రీశ్రీ 1943 అనువాదం, ఇంతవరకూ పుస్తకాలకు ఎక్కని ఒక ఆంగ్ల కథ, (టియర్స్ అండ్ క్రొకడైల్స్), తన మార్క్ ప్రయోగశీల బుల్లికవిత ‘దీర్ఘాలు’ (1963), తొలినాళ్ళ కవిత ‘ప్రణయ ప్రపంచము’ (1927), వినర సోదరా (సర్దార్ పాపారాయుడు సినిమాలో కొంత వాడిన బుర్రకథ- పూర్తి పాఠం), ‘స్విస్ బర్న్ కవికి’ అనే కవిత తొలుత ‘టు ఏ సిఎస్’ (ఆల్గెర్నాన్ చార్లెస్ స్విన్‌బర్న్ పేరు ఆంగ్ల పొడి అక్షరాలు) పేరిట అచ్చువేసిన వైనం, ‘అశ్వమేధయాగం’ అనే కథను అపజయం పేరిట ముద్రణచేసిన చరిత్ర, ఆనందవాణిలో వారంవారం ఫీచర్‌లో యుద్ధంపై రాసినది, ఇలా సంచలనాలకు ఎక్కని రచనలను ఈ సభలో పరిచయం చేయడం జరుగుతున్నది. వీటి సాంస్కృతిక రెఫరెన్స్‌లు, శ్రీశ్రీ ఎందుకు ప్రపంచ కవో చెప్తాయి.
ఈ పరిశోధన ద్వారా శ్రీశ్రీ సాహిత్యానికి మరింత సంపన్నత లభించినందుకు, తెలుగు సాహిత్య పరిశోధన, పరిశీలన రంగాలు సజీవంగా అభివృద్ధి సాగిస్తున్నందుకు, రామతీర్థ ఎంత బాధ్యుడో, అలాగే ఈ సారస్వత వనరులను నిరంతర వనరులుగా అంతర్జాలంలో ఉంచిన (విష్ణుకంచి, శివకంచిలా మనకు తెలుగు ‘కథ కంచి’ అయిన) కథా నిలయం, అక్కడి ఎందరో మిత్రులు, స్ఫూర్తిసుందర రూపులు కాళీపట్నం రామారావు మాస్టారు, ఈ పరిశోధనలో రామతీర్థకు విలువైన సహకారం అందించిన నిర్వాహక ముఖ్యులు కాళీపట్నపు సుబ్బారావు, వీరందరి సమ్యక్ కృషి, ఎన్నో ఇటువంటి పరిశోధనలకు దారితీయాలని ఆశిద్దాం. నూతన లభ్య రచనల సంధ్యలో, శ్రీశ్రీ మానస మాతృక, ఆదిమానస పుత్రిక, విశాఖ జూన్ పధ్నాలుగు, రంజాన్ ముని వెనె్నలలో సాంద్ర చంద్ర, నక్షత్ర గ్రంథాలు విరజిమ్మే వెలుగు మండలం అవుతుంది. రామతీర్థ పరిశోధనలో భాగంగా, నూతన లభ్య రచనల్లో ఒక శ్రీశ్రీ మార్క్ బుల్లికవిత ఈ సంబరాలకు శ్రీకారంగా - అన్నీ దీర్ఘాలే ఈ కవితలో. పేరు కూడా అదే.
ఈ నాడూ ఏ నాడూ
నీ నేనూ నా నీవూ
తాజాగా రోజులా
ఆడాలే పాడాలే
నా దానా ఓ దానా
*
(జూన్ 15న శ్రీశ్రీ 35వ వర్ధంతి సందర్భంగా
14-6-2018 సాయంత్రం విశాఖ పబ్లిక్ లైబ్రరీలో
మహాకవి శ్రీశ్రీ నూతన లభ్య రచనల పరిచయ సభ)

- జగద్ధాత్రి, 8712293994