మెయన్ ఫీచర్

కాంగ్రెస్‌తో చెలిమి?.. ‘చంద్రుల’ ఇరకాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ తమ తమ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీపై కాలుదువవుతూ ఉంటారు. కానీ, ఢిల్లీలో ఆ పార్టీతో సయోధ్య కోసం సిద్దపడుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటువంటి అనుమానాలు ఆ ఇద్దరినీ ఇరకాటంలో పడవేస్తున్నాయి. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ సారధ్యంలో ప్రభుత్వం ఏర్పడితే- ఆ పార్టీకి దూరంగా ఉండలేమని చంద్రులిద్దరూ ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఎన్డీయే నుండి వైదొలిగి, బిజెపిపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబుకు ఇప్పుడు జాతీయ స్థాయిలో మరో తోడు తప్పనిసరి. అందుకనే కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ఆయన బెంగళూరు వెళ్లి బిజేపిపేతర ప్రతిపక్షాలతో దాదాపు రెండు దశాబ్దాల అనంతరం తన సంబంధాలను పునరుద్ధరించుకొనే ప్రయత్నం చేశారు.
రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనపై ఆ పార్టీ ఎదురు తిరగకుండా కేసీఆర్ ముందే జాగ్రత్త పడుతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. 2014 ఎన్నికల సమయంలో తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని నమ్మబలికిన కేసీఆర్ మాట తప్పిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు తెలంగాణలో బిజెపిని ఉనికి లేని పార్టీగా చీదరించుకొంటూనే, ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ సహా ఇతర కేంద్ర మంత్రుల ప్రసన్నం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. కర్ణాటక ఎన్నికల సందర్భంగా బెంగళూరు వెళ్లి, జెడిఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడను కలసి అడగకుండానే మద్దతు ప్రకటించింది కేసీఆర్ మాత్రమే కావడం గమనార్హం. కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి పదవి చేబట్టబోతున్న కుమారస్వామిని ప్రమాణ స్వీకారానికి ముందు రోజు సాయంత్రమే బెంగళూరు వెళ్లి అభినందించి వచ్చారు. ఇతర ప్రతిపక్షాల నేతల వలే ప్రమాణ స్వీకారంలో కేసీఆర్ పాల్గొనకుండా వచ్చేసారు. కాంగ్రెస్ నేతలతో వేదిక పంచుకొంటే, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు బలం చేకూర్చిన్నట్లు అవుతుందని ఆయన భావించి ఉండవచ్చు. కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పొరుగున ఉన్న తెలంగాణలో పార్టీ నైతిక స్థైర్యం పెంపొంది, 2019 ఎన్నికలలో తనకు గుదిబండగా తయారవుతుందని ఆయన భావన కావచ్చు. ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎట్లాగూ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని అప్పటికే అందరికీ తెలుసు. విజయం పట్ల గట్టి నమ్మకంతో ఉన్న బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసినా తెలంగాణలో ఆ పార్టీ విజృభిస్తుందని కేసీఆర్ భయపడ్డారు. అందుకనే కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు ఇవ్వలేక, ఏదో ఒక విధంగా జేడీఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ కేసీఆర్ మనసారా కోరుకున్నారు.
ఇక చంద్రబాబు కర్ణాటకలో బిజెపిని ఓడించాలని బహిరంగంగానే పిలుపు ఇవ్వడం ద్వారా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు చేయవలసింది అంతా చేశారు. చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో భుజం భుజం రాసుకొంటూ, కుమారస్వామి ప్రమాణ స్వీకార వేదికపై కనిపించారు. ఎన్డీయే నుండి వైదొలగిన తనకు రాబోయే రోజులలో కాంగ్రెస్ ఆత్మబంధువుగా మారుతున్నట్లు స్పష్టమైన సంకేతం కూడా ఇచ్చారు.
కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే దక్షిణాదిలో పాగా వేసిన తర్వాత ఆ పార్టీ తదుపరి లక్ష్యం రెండు తెలుగు రాష్ట్రాలే కాగలవని చంద్రబాబు, కేసీఆర్ భయపడ్డారు. చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం నిలుపు కోవడం కోసం బహిరంగంగానే ప్రయత్నం చేస్తే, కేసీఆర్ పరోక్షంగా జేడీఎస్ ద్వారా అటువంటి ప్రయత్నం చేసారని ఇప్పుడు స్పష్టం అవుతోంది. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కానందుకు ఇద్దరు తెలుగు సీఎంలు మురిసిపోతున్నారు. తమకు పెద్ద రాజకీయ గండం తప్పిన్నట్లు ఊపిరి పీల్చుకొంటున్నారు. అయితే తమ ఎత్తుగడలను కుమారస్వామి బట్టబయలు చేయడంతో ఇద్దరు తేలుకుట్టిన దొంగలవలె వౌనంగా ఉండి పోయారు. వారి పార్టీ సహచరులు సైతం నోరువిప్పి వాఖ్యానించే సాహసం చేయడం లేదు.
ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఈ ఇద్దరు ముఖ్య మంత్రులు తనకు సూచించారని కుమారస్వామి చెప్పడంతో ఈ రెండు ప్రాతీయ పార్టీలకు దిమ్మ తిరిగిన్నట్లయింది. కాంగ్రెస్‌తో కలవమని చెప్పినట్లు కుమా రస్వామి అనడం కేసీఆర్‌ను చిక్కుల్లో పడవేసిన్నట్లయింది. ఈ ప్రకటనపై తెరాస స్పందించక పోవడం గమనార్హం. అక్కడ కాంగ్రెస్‌తో చెలిమి చేయమని ఒక ప్రాంతీయ పార్టీని ప్రోత్సహించి, సొంత రాష్ట్రంలో ఆ పార్టీని ఎట్లా ఎండగడతారనే ప్రశ్న తలెత్తుతున్నది. ఇక్కడ కాంగ్రెస్ తో కయ్యం పెట్టుకున్నా జాతీయ స్థాయిలో ఎన్నికల అనంతరం కేసీఆర్ కాంగ్రెస్‌తో నెయ్యం జరపడం తథ్యం అనే సంకేతం కుమారస్వామి ఇచ్చిన్నట్లయింది. ఇటువంటి సంకేతం ఇవ్వడం అంటే తెలంగాణలో బిజెపి బలపడడానికి దారితీయడమే అంటూ ఇప్పుడు ఒకవంక కేసీఆర్, మరోవంక కాంగ్రెస్ ఆందోళన చెందే పరిస్థితులు నెలకొన్నాయి. తమ తెరచాటు బాగోతాన్ని కుమారస్వామి అనూహ్యంగా ఈ విధంగా బట్టబయలు చేస్తారని కేసీఆర్ ఊహించలేక పోయారు.
ఎన్డీయే నుండి వైదొలిగాక ఒంటరిగా మిగిలిన చంద్రబాబు కొత్త మిత్రుల కోసం అనే్వషిస్తూన్నారు. తనను ఎట్లాగైనా గద్దె దింపాలని బిజెపి కృతనిశ్చయంతో ఉండటం, వైసిపితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు వ్యతిరేకంగా ప్రజల మధ్యలోకి వెడుతూ ఉండడంతో దిక్కుతోచ పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో కుమారస్వామి ప్రమాణస్వీకారం దైవమిచ్చిన వరంగా మారింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా మమతా మెనెర్జీ తదితర నాయకులతో పాత పరిచయాలను పునరుద్ధరించుకొనే జాతీయ రాజ కీయాలలో క్రియాశీలం అయ్యే ప్రయత్నం చంద్ర బాబు చేపట్టారు.
తెలుగు దేశం ఆవిర్భావమే కాంగ్రెస్ వ్యతిరేకమైనా, ఇప్పటివరకు కాంగ్రెస్‌తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోక పోయినా ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రంలో బిజెపి నుండి ఎదురయ్యే ముప్పు దృష్ట్యా కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీతో సానుకూల సంబంధాలు అనివార్యమని చంద్రబాబు గ్రహించారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని ఒక అవగాహనకు తెలుగు దేశం నాయకులు సిద్దపడుతుండటం బహిరంగ రహస్యమే. బహిరంగంగా పొత్తు అంటూ పెట్టుకోలేక పోయినా అవగాహనకు రాక తప్పని పరిస్థితి నెలకొంది.
ఏపీలో కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్ధకరంగా ఉన్నా వైకాపా,జనసేన, బిజెపిల నుండి రాగల ముప్పునుండి తప్పించుకునేందుకు కొద్దిపాటి ఓట్లు జత అయినా గట్టెక్కడానికి కాంగ్రెస్ దోహదపడుతుందని చంద్రబాబు ఆశపడే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్‌తో దాగుడు మూతలుగా ఏర్పరుచుకోవాలనుకొంటున్న సంబంధాలను కుమారస్వామి బహిరంగ పరచడం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్‌గా నియమితులైన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తొలిసారి విజయవాడ వచ్చిన సందర్భంగా- ఒంటరిగా పోటీ చేస్తామని పేర్కొనడం గమనార్హం. అంటే తెదేపాను వ్యతిరేకించే ఏ పార్టీతోనూ ఎలాంటి పొత్తు ఉండదని అర్థం. ప్రతిపక్షాల ఓట్లు చీల్చడం ద్వారా తెలుగుదేశం గెలుపునకు తమ వంతు సహకారం అందిస్తామనే సంకేతం కాంగ్రెస్ నేతలు ఇచ్చారు. ఎన్నికలకు మరో 10 నెలల గడువు ఉన్నా, రాష్ట్రంలో పార్టీ ఉనికి ప్రశ్నార్ధకరంగా ఉన్నా పొత్తుల ప్రసక్తి లేదంటూ ఇప్పుడే ప్రకటన ఇవ్వవలసిన అవసరం ఏమిటని కాంగ్రెస్ నేతలే విస్మయం చెందుతున్నారు.
కాంగ్రెస్‌తో ఒక అవగాహనకు రావడం కూడా చంద్రబాబుకు అంత సులభం కాబోదు. తెలుగు దేశం మద్దతుదారులు అత్యధికులు అటువంటి సహకారాన్ని హర్షించలేదు. కాంగ్రెస్ తో పొత్తు ఏర్పర్చుకొంటే ఆత్మహత్యకు సిద్ధం అంటూ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొనడం ఆ పార్టీలో నెలకొన్న మానసిక ధోరణిని వెల్లడి చేస్తుంది. మొదటినుండి కాంగ్రెస్ వ్యతిరేకతతో రాజకీయాలు జరుపుతూ వచ్చిన అసలు టిడిపి నాయకులు కాంగ్రెస్‌తో ఎటువంటి అనుబంధాన్ని సహించలేరు. అందుకనే బెంగళూరులో రాహుల్ గాంధీతో వేదికను పంచుకొన్న చంద్రబాబు ఎన్నికలయ్యే వరకు కాంగ్రెస్ విషయంలో దూరంగా ఉండక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
కాంగ్రెస్‌తో అవగాహనకు సిద్ధంగా ఉన్నామనే సంకేతం వెలువడటం రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి బలపడడానికి దారితీస్తుందని ఇద్దరు ముఖ్యమంత్రులకూ తెలుసు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండడంతో తెలంగాణలో కేసీఆర్‌కు ఆ పార్టీపై విమర్శలు కురిపించడం అనివార్యం. చంద్రబాబు మాత్రం తన విమర్శలన్నింటినీ ప్రధాని మోదీపైనే కేంద్రీకరిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అవినీతి కేసులు మినహా మరెటువంటి విమర్శలు చేయలేరు. ఎందుకంటె ఇప్పటి వరకు జగన్ అధికారంలో లేరు.
కాగా, జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా ప్రతిరోజూ ఏదో ఒక సరికొత్త హామీ ఇస్తూ వస్తున్నారు. ఆయా హామీలను అధికారంలోకి వస్తే కదా? అంటూ కొట్టిపారవేయడం మినహా వాటి అమలు సాధ్యా సాధ్యాలపై కూడా చర్చించే సాహసం తెలుగుదేశం పార్టీ చేయలేక పోతున్నది. ఆ విధంగా చర్చను లేవదీస్తే గత ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీల గురించిన చర్చకు ఆస్కారం కలిగించినట్లు కాగలదని తెలుసు. 2019 ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో తమ పార్టీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని చెప్పడం మినహా, ప్రతిపక్షాలతో మహాకూటమి కోసం ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్ల తన వైఖరిని ప్రకటించే సాహసం తెదేపా చేయడం లేదు.

-చలసాని నరేంద్ర