మెయన్ ఫీచర్

‘ఎమర్జెన్సీ’ని తలదనే్న రోజులివి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే మాయని మచ్చ ఇందిరాగాంధీ 1975 జూన్ 25న ప్రకటించిన అంతర్గత అత్యవసర పరిస్థితి. ప్రజల ప్రాథ మిక హక్కులను హరిస్తూ, తన అధికారాన్ని ప్రశ్నించే వారిని జైళ్లకు పంపి, మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా నిరంకుశ వ్యవస్థను ఆమె ఏర్పాటు చేశారు. అటువంటి పరిస్థితులకు శాశ్వత ప్రాతిపదిక కల్పించడానికి ఆమె 42వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చారు. పత్రికలపై సెన్సార్ షిప్ విధిస్తూ ప్రజాస్వామ్యానికి కీలకమైన పత్రికా స్వాతంత్య్రాన్ని కూడా హరించారు. నిరంకుశ పాలనకు శ్రీకారం చుట్టారు. నాడు దేశంలో ప్రతిపక్షాల నాయకులు చాలావరకు జైళ్లకు పరిమితమయ్యారు. కొద్దిమంది నాయకులు బయటఉన్నా పోరాట పటిమను ప్రదర్శించలేక పోయారు. జైళ్లలో ఉన్న నాయకులు అనేకమంది ప్రభుత్వ నేతలతో రాయబారాలు జరిపి పెరోల్ పై బయటకు వచ్చి వౌనంగా ఉండిపోయారు. జార్జ్ ఫెర్నాండెజ్ వంటి కొద్దిమంది మినహా ప్రతిపక్ష నేతలు దాదాపు అందరూ వౌన ప్రేక్షకులుగా మారారు.
అయితే, దేశంలో సాధారణ ప్రజలు, విద్యార్థులు, యువత ఎటువంటి ఆర్భాటం, ప్రచారం లేకుండా జరిపిన నిరసన ఉద్యమం జరిపారు. ప్రజలకు వాస్తవాలు చేర వేయడం జరిగింది. మరో వంక విదేశాలలో ముఖ్యంగా అమెరికాలో అత్యవసర పరిస్థితి పేరుతో జరుగుతున్న నిరంకుశ పాలన స్వరూపాన్ని డా. సుబ్రహ్మణ్య స్వామి వంటి వారు తెలియ చెప్పడంతో తీవ్రమైన వత్తిడులు ఎదురై ఎన్నికలు జరుపక తప్పని పరిస్థితులు ఇందిరా గాంధీకి ఎదురయ్యాయి. ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలలో పోటీ చేయడానికి చాలామంది ప్రతిపక్ష నాయకులు భయ పడ్డారు. ఎన్నికలను బహిష్కరిద్దామని సూచించారు. అయితే వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ మొరార్జీ దేశాయి, జయప్రకాశ్ నారాయణ్ వంటి నాయకుల నైతిక స్థైర్యం, సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లిన వేలాదిమంది యువకుల త్యాగాల ఫలితంగా 1977 ఎన్నికలలో ఇందిరాగాంధీ ఓటమి చవిచూడక తప్పలేదు.
మొరార్జీ దేశాయి నాయకత్వంలో కేంద్రంలో ఏర్పడిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం భవిష్యత్‌లో తేలికగా అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం లేకుండా 44వ రాజ్యాంగ సవరణను తీసుకు వచ్చింది. దాంతో ఇప్పుడు ఎవరైనా ఆ విధంగా ఎమర్జెన్సీని విధించి, ప్రాథమిక హక్కులను హరించడం అంత సులభంగా సాధ్యం కాదు. అయితే, నేడు నేరుగా ఎమర్జెన్సీ విధించక పోయినా, పరోక్షంగా అటువంటి పరిస్థితుల్లోకి దేశాన్ని నెట్టివేసి ప్రమాదం లేకపోలేదు. చట్టపరంగా అత్యవసర పరిస్థితి లేకపోయినా పరిస్థితులు అంతకన్నా అధ్వానంగా ఉండడంతో- అలనాడు ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లి, పోరాటం సాగించిన వారందరికీ తీవ్ర ఆందోళన కలుగక తప్పదు. దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ గుత్త్ధా పత్యానికి నేడు తెరపడింది. జనతా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడికి కాబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ప్రజాస్వామ్యంలో నూతన సంప్రదాయాలకు తెరలేపింది. దేశంలో అనేక నూతన రాజకీయ పక్షాలు ఆవి ర్భవించాయి. ప్రజల భిన్నాభిప్రాయాలను ఆదరించ డం నేడు అందరికీ తప్పనిసరిగా మారింది.
నాడు లోక్ సంఘర్షణ సమితి అధ్యక్షుడిగా 78 ఏళ్ళ వయస్సులో జైలులో ఉన్న మొరార్జీ దేశాయి వద్దకు మధ్యవర్తులను పంపి పెరోల్ పై విడుదల చేస్తామని, అత్యవసర పరిస్థితులు కారణంగా ప్రజలలో క్రమశిక్షణ పెరిగినది వంటి కొన్ని మంచి మాటలు చెబితే విడుదల చేస్తామని ఇందిరాగాంధీ రాయబారం పంపారు. కానీ బయటకు వస్తే తిరిగి ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తానని, ప్రభుత్వానికి లొంగిపోయే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మరో వంక స్వామి చిన్మయానంద, జిడ్డు కృష్ణమూర్తి వంటి వారు అత్యవసర పరిస్థితి విధించి పెద్ద తప్పు చేశావని, వెంటనే ఉపసంహరించుకోమని ప్రధాని ఇందిరకు హితవు చెప్పారు. ఆమెకంచికి వెళ్లి 90 సంవత్సరాల వయస్సులో ఉన్న నడిచే దేవుడిగా పేరొందిన స్వామి చంద్రశేఖర సరస్వతి కాళ్లపై పడి ఆశీర్వాదం కోరితే, ఆమె ముఖం చూడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఆ విధంగా అత్యవసర పరిస్థితి పట్ల తన విముఖతను చాటారు. 1977 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్య తలు చేపట్టిన జిమీ కార్టార్ తన ఎన్నికల ప్రచారంలోనే భారత్‌లో పౌరహక్కుల అణచివేతను ప్రస్తావించారు.
ప్రాథమిక హక్కుల అంశంపై రాజీలేని ధోరణి ప్రదర్శించడం ద్వారా జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పదవిని పొందలేక పోయారు. దాంతో సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా రాజీనామా చేశారు గాని ఉన్నత పదవి కోసం ప్రాకులాడలేదు. ప్రజల హక్కులు కాపాడటం కోసం, ప్రజాస్వామ్య విలువలను రక్షించడం కోసం అనేకమంది పలు త్యాగాలకు సిద్ధపడ్డారు. అటువంటి నైతిక స్థైర్యం గల నాయకులు నేడు దేశంలో ప్రస్తుతం కనబడటం లేదు. ఆధ్యాత్మికవేత్తలు సైతం ఆస్తుల పట్ల, వ్యాపారాల పట్ల చూపుతున్న ఆసక్తి ప్రజలలో చైతన్యం కలిగించడం పట్ల, స్వేచ్ఛ స్వాతంత్య్రాల పట్ల చూపలేక పోతున్నారు. ఒక విధంగా రాజకీయ వ్యవస్థే పూర్తిగా మారిపోయింది. ఎమర్జెన్సీ తరువాత ప్రతి రాష్ట్రంలో ఒకటి, రెండు ప్రాంతీయ పార్టీలు బలమైన పునాది ఏర్పర్చుకో గలిగాయి. అనేక రాష్ట్రాలలో సుదీర్ఘకాలం అధికారంలో ఉంటూ వస్తున్నాయి. ఈ పా ర్టీలన్నింటికీ ఒకరే సుదీర్ఘకాలం నాయకత్వం వహి స్తున్నారు. వారి తరువాత వారి కుటుంబ సభ్యులే నాయకత్వంలోకి వస్తున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం మచ్చుకైనా లేకపోవడం ఎమర్జెన్సీ కన్నా భయానకమైన ఒరవడికి, రాజకీయ సాంప్రదాయాలకు దారితీస్తుంది. అన్ని రాజకీయ నిర్ణయాలు ఒకరిద్దరు నాయకుల అభీష్టం మేరకు జరుగుతున్నాయి. ఒకొక్క రాజకీయ పక్షం ఒకొక్క కులానికి ప్రాతినిధ్యం వహించే పక్షంగా గుర్తింపు పొందుతున్నాయి. విశాల జాతీయ ప్రయోజనాల కన్నా సంకుచిత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దేశ రక్షణ విషయంలో కూడా రాజీ ధోరణులు అవలంబిస్తున్నారు.
కాంగ్రెస్‌లో అప్పుడు ఇందిరా గాంధీ ఆధిపత్యం కొనసాగినా ఆమె ధోరణులకు భిన్నమైన అభిప్రాయాలు గలవారికి కూడా ఆ పార్టీలో స్థానం ఉండేది. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలలో సహితం ప్రజా ప్రయోజనం గల అంశాలపై తగు రీతిలో చర్చలు జరిగేవి. ఒకరిద్దరు వ్యక్తులు నిర్ణయాలు తీసుకొనే ప్రజాస్వామ్య వ్యతిరేక సంప్రదాయం లేదు. నేడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేంద్రంతో పాటు సుమారు 20 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపిలో కుటుంబ రాజకీయాలు లేకపోయినా ఒకరిద్దరి నిర్ణయాలను అందరిపై రుద్దే ప్రయత్నం జరుగుతున్నది. పార్టీ వేదికలపై సమగ్ర చర్చలకు అవకాశమే ఇవ్వడం లేదు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సహితం తమ నియోజకవర్గానికో, ప్రాంతానికో చెందిన సమస్యలను ప్రస్తావించే అవకాశం కూడా పార్టీ ఎంపీలకు ఇవ్వడం లేదు. మంత్రులందరూ కీలక అంశాలపై చర్చలు జరుపలేక పోతున్నారు. హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ కు వెళ్లి వేర్పా టువాదులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన వారం, పది రోజులకే రాష్ట్ర ప్రభుత్వం నుండి భాజపా వైదొలగడం ద్వారా కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి రాజకీయ ప్రక్రియకు తాము సిద్ధంగా లేమనే స్పష్టమైన సంకేతం ఇచ్చారు. సైనికులు, కొద్దిమంది ఉద్యోగ విరమణ చేసిన అధికారులకే ఆ సమస్యను వది లివేసే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవంక కీలకమైన బిల్లుల గురించి కూడా చట్టసభ లలో చర్చలు జరగడమే లేదు. గతంలో పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు సంవత్సరంలో 150 రోజుల వరకు జరిగేవి. ఇప్పుడు అందులో సగం రోజులు కూడా జరగ డం లేదు. ఆ కొద్ది రోజులలో కూడా తరచూ వాయిదాలతో గడిపి వేస్తున్నారు. ప్రజా సమస్యలపై లోతైన చర్చల పట్ల నేతలు ఆసక్తి కనబరచడం లేదు. ప్రతిపక్షాలు ప్రతి పాదించిన అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో చర్చకు రాకుండా- ప్రభుత్వ పక్షమే కొందరు మిత్రులతో అల్లర్లు సృష్టించి మొత్తం బడ్జెట్ సమావేశాలను వృథా చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యపాలు చేసిన్నట్లయింది.
ప్రజల హక్కులను కాపాడేందుకు ఎన్నో విప్లవాత్మక చట్టాలు నేడు మన ముందున్నాయి. సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం, విద్య హక్కు చట్టం, భూసేకరణ చట్టం .. వంటివి అందుకు ప్రబల నిదర్శనంగా ఉన్నాయి. వీటి అమలు పట్ల ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదు. వాటిని నిర్వీర్య పరచే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. సమాచార హక్కు చట్టాన్ని సహితం నిర్వీర్య పరచే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం కనీసం ఆ చట్టంలో తీసుకు రాదలచిన మార్పుల గురించి తగు చర్చకు ఆస్కారం కలిగించడం లేదు.
ఎమర్జెన్సీలో వలే నేడు యువత, విద్యార్థులు హక్కులు, ప్రజాస్వామ్యం కోసం ఉద్యమాలు జరిపే పరిస్థితులు నెలకొనడం లేదు. సంకుచిత అంశాలపై దృష్టి సారి స్తున్నారు. ఎమర్జెన్సీ విధించగానే ఇందిరాగాంధీ మొదటగా ప్రెస్ సెన్సార్ షిప్ విధించారు. పత్రికలపై ఆంక్షలు పెట్టారు. నేడు అటువంటి అవసరం లేకుండానే మీడియా సంస్థలే వ్యాపార సంస్థలుగా మారి అధికార పక్షాలకు దాసోహ మవుతున్నాయి. వార్తలను నిర్భయంగా, వాస్తవంగా ఇవ్వలేని దుర్భర పరిస్థితులలో చిక్కుకు పోతున్నాయి. చెల్లింపు వార్తల జాడ్యం ఆవహించి, పేరున్న పత్రికలూ, న్యూస్ చానెల్స్ ఎవ్వరు డబ్బిస్తే వారి వార్తలను నిస్సిగ్గుగా ప్రముఖంగా ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి ముందుకు వస్తున్నాయి. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుండి ప్రజలను చైతన్య పరచడం కోసం పత్రికలు పనిచేస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు లాభదాయకమైన పరిశ్రమగా మారుతున్నాయి. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు సీనియర్ జర్నలిస్ట్‌లకు నెలవారీ పారితోషికాలు అంద జేస్తూ తమకు అనుకూలమైన వార్తలు మాత్రమే బయటకు వచ్చేటట్లు చేసుకోగలుగుతున్నారు. పలు చోట్ల అధికార పక్షాలు మీడియా సంస్థలను నియంత్రిస్తున్నాయి. తాము చెప్పిన్నట్లు నడచుకోలేకపోతే అవి పనిచేయకుండా చేస్తామని బహిరంగంగా బెదిరిస్తున్నాయి. అత్యవసర పరిస్థితి నాటికన్నా నేడు మీడియా పరిస్థితి చాలా దు ర్భరంగా ఉంది. ఆ నాడు కొన్ని మీడియా సంస్థలు అత్యవసర పరిస్థితి చాలా ధైర్యంగా ఎదిరించి, నిల బడ్డాయి. నేడు అటువంటి సంస్థలే కనబడటం లేదు.
ప్రజాస్వామ్యం వికసించడానికి సమష్టి నాయకత్వం అవసరం. కానీ నేడు అటువంటి పరిస్థితి ప్రభుత్వాలలో గాని, రాజకీయ పార్టీలలో గాని కనిపించడం లేదు. కార్పొరేట్ సంస్థలు రాజకీయ విధానాలను నిర్దేశిస్తున్నాయ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ప్రధానిగా లేదా ముఖ్యమంత్రిగా ఉన్నా కార్పొరేట్ సంస్థలు, బడా కాంట్రాక్టర్లు, దళారీలను కాదని పరిపాలన చేయలేని దుస్థితి నేడు నెలకొంది. అందుకనే ప్రభుత్వాలు మారు తున్నా ఆర్ధిక నేరస్థులు మాత్రం తమ దోపిడీని కొనసాగించుకొంటున్నారు. ఇటువంటి ధోరణులు నిరంకుశ పోకడలనే సూ చిస్తున్నాయి. మన ప్రజాస్వామ్య వ్యవస్థ 1975-77 నాటికన్నా నేడు మరింత ప్రమాద ఘడియలలో ఉన్నదని చెప్పవచ్చు. ప్రజాస్వామ్య స్ఫూర్తి నేడు ప్రజా జీవన రంగాలలో కనిపించడం లేదు. ఈ పరిస్థితులు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన వారందరికీ సహజంగానే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

-- చలసాని నరేంద్ర 98495 69050