మెయిన్ ఫీచర్

కార్పొరేట్ కొలువు వదిలి సామాజిక సేవకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ఆలోచన జీవితానే్న మలుపు తిప్పుతుందన్నది నానుడి. ఆ నానుడిని నిజం చేసింది చిత్తూరుకు చెందిన మంజూషా. తనకు ఎదురైన కష్టాన్ని మరో పేద, మధ్య తరగతి వారికి ఎదురుకాకకూడదని వారి సమస్యను పరిష్కరించడానికి తన భర్తతో కలసి ఒక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌కు కేంద్రప్రభుత్వం గుర్తింపు కూడా లభించింది. ఇక ఆ గృహిణిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇటు లారీ రవాణా అవసరాలు కావాల్సిన ప్రజలు, రవాణా చేసే లారీ యాజమాన్యాలు నుండి కూడా ఆనందం వ్యక్తమవుతోంది. ఎంతోమంది రవాణా సౌకర్యం అవసరమైన వారికి వెసలుబాటు, ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించే స్థితికి ఎదిగిన మంజూషా మరెంతోమందికి స్పూర్తిదాయకం కానుంది. ఇంతకీ మంజూషా సాధించిన విజయం ఏమిటంటే... 3లారీగురు2 యాప్ రూపొందించడమే. ఇంత శ్రమపడిన మంజూషా పుట్టినిల్లు చిత్తూరు అయితే, మెట్టినిల్లు నగరి. ఎంఎస్సీ కంప్యూటర్ చదివిన మంజూషా విప్రోలో ఉద్యోగాన్ని వదిలి లారీగురు యాప్‌పై దృష్టిసారించింది. మొన్నటి వరకు ఒకరి చెంత ఉద్యోగం చేసే పరిస్థితి నుండి నేడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చే స్థితికి చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల కాలంలో చెబుతున్నట్లుగా విద్యావంతులు, ప్రతిభావంతులు ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టిసారించకుండా, ఉద్యోగాలు ఇచ్చే స్థితికి చేరాలని ఇచ్చిన పిలుపు కూడా మంజూషాలో ఒక స్పూర్తిని నింపిందనే చెప్పుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగ విరమణ పొందిన రఘుపతి కుమార్తె మంజూషా. తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి ఎంఎస్సీ కంప్యూటర్స్ చదివింది. విప్రోలో ఉద్యోగం సాధించింది. ఈ క్రమంలో ఆమెకు నగరికి చెందిన పురుషోత్తంతో వివాహం జరిగింది. పురుషోత్తం కూడా బెంగళూరులోని విప్రోలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తన తండ్రి రఘుపతి ఆశయం మేరకు తమిళనాడులోని తిరునళ్వేరి అమ్మవారికి గ్రానైట్ విరాళం ఇచ్చేందుకు సిద్దమయ్యారు. అయితే గ్రానైట్ తరలించడానికి లారీలు బాడుగ అధికంగా అడుగుతుండడంతో నాలుగైదు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ప్రయోజనం కలగలేదు. చివరకు అనేక వ్యయప్రయాసలకు గురై ఆలయానికి గ్రానైట్ తరలించారు. ఈ క్రమంలోనే ప్రజలకు అందుబాటులో ఉన్న ఓలా, ఊబర్ సంస్థలను స్పూర్తిగా తీసుకుంది. సరుకుల రవాణా లారీలను ఒక తాటిపైకి ఎందుకు తీసుకురాకూడదని దీర్ఘాలోచన చేసింది. తన ఆలోచనను భర్తతో కలసి అమల్లో పెట్టేందుకు కంకణబద్దురాలయ్యింది. ఈ క్రమంలో ముందుగా భార్య, భర్తలిద్దరూ విప్రోలో ఉద్యోగాలకు రాజీనామా చేసి నగరికి వచ్చారు.

ఎండను, వానను లెక్కచేయకుండా టోల్‌గేట్ల వద్ద రోజుల తరబడి నిలబడి లారీ యజమానులతో చర్చించారు. యాప్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయిస్తామని హామీ ఇచ్చారు. రెండు సంవత్సరాలు కష్టపడ్డారు. 2014నాటికి పూర్తిస్థాయిలో లారీ గురుయాప్‌ను రూపొందించి అందుబాటులోనికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఈ కార్యకలాపాలను సాగించడం కోసం తిరుపతి మహిళాప్రాంగణంలో, ఐటీ సెంటర్లలో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాలు ఈ యాప్‌ను ప్రాచుర్యంలోనికి తీసుకురావడానికి విశేషంగా కృషి చేశారు. 2015లో తిరుమల బైపాస్‌రోడ్డులోని విఘ్నేష్ టవర్స్‌లో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. లారీ ఓనర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, రెన్యువల్ చేసుకోవాలన్నా నెలకు 531రూపాయలు, ఏడాదికి 2వేల రూపాయలుగా ఫీజులు నిర్ణయించారు. మంజూషా దంపతులు రూపొందించిన లారీగురు యాప్‌లో ఇప్పటివరకు 20వేలకు పైగా లారీ యజమానులు నమోదు చేసుకున్నారు. ఒక్కో లారీకి సరాసరిన నెలకు ఆరు నుండి 8 ఆర్డర్లు వస్తున్నాయని మంజూషా తెలిపారు. రోజుకు 70 నుండి 140 వరకు రవాణా నమోదు అవుతున్నాయని తెలిపారు. ఖాతాదారులకు పైసా ఖర్చు లేకుండా వారికి రవాణాకోసం లారీ ఓనర్లకు సమాచారం ఇవ్వడం, వారు నేరుగా ఖాతాదారులతో సంప్రదించేలా ఏర్పాట్లు చేయడంతో లారీగురు యాప్‌కు మంచి గుర్తింపు లభించింది. దీంతో ఖాతాదారులు కూడా 15శాతంపైగా నగదు కూడా ఆదా అవుతోంది. గూగుల్‌లో కూడా లారీగురు యాప్ ముందుంటుందని ఆమె తెలిపారు. ఈ వ్యవస్థను మరింత విస్తరిస్తున్నామని, ఇప్పటికే పెద్దపెద్ద కంపెనీల నుండి బిడ్డింగ్ ఆర్డర్లు వస్తున్నాయన్నారు. వారికి ఒక్కోసారి నూరు నుండి 200లారీలు అవసరం అవుతున్నాయన్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కొత్తపోర్టులు 18 అందుబాటులోనికి రానుండడంతో ఈ లారీగురు యాప్ మరింత ప్రాచుర్యంలోనికి రానుందన్నారు. నోయిడా, గుజరాత్ నుండి కూడా తమను సంప్రదిస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించి ఈ ప్రాజెక్టు నివేదికను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు అందించామన్నారు. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ద్వారా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రతియేడాది ఈ ప్రాజెక్టు ద్వారా ఐటీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత యేడాది ఆంధ్రరాష్ట్రంలో అనిమల్ బర్త్ కంట్రోల్ యాప్/వెబ్ ( ఏబీసీ) రూపొందించి మున్సిపల్ పరిధిలోని వీధి కుక్కల ఇమ్యునైజేషన్ చేసి వదిలే విధానాన్ని అందుబాటులోనికి తీసుకువచ్చే విధానాన్ని తీసుకొచ్చామన్నారు. అలాగే సీఎం కోర్ డాష్‌కు దీన్ని అనుసంధానం చేశామన్నారు. ఈ యాప్‌కు కేంద్రంలో రాష్ట్రానికి బెస్ట్ అవార్డు వచ్చిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజాగా హ్యూమన్ సొసైటీ ఆప్ ఇంటర్నేషనల్ యాప్/వెబ్‌ను కూడా రూపొందించడంపై దృష్టిసారిస్తున్నామన్నారు. ఏది ఏమైనా మనిషి తన జీవితంలో ఎదురయ్యే కష్టం అందులోంచి పుట్టుకొచ్చే నూతన ఆలోచనలు ఎంత గొప్పగా సమాజానికి సేవ చేయడంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఎలా అభివృద్ధి చెందవచ్చో చాటిచెప్పిన మంజూషా దంపతులు ఎంతోమంది ప్రతిభావంతులకు ఆదర్శప్రాయులే.

-ఆర్.రాజేంద్ర