మెయన్ ఫీచర్

కశ్మీర్‌లో అశాంతి.. ఓ అగ్నిపరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీడియాలో కొన్ని వార్తలు మాత్రమే వస్తాయి. మరికొన్ని తెరవెనుక నడిచే ఘటనలకు సంబంధించినవి. జమ్మూ కశ్మీర్‌లో మన సైనిక వ్యూహాలకు సంబంధించిన వార్తలు ఏ రోజుకారోజు పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘ఐఎస్‌ఐ’కి ఎలా చేరుతున్నాయి? ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఆరా తీయగా భయంకరమైన సంగతి తెలిసింది. కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మెహబూబా ముఫ్తీ స్వయంగా మన సైనికుల కదలికలపై సమాచారాన్ని పాక్‌కు ఎప్పటికప్పుడు చేరవేసేవారట! ఇది నమ్మడానికి ఇబ్బందిగా ఉన్నా కఠోర వాస్తవమట! ముఫ్తీకి సంబంధించిన కొన్ని ‘నమ్మలేని నిజాల’ను ఇటీవల ఓ ఆంగ్ల టీవీ చానల్ ఫొటోలతో పాటు బహిర్గతం చేయడం అందరినీ విస్మయపరచింది.
జమ్మూ కశ్మీర్‌లో పీడీపీ-్భజపా సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలాక ముఫ్తీకి సంబంధించి ఎన్నో ఆసక్తికర అంశాలు ఇపుడు వెలుగు చూస్తున్నాయి. ముస్లింవాద పార్టీ అయిన పీడీపీతో బీజేపీ జత కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పడినపుడే చాలామంది ‘ఇది మూన్నాళ్ల ముచ్చటే’ అని అనుమానించారు. కశ్మీర్ లోయలో హిందువులకు, బౌద్ధులకు భద్రత కల్పించడంలో సంకీర్ణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఫ్తీ హయాంలో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయారు. కశ్మీరు లోయపై పాకిస్తాన్ ప్రాబల్యం ఉన్నట్లే లడఖ్‌పై పరోక్షంగా చైనా ఆధిపత్యం ఉంది.
హిందువులు, ముస్లింలు కలిసి జీవించాలని కోరుకోవటం దురాశ కావచ్చు. కాని ఒక ప్రయోగం చేస్తే తప్పేమిటి? అన్నట్టు పీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పడినా ఫలితం దక్కలేదు. దేశ విభజన తర్వాత భారత్‌లో ఇంకా 20 కోట్ల మంది ముస్లింలు మిగిలిపోయారు. కశ్మీరులోని లక్షలాది మంది హిందూ పండిట్లను పూర్తిగా తరిమివేశారు. వారు కాందిశీకులై స్వదేశంలోనే పరాయివారుగా మారి ఢిల్లీకి వలస వచ్చారు. 1947లో పాకిస్తాన్‌లోని లాహోరులో 14 శాతం హిందువులు ఉన్నారు. ఇవాళ వారి సంఖ్య శూన్యం. ఈ వాస్తవాలను కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు అంగీకరించరు. దీనినే ‘ఉష్టప్రక్షి’ ధోరణి అంటారు. అలనాడు మన ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి కశ్మీరును వెండి పళ్ళెంలో పెట్టి పాకిస్తాన్‌కు అప్పగించారు. ఆ చారిత్రక తప్పిదం నుంచి నెహ్రూ కుటుంబం తప్పించుకోజాలదు.
కశ్మీర్‌లో ఆర్థికాభివృద్ధి, శాంతి భద్రతలు నెలకొల్పుతామంటూ పీడీపీ అధినేత్రి మెబబూబాతో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. అనుకున్నట్టే కశ్మీర్‌కు భారీగా నిధులను కేటాయించారు. ఐతే వేర్పాటువాదులు- ‘బంగారంతో మాకు రోడ్లు నిర్మించినా వేర్పాటువాదాన్ని వదిలిపెట్టం’ అని తెగేసి చెప్పారు. కశ్మీరులో హురియత్ నాయకులు వేర్పాటు ఉద్యమాన్ని నడుపుతూ, తమకు స్వతంత్ర దేశం ప్రకటించాలని కోరుతున్నారు. మన వామపక్ష పార్టీల నేతలు, మావోయిస్టులు హురియత్ ప్రతిపాదనకు మద్దతునిచ్చారు. కశ్మీరును పాకిస్తాన్‌లో కలిపివేయాలని మరో వర్గం ఆందోళన చేస్తున్నది. వారికి పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ నాయకత్వం వహించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్‌బుల్ ముజాహుద్దీన్ వంటి అనేక ఉగ్రవాద సంస్థలు కశ్మీర్‌లో సజావుగానే పనిచేస్తున్నాయి. వీరికి చైనా, పాకిస్తాన్‌లు అండగా నిలిచాయి. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం మెహబూబా కేంద్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేసింది. కాశ్మీరీ పండిట్లకు పునరవాస కేంద్రాలు ఏర్పాటుచేయరాదని ముఫ్తీ సర్కారు శాసించింది. కశ్మీర్‌లోయలో అరాచకాలు, దాడులు ఆగకుండా పండిట్లు తిరిగి ఎలా స్వస్థలాలకు చేరుకుంటారు? అలాగే, అమర్‌నాథ్ యాత్రికులకు భద్రత కల్పించడానికి ముఫ్తీ ప్రభుత్వం నిరాకరించింది.
రంజాన్ మాసంలో కాల్పుల విరమణను మోదీ ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని అవకాశంగా తీసుకుని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ప్రఖ్యాత సంపాదకుడు బుఖారీ, ఆర్మీ జవాన్ ఔరంగజేబులను ఉగ్రవాదులు హత్య చేశారు. ఉగ్రవాదులపై కేసులు నమోదు చేయడానికి బదులు భద్రతా దళాలపై ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. రంజాన్ తరువాత కూడా నిరవధికంగా కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్రంపై ముఫ్తీ ఒత్తిడి తెచ్చింది. సైనికులపై రాళ్లు రువ్వే ఆకతాయిలపై కేసులు పెట్టరాదని డిమాండ్ చేసింది. ఈ పరిణామాలకు విసుగెత్తిన భాజపా ముఫ్తీకి మద్దతును ఉపసంహరించుకుంది. అన్నింటినీ మించి ‘స్వయం పరిపాలనా సిద్ధాంతం’ అమలు కావాలంటూ ముఫ్తీ ప్రతిపాదించింది. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి, రాష్టప్రతి పాలన ప్రారంభం కావడంతో కశ్మీర్‌లో భద్రతా దళాలకు ఇప్పుడు స్వేచ్ఛ లభించింది.
ఏం జరగబోతోంది..?
భారత ప్రభుత్వం ఆర్టికల్-370ని రద్దుచేస్తుందా? పాక్ ఆక్రమిత కశ్మీరును ఇండియాలో కలిపివేస్తుందా? బెలూచిస్తాన్, సింధ్‌లను స్వతంత్ర రాజ్యాలుగా గుర్తిస్తుందా? హిందూ నదీజలాలు పాక్‌లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుందా? ఆక్రమిత కాశ్మీర్‌లోని 200 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తుందా? ఈ చర్యలను అమలు చేసినపుడు మోదీ ప్రభుత్వానికి విపక్ష పార్టీల నేతలు సంఘీభావం ప్రకటిస్తారా? ఇలాంటి సమయంలో మోదీకి మద్దతు ఇస్తే 2019 ఎన్నికల్లో భాజపా విజయావకాశాలు మెరుగుపడతాయని కాంగ్రెస్ వంటి విపక్షాలు అనుమానించడం సహజం. అలనాడు ప్రధాని ఇందిరా గాంధీ బంగ్లాదేశ్‌తో యుద్ధం చేసినపుడు- ప్రతిపక్షానికి చెందిన అటల్ బిహారీ వాజపేయి ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించారు. అంతటి సంస్కారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఉందా?
గత పాతికేళ్లలో 48 మంది జర్నలిస్టులను ఉగ్రవాదులు హతమార్చారు. 1,300 సార్లు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రంజాన్ మాసానికి ముందు 41 మంది భారత జనాన్లు ఉగ్రవాదుల కిరాతకానికి బలయ్యారు. మరోవైపు విపక్షాలకు చెందిన కొందరు నేతలే అంతర్గత శత్రువులై ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతున్నారు. ముస్లిం వోటుబ్యాంకు కోసమే వీరంతా మోదీని వ్యతిరేకిస్తూ పాక్‌కు మద్దతు పలుకుతున్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ సైనికులు ఎంతో ప్రమాదకరమైన వారో మన దేశంలోని అంతర్గత విద్రోహులు అంతే ప్రమాదకారులు. చైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. రాబోయే రోజుల్లో దేశానికి మరిన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. అందుకే భరత జాతికి ఇదొక అగ్నిపరీక్ష.
భారత్‌కు సంబంధించి మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ ఆమ్నెస్టీ సంఘాలు ద్వంద్వ వైఖరిని చూపుతున్నాయి. రోహిత్ వేముల వివాదంలో అల్లరి చేసిన ఈ సంఘాలు బెంగాల్‌లో దళిత యువకుడు త్రిలోచన మెహ్రాత్‌ను తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు హతమారిస్తే నోరెత్తడం లేదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, అవసరమైతే అంతర్గత శత్రువులను కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలి. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దులకు ఉగ్రవాదుల నుంచి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని అమెరికా,బ్రిటన్, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలకు తెలుసు. ఇపుడు పాక్‌ను శిక్షించడానికి ఈ దేశాలు ముందుకు రాకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం.
మన దేశానికి అనాదిగా అంతర్గత శత్రువుల వల్లనే పరాజయాలు సిద్ధించాయి. అంభి,జయచంద్, మీర్ జాఫర్‌లు ఇవ్వాళ కూడా ఉన్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి వచ్చి ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అనుకుంటాము. కానీ, హిందువులకు వ్యతిరేకంగా పనిచేసే నేతలంతా మరోరకం ఉగ్రవాదులు. ముస్లిం ఉగ్రవాదానికి మద్దతునిచ్చే వీరు ఇటీవల ‘కాషయా ఉగ్రవాదం’ అంటూ విష ప్రచారం చేస్తున్నారు.
కాగా, గవర్నర్ పాలన పారంభమైన వెంటనే కశ్మీర్‌లో సైనికులు ఎడిటర్ బుఖారీ హత్యకేసులో సూత్రధారులను గుర్తించేందుకు సోదాలు మొదలుపెట్టారు. పాకిస్తాన్ ప్రేరణతో జైషే మహమ్మద్ దళాలు ఔరంగజేబును, బుఖారీని హత్య చేసినట్టు భావిస్తున్నారు. విచిత్రమేమంటే మెహబూబా ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బుఖారీ హంతకులెవరో తెలుసుకోవడానికి స్థానిక పోలీసులకుగాని భద్రతా దళాలకుగాని అనుమతినివ్వలేదు. ఇదీ కశ్మీరు కథ. ఈ కన్నీటి నదిలో దుర్మార్గపు రాజకీయ నాయకులు జలకాలాడుతున్నారు.
కశ్మీరు రాజ్యాంగంలోని 35-ఎ అధికరణం ప్రకారం స్థానిక మైనారిటీ హిందువులను రక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఐతే ఈ నిబంధనలను తుంగలో తొక్కి మైనారిటీలైన హిందువుల నిర్మూలన మొదలైంది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర విపక్షాలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదు. యూపీలో ఓ వ్యక్తి ఆవును చంపాడని అతనిమీద స్థానికులు రాళ్లు వేస్తే దానిని ముస్లింలపై అణచివేతగా ఆందోళన మొదలుపెట్టి అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశాన్ని దోషి అని ఈ పార్టీలు నిలబెట్టాయి. ఇప్పుడు చైనా మన దేశంలోని వామపక్షాలను, ముస్లిం సంస్థలను రెచ్చగొట్టి భారత అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉంది. దీనిని కేంద్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఎవరెన్ని మాటలు చెప్పినా కశ్మీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలి. లోయలోని ముస్లింలు సైతం ఒకప్పుడు మైనారిటీలే. ఆ సంగతి వారికి గుర్తిచేయడమే శాశ్వత పరిష్కారం. ఆర్య సమాజం, విహెచ్‌పి వంటి సామాజిక సంస్థలు ఈ పని చేయాలి. లోయలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం అత్యంత అవసరం.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్