మెయన్ ఫీచర్

తాత్త్విక విజ్ఞానం పంచిన మహాయోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధ్యాత్మిక సాధనను వ్యాపారంగా మార్చుతున్న అనేకమందిని నేడు మనచుట్టూ చూస్తున్నాము. అయితే కీర్తి ప్రతిష్టలు, సంపదల పట్ల ఎటువంటి ఆసక్తి కనబరచకుండా, ఆధ్యాత్మిక వికాసం పొందడానికి తాత్విక చింతనతో అతి సాధారణ జీవితం గడిపి, మహోన్నతమైన సాధన చేసిన ఎందరో కర్మజీవులు మనదేశానికి వనె్న తెచ్చారు. వారిలో చాలామంది నేడు చరిత్ర మరుగున పడిపోయారు. యుజి కృష్ణమూర్తిగా పేరొందిన ఉప్పలూరి గోపాలకృష్ణ మూర్తి కృష్టా జిల్లాలో జన్మించి, ప్రపంచ వ్యాప్తంగా తన తాత్విక విజ్ఞానంతో అనేకమందిని ఆకట్టుకున్నారు. ఆయన శతజయంతి సంవ త్సరాన్ని ఈ ఏడాది ఘనంగా జరుపుకొంటున్నారు. తాత్విక చింతనలు అన్నీ జ్ఞానోదయం పొందటం కోసమే. కృష్ణమూర్తి కూడా ఆ దిశలోనే తన జీవితంలో విశేషమైన కృషిచేశారు. మనిషి తనలోని మానవీయ శక్తులని గ్రహిస్తే ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరని, అందుకోసం మరెవ్వరి నుండో జ్ఞానం సంపాదించే ప్రయత్నం చేయడం సమయాన్ని వృథా పరచుకోవడమేనని ఆయన చెప్పేవారు.
నిదుర పోయినప్పుడు మినహా ఆయన కంటి రెప్పలు ఎప్పుడు కదులుతున్నట్లు గాని, ముసుకు పోతున్నట్లు గానే కనిపించెడిది కాదు. మోక్షం కోసం అనే్వషణ జరిపి, అది సాధించిన అసమాన తత్వవేత్తగా గుర్తింపు పొందారు. ఎప్పుడూ సహజ స్థితిలోనే సాధన చేస్తూ ఉండేవారు. మోక్షం అనేది అంటూ అసలుంటే అది పొందాల నుకో వడమే దానికి ప్రధాన అడ్డంకి అంటుండేవారు. అర్ధం చేసుకోవడానికి ఏమీ లేదు. అనుభవంలో నేర్చుకో వలసిందేనని చెప్పేవారు. మొదట్లో ప్రఖ్యాత తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ప్రభావంతో, ఆయనకు సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత ఆయనతో అనేక అంశాలలో విభేదించారు. 1918 జులై 9న మచిలీపట్నంలో జన్మించగా, ఏడు రోజులకే తల్లి మృతి చెందడంతో, సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ప్రముఖ న్యాయవాది అయిన తాతగారి వద్దనే గుడివాడలో పెరిగారు. తాతగారి ప్రభావంతో యవ్వనంలోనే దివ్యజ్ఞాన సమాజం పట్ల ఆకర్షితులయ్యారు. ప్రముఖ నటి గౌతమికి ఆయన సన్నిహిత బంధువు.
21 ఏళ్ళ వయస్సు వరకు పలు ఆధ్యాత్మిక సాధనాలు చేస్తూ జ్ఞానోదయం కోసం ప్రయత్నం చేశారు. అసలు మోక్షం సాధించిన వారు ఎవరైనా ఉన్నారా? అంటూ అనే్వషణ ప్రారంభించారు. హిమాలయాలలో స్వామి శివానందతో ఏడు వేసవి కాలాలలో గడిపి యోగ అభ్యాసం చేసి, ధాన్యం చేస్తూ గడిపారు. మద్రాస్ యూని వర్సిటీ లో మనస్తత్వశాస్త్రం, తత్వశాస్త్రం, మార్మికసిజం లలో చేరి సాధన చేసినా ఏ కోర్స్ కూడా పూర్తి చేయలేదు. పశ్చిమ దేశాల విజ్ఞానం తన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చూపలేక పోతున్నట్లు యుజి కృష్ణమూర్తి గ్రహించారు. 1939లో 21 ఏళ్ళ వయస్సులో ప్రముఖ ఆధ్యాత్మిక సాధకుడు రమణ మహర్షిని కలసి తనకు మోక్ష మార్గం చూపగలరా? అని ప్రశ్నించారు. నేను ఇవ్వగలను, కానీ నీవు తీసుకో గలవా? అంటూ ఆయన బదులిచ్చారు. ఆధ్యాత్మిక మార్గం, సాధనలకు సంబంధించి కృష్ణమూర్తి ఆలోచనలను ఈ సమాధానం పూర్తిగా మార్చివేసింది. మరెప్పుడూ మరెవ్వరినీ ఇటువంటి ప్రశ్నలు ఆయన అడగనే లేదు. 1941లో దివ్యజ్ఞాన సమాజ్‌లో పనిచేస్తూ ప్రసంగాలు చెయాయడం కోసం నార్వే, బెల్జియం, జర్మనీ, అమెరికాలలో పర్యటనలు చేపట్టారు. అప్పటి నుండి తుది వరకు అంతర్జాతీయ పర్యటనలు జరుపుతూ తన ఆధ్యాత్మిక సాధనను కొనసాగిస్తూ ఉండేవారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత 1943లో కుసుమ కుమారిని వివాహం చేసుకున్నారు. 1947 నుండి 1953 వరకు క్రమం తప్పకుండా జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాలను మద్రాస్‌లో వింటూ ఉండేవారు. 1953లో నేరుగా ఆయనతో సమాలోచనలు జరిపారు. తన ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు లభించడం లేదని ఆయనను కలవడం మానివేశారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రసంగాలతో పర్యటనలు చేస్తున్న క్రమంలో కొన్ని అతీంద్రియ శక్తులు తనలో కనిపిస్తూ ఉండడం పట్ల కృష్ణమూర్తి ఆశ్చర్యం చెందేవారు. 1955లో పెద్ద కుమారుడికి చికిత్సకోసం అమెరికాకు కుటుంబ సభ్యులతో వెళ్లి ఐదేళ్లపాటు గడిపారు. తర్వాత వైవాహిక బంధం తెగిపోవడంతో ఒంటరిగానే గడిపారు. లండన్‌లో రామకృష్ణ మిషన్ కోసం మూడు నెలలపాటు పనిచేశారు. అప్పుడు తానో కొత్త మనిషిని అయిన్నట్లు పేర్కొంటూ ఒక లేఖను అక్కడి స్వామికి వారి ఇస్తూ అక్కడి నుండి వెళ్లి పోయారు.
30-40 సంవత్సరాలపాటు అనేకమంది ప్రముఖుల ప్రసంగాలు వింటున్న ఆయన తనలోనే ఘర్షణకు గురయ్యారు. బుద్ధ? లేదా జీసస్? ఆ స్థితిలోనే తాను ఉన్నట్లు భావించారు. అయితే నేను ఆ స్థితిలో ఉన్నట్లు యెట్లా తెలుసుకోవాలి? అనే ప్రశ్న ఆయనను వెంటాడటం ప్రారంభమైనది. సమాధానం దొరకడం లేదు. అయితే అకస్మాత్తుగా ఆ ప్రశ్నకు సమాధానం లేదని తెలుసు కున్నారు. అదొక్క అనూహ్యమైన భౌతిక, మానసిక ప్రతిస్పందన అని భారించారు. అంతర్గతంగా అక స్మాత్తుగా తన శరీరంలోని ప్రతి నాడిలో, గ్రంధిలో ఒక ప్రేలుడు సంభవించినట్లు భావించారు. మరో వారంలో గా పేర్కొన్న వికారంతో కూడిన భౌతికమైన పరిణామాలను చూడసాగారు. చివరకు మరణానికి అంచుకు చేరుకున్నట్లు అనిపించింది.
ఆయన మాటలలోనే.. నేను దీనిని విపత్తు అంటాను. ఎందుకంటె అదొక్కటే అందరు అద్భుతంగా, ఆనందకరంగా, మోక్షదాయకంగా, ప్రేమమయంగా, పారవశంతో భావించే అనుభవం వంటిది. అదొక్క భౌతికమైన చిత్రహింస. అందుకనే విపత్తు అంటాను. అది నాకు విపత్తు కాదు. ఏదో అద్భుతం జరుగబోతుందని భావించే వారికి విపత్తు.
ఎనిమిదవ రోజున : ఇక ఎనిమిదవ రోజున, నేను సోఫాలో కూర్చొని ఉండగా, అకస్మాత్తుగా అద్భుతమైన శక్తీ కలిగిన్నట్లయింది. మొత్తం శరీరాన్ని కదిలించిన విపరీతమైన శక్తీ. శరీరంతో పాటు సోఫాను, మొత్తం విశ్వా న్ని వణికించిన్నట్లు, కంపించినట్లు అయింది. అటువంటి పరిస్థితిని నీవు సృష్టించలేవు. అది అకస్మాత్తుగా కలిగినది కాదు. అది బయట నుండి వస్తుందా? లోపలి నుండి వస్తుందా? కింద నుండి వస్తుందా? పై నుండి వస్తుందా? అది నాకు తెలియదు. ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోలేక పోయాను. అది అంతా వ్యాపించి ఉంది. గంటల కొద్దీ కొనసాగింది. నేను భరించలేక పోయాను. కానీ నేను నిలిపి వేయలేక పోయాను. మొత్తం నిస్సహాయంగా ఉండిపోయాను. అది అట్లా కొనసాగుతూ ఉండిపోయింది అంటూ తనలో కలిగిన అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని వివరించారు.
తన విపత్తు అనుభవాల మూలాన్ని కృష్ణమూర్తి వివరించలేక పోయారు. తాను మోక్షం కోసం అనే్వషణలో మునిగిపోయిన దానికంతట అదే జరిగి పోతున్నదని మాత్రమే పలు ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. అది దానితో తన దైనందిన జీవితంతో సంబంధం లేదని మాత్రం స్పష్టం చేశారు. అనేకసార్లు యాదృశ్చికంగా మాత్రమే విపత్తు సంభవించిన్నదని, ఆ అనుభవాన్ని మరెవ్వరికీ కలిగించలేక పోయానని కూడా పేర్కొన్నారు.
తన జీవన గమ్యాన్ని విపత్తుకు ముందు కాలం, ఆ తర్వాతి కాలంగా విభజించవచ్చని కృష్ణమూర్తి చెప్పారు. విపత్తు తర్వాత శాశ్వతంగా తాను సహజ స్థితిలో గడప గలుగుతున్నట్లు తెలిపారు. అది పూర్తిగా యాదృశ్చికంగా, భౌతికంగా, సంవేదనాత్మకంగా, లేకుండాపోయినా సంబంధం లేకుండా ఉండటం వంటి స్థితిలో ఉన్నట్లు వివరించారు. తాను సహజ స్థితి ఉన్నట్లు కనుగొన్న తర్వాత అప్పటివరకు తాను గ్రహించిన విజ్ఞానం, జ్ఞాపకాలు అన్నింటిని కోల్పోయిన్నట్లు, పలక పై మొత్తాన్ని తుడిచివేసి మొత్తం తిరిగి నేర్చుకున్నట్లు అనిపించిందని పేర్కొన్నారు. విపత్తు అనుభవం తర్వాత కృష్ణమూర్తి తరచూ ప్రపంచం అంతా పర్యటించినా సందర్శకులతో అధికారిక చర్చలు జరపడానికి నిరాకరిస్తూ ఉండేవారు. విపత్తు తర్వాత కేవలం 1972లో భారత్‌లో బహిరంగంగా ఒక ప్రసంగం చేశారు. సాంప్రదాయానికి విరుద్ధంగా, సందే శాలు ఇచ్చే ధోరణి లేకుండా, తరచూ రాజీలేని ధోరణిలో. నేరుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండడంతో ఒక విధమైన అపఖ్యాతిని, భిన్నాభి ప్రాయాలను కలిగిస్తూ ఉండేవారు. కొందరు ఆయనను జ్ఞానిగా భావిస్తూ ఉంటె, మరి కొందరు కుహనా మేధావి గా భావించేవారు. ఆయన గురించి పుస్తకాలు, వ్యాసాలు వస్తూ ఉండేసరికి ఆయన ప్రవచిస్తున్న నూతన తాత్విక చింతన పట్ల మరింత గందరగోళం ఏర్పడుతూ ఉండెడిది. కృష్ణమూర్తి ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు సహితం అనూహ్యంగా ఉంటూ ఉండెడివి. తనతో పాటు ఒక సంచార వంటింటిని ఒక చిన్న సూట్‌కేసులో ఎక్కడికి వెళ్లినా తీసుకు వెడుతూ ఉండేవారు. ఏ ఆహరం తయారు చేయడానికైనా కొద్ది నిముషాలసేపు కన్నా ఎక్కువ సమయం తీసుకోరాదని చెబుతూ ఉండేవారు. తనతో ఉప్పు, వెన్నలను తీసుకు వెడుతూ ఉండేవారు. తన జీవితంలో ఆయన ఎప్పుడూ వైద్యుడి వద్దకు వెళ్ళలేదు. మందులు తీసికొననే లేదు. శరీరం తన గురించి జాగ్రత్త తానే తీసుకొంటుందిలే అంటూ ఉండేవారు. వృద్ధాప్యంలో సహితం బాగా కనిపించేవారు. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని. విటమిన్‌లు తీసుకొని. వ్యాయామం చేయను అంటూ తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడిస్తూ ఉండేవారు.
2007 మార్చ్ 22న ఇటలీ లోని వాళ్ళెక్రోషియాలో తనకు తానే జారిపడి, గాయానికి గురై, ఏడు వారాల పాటు మంచానికే పరిమితమై మృతి చెందారు. బాలీవుడ్ ప్రముఖుడు మహేష్‌భట్‌తో సహా చాలామంది భక్తులుగా ఉన్నప్పటికీ, ముగ్గురు మంచి మిత్రులు ఆ సమయంలో ఆయనతో ఉన్నారు. ఫిబ్రవరి, 2007లో తన చివరి ప్రసంగం ‘నా హంస పాట’ను ఆయన చెబితే శిష్యులు వ్రాసారు. తన మరణం తర్వాత ఎటువంటి అంత్యక్రియలు తనకు జరపరాదని కోరారు. అయితే తన మృతదేహాన్ని ఏమి చేయాలో కూడా సూచించలేదు. ఆ మరుసటి రోజున ఆయన దేహాన్ని భట్ దహనం చేసారు. తన మరణం తర్వాత తననెవ్వరు గుర్తుంచుకోవాలని ఆయన భావించలేదు. నేను బోధించడానికి ఏమీ లేదు. భద్ర పరుచుకోవడానికి ఏమీ లేదు. బోధించడం అంటే ఏదో ఒక మార్పు తీసుకు రావడానికి ఉద్దేశించినది. క్షమించండి. ఇక్కడ బోధన అంటూ ఏమీ లేదు. కేవలం కలవని వ్యాఖ్యలు మాత్రమే. వాటిని మీరు వ్యాఖ్యానించు కోవడమే. మరేమీ లేదు. అందుకోసమే నేను చెప్పిన వాటికి ఇప్పుడు గాని, మరెప్పుడు గాని ఎటువంటి కాపీ రైట్ అంటూ లేదు. నావన్ని ఏమీ అనుకోవడం లేదు.
ప్రజలు తనవంటి వారి వద్దకు (గురువుల వద్దకు) వచ్చెడిది ఆధ్యాత్మికత, జ్ఞానంల పేర్లతో తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే నిజమైన సమస్యలు, సమస్యలకు పరిష్కారం కోసమని ఆయన చెప్పేవారు. లక్ష్యమన్నది చేరలేనిది కావడంతో వీరెవ్వరు ఎటువంటి పరిష్కారం చూపలేరని స్పష్టం చేశారు. మనుషులు అనేవారు కేవలం ఒక జ్ఞాపకమని, తమ విజ్ఞానం ఆధారంగా తమ చుట్టూ ఉన్న విషయాలను అర్థం చేసుకొంటున్నారని, ఊహాజనిత లక్ష్యాలను చేరుకొనే ప్రయత్నంతో సమయాన్ని వృథా చేసుకోకుండా ఉంటే ఏమైనా చేయగలరని, ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలరని ఆయన సూచించేవారు.

-- చలసాని నరేంద్ర