మెయన్ ఫీచర్

జూదానికి కొత్త భాష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొగ తాగరాదు, తాగితే ప్రాణానికే హాని కలగవచ్చు...అంటూనే పొగ తాగడాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు, మద్యం తాగవద్దు అంటూనే వీధివీధికీ డజన్ల కొద్దీ బెల్టుషాప్‌లను, మద్యం దుకాణాలను అనుమతిస్తున్న ప్రభుత్వాలకు మరో ఆదాయ వనరు లడ్డూముక్కలాగ దొరకబోతోంది. ఇక అన్ని గల్లీల్లో పాన్ షాప్‌ల మాదిరి బెట్టింగ్ షాప్‌లు వస్తే ఎవరూ ఆశ్చర్యపడనక్కర్లేదు. బెట్టింగ్ కాసేందుకు, ఆన్‌లైన్‌లో జూదం ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం అక్కర్లేదు. ఇంతకాలం దేనిని చూసి భయపడ్డారో, అదే చట్టం ఇపుడు నిరభ్యంతరంగా బెట్టింగ్‌కూ, ఆన్‌లైన్ జూదానికి రాచబాట వేయబోతోంది. ఈ కొత్త ఆలోచనలు ఇంకా అమలులోకి రాకపోయినా, జాతీయ న్యాయ సంఘం చేసిన సిఫార్సులు అయితే మంటలు రేపుతున్నాయి. యువతను మాత్రమే కాదు, అన్ని వయస్కుల వారినీ చెడగొట్టే ఈ జూదం అధీకృతం చేయడం సమాజం కొంప ముంచుతుందని అంతా ఆందోళన చెందుతున్నారు. జూదానికి అనుమతి ఇవ్వండి, కాకపోతే విచ్చలవిడితనం లేకుండా ఆంక్షలు విధించండి అంటూ ఆ సలహాను కూడా ఇచ్చేసింది. న్యాయ సంఘం తీరు చూస్తుంటే రెండు చెంపలూ వాయించి ఆయింట్‌మెంట్ పూయండి అని చెప్పినట్టుంది. న్యాయ కమిషన్ చెప్పినట్టు ప్రభుత్వం ఆ సిఫార్సులను చట్ట రూపంలోకి తెస్తే చట్ట ఉల్లంఘన లేకుండానే బెట్టింగ్‌లూ, జూదం అంతా సాధారణ విషయం అయిపోతాయి. 1867లో రూపొందించిన పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్టు అటకెక్కడం ఖాయం.
పేకాట ఆడితే పోలీసులు వస్తారనే భయం ఇక అక్కర్లేదు. క్రికెట్ బెట్టింగ్‌లకు పూనుకుని ఊచలు లెక్కబెడుతున్న వారిని చూసి అంతకంటే భయపడనక్కర్లేదు. బెట్టింగ్ కాస్తూనో, పేకాడుతూనో, ఆన్‌లైన్‌లో జూదం ఆడుతుంటేనో కేసుల భయం ఇక ఉండనే ఉండదు. దేశానికి ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ వ్యాపారాన్ని క్రమబద్ధం చేసేస్తే పోతుందని జాతీయ న్యాయ సంఘం తేల్చి చెప్పేసింది. అమలులో ఉన్న అన్ని చట్టాలనూ తోసిరాజని, జూదానికి కొత్త భాష్యాన్ని చెబుతోంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సైతం పక్కన పెట్టడం గమనార్హం. క్రికెట్‌తో సహా అన్ని క్రీడలపై పెట్టే బెట్టింగ్, జూదాన్ని చట్టబద్ధం చేయాలని న్యాయ సంఘం సిఫార్సు చేసింది. బెట్టింగ్ చట్టబద్ధం చేసిన తర్వాత ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్‌లు, మోసాలు జరగకుండా కఠినమైన చట్టాలు తేవల్సి ఉంటుంది. చట్టబద్ధం చేసిన తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడితే కఠిన శిక్షలు విధించేందుకు వీలుగా ఈ కొత్త చట్టాలు ఉండాలి. క్రీడలపై అనుమతిచ్చే బెట్టింగ్, జూదాలపై సంపాదించే ఆదాయాన్ని ప్రత్యక్ష, పరోక్ష పన్నుల పరిధిలోకి తేవాలని సూచించింది. దీనిని ఎఫ్‌డిఐల ఆకర్షణకు ఒక వనరుగా ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఓ సలహా కూడా ఇచ్చింది. జూదాలను నియంత్రించేందుకు పార్లమెంటు ఒక ముసాయిదా బిల్లు పాస్ చేసి పంపిస్తే రాష్ట్రాలు వాటిని స్వీకరించి అమలు చేయవచ్చని, ఇందుకోసం ఆర్టికల్ 249, 252 కింద ఉన్న అధికారాలను ఉపయోగించుకుని పార్లమెంటు చట్టం చేయవచ్చని కూడా సూచించింది. కొన్ని నియంత్రణలు విధించి బెట్టింగ్‌నూ, జూదానికి సంబంధించి వివిధ కార్యకలాపాలను అనుమతించవచ్చని పేర్కొంది. వీటిని నిషేధించడం వల్ల మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతోందని, అందుచేత వీటిని అనుమతించేయడం ఉత్తమమని న్యాయ సంఘం అంటోంది. జూదం ఆడితే ఆదాయం పెరుగుతుంది, దానిపై పన్ను కూడా విధించవచ్చు, ప్రభుత్వానికి ఫలితంగా పన్ను ఆదాయం పెరుగుతుంది అంటూ సలహా కూడా ఇచ్చింది.
ఇంత వరకూ అమలులో ఉన్న పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్టు 1867 ప్రకారం పెద్దగా కఠిన శిక్షలు లేకపోయినా, మొత్తం ఆటలను రెండు రకాలుగా విభజించి అవకాశాలతో కూడిన ఆట, నైపుణ్యంతో కూడిన ఆటగా విభజించారు. నైపుణ్యంతో కూడిన ఆటల్లో బెట్టింగ్‌ను కొన్ని దేశాలు పాక్షికంగా విభజించాయి. అదే బాటలో భారత్‌లో కూడా పాక్షిక సడలింపు ఉంది. గోవాలో కేసినో ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 200 కోట్లు పై మాటే. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులో రాష్ట్రాల జాబితాలో జూదంపై చట్టం చేసే అధికారాన్ని కల్పించారు. బీహార్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, పంజాబ్, యుపీ రాష్ట్రాలు పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్టు- 1867ను యథాతథంగా అమలుచేశాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏపీ గ్యాంబ్లింగ్ యాక్టు -1974ను రూపొందించుకుంది. బోంబే ప్రివెన్షన్ ఆఫ్ గ్యాంబ్లింగ్ యాక్టు -1867ను మహారాష్ట్ర, 1960 గ్యాంబ్లింగ్ యాక్టును కేరళ, 1930 గ్యాంబ్లింగ్ యాక్టు ని తమిళనాడు అమలుచేస్తున్నాయి. కర్నాటక శాంతిభద్రతల చట్టంలోనే గ్యాంబ్లింగ్‌ను చేర్చింది. గుర్రపు పందాలు అవకాశాల ఆట పరిధిలోకి రాదని, అది నైపుణ్యంతో కూడిన క్రీడ పరిధిలోకి వస్తుందని 1996లో సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పడంతో గ్యాంబ్లింగ్ చట్ట పరిధిలో ఉన్న గుర్రపు పందాలు బహిరంగంగా నిర్వహించుకునే అవకాశం దక్కింది. ఆ తర్వాత కూడా పలు రాష్ట్రాలు తమ చట్టాల్లో సవరణలు చేసుకుంటూ వచ్చాయి. అలాగే లాటరీలను నియంత్రించే అధికారం కేంద్రం తన వద్దనే ఉంచుకుంది. లాటరీల నియంత్రణ చట్టం 1988ని రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలండ్ మినహా మిగిలిన రాష్ట్రాలు తమ పరిధిలో లాటరీలను ప్రోత్సహించేందుకు కూడా ఈ చట్టంలో అవకాశాలున్నాయి. అయితే సిక్కింలో ఈ చట్టం కింద ఆన్‌లైన్‌లో కూడా లాటరీలు నిర్వహించే వీలుకల్పించారు. 1961 ఇన్‌కం టాక్స్ చట్టం, 1994 ఫైనాన్స్ యాక్టు, 2017 సెంట్రల్ గూడ్స్ మరియు సర్వీసు యాక్టు పరిధిలో జూదానికి, బెట్టింగ్‌కు పన్ను భారీగానే ఉంది.
ఈ నేపథ్యంతో ‘‘లీగల్ ఫ్రేమ్‌వర్కు గేంబ్లింగ్ అండ్ స్పోర్ట్సు బెట్టింగ్ ఇన్‌క్లూడింగ్ క్రికెట్ ఇన్ ఇండియా ’’ అనే పేరుతో జస్టీస్ బి ఎస్ చౌహాన్ కమిటీ సమగ్ర నివేదికను తయారుచేసింది. ప్రస్తుత చట్టాల్లో చేయాల్సిన మార్పులను అందులో సూచించారు. బీహార్, ఒడిసా క్రికెట్ సంఘాలకు , బీసీసీఐకి మధ్య సాగుతున్న ఓ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడం సాధ్యమా అధ్యయనం చేయమని ఆదేశించడంతో జాతీయ న్యాయ సంఘం ఈ నివేదికను రూపొందించింది. విద్యార్ధులు, విషయ నిపుణులు, ప్రముఖుల నుండి అభిప్రాయాలను సేకరించిన మీదట బెట్టింగ్‌పై నిషేధం ఎత్తివేసి కొంత నియంత్రించడం మంచిదనే అభిప్రాయానికి వచ్చింది. నల్లధనం విపరీతంగా చెలామణి అవుతున్న ప్రస్తుత తరుణంలో గ్యాంబ్లింగ్‌ను చట్టబద్ధం చేసేసి అంతా ఆన్‌లైన్‌లో ఉంచితే ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని యోచిస్తోంది. నైపుణ్యం ఉన్న క్రీడ అనేపేరుతో గుర్రప్పందాలపై బెట్టింగ్‌ను అనుమ తిస్తున్నా, ఇలాగే నైపుణ్యం ఉన్న క్రీడలు అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ గ్యాంబ్లింగ్ నిషేధ చట్టం పరిధి నుండి తప్పించి చట్టబద్ధత కల్పించవచ్చని న్యాయ సంఘం అభిప్రాయపడుతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో మార్పులు చేసి కేసినోలు, ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలను భారత్‌కు రప్పించవచ్చు అనేది కూడా ఒక ఆలోచన. అయితే అనుమతులు మంజూరు చేసేటపుడు మాత్రం నియంత్రణ పాటిస్తే సరిపోతుందని చెబుతోంది. లైసెన్స్‌లు మంజూరు చేసే అధికారికి కూడా నిర్దిష్ట బాధ్యతలు ఉండాలని, నెలవారీ లావాదేవీలపై లెక్కా పత్రం ఉండాలని ప్రతి లావాదేవీ నగదు రహితంగా జరగాలని కూడా సూచించింది.
ఈ సిఫార్సులకు అనుగుణంగా ఒక వేళ ఆర్టికల్ 252 కింద చట్టం చేస్తే దానిని రాష్ట్రాలు యథాతథంగా అమలుచేయవచ్చు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఆడేవారి వివరాలు కూడా ఆధార్, ఫోన్ నెంబర్‌తో అనుసంథానం చేసి ఈ లావాదేవీలు అన్నీ నగదురహితంగా జరిగేలా చూడాలని కూడా షరతు విధించాలని పేర్కొంది. దీనివల్ల అక్రమ కార్యకలాపాలు, హవాలా వంటి ఆర్ధికనేరాలను అరికట్టవచ్చని తెలిపింది. జూదశాల, ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చేందుకు వీలుగా విదేశీ మారకద్రవ్యం, ఎఫ్‌డిఐ విధానాల్లో సవరణలు చేయాలని సూచించింది. ఈ వ్యాపారంలోకి కేవలం లైసెన్స్ తీసుకున్న ఆపరేటర్లను అనుమతిస్తే బాగుంటుందని, బెట్టింగ్‌పై కూడా కొంతమేరకు పరిమితులు విధించవచ్చని, పన్నులు చెల్లించని వారిని ఇందులో అనుమతించరాదని, వారిని అనర్హులుగా ప్రకటించాలని, బెట్టింగ్ వల్ల కలిగే ప్రమాదాలను ప్రధానంగా ప్రచురించాలని న్యాయ సంఘం సూచించింది.
నెవాడాలోని లాస్‌వేగాస్ కేసినో సంస్కృతికి పెట్టింది పేరు. అదేబాటలో ఉన్న ఫ్రాన్స్, ఐస్‌లాండ్ వంటి దేశాలు కేసినోను అనుమతించినా, ఆన్‌లైన్ బెట్టింగ్‌ను మాత్రం ఆమోదించడం లేదు. అర్జెంటీనా సాకర్ పోటీలపై బెట్టింగ్‌లను నిషేధించింది. యూకే, స్పెయిన్, జర్మనీ, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కేసినో సంస్కృతి పురివిప్పుకుంది. దేశంలో గోవా, దమన్, సిక్కిం రాష్ట్రాల్లో బెట్టింగ్, జూదం అధికారికంగా అనుమతిస్తున్నారు. ఇపుడు ఆ సంస్కృతి దేశవ్యాప్తంగా విస్తరించనుంది.
అసలు బెట్టింగ్ వల్లనే మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందనే ఆరోపణలు ఈనాటివి కావు. 2003 నుండి 2006 వరకూ ఐసిసి సారథిగా ఉన్న హసన్ మణి భారత్ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడం మంచిదని అనలేదా? బెట్టింగ్‌ను అరికడితేనే మ్యాచ్ ఫిక్సింగ్‌ను నిలువరించగలమని చెప్పలేదా? బెట్టింగ్ ఒక ప్రాంతానికి పరిమితం కాలేదని, ఇదో విషసంస్కృతి అని పేర్కొంటూ హేమాహేమీలైన క్రికెటర్లు స్పందించడం, ముద్గల్ కమిటీ సిఫార్సులు, జస్టీస్ లోథా కమిటీ సిఫార్సులు అపుడే మరిచామా? వ్యాపారం చేసుకోండి కానీ నిబంధనలు పెట్టండి అనడం దివాలాకోరుతనం అవుతుంది. ఆదాయం కోసం జూదాన్ని చట్టబద్ధం చేయడమా? అదే ప్రధాన అంశం అయితే ఆదాయాన్ని విపరీతంగా తెచ్చిపెట్టే అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చట్టబద్ధం చేస్తారా? నల్లధనంపై ఎంబీ షా కమిటీ ఇచ్చిన కళ్లు బైర్లు కమ్మే నివేదికను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందా?
బెట్టింగ్‌నూ, జూదాన్ని చట్టబద్ధం చేయాలని న్యాయ సంఘం చేసిన సిఫార్సులైతే దేశ ప్రజలను దిగ్భ్రాంతులను చేసింది. ధర్మరాజు కాలంలో ఇలాంటి నియంత్రణలు ఉంటే మహాభారత గాథ లేకపోయేదని, ధర్మరాజు, నలుడు వంటి పురాణ పాత్రలు జూదం ఎంతటి వ్యసనమో ఎంత అనర్ధదాయకమో చాటిచెబుతునే ఉన్నాయి. జూదం నీతి నిజాయితీలను, సంపదను నాశనం చేస్తుందని మనుస్మృతి చెబుతోంది. ఆనాడు గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లపై వేటు వేయాలని రాజ్యాంగ నిర్ణయ సభలో రచయిత, పాత్రికేయుడు, సామాజిక వేత్త లక్ష్మీనారాయణ సాహు, రాజస్థాన్‌కు గవర్నర్‌గా, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన సర్దార్ హుకమ్ సింగ్, రాజ్యాంగ నిపుణుడు ఆచార్య సక్సేనా గట్టిగా పట్టుబట్టారు. ఈ వాస్తవాన్ని విస్మరించి నేడు న్యాయ సంఘం సిఫార్సులు చేయడాన్ని న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు సైతం తప్పుపడుతున్నారు. బెట్టింగ్ సంస్కృతి హెచ్చుమీరి, సామాజిక ఆర్ధిక స్థితిగతులు తలకిందులై దేశంలో విష సంస్కృతికి నీరుపోసినట్టు అవుతుందనేది వారి ఆందోళన. పేదలను మరింత దుర్భరంలోకి నెట్టే ముప్పు లేకపోలేదు.

-బీవీ ప్రసాద్, ఫోన్: 98499 98090