మెయన్ ఫీచర్

భారత్‌తో స్నేహం నవాజ్ నేరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు గత వారం పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయన తనయ మర్యమ్, అల్లుడు కెప్టెన్ సర్దార్‌లు కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. పనామా పత్రాల కుంభకోణంలో వెలుగుచూసిన షరీఫ్ అవినీతి బాగోతంపై పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. న్యాయ మూర్తి నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్ల ఖైదుతో పాటు 8 మిలి యన్ పౌండ్ల జరిమానా విధించారు. మర్యమ్‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2 మిలియన్ పౌండ్ల జరిమానా, సర్దార్‌కు ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. జైలు శిక్ష గురించి తెలియగానే వెనుకడుగు వేయకుండా తీవ్రమైన అనారోగ్యంతో పలు నెలలుగా చికిత్స పొందుతున్న భార్య కులసూమ్‌ను వదిలి కు మార్తెతో కలసి లండన్ నుండి పాకిస్తాన్‌కు షరీఫ్ చేరుకున్నారు. లండన్‌లోని అవేంఫిల్డ్ హౌస్ ఫ్లాట్స్‌కు సంబంధించి యాజమాన్య విషయమై తగు వివరణ ఇవ్వ డంలో విఫలం కావడంలో ఈ శిక్ష విధించినట్లు చెబుతున్నారు. అయితే, నేరుగా చేసిన అవినీతి ఆరోప ణలలో నిర్దోషిగా బయటపడిన ఆయన అనుమానాస్పద ఆస్తి విషయంలో శిక్షకు గురికావడం గమనార్హం.
1990 నుండి రాజకీయ ప్రత్యర్థులపై అవినీతి ఆరోపణలతో పాకిస్తాన్‌లో కేసులు సమోదు కావడం సర్వ సాధారణమైంది. ప్రస్తుతం జైలు శిక్షను అవినీతిపరుడిగా భావించి షరీఫ్‌కు విధించారా? లేక అధికారంలో ఉన్న సమయంలో భారత్‌తో సంబంధాలను మెరుగు పరచు కోవడం కోసం ప్రయత్నించినందుకు ఇప్పుడు మూల్యం చెల్లించవలసి వస్తుందా? అనే అనుమానాలు కలుగు తున్నాయి. పాకిస్తాన్‌లో న్యాయస్థానాలు సహజంగా సైనికాధికారుల వ్యూహాలకు అనువుగా రాజకీయ పరమైన తీర్పులు ఇస్తున్నాయ. పౌర ప్రభుత్వంపై తమ పెత్తనం కొనసాగించుకోవడం కోసం సైనిక నాయకత్వం భారత్ వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ ఉంటుంది.
నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు చాలాకాలంగా వస్తున్నా 2016లో మాత్రమే పనామా పేపర్లలో బైటపడిన కొన్ని పత్రాల ఆధారంగా నిర్దిష్ట ఆరోపణలకు ఆస్కారం కలిగింది. భారత దేశంలో పలువురు ప్రముఖులపైనా ఈ పేపర్లలో పలు ఆరోపణలు వెలువడినా, అవినీతిని అంతం చేస్తానన్న ప్రతిజ్ఞతో అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం దర్యాప్తులో చెప్పు కోదగిన పురోగతి సాధించలేకపోతోంది. పనామా పత్రా లలో వెల్లడైన అంశాలను ఆధారంగా చేసుకొని నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ ఆగష్టు 29, 2016న పాకిస్తాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంబంధిత ఇతర వేదికలను ఆశ్రయించలేదంటూ సుప్రీం మొదట ఆ దరఖాస్తును తిరస్కరించింది. తన దరఖాస్తును చేపట్టని పక్షంలో ఆందోళనకు దిగుతానని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించడంతో అక్టోబర్, 28, 2016న దానిని కోర్టు విచారణకు స్వీకరించింది.
దేశంలో తీవ్రవాదులను నియంత్రించండి లేదా అంతర్జాతీయ ఆగ్రహాన్ని చవి చూడవలసి వస్తుంది- అం టూ షరీఫ్ ప్రభుత్వం సైనిక నాయకత్వానికి స్పష్టం చేసిన్నట్లు ఆ దేశంలో ప్రముఖ దిన పత్రిక డాన్ లో సంచలనాత్మక వార్త ప్రచురించిన రోజుననే కోర్టు ఈ ఫిర్యాదుపై పరిశీలన చేపట్టడం ప్రాధాన్యత సంత రించుకొంది. అంటే తీవ్రవాదం విషయంలో తమకు ఆదేశాలు జారీచేసే ప్రయత్నం పౌర ప్రభుత్వం చేయడాన్ని పాకిస్థాన్ సైన్యం సహించలేక పోయినట్లు భావించాలి. అటువంటి ప్రభుత్వం ఇంకా మనుగడ సాగించడాన్ని సైన్యం సహించలేక పోయినట్లు తెలుస్తుంది. అందుకు షరీఫ్‌కు తగిన ‘గుణపాఠం’ చెప్పడానికి సిద్ధపడినట్లు, వారికి న్యాయవ్యవస్థ సహకరించినట్లు సంకేతాలు లభిస్తున్నాయి.
గత ఏడాది పాకిస్థాన్ సుప్రీం కోర్టు షరీఫ్‌ను పదవి నుండి తొలగించింది. 2013 ఎన్నికలలో తన నామినేషన్ పత్రంలో తన కొడుకు యాజమాన్యంలో దుబాయి కేంద్రంగా ఉన్న ఒక కంపెనీలో తాను డైరెక్టర్‌గా ఉన్నట్లు, దాని ద్వారా కొంత ఆదాయం పొందుతున్నట్లు తెలపలేదని సాకు చూపింది. వాస్తవానికి ఈ వివరాలను ఆయన సమర్పించారని, తాను ఎటువంటి పరిహారం తీసుకోలేదని కూడా స్పష్టం చేసారని ఆధారాలు లభిస్తున్నాయి.
పాకిస్థాన్ దివంగత నియంత జనరల్ జియా ఉల్ హక్‌తో గల సాన్నిహిత్యం కారణంగా షరీఫ్ కుటుంబం వ్యాపార ప్రయోజనాలు పొందినట్లు గతంలో పలు అనుమానాలు వ్యక్తమైనా, వాటికి ఎటువంటి ఆధారాలు చూపలేకపోయారు. దాంతో పలు కేసుల్లో షరీఫ్ గతంలోనే నిర్దోషిగా బయటపడ్డారు. హక్ ప్రోత్సాహంతోనే ముస్లిం లీగ్‌లో 1976లో చేరి, 1985లో షరీఫ్ పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1990లో ప్రధానమంత్రి అయినప్పుడు పౌర పాలనపై సైనికుల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు. దాంతో సైన్యానికి ఆగ్రహం కలిగినప్పుడల్లా పదవి నుండి వైదొలగవలసి వచ్చింది.
1993లో అధికారం కోల్పోయి తిరిగి 1997లో అధికారంలోకి వచ్చారు. 1999లో జనరల్ పేర్వేజ్ ముషారఫ్ పదవీచ్యుతుడ్ని చేశారు. ముషారఫ్‌ను ఉరితీసే ప్రయత్నం జరిగినా 2000లో సౌదీ అరేబియాకు వెళ్లిపోవడానికి అవకాశం ఇచ్చారు. 2000లో మళ్లీ ప్రధానిగా తిరిగి ఎన్నికయ్యారు. అధికారంలోకి వచ్చినప్పుడల్లా భారత్‌తో ఆర్థిక సంబంధాలను పటిష్టపరచుకోవడానికి షరీఫ్ కృషిచేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మన దేశంలోని పంజాబ్‌లో ఖలిస్థాన్ తీవ్రవాదులకు పాకిస్థాన్‌లోని పంజాబ్ బలమైన స్థావరంగా ఉండేది. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలు మెరుగుపడేందుకు షరీఫ్ చూపిన చొరవను మన ప్రధానులు పి.వి.నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయిలు కొనియాడారు. చారిత్రాత్మకమైన వాజపేయి లాహోరు బస్సుయాత్ర షరీఫ్ చొరవతోనే జరిగింది.
1997 ఎన్నికలలో ముస్లిం లీగ్ మేనిఫెస్టోలో భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవడం తన ప్రధాన లక్ష్యంగా షరీఫ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తన పార్టీలో అత్యధికుల నుంచి వచ్చిన ప్రతికూల అభిప్రాయాలను ఆయన పట్టించుకోలేదు. ఆ ఎన్నికలలో మంచి ఆధిక్యతతో షరీఫ్ గెలుపొందడంతో పాకిస్థాన్ ప్రజలు భారత్‌తో మంచి సంబంధాలు కోరుకొంటున్నట్లు స్పష్టమైంది. దాంతో సైనిక నాయకత్వంతో ఘర్షణకు సిద్ధపడి, పౌర ప్రభుత్వం ఆధిపత్యాన్ని పెంపొందించేలా యత్నించారు. ఆ తర్వాత ముషారఫ్ సైనిక తిరుగుబాటు జరిపి షరీఫ్‌ను పదవి నుండి తొలగించారు.
భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకొనే విషయంలో పాకిస్థాన్ సైన్యం ఆది నుంచీ మొండివైఖరి చూపుతోంది. భారత్‌తో సంబంధాలు మెరుగుపడితే ఉపఖండంలో శాంతి నెలకొని, తమ ప్రాబల్యం తగ్గుతుందని సైనికాధికారులు భయపడుతూ వస్తున్నారు. అటువంటి పరిస్థితులలో పౌర ప్రభుత్వ ఆధిపత్యం పెరిగి, తమను కట్టడి చేయడం ఖాయమని సైన్యం భావించింది. అందుకనే పౌర ప్రభుత్వం తమ ‘ఆదేశాల’ను అమలు చేయడం మినహా భారత్ విషయంలో స్వతంత్రించి వ్యవహ రించకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. స్వతంత్రించి భారత్‌కు స్నేహ హస్తం చాపే ప్రయత్నం చేస్తే ఆ ప్రభుత్వం అస్థిరతకు గురికాక తప్పడం లేదు. గతంలో సైన్యంలోని ఒక వర్గం మద్దతుతో వేయేళ్లపాటు భారత్ పై యుద్ధం చేస్తానని ప్రగల్భాలు పలికిన జుల్ఫీకర్ అలీ భుట్టో ఆ తర్వాత స్వతంత్రించి వ్యవహరించే ప్రయత్నం చేయగా- ఆయనను భౌతికంగా అంతమొందించడం తెలిసిందే. పాకిస్థాన్, చైనా ఆర్ధిక కారిడార్, కాశ్మీర్, ఆఫ్ఘానిస్తాన్ విషయాలలో షరీఫ్ స్వతంత్రించి వ్యవహ రించే ప్రయత్నం చేస్తుండడంతో సైన్యం ఆగ్రహనికి గురి కావలసి వచ్చింది.
2014 మేలో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార సమయంలో షరీఫ్ హాజరు కావడం, ఆ మరుసటి సంవత్సరం మోదీ అకస్మాత్తుగా లాహోర్‌లో దిగి షరీఫ్ ఇంటికి వెళ్లి ఒక ఉత్సవంలో పాల్గొనడం, తద్వారా రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు మెరుగు పరచే ప్రయత్నం జరగడాన్ని పాకిస్థాన్ సైన్యం భరించలేక పోయింది. భారత్‌కు స్నేహ హస్తం చాపినందుకే షరీఫ్‌ను ఇపుడు శిక్షించినట్లు భావించాలి. కాశ్మీర్‌ను ఆక్రమించడమే పాకిస్థాన్ సైన్యం అసలు ఉద్దేశం. అందుకోసం ప్రత్యక్ష యుద్ధం జరుపలేమని గ్రహించి తీవ్ర వాదాన్ని కాశ్మీర్‌లో ప్రోత్సహిస్తున్నది. కాశ్మీర్ లోయలో తీవ్రవాదులకు ఆధా రమైన తీవ్రవాద సంస్థలు, వాటి శిక్షణ కేంద్రాలు పాకి స్థాన్‌లోనే ఉన్నాయ. అవన్నీ పాకిస్థాన్ సైన్యం ప్రత్యక్ష ప్రోత్సాహంతో కొనసాగుతున్నాయి. ఈ విషయమై అంత ర్జాతీయంగా పలు విమర్శలు చెలరేగుతున్నా ఆ దేశం లెక్క చేయడం లేదు. కాశ్మీర్, ఆఫ్ఘానిస్తాన్‌లో తీవ్రవాద కార్యకలాపాలు పాక్ భూభాగం నుండే కేంద్రీకృతం అవుతున్నా, పాకిస్థాన్ పౌర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహించక తప్పడం లేదు.
పాకిస్థాన్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులను అప్రతిష్టకు గురిచేసి, వారు దేశాన్ని దోచుకున్నారని అభిప్రాయం కలిగించి, భారత్ సానుకూల ధోరణిని మరే నాయకుడు అనుస రించకుండా ఒక హెచ్చరిక ఇవ్వడానికే షరీఫ్ కు జైలు శిక్ష పడినట్లు చెప్పకతప్పదు. షరీఫ్ కుటుంబ సభ్యులపై మరికొన్ని కేసులు విచారణలో ఉన్నందున ఈ శిక్ష కేవలం శాంపిల్ మాత్రమే అని, మరిన్ని కఠిన శిక్షలకు సిద్దపడవలసిందే అంటూ సైన్యాధిపతులు స్పష్టమైన సంకేతాలు పంపుతూనే ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాక్‌లోని అత్యున్నత న్యాయవ్యవస్థ అవహేళనకు గురవుతోంది. ముషారఫ్‌పై తీవ్రమైన కేసులున్నా, ఆయన దేశం వదిలి వెళ్లిపోయే అవకాశం ఇవ్వడం, తాజాగా పాస్‌పోర్ట్, గుర్తింపు కార్డులను జారీ చేయమని ఆదేశాలు ఇవ్వడం, షరీఫ్‌ను మాత్రం లక్ష్యంగా చేసుకోవడం గమనిస్తే సైనిక వ్యవస్థ ప్రభావంతో న్యాయవ్యవస్థ కుప్పకూలి పోతోందని చెప్పాలి. సైనికుల పన్నాగం నుండి ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం ముస్లిం లీగ్ ఏ మాత్రం చేయగలదో చూడవలసి ఉంది.

-చలసాని నరేంద్ర