మెయిన్ ఫీచర్

తెలుగు కథ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయితలు కథలు, నవలలు రాస్తారు. పత్రికలకు పంపుతారు. ఎడిటర్లు తమ పత్రిక అభిరుచులకు, ఆశయాలకు అనుగుణంగా వుండి, పాఠకులను అలరిస్తుందని భావించిన రచనలను ప్రచురిస్తారు. పాఠకులను ఆకట్టుకున్న రచయితల కథల సంపుటాలు, నవలలు ప్రచురణకర్తలు పుస్తక రూపంలో మార్కెట్‌కి పంపిస్తారు. నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు పత్రికలు, పుస్తకాలు చదువుతారు. తనకు నచ్చిన నవల గురించి నిర్మాత, దర్శకుడితో డిస్కస్ చేస్తాడు. ఆ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం కుదిరిన తర్వాత రచయితను సంప్రదించి సినిమా తియ్యడానికి నవల హక్కులు కొనుక్కుంటాడు నిర్మాత. సినిమాలకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాసి అనుభవం వున్న రచయితను సంప్రదించి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాయించుకుంటాడు. నిర్మాత, దర్శకుడు, రచయితలు అందులో పాత్రలకు ఏ హీరో న్యాయం చేస్తాడు? కథానాయిక ఎవరైతే బాగా నటిస్తారు? ఇతర పాత్రలకు ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తారు. ఇదంతా జరగడానికి ఆరు నెలలో, ఒక్కోసారి సంవత్సరమో పట్టేది. అందరి కాల్షీట్లు కుదిరిన తర్వాత షూటింగ్ మొదలయ్యేది అదంతా గతం.
అరికపూడి కౌసల్యాదేవి, రంగనాయకమ్మ, యద్ధనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, ద్వివేదుల విశాలాక్షి వంటి ప్రముఖ రచయిత్రుల నవలలు తెలుగు సినిమాలుగా రూపొంది విజయవంతంగా ప్రదర్శితమయ్యేవి. ఆ తర్వాత మల్లాది వెంకటకృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్, వసుంధర వంటి పాపులర్ రచయితల నవలలు హక్కు లు కొని సినిమాలు తీశారు. అప్పట్లో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వుండేది. విజయవాడలో నవయుగ, పూర్ణా, విజయా, లక్ష్మీఫిలింస్ వంటి ప్రముఖ సంస్థలు వుండేవి. నిర్మాత స్క్రిప్ట్ సమకూర్చుకుని నటీనటులను నిర్ణయించుకుని, బడ్జెట్ ప్లాన్‌చేసి డిస్ట్రిబ్యూటర్‌ని సంప్రదించేవాడు. ఏ జోనర్, ఏ హీరో సినిమా ఎంత వసూలుచేస్తుందో ఒక అంచనా వుండేది.
ఏ హీరో సినిమా ప్లాఫయితే థియేటర్లనుంచి ఎంత షేర్ వస్తుందో వారికి అనుభవమే. ఆ ప్రకారం పెట్టుబడి పెట్టి నిర్మాతకు సహకరించేవారు. రిలీజ్ డేట్లుకూడా దాదాపు ఖరారు అయ్యేవి. ఏ టెన్షన్ లేకుండా సినిమా నిర్మాణం పూర్తయ్యేది. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే షేర్‌లో ముందు తమ పెట్టుబడి, వడ్డీతోసహా మినహాయించుకుని ఆ తర్వాతే నిర్మాతకు చెల్లించేవాడు డిస్ట్రిబ్యూటర్. అప్పట్లో నిర్మాతదే రిస్క్. ముందు పెట్టుబడిపెట్టి ఆఖర్లో తీసుకునే వాడు నిర్మాత.
కీ.శే.జలగం వెంగళరావుగారు ఆంధ్రప్రదేశ్, ముఖ్యమంత్రిగా వుండగా 25,000 జనాభాలోపు వుంటే ‘సి’క్లాస్ సెంటర్లకు ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్‌కి శ్లాబ్‌సిస్టమ్ విధించారు. తెగిన టిక్కెట్ల ఆధారంగా కాకుండా, థియేటర్ సీటింగ్ కెపాసిటీ ఆధారంగా మినిమమ్ 20 పర్సెంట్ అని టాక్స్ విధించారు. కొన్ని సెంటర్స్‌లో థియేటర్ యజమానులు ఇనస్పెక్షన్‌కి వెళ్ళిన కమర్షియల్ టాక్స్ అధికారుల మీద దౌర్జన్యం చేసేవారు. వారానికి వంద రూపాయలుగూడా టాక్స్‌కట్టని సెంటర్స్ వుండేవి. కొందరు ఎ.సి.టీ.వోలు నెలవారి మామూలు వసూలుచేసుకుంటూ వారి జోలికి పోయేవారుకాదు. మారుమూల వూళ్ళకుపోవాలంటే అధికారులకు భయంగా వుండేది. దానికి అడ్డుకట్టే శ్లాబ్ సిస్టమ్, బాగానే వుంది కదా?
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘సి’క్లాస్ సెంటర్లలో శ్లాబ్ సిస్టమ్ సాకు చూపించి ‘ఏ’క్లాస్ థియేటర్ల లాబీ తమకూ శ్లాబ్ సిస్టమ్‌కావాలని ముఖ్యమంత్రి కీ.శే.ఎన్.టి.రామారావుగారికి విన్నవించుకున్నారు. సినిమావారికి లాభం జరుగుతుందని ప్రభుత్వం అందరికీ శ్లాబ్ సిస్టమ్ విధించింది. ఇక టికెట్లు తెగినాతెగకపోయినా హౌస్‌ఫుల్ కెపాసిటీ మీద టాక్స్‌కట్టాలి. హిట్ అయిన సినిమాలకు కనక వర్షమే. 70%వున్న టాక్స్ 25%కి తగ్గిపోయి షేర్ పెరిగిపోయింది. కలెక్షన్లు వున్న సినిమాలకు. అప్పుడు రిలీజైన ఖైదీ శ్లాబ్‌వల్ల ఎవరూ వూహించని షేర్ సాధించింది. చిరంజీవి హీరోగా దూకుడు మొదలైంది. శ్లాబ్ సిస్టమ్ కొన్ని థియేటర్లవారికి శాపంగా మారింది. కలెక్షన్ వచ్చినా రాకపోయినా టాక్స్ కట్టాల్సిందే. విడుదలయ్యే సినిమాల సక్సెస్ 10నుంచి 20శాతమే. సెంటర్ థియేటర్లకు ఎప్పుడూ డిమాండ్ వుంటుంది. హైబడ్జెట్,
పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యేవి. లాభసాటిగా వుంది. మరి చిన్న సినిమాలు సంగతి ఏంటి? హీరోల సినిమాలకు ఓపెనింగ్సే వస్తాయి. చిన్న సినిమాలకు బాగుందని వౌత్‌టాక్ వస్తేనే జనం వస్తారు. ఈలోపే టాక్స్ కట్టడానికిగూడా కలెక్షన్ రావడంలేదని సినిమా ఎత్తేసేవారు. హైదరాబాద్ సిటీలోనే సినిమా థియేటర్లు రన్‌చెయ్యలేక పడగొట్టి షాపింగ్ మాల్స్‌గా మార్చిన వాళ్ళు, కళ్యాణ మండపాలుగా కన్వర్ట్‌చేసుకున్నవాళ్ళు ఎందరో? కోఠీలో విక్రమ్, అశోక్, ఆబిడ్స్‌లో ప్యాలెస్, సాగర్, జమ్రుద్, కాచిగూడాలో బసంత్, ప్రభాత్, హిమయత్‌నగర్‌లో లిబర్టీ వంటి థియేటర్లు మూతబడ్డాయి. తెలుగు హిట్ సినిమాలు లేక రామకృష్ణ, తారకరామా వంటి ప్రతిష్టాత్మకమైన థియేటర్లలో మళయాళం ‘సి’గ్రేడ్ బూతు సినిమాలు ప్రదర్శించి మనుగడ సాగించిన రోజులున్నాయి.
శ్లాబ్ సిస్టమ్‌తో హీరోల ప్రాబల్యం పెరగడం, తెలుగు కథలకు డిమాండ్ తగ్గడం మొదలైంది. వి.సి.ఆర్‌లు, కేసెట్లు ఇతర దేశాలనుంచి దిగుమతి కావడం గూడా తెలుగుకథలకు శాపమైంది. లక్ష రూపాయలు ఖర్చుచేసి ఏ సింగపూర్ నుంచో టి.వి. వీ.సీ.ఆర్‌లు తెచ్చుకునేవారు. ఆస్థాన డైలాగ్ రైటర్లకు ఆ కేసెట్లు చూపించి కథలు తయారుచేయించే పద్ధతి మొదలైంది. తెలుగు కథలు, నవలలు చదివే నిర్మాతలు, దర్శకులు నెమ్మదిగా కనుమరుగుఅయ్యారు. ఇప్పుడంతా కథ చెప్పడమే. సక్సెస్‌వున్న డైరెక్టర్ల హవానడుస్తోంది. అసిస్టెంట్ డైరెక్టర్ల బృందం సినిమా కథ వండుతారు. అందుకే తెలుగు సినిమాలలో తెలుగుదనం మృగ్యమైంది. విజయా, వాహిని, లక్ష్మీ ఫిలింస్, జగపతి వంటి సంస్థలన్నీ కనుమరుగయ్యాయి. పాత తరం మాయమైంది. సినిమా కళాత్మక వ్యాపారం అనేదిపోయి సెంట్‌పర్సెంట్ బిజినెస్ అయింది. ‘‘్ఫలానా డైరెక్టర్ చెప్పిన పద్ధతి నచ్చింది. సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వుంది. ఇంతకుముందు ఇటువంటి కథ రాలేదు. హీరోగారు ఎంతో మెచ్చుకున్నారు. నిర్మాణంలో ఎటువంటి రాజీలేదు. ఎంత డబ్బయినా ఖర్చుపెడతాం.’’వంటి స్టార్ డైలాగులు చెబుతాడు నిర్మాత ప్రెస్‌మీట్ పెట్టి.
‘‘కథ ఎవరు రాశారు సార్?’’ అని ఎవరైనా పొరపాటున అడిగితే ‘ఆ ఒక్కటీ అడక్కు’అన్నట్టు మొహం పెడతాడు. ‘కథ చెప్పాల్సింది రైటర్‌కదా? డైరెక్టర్ కథ చెప్పడం ఏంటి?’అని ఎవరూ అడగరు.
డైరెక్టర్లు సి.డి.లు చూసి విదేశాల సినిమాల స్ఫూర్తితో కథలను వండుకోవడం మొదలుపెట్టిన తెలుగు సినిమాలలో తెలుగుదనం మాయమైందనేది యదార్థం.
తెలుగు సమకాలీన సాహిత్యాన్ని దూరంగాపెట్టారు. తెలుగుపత్రికలలో ఇప్పటికీ తెలుగు సీరియల్స్ వస్తున్నాయి. స్వాతి, చతుర, ఆంధ్రభూమి మాస పత్రికలు అనుబంధ నవలలు ప్రచురిస్తూనే వున్నాయి. ఎన్నో వైవిధ్యమైన ఇతివృత్తాలు ఆవిష్కరించబడుతున్నాయి. సినిమావారికి చదివే ఓపిక లేదు. ఒక హీరో ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు. ఆయన అభిమాని ఒక రచయిత కథ తయారుచేసుకుని వెళ్ళాడు. హీరోతో ములాఖాత్ అంత ఈజీకాదని పాపం ఆ రచయితకు తెలీదు. సినిమాకల్చర్‌కి కొత్త. ఆ హీరోచుట్టూ తిరిగే భజన బృందం అడ్డుపడింది. హీరోని కలిసి కథ చెప్పాలంటే ముందుగా బృంద నాయకుడి అనుమతి కావాలట. ఆ నాయకుడు సినిమాలలో సపోర్టింగ్ రోల్స్‌వేసే నటుడు కూడా. హీరో కులం, ప్రాంతం వగైరా. ఆ రచయితను రేపుమాపుఅంటూ తిప్పుకుని తర్వాతి అసలు సంగతి చెప్పాడు.
‘‘సినిమా హీరో అంటే తెర వేల్పు. అభిమానులకు దేవుడితో సమానం. ఆయనతో ఫొటో దిగాలనీ, కనీసం కరచాలనంచేస్తే జన్మధన్యమవుతుందని భావించేవాళ్ళు లక్షల్లో వుంటారు. ఆయన పక్కన ఒక్క నిమిషం నిలబడాలంటే ఎంతో పుణ్యంచేసుకున్న వాళ్ళకి సాధ్యమవుతుంది. మరి మీరు ఆయనముందు కూర్చుని కథ చెప్పడానికి రెండుగంటలు పడుతుంది. ఔనా?’’ ‘‘నిజమేనండి. కథ డిటెయిల్డ్‌గా చెప్పడానికి రెండు గంటలు సమయం కావాలి.’’ ఒప్పుకున్నాడు రచయిత. ‘‘అందుకు రెండు లక్షలు నాకు ఇవ్వాలి.’’ ‘‘నేను కథ చెప్పడానికి ఎదురుడబ్బివ్వాలా? రెండు లక్షలా?’’ బిత్తరపోయాడా రచయిత. ‘‘మీ కథ హీరోకి నచ్చితే, అది సినిమాగావస్తే, మీకు బ్రేక్ వచ్చేస్తుంది. సినిమాకు పాతిక, ఏభై లక్షలు సంపాదిస్తారు. జెస్ట్ టూ లాక్స్ పెట్టుబడి అనుకోండి.’’ ‘ఆకాశంలోని నల్లమబ్బుల్ని చూసి వానొస్తుందిలే అని కుండలో నీళ్ళు పారబోసుకున్నట్టుంది’ అనుకుని ఆ రచయిత పారిపోయాడు. సికింద్రాబాద్ స్టేషన్‌కెళ్ళి తమ వూరెళ్ళిపోయాడు.
అదీ దిగజారిన తెలుగు కథ. అందుకు కర్ణుడి చావుకి ఎన్ని కారణాలున్నాయో? అంతకంటే ఎక్కువే వున్నాయి. ఇప్పుడు తెలుగు తెరపై కథ ఫలానా రచయిత అనే టైటిల్‌కార్డు మీరు చూశారా? చూడలేరు. వుంటేగా చూడ్డానికి?

-వాణిశ్రీ 8309860837