మెయన్ ఫీచర్

నాణ్యత లోపించిన తెలుగు వాచకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థా యిల్లో రూపొందించే పాఠ్యపుస్తకాలు ఆయా తరగతులకు అనుకూలంగా ఉండేవిధంగా రచించాలి. పుస్తక రచనలో విషయ నిర్దిష్టత, యోగ్యత, ఔపయోగిత, అనుసరణీయత, ఆచరణయోగ్యత, బోధ నా సౌలభ్యం మొదలైన అంశాలను మూల్యాంకన అంశాలుగా గ్రహించి అత్యంత ప్రాధాన్యతనీయడం జరగాలి. భాష, భాషేతర పుస్తక నిర్మాణంలో అనుభవజ్ఞులైన విద్యావేత్తలు, బోధనారంగంలో విశేషానుభవం కలిగిన విషయ, భాషా, సాహిత్య నిపుణుల ఎంపిక చాలా అవసరం. నిష్ణాతుల పర్యవేక్షణ, నియంత్రణ, రచన, సంపాదకత్వంలో పుస్తక రచన సాగాలి. పాఠ్యపుస్తకాల రచన తరువాత వాటిని ఆమూలాగ్రంగా పరిశీలించి, సమీక్షించి, సంశోధించి, నాసిగా, వివాదాస్పదంగా, అసమగ్రంగా ఉన్న ఉన్న పాఠ్యాంశాలను తొలగించడం లేదా పునఃరచించడం చేయడమనేది తప్పనిసరి నిబంధన. ఎంత పెద్ద రచయిత రాసిన అంశమైనా బోధనాభ్యసన మూల్యాంకనానికి అనుగుణంగా లేనట్లయితే దాన్ని పాఠ్యాంశంగా పొందుపరచకపోవడం శ్రేయస్కరం. మన మేధో సంపత్తిని, బుద్ధిబలాన్ని, పాండితీ ప్రకర్షణను, ఆలోచనా విధానాలను చిన్నారులపై ప్రదర్శించకూడదు. ముఖ్యంగా పాఠ్యపుస్తకాలకోసం ఎంపిక చేసుకునే అంశాలు బోధనా సౌలభ్యాన్ని, అభ్యసనానుకూలతను విలువలను కలిగివుండాలి.
1986 నూతన విద్యావిధానంలో పేర్కొనబడిన పది వౌలికాంశాలను పాఠ్య ప్రణాళిక రచన, పాఠ్యపుస్తక రచన, తయారీ, బోధన, అభ్యసన ప్రక్రియలతో అంతర్లీనం చేసి జాతీయ విలువలు, సామాజిక విలువల్ని, సభ్యత, సంస్కృతి వాతావరణాన్ని సృష్టించాలి. కాని ప్రస్తుత వాచకాలు తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూతో పాటు భాషేతర పుస్తకాలు/వాచక నిర్మాణంలో కూడా ఇలాంటి ప్రయత్నం జరగడంలేదు. నిరంతర సమగ్ర మూల్యాంకనం ముసుగులో అశాస్ర్తియ పద్ధతిలో ఒంటెద్దు పోకడతో, వాచకాలను తయారు చేయడం గర్హనీయం. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే నూతన విద్యావిధానాన్ని అనుసరించి ప్రతిపాదిత అంశాలను పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టాల్సిన అగత్యం ఉన్నది.
1986 నూతన విద్యావిధానంలోని విద్యకు సంబంధించిన ఏ ఒక్క అంశం నేటికీ సాధించబడలేదు. అన్నీ ప్రయోగాలే తప్ప ఆచరణ అమలు, ఫలితం శూన్యం. మూడు దశాబ్దాలుగా అందరికీ చదువు పథకం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అనియత విద్యాపథకం అభాసుపాలైంది, జనాభావిద్య గతితప్పింది. దుర్గాబాయి దేశ్‌ముఖ్ నేషనల్ కమిటీ ఆన్ ఉమెన్స్ ఎడ్యుగేషన్‌లో ప్రతిపాదించిన ఎన్నో అంశాలు నేటికీ అమలుకు నోచలేదు. 1986 నూతన విద్యావిధానంలోని మూల్యాంకనం, సమగ్ర మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేవి నేడు మూడుముక్కలాటగా మిగిలింది. దాని గురించి సమగ్రావగాహన ప్రస్తుతం పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకే లేదు. పరీక్షలు-మూల్యాంకనానికి సంబంధించిన తేడాలేవీ తెలియకుండా నిరంతర సమగ్ర మూల్యాంకనమంటూ పదవ తరగతి పరీక్షా పత్రాలలో అస్తవ్యవస్తమైన, అవగాహనకందని, అవాంఛనీయమైన పద్ధతిలో ప్రశ్నలనిస్తూ విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్నారు. సి.సి.. అంటూ పాఠ్యపుస్తకాల్లో సంసిద్ధతా పాఠం, అసలు పాఠం, తోక పాఠాలను పెట్టి పాఠ్యాంశాన్ని చిందరవందర చేసి ఇష్టం వచ్చినట్టు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రశ్నించడం కూడా ఒక కళ. దానికి కూడా ఒక లక్ష్యం, ఉద్దేశం, ప్రయోజనం ఉంటుందనేది రచయితలు గమనించాలి.
తిక్కన విరచితమైన శాంతికాంక్ష పాఠంలో ‘హిరోషిమా బాంబుదాడి’ సంసిద్ధతా పాఠం. అసలు పాఠం భారతంలోని శాంతి రాయబారం, తోక పాఠంలో నెల్సన్ మండేలా, గాంధీజీల ప్రసక్తి. ప్రతిదానిలో అస్తవ్యస్త ప్రశ్నలు. పాఠం ఉద్దేశం మృగ్యం. శాంతికాంక్షలోని ప్రాజెక్టు పని లో విద్యార్థులు వారి వీధిలోని, వాడలోని శాంతికోసం పాటుబడుతున్న ఒక వ్యక్తిని గుర్తించి అతనితో ముఖాముఖి చర్చించి అతను శాంతికోసం ఎలా పాటుపడుతున్నది తెలిసికొని ఒక నివేదిక తయారు చేయాలట! ఇంచుమించు పై తరగతుల పాఠాలన్నీ సంకలనాలే. అభ్యాసాలు రాయడంలోనే రచయితల శ్రమ. అదీ పాఠ్యపుస్తకాల నిర్మాణ సూత్రాలకు పూర్తి భిన్నంగా నాసిరకంగా ఉంటోంది. కఠిన పదాలకు అర్థాలు పుస్తకం చివరన పదపట్టికలో చూసి నిఘంటు సహాయంతో విద్యార్థి నేర్చుకోవాలట! ఇక పాఠానికి ముందు ప్రశ్నల పరంపర. ఆలోచించండి, అడగండి, చర్చించండి, పరిశీలించండి, గణించండి, సేకరించండి, ప్రదర్శించండి, తెలియకపోతే మీ స్నేహితులను అడగండి..ఇదీ వరుస. పుస్తక పరిచయం, సమీక్ష, సంపాదకీయం, నివేదిక, పీఠికలు, కరపత్రాలు తదితరాలన్నీ విద్యార్థులే చేయాలట. ఉపాధ్యాయులు చెప్పేదేమీ లేదట. చేసేది కూడా ఏమీలేదు! ఇక్కడ సంగతేంటంటే ఉపాధ్యాయుడు మార్గదర్శి, వసతులు సమకూర్చేవాడేనట. అలాంటప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉపాధ్యాయులను నియమించడమెందుకు? శిక్షణా తరగతులెందుకు? ఇది ఎవరికీ అర్థంకావడంలేదు.
ఇక ప్రాజెక్టు పనుల్లో యాబైమందికి స రిపడా అప్పడాలు, పాపడాలు, వడియాలు చేసుకొని తీసుకు రండి, కూరగాయల బిర్యాని చేసుకురండి, సినీనటి సావిత్రి, కరీనా కపూర్ జీవిత విశేషాలను, బాల్యం చిత్రాలను సేకరించి వారి జీవిత చరిత్ర రాయండి, ప్రాజెక్టు సమర్పించండి అనేవి కొన్ని మాత్రమే. ఒక్క పాఠంలో కూడా బోధనా సౌలభ్యం, విలువలు వేటికీ స్థా నం లేదు. అవి విద్యార్థుల పాలిట శాపా లు, గుదిబండలు. ఇలాంటి డొంకతిరుగుడు పాఠాలతో డోలాయమాన పరిస్థితి. ఇక చిత్రాల విషయానికి వస్తే పుస్తకాలనిండా చిత్రాలే. ప్రాథమిక స్థాయిలో చిత్రా ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, రానురాను వాటిని తగ్గించవలసిన అవసరం ఉంటుందనే విషయం రచయితలు, సమన్వయకర్తలు, సంపాదకులు గుర్తించాలి. వారికి వాచక నిర్మాణ రీతులు తెలిసుండాలి.
ఏడో తరగతిలో ‘నాయినమ్మ’ అనే పా ఠం నాసిరకం, చౌకబారు ప్రదర్శన. విద్యార్థుల్లో ఋణాత్మక భావనలను కలిగిస్తుంది. ఇక దాశరథి రచన ‘‘ఈ చల్లని గర్భం దాచిన బడబాగ్నులు ఎన్నో, ఈ నల్లని ఆకాశంలో కానరాని బాస్కరులెందరో’’ హృద్యమైన గేయపాఠం. దీనికి విద్యార్థుల్ని శీర్షిక ఎంపికచేసి పెట్టమన్నారు. ఒకవేళ శీర్షిక తగనిదైతే ఎందుకు తగనిదో రాయాలట! తగినదైతే ఎందుకు తగినదో రాయాలట. ఇలా చెప్పుకుంటూపోతే రచయితల రచనా విన్యాసానికి అంతూపొంతూ లేదు.
2000 సంవత్సరం నుంచే ఈ వాచకాల రచనా క్షీణత మొదలైంది. ఒక్కొక్క వాచక నిర్మాణానికి ప్రస్తుతం 60 మంది ఉన్నారు. వివిధ కమిటీల పేర్లతో వేసుకున్నారు. ప్రణాళికా సంఘం, సలహాసంఘం, రచయితలు, సంపాదకవర్గం, సంకలనకర్తలు, సమీక్షకులు, సమన్వయకర్తలు, నిర్వహణాధికార్లు, చిత్రకారులు, డి.టి.పి. లేఅవుటు, ముద్రణాధికారి అంటూ పెద్ద జాబితా. పాఠ్యపుస్తకం కొన్ని పరిమితులకు లోబడి ఉంటుందనే అంశాన్ని సమన్యకర్తలు నిర్వాహకులు గుర్తిస్తే మంచిది.
ఈ పాఠ్య గ్రంథాల రచనలో బి.ఇడి కళాశాలల్లో, ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో పనిచేసిన అనుభవజ్ఞులను, విషయ భాషా నిపుణులను, గతంలో పాఠ్యపుస్తక నిర్మాణంలో పాల్గొన్నవారిని పక్కన బెట్టి, ఆశ్రీత పక్షపాతం, బంధుప్రీతితో అనర్హులను విద్యాకళాశాలల గడపతొక్కని వారని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత తరగతులలో ఎలాంటి బోధనానుభవం లేనివారిని, విశ్వవిద్యాలయ శాఖాధిపతులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల ఉపన్యాసకులను వివిధ కమిటీలలో వేసుకొని వాచక నిర్మాణం గావించారు. ఉమ్మడి రాష్ట్రంలో వాచకాలను భ్రష్టు పట్టించినవారు దశాబ్దాలుగా రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో తిష్టవేసి ప్రభుత్వాధినేతల అధికారుల అండదండలతో పబ్బం గడుపుకుంటున్నవారు, తెలంగాణ తెలుగువాచకాలలో కూడా తమ హవాను కొనసాగిస్తున్నారు.
దీన్నిబట్టి చూస్తే రాష్టల్రో వాచక రచయితలకు కరువు ఏర్పడింది. రాష్ట్రం గొడ్డువోయింది అనే సత్యాన్ని ఒప్పుకోక తప్పదు. అలా కాకపోతే ఎర్రన నృసింహ పురాణంలోని వినత-కద్రువకు సంబంధించిన పాఠంలో వేమన ‘పుత్రోత్సాహం’ పద్యమేంటి? అలాగే సీత ఇష్టాలు, బుర్రకథ రచనల్లో నాణ్యతలేదు. ఇలాంటి పుస్తకాలు రాసి విద్యార్థులకు తెలుగుపట్ల విముఖతను కలిగించడమెందుకు? తెలుగు భాషా సంస్కృతుల విస్తృతి కోసం విదేశాలకు పరిగెత్తడమేంటి? ప్రాచీన హోదాను సంతరించుకున్న తెలుగు భాషను మూడవ దర్జాకు తెచ్చారు. మూలవిద్యకు ఆధారమైన తెలుగు మాతృభాషను విస్మరించి ఆంగ్లభాషకు పట్టం కడుతున్నారు. తెలుగు మాతృభాష, ప్రాంతీయ భాష, ప్రథమ భాష, ద్వితీయ భాష, బోధనా మాధ్యమం, అధికార భాష అంటూ తెలుగును అందలమెక్కిస్తామన్న వాగ్దానాలు ఏమయ్యాయి? ఇది ఇలాగే కొనసాగితే మన విద్యార్థులు రెంటికి చెడ్డ రేవడులవుతారు. వేదికలెక్కి తెలుగు భాష గురించి ఉద్వేగపూరిత ఉపన్యాసాలిచ్చేవారికి, ప్రదక్షిణలు చేసేవారికి వాచకాల గురించిన ఆలోచనగానీ, భావిభారత పౌరులైన చిన్నారుల ఆవేదన, అభ్యసన పట్టదా?

-డాక్టర్ సరోజన బండ (విశ్రాంతాచార్యులు, ప్రభుత్వ ఉన్నతస్థాయి విద్యా అధ్యయన సంస్థ)