మెయన్ ఫీచర్

‘అసహజ లైంగిక క్రియ’ ప్రాథమిక హక్కా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజ లైంగిక స్వభావా’న్ని ప్రాథమిక హక్కుగా గుర్తించేలా మన సమాజం ఎదిగిందా? అదే నిజమైతే- దేశంలో ఉన్న వందలాది చట్టాల్లో సవరణలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? కేవలం భారత శిక్షా స్మృతిలోనే కాదు.. కార్మిక చట్టంలో, భూమి హక్కు చట్టాల్లో, ఆస్తి హక్కు చట్టాల్లో, వివాహ చట్టాల్లోనూ అనేక మార్పులు చేయాల్సి ఉంటుంది. శతాబ్దాలుగా ఎల్‌జీబీటీక్యూ (స్ర్తి స్వలింగ సంపర్కులు, పురుష స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు, హిజ్రాలు, స్వలింగ సంపర్కం పట్ల ఆసక్తి ఉన్న వారు) వర్గాన్ని సమాజం వేరుగా చూస్తోంది. ఆమాటకొస్తే 1290 నాటి కాలంలో లైంగిక క్రియ సైతం నేరమే! ఎంతగా అంటే సమాచారం ఇవ్వకుండానే ‘నిందితుల’ను ఉరితీసేవారు. 1290 ప్రాంతంలో ఫ్లెటాలో, 1300 సంవత్సరంలో బ్రిటన్‌లో ఆ నిబంధన ఉండేది . 1533 నాటికి పురుషుల మధ్య జరిగే అసహజమైన లైంగిక చర్యల నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. అప్పటి రాజు హెన్రీ-8 దీనిని కఠినంగా అమలు చేశాడు. ఈ నేరం కింద దోషులకు మరణశిక్ష విధించారు. కాలక్రమంలో ఈ అంశం కాస్తా మతపరమైన హేయమైన అంశంగా మారిపోయింది. 1852 నుండి బ్రిటిష్ చట్టాలు క్రోడీకరించడం మొదలుపెట్టిన తర్వాత ఈ చర్యలకు స్పష్టమైన నిబంధనలు వచ్చాయి.
బ్రిటిష్ పాలనలోనే 1837లో భారత శిక్షా స్మృతి ముసాయిదాను తయారుచేసినపుడే 361, 362 క్లాజుల్లోనూ, 377లోనూ అసహజమైన లైంగిక చర్యలపై శిక్షలను సూచించారు. అయితే అది 1860లో అమలులోకి వచ్చేనాటికి కొన్ని మార్పులూ చేర్పులూ జరిగాయి. భారత తొలి ‘లా కమిషన్’ అధ్యక్షుడు థామస్ బాబింగ్టన్ మెకాలే భారత శిక్షా స్మృతికి తుది రూపాన్ని ఇచ్చినపుడు కూడా అసహజ లైంగిక స్వభావాలపై స్పష్టమైన నిబంధనలు చేర్చారు. ఖాను వెర్సస్ ఎంపరర్ (1925) సింథ్ 286 పేరా 2- పేజీ 286లోనూ, ఖండు వెర్సస్ ఎంపరర్ (1934) లాహోర్ 261, స్టేట్ ఆఫ్ కేరళ వెర్సస్ కుందకర గోవిందం (1969), బ్రదర్ జాన్ ఆంథోనీ వర్సస్ స్టేట్ (1992), స్టేట్ ఆఫ్ గుజరాత్ వెర్సస్ బచిమియా ముసామియా (1998)లో ఏ రకమైన అసహజ లైంగిక చర్యలను నేరంగా పరిగణిస్తామో స్పష్టమైన తీర్పులున్నాయి. శతాబ్దాల తరబడి ఉన్న ఈ నేపథ్యంతో అసహజ లైంగిక స్వభావాన్ని తీవ్రనేరంగానూ, అందుకు పాల్పడిన వారిని సృష్టి విరుద్ధమైన నేరస్థులుగా చూడటానికి మనం అలవాటు పడిపోయాం.
వాస్తవానికి స్వలింగ సంబంధం సృష్టివిరుద్ధమని అం తా భావిస్తారు. కానీ ఇది సృష్టికి విరుద్ధమేమీ కాదనీ, ప్రాకృతమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. వైద్య శాస్త్రం ప్రకారం కూడా స్వలింగ సంపర్కం అనేది మానసిక వ్యాధి కాదని, జన్యుపరంగా వచ్చే లోపం కూడా కాదని లైంగికతలో ఒక భిన్నమైన కోణంగానే దీనిని పరిగణించాలని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్, అమెరికా సైక్రియాటిక్ అసోసియేషన్, అమెరికా అకాడమి ఆఫ్ పెడియాట్రిక్స్ సొసైటీలు నిర్ధారించాయి. ఈ నిర్థారణలను భారత సైక్రియాటిక్ సొసైటీ కూడా ఆమోదించింది.
మన రాజ్యాంగం ఆర్టికల్-14 ద్వారా సమానత్వపు హక్కు, ఆర్టికల్-19 ద్వారా వాక్ స్వాతంత్య్రపు హక్కు, ఆర్టికల్-21 ద్వారా జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కును కల్పించింది. వీటికి భిన్నంగా అసహజ లైంగిక చర్యలకు పాల్పడితే భారత శిక్షా స్మృతి సెక్షన్ -377 ప్రకారం నేరం గానే భారత రాజ్యాంగం పరిగణించింది. భారత్ సహా ఆసియా, ఐరోపా దేశాల్లోనూ అసహజ లైంగిక స్వభావానికి తీవ్రమైన శిక్షలు ఉండటంతో దానిని అడ్డుకునేందుకు ఎల్‌జీబీటీక్యూ వర్గాలు ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమాలు ప్రారంభించాయి. మన దేశంలో ఈ ఉద్యమం 1991లో ఊపిరి పోసుకుంది. ‘ఎయిడ్స్ బేద్భావ్ విరోధి ఆందోళన’ రూపంలో ఇది ప్రారంభమైంది. 1996లో ఈపీడబ్ల్యులో విమలా సుబ్రహ్మణ్యం దేశంలో పురుష స్వలింగసంపర్కుల ఉద్యమంపై సమగ్రమైన కథనం ప్రచురించిన తర్వాత అందరిలో ఆలోచనలు మొదలయ్యాయి. 2001లో ‘నాజ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టులో సెక్షన్ -377 రద్దుచేయాలని కోరుతూ పిటిషన్ (7455/2001) దాఖలు చేసింది. ఒక పక్క రాజ్యాంగంలో అన్ని రకాల హక్కులను కల్పిస్తూనే మరోపక్క భారత శిక్షా స్మృతిలో మాత్రం లైంగిక స్వభావంపై ఆంక్షలు విధించడం సరికాదని ఆ సంస్థ సవాలు చేసింది. 2004 సెప్టెంబర్ 2న ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నాజ్ సంస్థ 2004 నవంబర్ 3న రివ్యూ పిటిషన్ దాఖలుచేసింది. 2006 ఫిబ్రవరి 3న గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు పక్కన పెట్టింది. అయితే దీనిపై 2006 ఏప్రిల్‌లో సుప్రీం కోర్టుకు పిటిషన్‌దారులు వెళ్లడంతో ఈ అంశాన్ని మరోమారు పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది.
2009 జూలై 2న ఇద్దరు వయస్కుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని (7455/2001) , సెక్షన్ 377 భారత రాజ్యాంగంలోని అధికరణాలు 14, 15, 21ల ప్రకారం తప్పని తీర్పు చెప్పింది. స్వలింగ సంపర్కం చట్టబద్దం చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందన తెలియజేయాలని సుప్రీం 2009 జూలై 9న నోటీసులు ఇచ్చింది. కానీ 2013 డిసెంబర్ 11న సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. 377 సెక్షన్ రాజ్యాంగ విరుద్ధం కాదని, ఒక వేళ దానిలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే పార్లమెంటు చేయవచ్చని తీర్పు చెప్పింది. సెక్షన్ -377ను కొట్టి వేయాలని కోరుతూ 2016 జూన్‌లో మరో పిటిషన్ దాఖలు కావడంతో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ దీనిని ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేయాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని కోరారు. 2017 ఆగస్టులో గోప్యత హక్కుపై సుప్రీంకోర్టు తీర్పు రావడం, హదియా కేసులో సుప్రీం తీర్పు స్వలింగసంపర్కుల కేసుకు బలాన్ని చేకూర్చాయి. దాంతో 2018 జనవరిలో వారంతా మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. 2018 జూలై 10న సుప్రీంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్, జస్టిస్ ఎఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డి వై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హొత్రా ఉన్నారు. గత కొనే్నళ్లుగా స్వలింగ సంపర్కుల తరఫున పోరు సాగిస్తున్న అశోక్ రవి కవి, వివేక్ రాజ్ ఆనంద్, గౌతం యాదవ్, యశ్విందర్ సింగ్, ఆరిఫ్ జాఫర్‌లు వేసిన పిటిషన్లతో పాటు వ్యాపారవేత్త ఆయేషా కపూర్, భరతనాట్య కళాకారుడు నవతేజ్ సింగ్ జోహార్ (రిట్ పిటిషన్ క్రిమినల్ 76/2006) , జర్నలిస్టు సునీల్ మెహ్రా, రచయిత రీతూ దాల్మియా, చరిత్రకారుడు ఆమన్‌నాద్‌లు 2017 జనవరిలో దాఖలుచేసిన పిటిషన్లను కూడా రాజ్యాంగ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. డాక్టర్ అక్కై పద్మదాళి వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా (572/2016) తరఫున జయన కొఠారీ, అనే్వష్ పొక్కులూరి వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా (121/2018) తరఫున మేనకా గురుస్వామి తమ వాదనలు వినిపించారు. నాల్సవ్ వెర్సస్ యుఒఐ (2014) సెక్షన్ 438 విషయంలో హిజ్రాల హక్కులను గుర్తించడం, జస్టిస్ కేఎస్ పుట్టుస్వామితో కూడిన 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సురేష్ కుమార్ కౌశల్ కేసులో ఇచ్చిన తీర్పు, శక్తి వాహిని వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018) కేసులో కారుణ్య హత్యలపై ఇచ్చిన తీర్పులోని అంశాలు ఒకదానికొకటి పొంతన ఉండటం లేదని వాదనల సందర్భంగా చర్చకు వచ్చింది. అసహజ లైంగిక భావనలున్న వర్గాల వివాహం, సహజీవన సంబంధాల్లో వారసత్వ అంశాలు గురించి విచారించవద్దని కేంద్రప్రభుత్వం సుప్రీంను కోరింది. దీంతో స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తున్న భారత శిక్షాస్మృతి లోని సెక్షన్ 377 చెల్లుబాటు గురించి మాత్రమే పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది.
భారత సమాజంలో శతాబ్దాల తరబడి ఏర్పడిన పరిస్థితులు ఈ వర్గాలపై తీవ్ర వివక్షకు దారితీశాయి. దాదాపు 159 ఏళ్లు నాటి చట్టం కారణంగా సమాజం ఈ వర్గాలను వేరుగా చూస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఫలితంగా వారి మానసిక ఆరోగ్యంపైనా ఈవివక్ష ఎంతోప్రతికూల ప్రభావం చూపింది. వాస్తవానికి వారి లైంగిక స్వభావాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా గుర్తించిన తర్వాత ఏర్పడే పరిణామాలను కూడా అధ్యయనం చేయాలి.
స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసిన తొలి దేశం డెన్మార్క్. ఆ తర్వాత నార్వే, స్వీడన్, ఐలాండ్ దేశాలు డెన్మార్కును అనుసరించాయి. ఆఫ్రికాలో అత్యధిక దేశాల్లో స్వలింగ సంపర్కం చట్ట వ్యతిరేకం. దక్షిణాఫ్రికాలో స్వలింగ సంపర్కులకు రాజ్యాంగంలో స్థానం కల్పించారు. 2007లో నేపాల్ సుప్రీం కోర్టు వీరందరినీ మూడో లింగంగా గుర్తించాలని, వారికి కూడా పౌర హక్కులు కల్పించాలని పేర్కొంది. చాలా దేశాల్లో అనుకూలంగానూ, ప్రతికూలంగానూ చట్టాలున్నాయి. కాలానికి అనుగుణంగా కొన్ని దేశాలు తమ చట్టాల్లో సవరణలు తీసుకువచ్చి స్వలింగ సంపర్కాన్ని ప్రాకృతికంగా గుర్తించాయి. అయితే భారత సర్వోన్నత న్యాయస్థానం మాత్రం స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధమని, అది నేరమని, జీవితఖైదు వరకూ విధించగలిగేంత శిక్షార్హమని చెబుతోంది. ఒక వేళ ఐపీసీ నుండి సెక్షన్ 377 తొలగించాలా? వద్దా? అనే విషయం శాసన వ్యవస్థ చూసుకుంటుందని చెప్పగా, సుప్రీం తీర్పు తమకు శిరోధార్యమని కేంద్రం స్పష్టం చేసింది. 377 సెక్షన్ రాజ్యాంగ పరంగా చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్నది తేలితే మిగిలిన చిక్కు ముడులు అన్నీ వీడిపోతాయని న్యాయ కోవిదులు చెబుతున్నారు. పరస్పర అంగీకార స్వలింగ సంపర్కం నేరం కాదని తేలిపోతే ఈ వర్గాలపై ఉన్న వివక్ష, సామాజిక కళంకం వాటంతట అవే పటాపంచలైపోతాయి. స్వలింగ సంపర్కులు అందరిలా ఏదైనా హక్కును ఉపయోగించుకోకుండా నిషేధించే చట్టం, నిబంధన, నియంత్రణ, స్వీయలిఖిత సంపుటి లేదా మార్గదర్శకం ఏదైనా ఉందా? అని ధర్మాసనం ఒక కేసులో వాదిస్తున్న న్యాయవాది మేనకా గురుస్వామిని ప్రశ్నించింది. అటువంటి నిబంధనలు ఏమీ లేవని, ఈ వర్గాలపై కేవలం వివక్ష మాత్రమే ఉందని మేనకా పేర్కొన్నారు. ఈ వర్గం తీవ్రమైన కళంకం ఎదుర్కొంటున్నారని, లైంగిక స్వభావం ఆధారంగా సమాజం వీరిపై వివక్ష చూపుతోందని, వీరిపై ఉన్న దురభిప్రాయం కారణంగానే సరైన వైద్య సంరక్షణ కూడా పొందలేకపోతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకురావడమైంది. ఈ వాదనలలో అనేక ఇతర అంశాల ప్రస్తావన కూడా వచ్చింది. పురాణ ఇతిహాసాలు, దేవాలయాలపై బొమ్మలు, భారతీయ ప్రాచీన సంస్కృతి, సాహిత్యంలలో అంశాలూ ప్రస్తావనకు వచ్చాయి.
భారతీయ సమాజం సహనానికి ప్రతీక. ప్రకృతిని , జంతుజాలాన్ని కూడా సమానంగా ఆరాధించే సమాజం. ఇలాంటి సమాజంలో భిన్నమైన లైంగికతతో ఉన్న వారిని దూరం చేయడం ఎవరి అభిమతం కాదు, కానీ వారిని సమాజం కలుపుకోవడంతో మిగిలిన వ్యవస్థలు అవస్థల పాలు కాకూడదనే సందేహమే తప్ప ఇతరులను ఇబ్బంది పెట్టాలనేది కాదు. ఒకరి వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదనే చట్టాలు చేసుకున్నాం. ఈ చట్టాలు సమస్యలను పరిష్కరించాలే తప్ప, సరికొత్త సమస్యలను సృష్టించరాదు. ఈ విషయం అర్థం చేసుకుని ఆచితూచి వ్యవహరించడంలో భారతీయ ఉన్నత న్యాయవ్యవస్థ ఎపుడూ ప్రపంచానికి ఆదర్శమే. అందులో సందేహం అక్కర్లేదు.

--బీవీ ప్రసాద్ 98499 98090