మెయన్ ఫీచర్

సాగునీటి రంగంలో సరికొత్త శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల రంగంలో కీలకమైన విధాన నిర్ణయం అమలు చేస్తోంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ‘డ్యాం సేఫ్టీ బిల్లు’ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదించాక చట్టరూపం దాల్చితే- దేశంలోని డ్యాంల పరిరక్షణ, భద్రతకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ ప్రాజెక్టును ‘ఆధునిక దేవాలయం’గా అభివర్ణించారు. సాగునీటి ప్రాజెక్టులు మానవ జీవన విధానాన్ని మార్చి వేసి సంపదను సృష్టిస్తాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రా జెక్టులను నిర్మించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో బృహత్తరమైన పోలవరం, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులూ ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేస్తాయి. హరిత విప్లవం వల్ల పల్లెలు, చిన్న పట్టణాలు కళకళలాడుతాయి. వచ్చే పదేళ్లలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం ఊపందుకుంటుందనడంలో సందేహం లేదు. వీటన్నింటికీ సాగునీటి ప్రాజెక్టులే కారణం. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకుంటూ పోవడం ముఖ్యం కాదు. వీటి భద్రత కూడా ఎంతో ప్రధానం. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీర్లు ఎంతో అద్భుతంగా నిర్మించారు. కాలక్రమంలో వీటి భద్రతపై ప్రభుత్వాలు దృష్టిని సారించలేదు. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా, భద్రత ప్రశ్నార్థకంగా మారింది. 2009లో కృష్ణానదికి పెద్దఎత్తున వరదలు వచ్చినప్పటికీ శ్రీశైలం డ్యాం నీటి ప్రవాహాన్ని తట్టుకుని నిలబడింది. ఆ తర్వాత ఈ డ్యాం భద్రతకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సిఫార్సు చేశారు. ఇదే పరిస్థితి నాగార్జునసాగర్ డ్యాం, ప్రకాశం బ్యారేజీలకు తలెత్తింది. సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుడు ధవళేశ్వరం వద్ద నిర్మించిన ఆనకట్ట 145 ఏళ్లకుపైగా సేవలు అందించి 1986 గోదావరి వరదల్లో దెబ్బతింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావుహయాంలో కొత్త బ్యారేజీని యుద్ధప్రాతిపదికన నిర్మించారు. 1986లో గోదావరి వరదల సమయంలో దాదాపు 36 లక్షల క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం బ్యారేజీ ద్వారా సముద్రంలో కలిసింది. ప్రస్తుతం అదే బ్యారేజీకి 35 కి.మీ ఎగువున పోలవరం ప్రాజెక్టు నిర్మాణమవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని. వచ్చే పదేళ్లలో అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఉంటుంది. కృష్ణానది నీటి కోసం కీచులాటలు తగ్గుతాయి. ఆంధ్రా ప్రాంతం సుసంపన్నమవుతుంది. ఈ ప్రాజెక్టు కాల్వలు తవ్విన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుంది. ఎండిపోతున్న కృష్ణాడెల్టాకు పట్టిసీమ ఎత్తిపోతల స్కీం ద్వారా సాగునీరందించిన నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబును చరిత్ర మర్చిపోదు.
ప్రస్తుతం తెలంగాణలో కూడా పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర, తెలంగాణ మాదిరిగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చుపెట్టడం లేదు. రెండు రాష్ట్రాలు కలిపి దాదాపు రూ.50 వేల కోట్ల మేర నిధులు ఈ రంగంపై వెచ్చిస్తున్నాయి. సాగునీటి రంగం అభివృద్ధికి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చుపెడుతున్నా, వాటి భద్రతకు తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రమే. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం తొలిసారిగా ‘డ్యాం సేఫ్టీ బిల్లు-2018’ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.
ప్రస్తుతం దేశంలో 5,254 పెద్ద డ్యాంలు ఉన్నాయి. మరో 447 డ్యాంలు నిర్మాణంలో ఉన్నాయి. మరెన్నో చి న్న, మధ్య తరహా ప్రాజెక్టులు నిర్మాణమవుతున్నాయి. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, బాక్రానంగల్ ప్రాజెక్టును భాక్రా బియస్ మేనేజిమెంట్ బోర్డు నిర్వహిస్తున్నాయి. వీటి స్ట్రక్చరల్, ఆపరేషన్ విభాగాలు డ్యాంలు సురక్షితంగా ఉండడంలో కీలకపాత్ర వహిస్తాయి. దేశంలో 75 శాతం డ్యాంలు 25 సంవత్సరాల క్రితం నిర్మించారు. 164 డ్యాంలను వందేళ్ల క్రితం నిర్మించారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాలను చూస్తే 36 డ్యాంలు విఫలమయ్యాయి. ఒక్క చిన్న పొరపాటు జరిగినా అపారమైన ప్రాణ,ఆస్తి నష్టం సంభవిస్తుంది. విద్యుత్ ఉత్పత్తి, సాగునీరు, మంచినీటి సరఫరా, వరద నియంత్రణపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని దేశంలో డ్యాంల సేఫ్టీకి సంబంధించి ఏకీకృత చట్టం, పరిపాలన వ్యవస్థ ఇంతవరకు లేదు. డ్యాం సేఫ్టీ బిల్లులో డ్యాంల భద్రత నిఘా, తనిఖీలు, ఆపరేషన్, పర్యవేక్షణ, మరమ్మతులు, సురక్షిత చర్యలకు ప్రాధాన్యత ఇచ్చారు. జాతీయ స్థాయిలో డ్యాం సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేస్తారు. ఇది ఒక రెగ్యులేటరీ సంస్థగా అవతరిస్తుంది. సాగునీటి రంగం విధానాలు, మార్గదర్శకాలు, భద్రతా ప్రమాణాలను ఈ అథారిటీ అమలు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో కూడా డ్యాం సేఫ్టీ సంస్థను సంబంధిత ప్రభుత్వాలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. రెండు అథారిటీలకు మధ్య ఒక నోడల్ అథారిటీని నెలకొల్పుతారు. రెండు రాష్ట్రాలతో ముడివడి ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి భద్రతాపరమైన అంశాలను ఈ ఏజెన్సీ అధ్యయనం చేసి నివేదికలను ఇస్తుంది.
నీటి యాజమాన్యం అంటే ఒక నిపుణుడి వల్ల సాధ్యమయ్యేది కాదు. ప్రజలను భాగస్వాములను చేయాలి. అప్పుడే నీటి యజమాన్యంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఈ బిల్లులో స్రక్టరల్ సేఫ్టీ, ఆపరేషనల్ సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చారు. 2015లో చెన్నైలో వరదలు వచ్చాయి. చెన్నైలో చిన్న నది ఉంది. కాని సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ఎడాపెడా భవనాల నిర్మాణాల వల్ల భారీవర్షాల వల్ల చెన్నై నగరం విలవిలలాడింది. చెన్నై వరదలకు కారణాలను ‘కాగ్’ పేర్కొంటూ, ఈ తరహా వరద బీభత్సాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఒక నదిపై అనేక రాష్ట్రాలు ప్రాజెక్టులు నిర్మిస్తాయి. కాని ఒకరికొకరికి సంబంధం ఉండదు. సమన్వయ లేమి ఎక్కువ. దీని వల్ల ఏ మేరకు నీటిని విడుదల చేస్తున్నారనే దానిపై సకాలంలో వచ్చే హెచ్చరికలు రావు. కేంద్ర జలసంఘం ఉన్నా, ఈ వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంది. దీనివల్ల నీటిని విడుదల చేయడం వల్ల, దిగువ ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టుల నిర్వాహకులకు సరైన సమాచారం అందనందువల్ల వరద ముప్పు ఏర్పడుతుంది. ప్రాజెక్టులు కూడా దెబ్బతింటాయి. పెద్దఎత్తున నీటి ప్రవాహం ఉన్నప్పుడు నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? ప్రస్తుతం ఈ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి.
కృష్ణా నదిపై మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించాయి. గోదావరిపై మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ప్రాజెక్టులు ఉన్నాయి. వెబ్‌సైట్లలో నీటివిడుదల గణాంక వివరాలను నమోదు చేస్తే సరిపోదు. వాగులు, వంకలు, చిన్న నదులు, ఏర్లు నదుల్లో కలుస్తుంటాయి. సాధారణ సమయాల్లో ఇవి ఎండిపోయి ఉన్నా, వర్షాల సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఈ నీటితో వరద తీవ్రత పెరుగుతుంటుంది. ఈ అంశాలన్నీ డ్యాం సేఫ్టీలో భాగంగా చేర్చారు. మన దేశం గర్వించదగిన సంస్థల్లో కేంద్ర జల సంఘం ఒకటి. ఈ సంస్థ, ఉత్తరాఖండ్ జల విద్యుత్ నిగం రూర్కీ ఐఐటీతో కలిసి జాతీయ డ్యాం సేఫ్టీపై సదస్సును నిర్వహించింది. దేశంలో 170కుపైగా డ్యాంలు వందేళ్ల క్రితం నిర్మించారని, వీటి నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని, ఇవి డ్యాం సేఫ్టీకి ముప్పని తేల్చారు. కొన్ని డ్యాంల వైఫల్యాలు పెద్ద నష్టాన్ని కలిగించాయి. మధ్యప్రదేశ్‌లోని జమునియా (2002), రాజస్తాన్‌లోని లవా క బస్ డ్యాం (2003), ఇంకా పంచత్, కడకవాస్లా డ్యాం (1961), నానక్ సాగర్ (1967), టైగ్రా (1970), చిక్కహోల్ (1972) డ్యాంలు సేఫ్టీ చర్యలు లేనందు వల్ల దెబ్బతిన్నాయి.
మోదీ ప్రభుత్వం డ్యాం సేఫ్టీ రిహెబిలిటేషన్ ఇంప్రూమెంట్ ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. చైనా, అమెరికా త ర్వాత ఎక్కువ డ్యాంలు ఉన్న దేశం భారత్. డ్యాంల నియంత్రణకు చట్టబద్ధమైన సంస్థ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. డ్యాంల నిర్వహణకు జవాబుదారీతనం కావాలి. విపత్తు సంభవిస్తే తమకు సంబంధం లేనట్లు చేతులు దులుపుకుని పోయే ధోరణి మన దేశంలో ఎక్కువ. అందుకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్నత ప్రమాణాలు, సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చారు. డ్యాంలకు కస్టోడియన్లు రాష్ట్రప్రభుత్వాలే. పెద్ద డ్యాంలు, చిన్న డ్యాంలు అని కాకుండా వీటి సేఫ్టీకి తీసుకుంటున్న కార్యాచరణ ప్రణాళికలపై నివేదికలు ఇవ్వాలని కేంద్ర జల సంఘం 2006లో అన్ని రాష్ట్రాలకు లేఖలు రాస్తే పెద్దగా స్పందన రాలేదు. 2011లో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి ఈ అంశంపై నివేదికలు ఇవ్వాలని కోరినా, రాష్ట్రప్రభుత్వాలు స్పందించలేదు. దేశంలో సగం రాష్ట్రాలు మాత్రమే కేంద్ర జలసంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి.
బీజేపీ ప్రభుత్వం జాతీయ డ్యాం సేఫ్టీపై ముసాయిదా బిల్లును రూపొందించి అన్ని రాష్టల్రకు పంపింది. కేంద్ర జల సంఘం పరిధిలో ఉన్న డ్యాం సేఫ్టీ సంస్థ సేవలను అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. విపత్తులు చెప్పి రావు. కాని అనుకోని ప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తు ప్రణాళికలు ప్రభుత్వం వద్ద ఉండాలి. డ్యాం సేఫ్టీ రిహెబిలిటేషన్ ఇంప్రూమెంట్ ప్రాజెక్టు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ఏడు రాష్ట్రాల్లో 225 డ్యాంల సేఫ్టీ కోసం కొన్ని చర్యలు తీసుకుంది. సాగునీటి శాఖలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు తన కార్యకలాపాలను ఇప్పటికే ఝార్ఖండ్, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్నాటకల్లో చేపట్టింది. డ్యాం సేఫ్టీకి ఎదురవుతున్న సవాళ్లను టెక్నాలజీ సహాయంతో పరిష్కరించడంలో ఈ సంస్థ ముందడుగువేసింది. జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలు నదీ జలాలను వినియోగించుకోవడానికి పోటీపడుతున్నాయి. ఈ వినియోగం వెనక ఎన్నికలు, ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా, ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీఏ సర్కారు డ్యాంల సేఫ్టీ బిల్లుకు తీసుకుంటున్న చొరవ ప్రశంసనీయం. జాతీయ సాగునీటి ప్రాజెక్టుల రంగంలో విప్లవాత్మకమైన మార్పుల దిశగా భారత్ అడుగులు వేస్తోంది.

--కె.విజయ శైలేంద్ర 98499 98097