మెయన్ ఫీచర్

రాజన్‌పై ఇంత రాద్ధాంతం అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా సెప్టెంబర్ 4న తన పదవీ కాలం పూర్తయిన తరువాత తాను ఇంకా కొనసాగాలని కోరుకోవడంలేదని రఘరామ్ రాజన్ ప్రకటించగానే దేశంలో ఏదో పెద్ద ఉపద్రవం జరగబోతోందనే ఆందోళనలు బయలుదేరాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందా అన్నంత భయాందోళనలు కలగచేసారు. నరేంద్రమోదీ ప్రభుత్వానికి మేధావుల అవసరం లేదని రాహుల్‌గాంధీ అవహేళన చేసారు.
రఘరామ్ రాజన్ పదవీకాలం పొడిగించక పోవడం నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న ఘోర తప్పిదం అని అందువల్ల కలిగే నష్టం భర్తీ చేసుకోవడం అసంభవం అని వ్యాఖ్యానిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే విధంగా పరిస్థితులని అధ్వాన్నంగా మార్చింది యుపిఎ ప్రభుత్వం అని అందరికీ తెలిసిందే. తమ విధానాల అమలుకు తగిన వ్యక్తిగా రాజన్‌ను ఎంపిక చేసుకుని నియమించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లయినా ఇంకా రాజన్‌ను కొనసాగించడం ఆ ప్రభుత్వ అవశేషాలను మోసుకుపోతుండడమే కాగలదు.
రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా రాజన్ పని తీరు చర్చనీయాంశమే. ఆయన పదవిలో కొనసాగడం లేదంటే ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్నది పారిశ్రామిక వర్గాలు కావడం గమనార్హం. రూపాయి మారకం విలువను పటిష్టపరచలేకపోయారని మరిచిపోలేము. అమెరికా, ఐరోపా ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభకర పరిస్థితులు ఎదుర్కొంటున్నా భారత్ మాత్రం అభివృద్ధి వైపు ముందడుగు వేస్తున్నదని గర్వంగా చెప్పుకుంటున్నాము. అయినా రూపాయి మారకం విలువ ఆ మేరకు ఎందుకని గట్టిపడడంలేదు.
అమెరికా ఆర్థిక ప్రయోజనాలు కాపాడడం ప్రథమ ఎజెండాగా అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ద్వారా ఆయన ఈ పదవిలోకి రాగలిగారు. దానితో ఆయన ప్రాధాన్యతల పట్ల డా.సుబ్రహ్మణ్య స్వామి వ్యక్తం చేసిన అనుమానాలు సహజంగా ఉద్భవించినవే. వాటిని తేలికగా కొట్టివేయడం ద్వారా గాక తన సహేతుక చర్యల ద్వారా రాజన్ సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు.
ద్రవ్య అంశాలపై రాజన్‌కున్న సాధికారికత అటుంచితే ఆయన ప్రభుత్వ బ్యాంక్ అధిపతిగా కాకుండా ఒక రాజకీయ నాయకుని వలె వ్యవహరించడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా సహించలేదు. అయితే రాజన్ విషయంలో మోదీ ప్రభుత్వం ఎంతో సహనంతో వ్యవహరించిందని చెప్పవచ్చు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి, తనకు మధ్య వాదోపవాదాలు జరగలేదని స్వయంగా రాజన్ చెప్పడం గమనార్హం.
రిజర్వుబ్యాంక్ గవర్నర్‌గా ప్రభుత్వం ప్రతిష్టగా చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంపై విమర్శలు కుప్పిస్తూ ప్రసంగాలు చేయడం, అసహనం గురించి వ్యాఖ్యలు చేయడం ఏ ప్రభుత్వమైనా సహించగలదా? ఆయనకు భిన్నాభిప్రాయాలు వుంటే ప్రభుత్వానికి తెలపవచ్చు. కానీ ఇటువంటి ప్రసంగాలు చేయడం రాజకీయ ఎజెండాతోనే అని భావింపవలసి ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ కెనడా, అమెరికా ఫెడరల్ బ్యాంక్‌ల గవర్నర్లు ఇటువంటి ప్రసంగాలు చేస్తే ఆయా ప్రభుత్వాలు సహించగలవా? తమను నియమించిన ప్రభుత్వాలపైనే నిపుణులు రాజకీయ విమర్శలకు పాల్పడడం తగునా? రాజన్ పదవిని పొడిగించే అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చడం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రిజర్వుబ్యాంక్ గవర్నర్‌లతో ప్రభుత్వాలు వివాదాలకు పాల్పడడం ఇది ప్రథమం కాదు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంలో జరిగింది. అప్పటి ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి, రిజర్వుబ్యాంక్ గవర్నర్ బెనెగల్ రామారావుల మధ్య తలెత్తిన విభేదాలు ఈ సందర్భంగా గమనార్హం. 1952లో పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు రామారావును గవర్నర్‌గా నియమించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్థిక మంత్రి సి.డి.దేశ్‌ముఖ్‌కు లేఖ రాసారు. ఇంపీరియల్ బ్యాంక్ (ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) జాతీయకరణకు ఆయన వ్యతిరేకి కావడమే అందుకు కారణం. చేనేత రంగానికి సంస్థాగత ఆర్థిక సంస్థల ద్వారా నిర్ణీత కాలంలో ఆర్థిక సహకారం అందించాలని సూచిస్తూ బ్యాంక్‌లకు రామారావు సర్కులర్ పంపారు. అప్పటివరకు అమలులో వున్న సెస్ నిధి పథకాన్ని మార్చాలని సూచించారు. అయితే ఆ పథకం కొనసాగించాలని కోరుతున్న కృష్ణమాచారి ఈ విషయంపై మంత్రివర్గానికి ఫిర్యాదు చేసారు. ఐదేళ్లపాటు గవర్నర్‌గా కొనసాగిన అనంతరం పదవీ విరమణ చేయాలని రామారావు భావించినా ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి మరో ఐదేళ్లు కొనసాగమని కోరడంతో అంగీకరించారు. కానీ 1956లో దేశ్‌ముఖ్ ఆర్థిక మంత్రిగా రాజీనామా చేయడం, కృష్ణమాచారి ఆర్థిక మంత్రి కావడంతో పరిస్థితులు విషమించాయి.
ప్రతి సందర్భంలో తనపట్ల ఆర్థిక మంత్రి దురుసుగా ప్రవర్తిస్తూ పరుషమైన పదాలతో అవమానకరంగా వ్యవహరిస్తున్నారంటూ ఆర్థిక మంత్రిపై ఫిర్యాదు చేస్తూ గవర్నర్ ప్రధానమంత్రికి పలు లేఖలు రాసారు. అయితే నెహ్రూ నచ్చచెప్పేవారు. రిజర్వుబ్యాంక్ ఆర్థిక మంత్రిత్వ శాఖ విభాగం అని అవహేళన చేస్తూ బ్యాంక్ చేయవలసిన విధాన నిర్ణయాలను ఆర్థిక మంత్రి చేస్తుండేవారు. రిజర్వుబ్యాంక్ ప్రతిపత్తి కాపాడడం కోసం చివరికంటూ పోరాడిన రామారావు జనవరి 1957లో గవర్నర్ పదవికి రాజీనామా చేసారు.
రాజన్ విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో హుందాగా వ్యవహరించింది. డా.సుబ్రహ్మణ్యం స్వామి చేసిన ఆరోపణలను స్వయంగా ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఖండించారు. రాజన్‌తోపాటు ప్రభుత్వంలో ఆయనకు మద్ధతుదారునిగా వున్న అరవిందన్ సుబ్రహ్మణ్యన్ సహితం గత ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఎంపిక చేసిన వారే కావడం గమనార్హం. అయినా అరుణ్‌జైట్లీ వారిద్దరినీ పదవులలో కొనసాగించారు.
ప్రజాస్వామ్యంలో రిజర్వుబ్యాంక్ గవర్నర్ నియామకం ప్రభుత్వం రాజకీయంగా తీసుకున్న నిర్ణయమే. ప్రభుత్వ విధానాలకు పరిపుష్టి కలిగించగలరని విశ్వశించిన వారినే సహజంగా నియమిస్తారు. గత ఆర్థిక మంత్రి చిదంబరం నియమించిన రాజన్‌ను అధికారం చేపట్టగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయనను మార్చినా ఎవ్వరూ తప్పుపట్టి ఉండేవారు కాదు. అటువంటి మార్పు మార్కెట్‌లో అనవసరంగా అస్థిరతకు దారితీస్తుందనే భావనతో కొనసాగించారు.
పైగా నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో మన సూక్ష్మ ఆర్థిక స్థితిగతులు సమస్యాత్మకంగా ఉన్నాయి. ఇప్పుడు అటువంటి సమస్యలు లేవు. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం...అన్నీ అదుపులో వున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగమిస్తున్నది. అటువంటి సమయంలో గవర్నర్ మారినా ఆర్థిక వ్యవస్థపై చెప్పుకోదగిన ప్రతికూల ప్రభావాలు వుండే అవకాశం ఉండదు.
ప్రభుత్వం తన పదవీకాలం పొడిగించే అవకాశం లేదని తెలుసుకునే రాజన్ సహితం హుందాగా తన పదవిలో కొనసాగదలచుకోలేదని బ్యాంక్ సిబ్బందికి లేఖలు రాసి వుండవచ్చు. ప్రజాస్వామ్యంలో కీలక పదవులలో నియామకాలు ఇదే విధంగా జరుగుతుంటాయి. సాధారణ ప్రజాస్వామ్య ప్రక్రియను వివాదాస్పదం చేయడం, రాజకీయాలు చొప్పించడం దేశానికి మంచిది కాదు. ఇంతకు ముందు వాజపేయి హయాంలో సహితం రిజర్వుబ్యాంక్ గవర్నర్‌పట్ల చాలా హుందాగా వ్యవహరించింది. గవర్నర్ బిమల్‌జైన్ పదవీ కాలం పొడిగించనున్నట్లు చాలా ముందుగానే ప్రకటించడం ద్వారా అస్థిరతకు అవకాశం లేకుండా చేసారు.
యుపిఎ ప్రభుత్వం హయాంలో సెప్టెంబర్ 2011లో గవర్నర్ పదవీకాలం ముగియనున్న దువ్వూరి సుబ్బారావుకు పొడిగింపు ఇవ్వడంపట్ల నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ విముఖంగా వున్నారు. అయితే మాజీ గవర్నర్ అయిన ప్రధాన మంత్రి మన్‌మోహన్‌సింగ్ సొంతంగా నిర్ణయం తీసుకుని ఆయనకు రెండేళ్లు పొడిగింపు ఇచ్చారు. రిజర్వుబ్యాంక్ పని తీరులో గల సున్నితత్వం బహుశా మన్‌మోహన్‌సింగ్‌కు తెలిసినంతగా వేరెవరికీ తెలియకపోవచ్చు. వివాదాస్పదమైన ఒక విదేశీ బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటుకు ఆయన అనుమతి నిరాకరించడంతో విదేశీ బ్యాంకులకు లైసెన్సులు ఇచ్చే అధికారాలను రిజర్వుబ్యాంక్ నుండి ఇందిరాగాంధీ ప్రభుత్వం తొలగించింది. దానితో ఆయన 1984లో గవర్నర్ పదవికి రాజీనామా చేసారు. అయితే ఇందిరాగాంధీ నచ్చచెప్పి ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటామనడంతో ఆయన పదవిలో కొనసాగారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక రంగంలో వ్యవస్థాగత ఏర్పాట్లను పటిష్టపరచడం పట్ల దృష్టి సారించింది. అందుచేత ఇప్పుడు రాజన్ స్థానంలో ఎవరిని నియమించినా పెద్దగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదు. గవర్నర్‌గా రాజన్ చేసిన గొప్ప కృషి బ్యాంకులను గుడ్డిగా సమర్థించే ప్రయత్నం చేయకుండా నిరర్థక ఆస్తులు పెరిగిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ బ్యాంకుల లాభదాయకత పెంపునకు తీసుకోవలసిన చర్యలపట్ల దృష్టి సారించారు. కేవలం మహిళలతో మహిళల కోసం ఏర్పాటు చేసిన బ్యాంకు నిలదొక్కుకోలేక పోవడం, ఇప్పుడు ఆ బ్యాంకును స్టేట్ బ్యాంకులో విలీనం చేయవలసి రావడం కూడా గమనించదగిన అంశం.
గతంలో మొరార్జీ దేశాయ్, చంద్రశేఖర్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రిజర్వుబ్యాంక్ గవర్నర్లను మార్చారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. దానితో రాజన్ పదవీ కాలాన్ని రాజకీయంగా వివాదాస్పదం చేయడం రిజర్వుబ్యాంకు విశ్వసనీయతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నదని గ్రహించాలి. ఈ విషయంపై మరింత రాద్ధాంతం చేయడం ఎవరికీ మంచిది కాదు.

- చలసాని నరేంద్ర