మెయన్ ఫీచర్

‘వెలుగుల’ ప్రస్థానంలో మైలురాళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యుత్ రంగంలో భారత్ పరుగులు పెడుతోంది. ప్రపంచ స్థాయిలోనే విద్యుదుత్పత్తి రంగంలో గత నాలుగేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత వల్ల భారత్ విశిష్ఠ స్థానం సంపాదించింది. పవన విద్యుత్‌లో నాల్గవ స్థానం, సంప్రదాయేతర ఇంధన విద్యుత్‌లో ఐదవ స్థానం, సౌర విద్యుత్‌లో ఆరవ స్థానంలో మనదేశం నిలిచింది. దేశాభివృద్ధిలో విద్యుత్ రంగం పాత్ర కీలకం. చాలినంత విద్యుత్ లేని పక్షంలో పరిశ్రమలు మూతపడి అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం ఖాయం. స్థూల జాతీయోత్పత్తి రేటు (జీడీపీ) ఆశాజనకంగా నమోదు కావడానికి విద్యుత్ రంగంలో సంస్కరణలు, తగినంతగా ఉత్పత్తి, నిధుల కొరత లేకపోవడం కారణమని చెప్పవచ్చు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పరిస్థితుల్ని విశే్లషిస్తే 2014 మార్చి వరకు దేశంలో విద్యుత్ ఉత్పత్త సామర్థ్యం 2,43,029 మెగావాట్లుగా ఉంటే, గత నాలుగేళ్లలో అదనంగా లక్ష మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ప్రాజెక్టులను నెలకొల్పి ఉత్పత్తిని బాగా పెంచారు. ఈ రోజు విద్యుత్‌ను ఎగుమతి చేసే దేశంగా భారత్‌కు గుర్తింపులభించింది. 2017-18లో భారత్ నుంచి నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు 7,203 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పంపిణీ చేశారు. గత ఐదేళ్లలో ఇంధన లోటు 4.2 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గింది. రూ.48,427 కోట్లవిలువైన 26 ప్రాజెక్టులను ‘టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్’ ద్వారా పారదర్శక విధానంలో ఖరారు చేశారు. అంతర, ప్రాంతీయ బదలాయింపుసామర్ధ్యాన్ని 16వేల మెగావాట్ల నుంచి 50,500 మెగావాట్లకు పెంచారు. 2014 కంటే ముందు సాలీనా 4,800 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే గగనమయ్యేది. గత నాలుగేళ్లలో ఏటా 24వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా కృషి చేశారు. గతంలో సాలీనా 3,400 సర్క్యూట్ కి.మీ ట్రాన్స్‌మిషన్ కెపాసిటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తే 2014 నుంచి సాలీనా 25వేల సికిమీ కెపాసిటీని నిర్మించే స్థాయికి మన దేశం ఎదిగింది.
ఆర్థిక, సంక్షేమ రంగాల్లో ఏ దేశమైనా ఎదగాలంటే విద్యుత్ రంగం ప్రధానపాత్ర పోషిస్తుంది. మన విద్యుత్ రంగం తొలినాళ్లలో అనేక ఒడిదొడుకులకు లోనైంది. సంప్రదాయ విద్యుత్ వనరులైన బొగ్గు, లిగ్నేట్, సహజవాయువుల నుంచి, జల విద్యుత్, అణువిద్యుత్ రంగాల నుంచి, సంప్రదాయేతర ఇంధన వనరులైన పవన, సౌర, వ్యవసాయ, ఇళ్లలోని చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు మన దేశం ప్రణాళికలను రూపొందించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 25 దేశాల్లో విద్యుత్‌కు సంబంధించి భారత్ నాల్గవ ర్యాంకును సాధించడానికి ప్రధాని మోదీ ‘విజన్ డాక్యుమెంట్’ కారణమైంది. దీంతో విద్యుత్ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2000 ఏప్రిల్ నుంచి 2017 డిసెంబర్ వరకు విద్యుత్ రంగంలోకి 12.97 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. భారత్‌కు వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో విద్యుత్ వాటా 3.52 శాతం కావడం విశేషం. ఇంధన సామర్ధ్య సర్వీసుల్లో (ఇఇఎస్‌ఎల్) 454 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇఇఎస్‌ఎల్ తీసుకున్న చర్యల వల్ల 37 బిలియన్ల కెడబ్ల్యుహెచ్ విద్యుత్‌ను ఆదా చేశామని గణాంకాలు చెబుతున్నాయి. 30 మిలియన్ టన్నుల మేరకు గ్రీన్ హౌస్ గ్యాస్ ప్రభావం తగ్గించగలిగాం. సబ్సిడీలు పక్కదారి పట్టకుండా లబ్దిదారులకు నగదు బదలాయింపుద్వారా ప్రయోజనాలను చేకూర్చుతున్నారు. 2018లో బయో ఇంధనంపై జాతీయ విధానాన్ని కేంద్రం ఆమోదించింది. ప్రస్తుతం 2022 నాటికి 175 గిగావాట్స్ (జిడబ్ల్యు) సంప్రదాయేతర ఇంధన వనరులను ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 100 జిడబ్ల్యు సౌర విద్యుత్, 60 జిడబ్ల్యు పవన విద్యుత్ లక్ష్యాలు చేరి ఉన్నాయి. సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులపై నిర్దిష్ట విధానాన్ని కేంద్రం తయారు చేస్తోంది. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి రంగంపై కేంద్రం దృష్టిని సారించింది. ప్రస్తుతం దేశంలో 192 జిడబ్ల్యు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 2040 నాటికి 330-441 జిడబ్ల్యు థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని నిర్దేశించారు.
మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2019లో ప్రపంచంలోనే ఎల్‌ఈడీ లైట్ల వాడకంలో భారత్ ప్రథమ స్థానానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేశారు. దీని వల్ల సాలీనా రూ.40వేల కోట్ల విలువ చేసే విద్యుత్‌ను ఆదా చేసినట్లవుతుంది. విద్యుత్ ఉత్పత్తి, ఆదా, పంపిణీ వంటి విషయాల్లో నష్టాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. 2019లో రికార్డు స్థాయిలో రెండు ట్రిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని మార్గనిర్దేశనం చేసింది. గృహ, వాణిజ్య, వ్యవసాయ రంగాలకు 24 గంటల పాటు విద్యుత్ అందించాలనే కల సాకారం చేసేందుకు ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలను అమలు చేస్తోంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు పదేళ్ల పాటు ‘పన్ను రహిత’ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో 2022 నాటికి 175 జీడబ్ల్యు సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. అనేక కారణాల వల్ల, గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల జల విద్యుత్ కుంటుపడింది. ఈ రంగానికి మోదీ ప్రభుత్వం కాయకల్ప చికిత్స చేపట్టింది. 2022 నాటికి జల విద్యుత్ ఉత్పత్తిని 20 జిడబ్ల్యు నుంచి 60 జిడబ్ల్యుకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక థర్మల్ రంగంలో 4.27 శాతం, అణువిద్యుత్ రంగంలో 0.87 శాతం, సంప్రదాయేతర ఇంధన వనరుల్లో 23.48 శాతం విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. మొత్తం మీద విద్యుత్ రంగంలో ఉత్పత్తి వృద్ధిరేటు 5.35 శాతం నమోదైంది. జలవిద్యుత్ ఉత్పత్తి మాత్రం 3.07 శాతం తగ్గింది. విద్యుత్ రంగానికి వచ్చే ఐదేళ్లలో రూ.11,55,652 కోట్ల విదేశీ పెట్టుబడులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిధులతో 58,384 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతారు. ఇందులో 47,855 మెగావాట్ల థర్మల్ విద్యుత్, 406 మెగవాట్ల సహజవాయువు విద్యుత్ స్టేషన్లు, 6823 మెగావాట్ల జల విద్యుత్ స్టేషన్లు, 3300 మెగావాట్ల అణు విద్యుత్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.
రూ.11.55 లక్షల కోట్ల కేటాయింపులు చేసినా, రూ.8.52 లక్షల కోట్లతో గత ఐదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. మిగిలిన రూ.3.02 లక్షల కోట్లతో మరిన్ని ప్రాజెక్టులను చేపట్టి 2022-27 మధ్య కాలంలో పూర్తి చేస్తారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్పొరేషన్, జీవిత బీమా సంస్థ, పలురకాల బాండ్లు, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, ఎగ్జిమ్ బ్యాంకుల నుంచి కూడా విద్యుత్ రంగానికి రుణాలు సేకరిస్తున్నారు.
‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన’ ద్వారా గ్రామాల విద్యుదీకరణ కార్యక్రమానికి రూ.75,893 కోట్లను కేటాయించారు. ఈ స్కీం కింద రాష్ట్రాలకు కేటాయించే నిధులను 2.5 రెట్లు పెచారు. ఇంతవరకు 4.09 లక్షల ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేశారు. ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ స్కీం కింద రూ. 65424 కోట్లతో ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఉదయ్ స్కీం కింద రూ.20వేల కోట్ల వడ్డీలు ఆదా అయ్యాయి. ఈ స్కీం డిస్కామ్‌లకు కల్పతరువని చెప్పవచ్చు. 33 శాతం రెవెన్యూ లోటును పూడ్చారు. ఈజ్ ఆఫ్ గెటింగ్ ఎలక్ట్రిసిటీ ర్యాంకింగ్‌ల భారత్ స్థానం 111 నుంచి 29వ స్థానానికి చేరింది. సౌభాగ్య స్కీం కింద ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చెందిన 60.34 లక్షల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ‘అందరికీ విద్యుత్’ అనే బృహత్తర పథకాన్ని 2019 ఏప్రిల్ 1 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ రంగంపై బీజేపీ సర్కారు దృష్టి పెట్టింది. రూ. పదివేల కోట్లతో 9,004 గ్రామాల విద్యుదీకరణ పనులు చేపట్టారు. ఉజల స్కీం ద్వారా 107 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేశారు. దీనివల్ల సాలీనా రూ.15,500 కోట్ల విద్యుత్‌ను పొదుపుచేయవచ్చు. 2014-18 మధ్య 4,376 మెగావాట్ల జల విద్యుత్‌ను అదనంగా ఉత్పత్తి చేశారు. లైసెన్సు లేకుండా విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పేందుకు అవకాశం ఇవ్వనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా పదివేల విద్యుత్ వాహనాలను సమకూర్చనున్నారు. ఇంతవరకు 50 లక్షల స్మార్ట్ మీటర్లను నెలకొల్పారు. మొత్తం కోటి ప్రీపెయిడ్ మీటర్లను అమర్చనున్నారు. విద్యుత్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు సౌభాగ్య, విద్యుత్ ప్రవాహ్, ఉజల, ఉర్జామిత్ర, మెరిట్, ఉదయ్, తరంగ్, అర్బన్ జ్యోతి అభియాన్, దీప్ ఈ-బిడ్డింగ్, ఆష్ ట్రాక్ యాప్‌లను కేంద్రం ప్రవేశపెట్టింది. వృద్ధిరేటు 7 శాతం దాటి 8 శాతానికి చేరుకునే దిశగా భారత్ ఆర్థిక రంగం దూసుకుపోతోంది. పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి చోదక శక్తి విద్యుత్. కేంద్ర, రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలు విద్యుత్‌కు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. దీని వల్ల 1980,90 దశకాలు, 2000 నుంచి 2010 వరకు తీవ్రమైన విద్యుత్ కోతలతో ప్రజలు కటకటలాడిన రోజులను మర్చిపోలేం. పరిశ్రమలు నెలల తరబడి మూతపడేవి. ప్రస్తుతం స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలతో విద్యుత్ రంగాన్ని నూతనోత్తేజంతో మోదీ సర్కారు ముందుకు తీసుకెళుతోంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097