మెయిన్ ఫీచర్

ముక్తికి మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైతిక జీవితంలో మానవుడు తన కర్తవ్య కర్మల ద్వారా హృదయంలోని మాలిన్యాన్ని కడిగి దైవప్రార్థనవైపు తన దృష్టిని మరల్చడానికి ప్రయత్నించాలి. ఈ ప్రయత్నంలో అలసిపోకుండా కొంత శక్తిని బలాన్ని తనకు చేకూర్చమని ఆ దైవానే్న ప్రార్థించాలి. ఇందుకు వేదమంత్రాలను పఠించాలి. వేద మంత్రాలలో వున్న మహత్తరశక్తి మనిషిని సన్మార్గంలో నడిపించగలదు. వేదపఠనం ద్వారా విశేషమైన ఆధ్యాత్మిక సంపద లభిస్తుంది. తద్వారా మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. ఈ ప్రార్థనల ద్వారా వేద పఠనం ద్వారా ‘అహం బ్రహ్మాస్మి’ అనే దివ్యమైన అనుభూతిని పొందే మార్గం లభిస్తుంది. పూర్వం మహామునీశ్వరులు బ్రహ్మర్షులు మానవాళికి ప్రసాదించిన వేదమంత్రాలు పఠనం చేసి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఆధ్యాత్మిక పరిభాషలో వైదిక తత్వం వేదాంతంగా వ్యవహరించబడుతూ ఉపనిషత్తులు వేద సారస్వతానికి మకుటాయమానంగా నిలిచాయి. ప్రకృతీ పురుషులైన పార్వతీ పరమేశ్వరుల ధ్యానంతో మనస్సులోని మాలిన్యం తొలగిపోతుంది. ఏ శుభకార్యానికైనా తొలుత మహాగణపతిని ధ్యానించాలి.
‘గణానాంత్వా గణపతిగ్‌ం హావామహే...’ అంటూ ఓ గణేశా! నీకు ప్రణామం. నీవు సాక్షాత్తు పరబ్రహ్మవు. వేదపఠనం ద్వారా నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈ వేద మంత్రాలను సరియైన ఉచ్ఛారణతో పఠించగలిగేలా మాకు శక్తిని ప్రసాదించుము అని విఘ్న వినాయకుడిని ప్రార్థించిన తరువాత వేద పఠనం ప్రారంభించాలి. ‘ఓం నమో భగవతే రుద్రాయ..’ భగవంతుడైన రుద్రునికి ప్రణామం. నీవు ధరించిన బాణాలకు, ధనస్సుకు నమస్కరిస్తున్నాను. నీ ధనుర్భాణాలు అమ్ముల పొద మాకు శుభసూచకంగా కనిపిస్తున్నాయి. నీ ధనర్విద్యతో మాకు సుఖశాంతులు శుభాన్ని కలిగించు. నీ శాంత స్వరూపంతో మాకు జ్ఞానాన్ని ప్రసాదించు.
ఓ పరమేశ్వరా.. కైలాస పర్వతంపై నివసించేవాడా.. సర్వ రక్షకా నీవు ధరించిన ధనుర్భాణాలను శాంతింపజేసి ఈ జగత్‌లోని జనులను రక్షించి కాపాడుము. సృష్టిలోని జీవులందరూ శారీరక మానసిక ఆరోగ్యంతో సుఖ శాంతులతో వర్థిల్లాలి. ఆనందంగా వుండేలా అనుగ్రహింపుము. ఈ విధంగా సూర్య మండల రూపుడైన రుద్రమూర్తిని ప్రజలందరూ దర్శించుకుంటున్నారు. ఓ రుద్రా, నీలకంఠా, సహస్రాక్షా మాపై కరుణా కటాక్షాలతో దృష్టి మరల్చి మమ్మల్ని అనుగ్రహించమని ప్రణమిల్లుతున్నాము. శత్రు సంహార రూపము విడచి భక్త జనులను రక్షించే శాంత స్వరూపమును ధరించి మాకు శుభము కలిగించుము. విశ్వమంతటికి ప్రభువు, దేవాదిదేవుడవు, త్రినేత్రుడు, నీలకంఠా, మృత్యుంజయా మా ప్రణామములు అందుకో. జనన మరణాల మార్గంలో జీవుల రూపంలో నర్తించు రుద్రునికి నమస్కారం. ‘నమో గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః’- గణాధిపతుల, రుద్ర గణముల రూపములో వున్న రుద్రునికి నమస్కారం. సేనలు, సేనాధిపతుల రూపములో వున్న రుద్రునికి నమస్కారం. సృష్టి స్థితి లయకారకుడైన రుద్రునికి నమస్కారము. ఇంద్రియములకు అధిపతి, శరములను ప్రయోగించువాడు, స్థితికంఠుడు అగు రుద్రునికి నమస్కారము. ‘నమో సహస్రాక్షాయ చ శతధన్వనేచ’- వేయి కన్నులు కలవాడు, నూరు ధనుస్సులు కలిగిన రుద్రునికి నమస్కారము. పర్వతముపై శయనించువాడు, శీఘ్రగమనుడు, సర్వాంతర్యామియైన రుద్రునికి నమస్కారము. సదా శక్తి స్వరూపిణియైన ఉమాదేవితో వున్నవాడా సంసార దుఃఖమునుండి విముక్తి కలిగించే రుద్రునికి నమస్కారము. సస్యశ్యామలమైన క్షేత్రములలో కొలువైనవాడా భక్తజన సులభుడు, సముద్రపు అలలయందు వున్న రుద్రునికి నమస్కారము. అంతరిక్షం, దివ్య లోకాలయందున్న రుద్రమూర్తులకు నమస్కారము. ‘యే తే సహస్ర మయుతం పాశామృతో మర్త్యాయ హస్తవే’- ఓ రుద్రా! జీవులకు బంధకరములైన పాశములను నీ అనుగ్రహముతో, మా పుణ్య కార్యములతో మేము తొలగింపజేసుకుందముగాక! మమ్మల్ని కరుణించి సర్వదా మమ్మల్ని కాపాడుము. జ్ఞాన స్వరూపుడైన రుద్రుని ఆరాధించి మానసిక శాంతిని పొందుదుము. నిన్ను స్మరించి, నీ దర్శనంతో నాకు మహద్భాగ్యము లభించినది. నీ నామ పారాయణంతో, భవరోగాలనుండి విముక్తి కలుగును. నీ నామం దివ్య ఔషదం.
ప్రతినిత్యం పరమ పవిత్రమైన పరమేశ్వరుడి నామాలు జపించినవారికి ఉమామహేశ్వరుల కృపాకటాక్షాలు లభించగలవు. సృష్టికర్త వేద మంత్రాలను సృష్టించాడని, నిగూఢమైన, మహాశక్తివంతమైన వేద పఠనంతో ఆధ్యాత్మిక సంపదను పొంది ప్రజలు భక్త్భివంతో పునీతులు అగుగాక. శ్రీసూక్తం, నమకం, చమకం, రుద్రం పఠనంతో మనోనేత్రంతో పరమేశ్వరుని దర్శించగలిగితే అజ్ఞానాంధకారం నుండి విముక్తి కలుగుతుంది.

-బ్రహ్మశ్రీ కురువాడ మురళీధర్