మెయిన్ ఫీచర్

వాగుడు కాయలు కాదు... బెల్లం కొట్టిన రాళ్లు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి వెళ్లటానికి విజయవాడ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ ఎక్కాను. నా కొలీగ్ కూతురి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నాను. అదృష్టవశాత్తూ ఈ రోజు ట్రైన్‌లో ఎక్కువమంది జనం లేరు. కిటికీ పక్కన సీటు ఎక్కడ ఖాళీగా ఉంటుందా అని వెతుక్కుంటూ ఉండగా ఒక చోట కనిపించింది. ‘హమ్మయ్యా’ అనుకుంటూ సర్దుకుని కూర్చున్నాను.
‘‘హలో! కృష్ణగారూ! ఎదురుసీటులో కూర్చున్న ఆమె పలకరించింది. ‘ఎవరో’ అనుకుంటూ ఒక్క క్షణం ఆలోచించాను.
‘‘నన్ను గుర్తుపట్టలేదా! ఇంటర్నీడియెట్ నుంచీ డిగ్రీవరకు ఐదేళ్ల పాటు ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నాం’’ అన్నది.
‘‘ఓ! మీరా! మీపేరు సుజాత కదూ!’’ నవ్వుతూ అడిగాను.
‘‘అవును. మనం విడిపోయి పాతికేళ్లు అయింది. ఇప్పుడేం చేస్తున్నారు?’’ అడిగింది. చెప్పాను. ఆమె కూడా తన వివరాలు చెప్పింది. ఆమె పక్కనే కూతురు కాబోలు ఇరవై ఏళ్ళ అమ్మాయి కూర్చుని ఉంది. మోడ్రన్ డ్రెస్ వేసుకుని ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని సెల్‌ఫోన్‌లో పాటలు వింటూంది.
‘‘మీ అమ్మాయా?’’ అన్నాను.
‘‘అవును. మా రెండో అమ్మాయి’’ చెప్పింది సుజాత.
‘‘ఏం చదువుతున్నావమ్మా!’’ అడిగాను. కళ్ళు మూసుకుని తాదాత్మ్యంగా పాటలు వింటున్న ఆ అమ్మాయి మాట్లాడలేదు. ‘‘నినే్న’’ సుజాత తట్టింది. ఒక చెవిలో నుంచి ఇయర్‌ఫోన్ వైరు తీసి ప్రశ్నార్థకంగా చూసింది. మళ్లీ అదే ప్రశ్న అడిగాను. ‘‘బిటెక్ సెకెండియర్ అంకుల్!’’ అని చెప్పి మళ్లీ వైరు చెవిలో పెట్టుకుని తన లోకంలో తను మునిగిపోయింది.
సుజాత, నేను కాలేజీ నాటి కబుర్లు గుర్తుతెచ్చుకుంటూ చెప్పుకున్నాం.
‘‘ఆ రోజుల్లో ఏదైనా ఒక పీరియడ్ లెక్చరర్ రాకపోతే అమ్మాయిలంతా వెయిటింగ్ రూమ్‌లో చేరి ఒకటే కబుర్లు చెప్పుకునేవాళ్ళు. మా అబ్బాయిలంతా మీ లేడీస్ వెయిటింగ్ రూంకి ఒక నిక్ నేమ్ పెట్టాము. గుర్తుందా!’’ అడిగాను.
‘‘లేకేం? కోళ్ళఫారం’’ ఫక్కున నవ్వింది. నేను కూడా నవ్వాను.
‘‘మేం అబ్బాయిలం పని ఉన్నా లేకపోయినా వరండాలలో తిరుగుతూ అమ్మాయిల దృష్టిలో పడాలని ప్రయత్నించేవాళ్ళం. అమ్మాయిలు మావైపు చూడగానే క్రాపు సరిచేసుకుని ఇంకా ఠీవిగా నడిచేవాళ్ళం’’ అన్నాను.
‘‘మేం కూడా కబుర్లు చెబుతూనే వరండాలో అబ్బాయిల మాటలు వినపడగానే టక్కున తల తిప్పి చూసేవాళ్ళం’’ అన్నది సుజాత నవ్వుతూ.
‘‘ఆ వయసే వేరు’’ అన్నాను.
విజయవాడ నుంచీ తెనాలి రావటానికి గంటసేపు ప్రయాణం పట్టింది. కబుర్లలో మునిగిపోయిన మాకు గంట ఎలా గడిచిందో తెలియలేదు. తెనాలిలో దిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయాం.
ఇంటికి వచ్చినా కూడా నాకు ఆ సంఘటనే గుర్తుకు రాసాగింది. చిన్ననాటి స్నేహితురాలిని చాలాకాలం తర్వాత చూడటమూ, మనసారా మాట్లాడుకోవటంతో చాలా సంతృప్తిగా అనిపించింది. కానీ వాళ్ళ అమ్మాయి ధోరణే చిత్రంగా అనిపించింది. అడిగిన ఆ ప్రశ్నకు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం మాట్లాడాలన్న కుతూహలం కూడా చూపించలేదు. చెవిలో నుంచీ ఇయర్‌ఫోన్స్ తీయలేదు. వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు.
ఇప్పటి యువతరం అంతా ఇంతే! తెల్లవారి లేచింది మొదలు సెల్‌ఫోన్ లేకండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. నిద్రపోయేటప్పుడు కూడా దిండు కిందే ఉంటుంది. లేవగానే ‘గుడ్‌మార్నింగ్’ అనే మెసేజ్. మెసేజ్‌లతోనే మాట్లాడుకుంటారు. ‘ఏం చేస్తున్నావు?’ అని ఏ ఫ్రెండో మెసేజ్ చేస్తే ‘ఇపుడే నిద్ర లేచాను’ అని రిప్లై ఇస్తాడు. ఇదివరకు ఎవరైనా పలకరించేటప్పుడు ఎంతో మర్యాదగా ‘్భజనం చేశారా?’ అని అడిగేవారు. ఇప్పటి పిల్లలు ‘తిన్నావా!’ మెసేజ్ పెడతారు.
ఒకప్పుడు ఏదైనా అకేషన్ వస్తే ఫొటోగ్రాఫర్‌ని ఇంటికి పిలిపించి ఫొటోలు తీయించుకునేవారు. అవి ఆల్బంలో పెట్టుకుని అప్పుడప్పుడు చూసుకుంటూ ఆ స్మృతులను నెమరువేసుకునేవారు. ఇపుడు కూర్చున్నా, నుంచున్నా, బజారులో వున్నా అదేదో ఘనకార్యమైనట్లు ఫొటోలు దిగుతారు. అవి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి ఎన్ని లైకులు, ఎన్ని కామెంట్లు వచ్చాయో, ఎంతమంది షేర్ చేసుకున్నారో నిమిష నిమిషం చెక్ చేసుకుంటారు. డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేసేటప్పుడు కూడా ఎడమ చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని చూసుకుంటూ ఉంటారు. తల్లి ఏం కూర చేసిందో, రుచిగా ఉందో లేదో కూడా పట్టించుకోరు. ‘‘ఈ రోజు కూర బాగుందమ్మా’’ అనో, ‘టిఫిన్ బాగుందమ్మా’ అనో చెబితే ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది. తన బిడ్డ కడుపు నిండితే తను తిన్నట్లుగా తృప్తిపడుతుంది.
రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా తల్లిదండ్రులు కోప్పడితే దుప్పటి ముసుగు కప్పుకుని సెల్‌ఫోన్ చూస్తూ ఉంటారు. దుప్పట్లో నుంచీ లైటింగ్ కనబడుతూ ఉంటుంది. కొద్దిగా స్థితిమంతులు, ఎవరి గది వారికి ఉన్న కుటుంబం అయితే గదిలోకి వెళ్లి తలుపేసుకుంటారు. వైఫై పోయి ఇంటర్నెట్ ఆగిపోతే తప్ప ఆ తలుపులు తెరచుకోవు.
ఇప్పటితరం అన్నదమ్ములు కానీ, అక్కచెలెళ్ళు కానీ ఒకే ఇంట్లో ఉన్నా ఒకరికొకరు మాట్లాడుకోరు. అదేమంటే ప్రైవసీ కావాలిట. ప్రైవసీ ఎంతవరకు? మనుషులమధ్య అనుబంధం లేకుండా పోయేవరకూనా!
ఏదైనా పెళ్లికిగానీ, ఫంక్షన్‌కిగానీ తీసుకువెళదామని తల్లిదండ్రులు రమ్మంటే, ‘అక్కడెవరూ నాకు తెలియదు’ అనో, ‘నాకు ఇంట్రెస్ట్ లేదు’ అనో ఒక్క ముక్కలో తుంచేస్తారు. పదిమందిలో తిరుగుతూ ఉంటేనే కదా పరిచయాలు పెరిగేది? నలుగురితో మాట్లాడుతూ ఉంటే బెరుకుపోయి స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయగలుగుతారు. ఇంట్రెస్ట్ లేదని ఒంటరిగా కూర్చుంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు
తమ వ్యక్తిగత ఇష్ట ఇష్టాలను కొంత తగ్గించుకుని పదిమందితో కలవాలి. మనం సమాజంలో జీవించేటప్పుడు ‘నా ఇష్టం’ అన్నట్లు ఉండకూడదు. పదిమందికీ ఆమోదయోగ్యం అయ్యేటట్లు అందరూ మెచ్చుకునేటట్లు నడచుకోవాలి. నీకు ఏదైనా అవసరం అయినపుడు పక్కవాళ్లు సాయం చేసేటట్లు ఉండాలి. ‘‘నేనింతే! ఇదే నాకు ఇష్టం’’ అనుకుంటే క్రమక్రమంగా అందరికీ దూరమయి ఏకాకులుగా మిగిలిపోతారు.
ఇదివరకు గలగలా మాట్లాడేవారిని చూసి ‘‘వాగుడుకాయలలాగా మాట్లాడుతున్నావు, చిన్నప్పుడు మీ అమ్మ ఎంత వసపోసి పెంచిందో!?’’ అనేవారు. ఇప్పటి తరంవాళ్ళు వాగుడుకాయలు కాదు, పిలిచినా సమాధానం చెప్పని బెల్లంకొట్టిన రాళ్ళులాగా మారిపోతున్నారు.

-గోనుగుంట మురళీకృష్ణ