మెయన్ ఫీచర్

మోదీని ఓడించాల్సిందే.. అదెట్లా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓ డించాలనే విషయంలో ఒకే విధమైన ఏకా భిప్రాయం విపక్షాల్లో వ్యక్తం అవుతోంది. భాజపా మిత్రపక్షాలు సైతం అదే అభిప్రాయంతో ఉన్నాయి. భాజపాలోని పలువురు నేతలు కూడా మోదీ ప్రధానిగా కొనసాగడం పట్ల విముఖంగా ఉన్నారు. ఆయన ప్రధానిగా మరో ఐదేళ్లు కొనసాగితే దేశానికి, ప్రజలకు, పరిపాలనకు ఏదో ముప్పు వాటిల్లుతుందని వారెవ్వరూ ఆందోళన చెందడం లేదు. తమ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని వారు భయపడుతున్నారు. తమ రాజకీయ ఉనికి ప్రమాదంలో పడుతుందని కంగారు పడుతున్నారు. మరో ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండగలమా? అనే సంశయంలో పడుతున్నారు. అయితే, మోదీని తిరిగి అధికారంలోకి రాకుండా చేయటం ఎట్లాగో మాత్రం ఎవ్వరిలోనూ స్పష్టత లేదు. అందుకు కాంగ్రెస్ , కొన్ని ప్రతిపక్షాలు ఒకే సూత్రాన్ని చెబుతున్నాయి. భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల నుండి ప్రతి ఎంపీ స్థానంలో ఒకే అభ్యర్థి ఉండాలని సూత్రీకరణకు వచ్చాయ. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉపఎన్నికలలో ఈ సూత్రం మంచి ఫలితం ఇవ్వడంతో వారిలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. తామంతా కలిస్తే మోదీని ఓడించినట్లే అనే ధీమాకు విపక్ష నేతలు వస్తున్నారు.
ప్రతిపక్షాలు ఒకే అభ్యర్థిని నిలబెట్టడం చెప్పినంత సులభం కాబోదు. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్‌లో అక్కడ బలం లేని కాంగ్రెస్‌కు సీట్లు వదలాలంటే- కాంగ్రెస్‌కు బలం ఉన్న ఇతర రాష్ట్రాల్లో తమకు కూడా కాంగ్రెస్ సీట్లు వదలాలని బీఎస్పీ వంటి పార్టీలు పట్టుబడుతున్నాయి. శివసేన వంటి పార్టీలు మోదీ పట్ల ఎంతగా విమర్శలు కురిపిస్తున్నప్పటికీ, కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి సిద్ధపడడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రతిపక్షాలకు కేంద్ర బిందువుగా ఒప్పుకోవడానికి సుముఖత చూపడం లేదు.
ప్రతిపక్షాలలో ఎవరికి వారే ప్రధానమంత్రి కావాలనే ఆశలు చెలరేగడమే భాజపాకు వ్యతిరేకంగా ఒక్కటిగా పోరాడడంలో సమస్యలు సృష్టిస్తున్నది. అందుకనే మహాకూటమి ఏర్పాటు కోసం జరుపుతున్న ప్రయత్నా లను ప్రధాన మోదీ కొట్టిపారేశారు. గతంలో పలుసార్లు ఇటువంటి ప్రయత్నాలు జరిగినా ఎటువంటి ఫలితం సాధించలేక పోయారని గుర్తు చేశారు. విపక్షాలు కూటమిగా ఏర్పాటైనా ఎప్పుడు విడిపోతాయన్నదే ప్రశ్న. ఎన్నికలకు ముందు విడిపోతారు, ఎన్నికల తర్వాత కూడా విడిపోతారు ? అంటూ ఎద్దేవా చేసిన ప్రధాని వి పక్షాలు కలసి ఉండటం అసంభవం అన్నట్లు పేర్కొ న్నారు. ప్రతిపక్షాలలో ఉన్న వైరుధ్యాలను గతంలో కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకొని అధికారంలో కొనసాగుతూ వచ్చింది, ఇప్పుడు భాజపా అటువంటి ప్రయత్నం చేస్తున్నది. పలు ప్రతిపక్షాలు ఒకవంక కాంగ్రె స్‌కు స్నేహహస్తం చాస్తూనే ఎందుకైనా మంచిదని మరోవంక భాజపా పట్ల మిత్రత్వం జరిపే ప్రయత్నాలు చేస్తున్నాయి.
కాంగ్రెస్ మోదీని ఓడించడానికి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 250 నుండి 300 సీట్ల వరకూ మాత్రమే చాలా తక్కువగా పోటీ చేసి, మిగిలిన సీట్లను ఇతర ప్రతిపక్షాలకు వదిలి వేయాలని చూస్తున్నది. దీంతో కాంగ్రెస్ సొంత బలంపై ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు. భాజపా గనుక ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో లేని పక్షంలో 40 నుండి 50 సీట్లు తాము సంపాదించుకొంటే బిజెపి, కాంగ్రెస్‌లలో ఎవరో ఒకరు మద్దతు ఇస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని ఇప్పుడు చాలామంది ఆశ పడుతున్నారు. గతంలో చంద్రశేఖర్, దేవెగౌడ వంటి వారు ప్రధాని పదవి చేపట్టడం వారికి ఆదర్శంగా కనిపిస్తున్నది. మమతా బెనెర్జీ, మాయావతి, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు ఇటువంటి ఎత్తుగడలోనే అడుగులు వేస్తున్నారు. అందుకనే ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో ఎన్నికల తర్వాత మాట్లాడుకొందాం, ఇపుడెందుకు? అంటూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. తనకు బలం ఉన్న చోట్ల ఇతర పక్షాలకు సీట్లు ఇవ్వడానికి విముఖంగా ఉన్న కాంగ్రెస్ జాతీయ స్థాయిలో పొత్తులు వద్దని, రాష్ట్రాలలోనే ఏర్పాటు చేసుకొందామని వాదిస్తూ వస్తున్నది.
భాజపా 282 సీట్లను సొంతంగా గెల్చుకోలేదు, కనీసం 100 సీట్లు తగ్గుతాయనే అంచనాలతో విపక్ష నేతలు ముందుకు వెడుతున్నారు. ఆ నష్టాన్ని ఈశాన్య రాష్ట్రాలలోని 25 సీట్లు, దక్షిణాదిన 132 సీట్లపై కన్ను వేసి ఎట్లా భర్తీ చేసుకోవాలా? అని బిజెపి వ్యూహరచన చేస్తున్నది. ప్రజలను ఆకట్టుకోగల మోదీ వంటి నా యకుడు తమకు లేకపోవడం, అపరిమితమైన వనరులు లేకపోవడం, అద్భుతమైన కార్యకర్తల బలం లోపించడం వంటి సమస్యలతో ఇతర రాజకీయ పక్షాలు భాజపాను ఎదుర్కోవడంలో వెనుకడుగు వేయవలసి వస్తున్నది. భాజపా గత ఎనికలలో 31 శాతం ఓట్లతోనే అధి కారంలోకి రావడం గమనార్హం. ఎన్నికలలో ఘోరంగా దెబ్బ తిన్న ఎస్పీ, బిఎస్పీ, జేడీయూ, డీఎంకే పార్టీలు తమ వోట్ల శాతాన్ని మాత్రం కోల్పోలేదు. రాహుల్ గాంధీ చెప్పిన్నట్లు భాజపాకి వ్యతిరేకంగా కనీసం 400 ఎంపీ సీట్లలో ఒకే అభ్యర్థిని నిలబెట్టగలిగినా చెప్పుకోదగిన విజయం సాధించవచ్చు.
కానీ, అందరికీ ఆమోదయోగ్యమైన నాయకత్వం ఇప్పుడు విపక్షాల్లో కనిపించడం లేదు. మొదట్లో మమత బెనర్జీ ప్రతిపక్షాలను ఒకచోటకు తేగల నేతగా అనిపించినా అక్రమ వలసదారుల విషయంలో ఆమె తీసుకున్న జటిలమైన విధానం ఇతర పక్షాలకు ఆమోదయోగ్యంగా లేదు. పైగా, బెంగాల్‌లో హింస స్వారీ చేస్తూ ఉండటం, చట్టబద్ధ పాలన కనిపించక పోవడంతో ఆమె నాయకత్వం పట్ల ఇతరులలో ఏకాభిప్రాయం అసాధ్యమే.
మరోవంక ప్రధాని కావాలని కలలు కంటున్న రాహుల్ గాంధీ అందివచ్చిన అవకాశాలను అందుకోలేక పోతున్నారు. ఈ మధ్య జరిగిన రెండు సంఘటనలను ఈ సందర్భంగా చెప్పు కోవచ్చు. ఆయన అనుసరించిన ఒంటెత్తు పోకడల కారణంగానే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో పరాజయం ఎదురైందని, భాజపాకు 2019 ఎన్నికల ముందు వ్యూహాత్మకమైన విజయాన్ని కట్టబెట్టిన్నట్లు అయందని ప్రతిపక్షాలు భగ్గుమం టున్నాయి. సహకారం అందించడానికి సిద్దంగా ఉన్న మూడు ప్రాంతీయ పార్టీలు కేవలం రాహుల్ ధోరణి కారణంగా దూరమైన్నట్లు స్పష్టమవుతోంది. భాజపా, కాంగ్రెస్‌లకు సమదూరంలో ఉండాలని ప్రయత్నం చేస్తున్న వైకాపా, తెరాస, బీజేడీ, ఆప్, పీడీపీ వంటి పక్షాలు కేవలం రాహుల్ గాంధీ చేసిన పొరపాటు కారణంగానే కాంగ్రెస్‌కు దూరం అయ్యాయని చెప్పవచ్చు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థిని రంగంలోకి దింపి, రాహుల్ ప్రాంతీయ పార్టీలను గట్టి ఇరకాటంలో పెట్టిన్నట్టయ్యంది.
టీఆర్‌ఎస్‌ను బుట్టలో వేసుకొనేందుకు తీవ్రంగా యత్నిస్తున్న మోదీకి రాహుల్ అవకాశం ఇచ్చినట్టయ్యింది. ఆప్,పీడీపీ,టీఆర్‌ఎస్ వంటి పార్టీలు రాహుల్ ఫోన్ చేస్తే చాలు రాజీపడి కాంగ్రెస్‌ను గెలిపించడానికి సిద్ధపడ్డాయి. కనీసం ఫోన్ చేయడానికి కూడా రాహుల్‌కు మనసు రాలేదు. మరోవైపు మోదీ ముందుగానే బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేసి మద్దతు కోరారు. ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది లేని రీతిలో భాజపా అభ్యర్థిని కాకుండా జేడీయూ అభ్యర్థిని నిలబెట్టి మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అప్పుడైనా రాహుల్ గ్రహించి మరో విపక్ష పార్టీ అభ్యర్థిని నిలబెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. రాహుల్ వౌనం తమను ఓటింగ్‌ను బహిష్కరించేలా చేసిందని ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్‌కు రాహుల్ ఫోన్ చేస్తే తమ వోట్లు కాంగ్రెస్ అభ్యర్థికే వేస్తామని ఆ పార్టీ నేత చెప్పినా రాహుల్ స్పందించలేదు.
భాజపా పట్ల ఈ మధ్య కొంత అసహనంగా ఉంటున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు తగు ప్రాధాన్యత ఇచ్చి, అడగకుండానే ఆయన సన్నిహితుడిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా చేయడం ద్వారా నితీశ్‌ను ఎన్నికల ముందు తమవైపు తిప్పుకోవాలని ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌కు చెంపదెబ్బ తగిలినట్టయ్యింది. యూపీ, బిహార్‌లలో వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని ఎదుర్కొనాల్సిన పరిస్థితుల్లో జేడీయూ ఇప్పుడు భాజపాతో గట్టి బంధం కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది.
పత్రికా సంపాదకుడిగా మోదీని విమర్శించిన హరివంశ్‌ను ఎన్డీఏ అభ్యర్థిగా నిలబెట్టడంలోనే భాజపా ఎంత సర్దుకుపోతోందో తెలుస్తుంది. శివసేన, అకాలీదళ్‌లు మారు మాట్లాడకుండా ఎన్డీఏ అభ్యర్థికి వోటు వేసేలా అమిత్ షా కథ నడిపించారు. కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ భాజపా మీద కోపంతో కాంగ్రెస్‌కు వోటు వేయాలని భావించారు. కానీ, కాంగ్రెస్ కనీసం తనను సంప్రదించక పోవడంతో ఆమె ఆగ్రహించి, తన పార్టీ వారిని వోటింగ్‌కు దూరంగా ఉంచారు. కిడ్నీ మార్పిడి చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకొంటున్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని వోటింగ్‌కు రప్పించడాన్ని గమనిస్తే- ఈ ఎన్నిక పట్ల భాజపా ఎంత పట్టుదలగా వ్యవహరించిందో స్పష్టమైంది. రాహుల్‌లో అలాంటి పట్టుదల లేనందున కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. మోదీని ఓడించాలని నిత్యం ప్రసంగాలు చేస్తే సరిపోదు. భాజపాకు దీటుగా విపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేయగలవా? అన్నదే నేటి ప్రశ్న!

-చలసాని నరేంద్ర