మెయిన్ ఫీచర్

సాహితీ విరిమల్లి.. అద్దేపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన కాలంలోని సాహిత్యాన్ని ప్రజాపరం చేసిన ప్రజాకవి డా. అద్దేపల్లి. ఎందరో సమకాలీనులకు- కవిగా, విమర్శకునిగా, సమీక్షకునిగా సభా సంచలనాల్లో సాహితీయోధునిగా గణుతికెక్కారు. కవిత్వ ప్రాధాన్యతలలో ఎదుటివారి విలువలను సున్నితంగా, సుతిమెత్తగా విమర్శించే నైజం ప్రదర్శించే అరుదైన వారిలో అరుదైనవారు అద్దేపల్లి. ఒక రకంగా కవిత్వం వక్తృత్వంల మేలు కలయిక అద్దేపల్లిలో కన్పిస్తుంది. అందుకే సాహితీ దీప్తిమంతం అద్దేపల్లి కీర్తిసాంద్రత్వం. ఆరు దశాబ్దాలకు పైబడి తెలుగు ప్రాంతాల్లోనేకాక, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలకు అభిమాన పాత్రులయ్యారు.
‘‘కవిత్వం కంటె జీవితం గొప్పది - కవిత్వం పోరాట గీతం రాయకముందే జీవితం పోరాటంగా మారిపోతుంది’’ అలా హృదయాన్ని ఆవిష్కరించుకోవడం చేసిన ప్రజాకవి అద్దేపల్లి. ఆరు దశాబ్దాల సాహితీ ప్రస్థానంలో కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఆదర్శప్రాయంగా నిలుపుకున్న అరుదైన కవి.
‘‘వాన కురిసిన నీళ్ళల్లో తడిసిన పసిపిల్లలు
నీళ్ళల్లో పడవల్ని వదిలినప్పుడు
ఒకే పడవలో పయనించి బాల్యం స్టేషన్ చేరుకో’’ అన్నారు. ఇవి పసిప్రాయపు కవితలు కావు, అక్షరాల్లోంచి పసితనాన్ని అనుభూతిని వ్యక్తీకరణలోని ప్రత్యేక లక్షణం.
ఈ ఒక్కటే కాదు, తాను నడిచివచ్చిన దారులగుండా ముందుతరాన్ని, తన తోటి కవుల్ని, వర్ధమానుల్ని సమాదరంగా చేరదీసి, వాళ్ళ ఆశయాచరణాల్ని దృష్టిపథం చేసినవారు. ఒక రకంగా కొంతమంది కవుల లాగ గిరిగీసుకునే మనస్తత్వం అద్దేపల్లికి లేదు.
‘‘మట్టిలో తలెత్తి లేచిన విత్తనానికి వందనం
నేల చీల్చి తలెత్తి లేచిన లేతమొక్కకు వందనం’’
- అంటూ మనకెప్పుడూ వంద్యనీయుడైనాడు.
కవిత్వం పట్ల అద్దేపల్లి నిశ్చితాభిప్రాయాలు సమకాలీనత ప్రధాన అంశమైనా, సమకాలీనత అంతా ప్రగతిశీలతే అనుకోరాదంటారు. ఒక కవిత తన సొంతముద్రని నిల్పుకోవడమంటే, అభివ్యక్తిని ప్రత్యేకంగా ఆవిష్కరించుకోగలగాలి. వర్గదృష్టి లేని ఏ దృక్పథమైనా తిరోగమనశీలతకు దార్లు తీస్తుందంటారు. యింకా చెప్పాలంటే ఒక జాతి అస్తిత్వానికి కొలమానం దాని సాంస్కృతిక విలువలే అని సూత్రీకరించారు. ఈ సందర్భంలోని ఆర్ద్రతలు, అనుబంధాలు, ప్రగతిశీలతల అనుసంధానంగా వ్యక్తిని సమాజపు కేంద్రబిందువుగా అవగాహన చేసుకున్నప్పుడే ఆ సాహిత్య సృజనకు పరిపుష్టత ఏర్పడుతుందంటారు. ఏతావాతా కవితాధ్యయనం భావాల పునాదినుంచి కవిత్వస్ఫూర్తి నింపుకోవాలంటారు.
అద్దేపల్లి కవిత్వంలో అంతర్గతంగా ఛందోరూపం, లయ, మాత్రా గుణబద్ధంగా హాయిగా పలికే రీతిలో సాగడం చూస్తాం. సాహిత్యరీతుల్ని సమన్వయం చేయడంలో చేసిన ప్రయోగాలు అత్యంత ప్రయోజనకారులుగా సూత్రీకరణలు చేసారు. అది పురాణ, చారిత్రక, కాల్పనిక అంశాల వస్తుస్వీకరణల్లో కుందుర్తి, తిలక్, శ్రీశ్రీల బాణీల కంటె మరింత సారళ్యం పొందిన వచన ఫణితిని సాధించారనే చెప్పాలి. ఆయన భావనల్లో, వేదనల్లో సామాన్యుడు వస్తువు. సమకాలీన ప్రగతిశీలతలు ఆయన ప్రతీకాత్మకతలుగా వ్రాసిన కవితా పాదాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మరణానంతరం వెలువడిన వీరగాధ కావ్యం ‘‘అల్లూరి సీతారామరాజు’’ వచన కవితా విప్లవ వీరకథగా వెలుగులోకి వచ్చి, ఆ మన్యం విప్లవజ్యోతికి నిటలగటితాంజలిగా, కవితాపద మంజరిగా ఆవిష్కృతమై, తెలుగు సాహిత్యాకాశంలో అద్దేపల్లి అక్షరాల్ని ‘‘్ధృవతార’’గా కీర్తిసాంద్రుణ్ణి చేసాయి. అద్దేపల్లి అభిప్రాయం ప్రకారం ‘‘పాతకాలం పద్యమైతే- వర్తమానం వచన గేయం’’. సమాసాలు, గ్రాంథిక వాసనలు, వ్యాకరణ సూత్రాల అనుకరణల్ని తన ప్రారంభ దశల్లో పద్యాలు వ్రాసినా, కాలానుగతిలోని అన్ని ఉద్యమాల నేపథ్యాల్ని ఆకళింపు చేసుకున్న అధ్యయన శీలత్వం అద్దేపల్లిది. అందుకే మనిషిని నమ్ముదాం, మానవహితంగా వినూత్న సమాజానికి, కాలానికి మనిషి మీద నమ్మకముండేలా ఆత్మబలంతో అడుగుముందుకు వేద్దాం అని ప్రతి సభలో ఉద్ఘాటించేవారు. కాలంమీద కప్పుకున్న సమాజపర విషధూమాల్లోకి, ముసురుకున్న నిరాశామయ చీకట్లను పారద్రోలడానికి, పూనిక, నమ్మిక కావాలి, రావాలంటారు. తాను నడిచివచ్చిన దారుల్లో గాలితోపాటు, కవిత్వాన్ని కూడా శ్వాసించారు. తన రక్తంలోని జీవకణాల చైతన్యం నిత్యవననిగా, నిలువెత్తు నిజాయితీగా జీవన గమనం సాగించేట్లు చేసింది. అందుకే లాక్షణికుల అభిప్రాయం ప్రకారం ‘‘అనర్ఘ విమర్శక రత్నాల్లో తరళమణి’’ అన్నది అక్షరసత్యం. మట్టినీ, మనిషినీ సమానంగా ప్రేమించినవాడు. అక్షరాల తీగలలో అక్షయామనుల్ని కూడా అల్లుకుపోయిన సాహితీ విరిమల్లిగా కొనియాడబడ్డారు. స్నేహవనంలో సాహితీ సమీరంలా, మినీ కవితోద్యమ పల్లకీబోయగా, చెట్టూ చెట్టూ కల్సినప్పుడు పులకరింతగా ఎందరి మనోచేలాంచలాల్లోనో ఆరాధికుడు. ముఖ్యంగా ఆరోజుల్లో ‘‘ఆంధ్రప్రభ’’ దినపత్రికలో శ్రీశ్రీ మహాప్రస్థానం కవితలపై విశే్లషణాత్మక వ్యాసాలు ఆయనకు, దరిమిలా శ్రీశ్రీ సాహిత్య ప్రస్థానం సంపుటం ఎనిమిదికి పైగా పునర్ముద్రణలకు దోహదపడింది. ‘‘అభ్యుదయ విప్లవ కవిత్వాలు - సిద్ధాంతాలు, శిల్పరీతులు’’ సిద్ధాంత గ్రంథంతో ఆయన పరిశోధనాచార్యుని గారికంటే ముందే ఆయన మీద ఎమ్.్ఫల్, డాక్టరేట్లు చేసినవారు ఎందరో ఉన్నారు.
అద్దేపల్లి అంతర్జ్వాల కవితాప్రస్థానం, రక్తసంధ్యల మెరుపు పువ్వులు ఒక ఎతె్తైతే ‘‘శ్రీశ్రీపై వ్రాసిన కవితాప్రస్థానం- అగ్నిశిరస్సున వికసించిన వజ్రమన్నది’’ సాధికారిక అభిప్రాయం. యింకా చెప్పాలంటే ఆయన అగ్నిశిఖల్లాంటి రచనల్లో సామ్యవాదం, సాంస్కృతిక పరారుూకరణులు, వలస పెట్టుబడుల పరిష్వంగాలు, విష సంస్కృతులపై నిరసనలు పలు సంపుటాలుగా వచ్చి చేరాయి.
ఈ పరిణామక్రమంలో ‘‘పొగచూరిన ఆకాశం’’, ‘‘అయినా ధైర్యంగానే’’, ‘‘ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల’’, సాహిత్య సమీక్షలు, కుందుర్తి, జాషువా, బుద్ధం శరణం గచ్ఛామి, స్ర్తివాద కవిత్వం, గీటురాయి వంటివెన్నో ఉన్నాయి. అద్దేపల్లి అక్షరాల్లో ఆనందానుభూతి ఉంటుంది. నిరంతర అధ్యయనం అంతరంగాల్లో జ్ఞాన సంపన్నునిగా చేసింది.
ఒక ప్రవాహవేగం, పరిణతితో తన సాహిత్య సర్వస్వం పరమార్థం సమాజ చేతనే మార్పు పురోగమనానికి కరదీపిక కావాలన్న తన ఆశయం అని ప్రకటించేవారు. మనిషి కేంద్ర బిందువుగా భావ విప్లవం వస్తేనే, అది నవ సమాజానికి నాందీ వాచకవౌతుందన్న అద్దేపల్లి వాక్యాలు ఆచంద్రార్కం తెలుగు సాహితీ ఆకాశంలో నిల్చే ఉంటాయి.
అనుభూతి సౌందర్యాత్మకతలు ఆయా కాలాల ప్రపంచీకరణ పెనుముప్పుల్ని అన్నివాదాల ఔచిత్యాలని గుర్తిస్తూనే సహానుభవశీలతను ప్రకటించిన మేధోకవి. షష్టిపూర్తి ‘‘మోహనరాగం’’ సప్తతి ‘‘నిరంతరం’’ అశీతి సంబరాల ప్రారంభంలోనే అమరపురి కేగినా, ఆయన సాహిత్యం, సన్మిత్రత్వం అశీతి ఆకుపచ్చని సంతకంగా చూసుకుని మురిసిపోయారు.
సముద్రాన్ని, ఆకాశాన్ని అమితంగా ప్రేమిస్తూ ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల అన్నా, పొగ చూరిన ఆకాశంలోని కాలధూమాల్ని కలంతో ఎదిరించినా అద్దేపల్లి అక్షరాల ప్రగతిశీలత, సమకాలీనతల అభ్యుదయ పథికుడు.
‘‘ప్రగతిశీలమైన కవి... ఎప్పుడూ యాంత్రికంగా ఆలోచించడు. హృదయంతో ఆలోచిస్తాడు. కవి యంత్రాలకంటె ప్రకృతికి దగ్గరివాడు. కవిత్వంలో ప్రాకృతిక జీవనానుభూతి ఒక ప్రధాన వస్తువు’’- డా.అద్దేపల్లి. ఇవి ఎప్పటికీ తెలుగుభాషా పరీవాహక ప్రాంత భాషాప్రియులు, అనుయాయులు అద్దేపల్లి స్మృతిలో నెమరువేసుకునే అమృతాక్షరాలు.

-- వి.యస్.ఆర్.ఎస్. సోమయాజులు 9441148158