మెయన్ ఫీచర్

ఎన్నికల సంఘం ఓకే అనక తప్పదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాసిప్..గాసిప్.. ఎక్కడ విన్నా, చూసినా అదే గా సిప్.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయన్న గాసిప్. కొన్ని పత్రికలైతే శాసనసభ రద్దుకు, ముందస్తు ఎన్నికలకు ముహూర్తం, తేదీలు కూడా ఖారారు చేసాయి. కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న అనేక రాష్ట్ర సంబంధిత అంశాలపై చొరవ తీసుకోవాలని కోరడానికి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన ప్రతిసారీ, పత్రికల్లో ప్రధాన శీర్షికలతో ముందస్తు ఎన్నికల గాసిప్ వార్తలే కనిపిస్తున్నాయి. పాత్రికేయ జ్యోతిష్కుల భవిష్యవాణిలోని నిజానిజాలు, ముందస్తు ఎన్నికల సాధ్యాసాధ్యాలను విశే్లషించి చూస్తే ఆసక్తికరమైన అంశాలు అవగతం కావచ్చునేమో! శాసనసభ రద్దయి, ముందస్తు ఎన్నికలకు పోతే, ఉత్పన్నమయ్యే ప్రశ్నలు కూడా ఆసక్తిగానే ఉంటాయి.
అన్నింటికన్నా ప్రధానమైంది, ఏయై పటిష్టమైన కారణాలతో సీఎం శాసనసభ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవాలనుకుంటున్నాడనే విషయం. అదే నిజమైతే, సీఎం అలా చేయకూడదా? అసెంబ్లీని రద్దు చేయమని అడిగి ప్రజాక్షేత్రంలోకి పోకూడదా? శాసనసభలో మెజారిటీ ఉన్న కేసీఆర్- అవసరమనుకుంటే ఎప్పుడైనా సరే సభను రద్దు చేయమని రాజ్యాంగపరంగా గవర్నర్ ను కోరే హక్కు ఉంది. ఆ నిర్ణయం ఆయన ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నిస్తే, సమయం వచ్చినప్పుడు.. అనేదే సమాధానం.
అసంబద్ధమైన వాగ్దానాలతో ధేశంలో ఓటర్లను మభ్యపెట్టడానికి సవాలక్ష మార్గాలున్నాయి. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నుంచీ ఇది నిరాటంకంగా కొనసాగుతున్న కఠోర వాస్తవం. ఇలాంటి కుటిల వాగ్దానాలు చేస్తున్న రాజకీయ పార్టీలను కట్టడి చేయడంలో ఎన్నికల సంఘం కూడా దురదృష్ట వశాత్తు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. భయంకర నిశ్శబ్దం పాటిస్తున్నది. ఈ యావత్తు వ్యవహారంలో ఓటరే బాధితుడుగా మిగిలిపోతున్నాడు. ఉదాహరణకు- దీర్ఘకాలం అధికారం అనుభవించి, ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న ఒకానొక ప్రధాన రాజకీయ పార్టీ అనుదినం అసంబద్ధమైన వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. తాము అధికారంలోకి వస్తే- 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ ఋణాలను ఒకే-ఒక్క సారి మాఫీ చేస్తామనీ, ఆసరా పించన్లను రెట్టింపు చేస్తామనీ, ఒకే కుంటుంబానికి ఒకటికంటే ఎక్కువ పెన్షన్లు ఇప్పిస్తామనీ, నిరుద్యోగ భృతి మంజూరు చేస్తామనీ ఇంకా ఏదేదో చేస్తామనీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్పెముందు- వీటి అమలులో సాధ్యాసాధ్యాలు కాని, తద్వారా పడే ఆర్థిక భారానికి తగ్గ నిధులు ప్రభుత్వం దగ్గర వుంటాయా? లేదా? అనే విషయం కానీ, ఆ రాజకీయ పార్టీ ఆలోచన చేసిందా? అనేది జవాబు దొరకని యక్షప్రశ్న. 2009 ఎన్నికల్లో కూడా అదే రాజకీయ పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నికల్లో గెలిచింది. ఐదేళ్ళ పాలనలో ఒక్క వాగ్దానాన్నీ కూడా నేరవేర్చలేకపోయింది.
కల్లబొల్లి మాటలతో ఓటర్లను మభ్యపెట్టడం వల్ల, అధికారం ఆ పార్టీకి ఒకవేళ దక్కితే- నష్టపోయేది ప్రజలు, తెలంగాణ రాష్ట్రం. అనైతిక-అబద్ధపు మాటలు చెప్పే ప్రభుత్వమే గనుక అధికారంలోకి వస్తే, బంగారు తెలంగాణ భవిష్యత్ ఏంటి? తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం ఏం కావాలి? సాగునీటి ప్రాజెక్టుల భవిత్యం ఏమిటి? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఏమైపోవాలి? రైతు బంధు-రైతు భీమా పథకాలు కొనసాగుతాయా? వందలాది ఇతర ప్రథకాల గతి ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఇంకా ఎంతో ముందుకు పయనించాల్సిన ఈ సందర్భంలో అలాంటివారి చేతుల్లోకి అధికారం పోతే ఎలా? ఎలాంటి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు.
కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేసింది. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. అది జరగాలంటే మళ్లీ ఆయన నాయకత్వమే కావాలి. చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం చేసినవి ఎన్నో ఉన్నాయి. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి, అచిరకాలంలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ వెలిగిపోనుంది. దీన్ని కొనసాగించడం ఇతరులకు సాధ్యమా? ఏక గవాక్ష పారిశ్రామిక విధానాన్ని ఇంత పకడ్బందీగా మరెవరైనా అమలు చేయగలరా? రైతు బందు-రైతు భీమా లాంటి పథకాల ద్వారా వ్యవసాయ రంగాన్నీ, రైతునూ ఆహర్నిషలూ ఆదుకోవాలంటే కేసీఆర్ లాంటి దార్శినికుడుకావాలి. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ మరింత పరిపుష్టం కావాలంటే ఎవరికీ సాధ్యం?
ఏదేదో చేస్తామని చెప్తున్న ఈ స్వయం ప్రకటిత రాజకీయ నాయకులకు- కేసీఆర్ రీడిజైన్ చేసిన సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క ముక్కయినా అర్థమవుతుందా? ఏ ప్రాజెక్టులో ఎంత నీరు ఎప్పుడెప్పుడు లభ్యం అవుతుందో వాళ్లకు తెలుసా? నీటి యాజమాన్య విధానం ఏంటో వాళ్లకు అవగాహన ఉందా? అలాంటప్పుడు అధికారాన్ని అనర్హులకు ఇవ్వడం అవసరమా? ఎప్పటికీ అలా జరగకూడదు. ఫ్రజల బాగోగులు పరిరక్షించడానికి ప్రజాస్వామ్య బద్ధంగా ఏం చేయడానికి వీలవుతుందో అదంతా చేయడమే నాయకుల కర్తవ్యం. అదే జరగబోతున్నదేమో తెలంగాణాలో బహుశా.
ఈ నేపథ్యంలో ఎవరికి శాసనసభను రద్దు చేయమని కోరే హక్కుందన్న ప్రశ్న వేసుకోవాలి. పాలక పార్టీ మెజారిటీ పక్ష శాసనసభ నాయకుడికి ఎప్పుడైనా సభను రద్దు చేయమని గవర్నర్‌కు సలహా ఇచ్చే హక్కు ఉంది. ఆయన ఈ పని ఎప్పుడు చేయదల్చుకుంటే అప్పుడు చేసే హక్కును ఎవరూ ప్రశ్నించలేరు. ఇటీవల వస్తున్న మీడియా కథనాలే నిజమైతే, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఏ కారణం చెప్పకుండా, ఎప్పుడైనా శాసనసభను రద్దు చేయమని గవర్నర్‌కు సిఫార్స్ చేసే హక్కుంది. ఈ విషయంలో ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు అర్థం లేదు. కేసీఆర్‌కు శాసనసభలో పరిపూర్ణ మెజారిటీ ఉన్నందున ఆయన కావాలనుకుంటే, సభను రద్దుచేయమని అడిగి ఎన్నికలకు పోవచ్చు.
ఒకసారి శాసనసభ రద్దు కాగానే, కొత్త శాసనసభ ఏర్పాటు చేయడానికి ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో సంపూర్ణ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. దీనికి సంబంధించినంతవరకు ప్రధానికి ఎలాంటి పాత్ర లేదు, ఉండకూడదు కూడా. రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్న కొందరి అభిప్రాయం- ప్రధానమంత్రి పరోక్షంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తాడని కావచ్చు. ఆ అవసరం ఆయనకుంటుందని భావించడం సరైంది కాదేమో. తెలంగాణాలో- ఒకవేళ శాసనసభ రద్దు చేసి ముందస్తుగా ఎన్నికలు జరపాలనుకుంటే, అలా జరగకుండా చూడడంవల్ల ప్రధానికి ఒరిగే లాభం లేదు.
శాసనసభ ఒక సమావేశానికీ, మరొక సమావేశానికీ మధ్య ఆర్నెల్ల కంటే ఎక్కువ ఉండడకూడదని రాజ్యంగా నిర్దేశిస్తున్నది. దీనర్థం- సభ సమావేశమైన-రద్దయిన ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించడం మినహా మరో గత్యంతరం ఎన్నికల సంఘానికి లేదు. ఆ లోపుగా కొత్త ప్రభుత్వం ఏర్పడి తీరాలి. తెలంగాణకు సంబంధించి- కొందరు గుజరాత్ విషయంలో అప్పటి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఉదహరించడం సమంజసం కాదు. నేటి ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, భారతదేశంలో కనీ-వినీ ఎరుగని రీతిలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో జులై 19, 2002 న శాసనసభను రద్దు చేసి ఎన్నికలు నిర్వ హించాలని కోరడం జరిగింది.
అప్పట్లో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఎన్న్జికల సంఘం నిర్ణయం రాజ్యంగ ప్రకరణ 174 కు విరుద్ధంగా తీసుకోవడం జరిగింది. అల్లర్లు ఇంకా సమసిపోనందున, ఓటర్ల జాబితా తయారు కానందున, ఎన్నికల యంత్రాంగం సిద్ధంగా లేనందున, ఆర్నెల్ల లోపు ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని ఈసీ నిర్ణయించింది. చివరకు రాష్టప్రతి జోక్యం చేసుకుని సుప్రీం కోర్టు సలహా కోరగా- కథ సుఖాంతం అయింది.
మీడియా వార్తలు నిజమై, సీఎం కేసీఆర్ శాసనసభను రద్దు చేయాలని భావిస్తే, అదే జరిగితే, రాజ్యాంగం ప్రకారం 2019 మార్చిలోపు జరగాల్సి ఉన్నా, అంతవరకు ఆపాల్సిన పని ఎన్నికల సంఘానికి లేదు. డిసెంబర్ 2018 లోపు మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉంది. తెలంగాణ శాసనసభను రద్దు చేయడం జరిగితే, ఆ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించడానికి అంగీకరించడం మినహా ఎన్నికల సంఘానికి వేరే మార్గం లేదు. ఏం జరుగుతుందో, జరగబోతున్నదో, ఏం జరిగితే బాగుంటుందో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి సమాధానం కూడా ఆసక్తికరమే.

-వనం జ్వాలా నరసింహారావు 80081 37012