మెయన్ ఫీచర్

అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో గురువులు కొన్ని విధాలుగా ఉన్నారు. తల్లిదండ్రులు తొలి గురువులు. పాఠశాలలో చదువు చెప్పినవారు తర్వాతి గురువులు. మనకు కులగురువులు ప్రత్యేకంగా ఉంటారు ఆషాఢ పూర్ణిమనాడు శైవ వైష్ణవాది వివిధ మతస్థులు తమతమ గురువులను పూజించుకునే సంప్రదాయం అనాదిగా భారతదేశంలో వస్తున్నది. సెప్టెంబరు 5న టీచర్స్‌డే సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ప్రభుత్వం ఉత్సవాన్ని జరుపుతున్నది. ఆనాడు లౌకిక గురువులను గౌరవించుకోవడం ఆనవాయితీగా మారింది. నిజానికి సమాజంలో జ్ఞానము, వివేకము కలవాడు ప్రతి విషయాన్ని పరిశీలించి గౌరవించి ఎంతో నేర్చుకుంటాడు. చీమనుండి శ్రామిక జీవనము, తేనెటీగనుండి మాధుర్య స్వీకరణ, పుష్పమునుండి సుగంధ జీవనము, ఇలా ప్రతి విషయమూ మనకు ఏదో ఒక సందేశం ఇస్తూనే ఉన్నది. అలాగే చేపగాలమునకు చిక్కి చనిపోతుంది. కాబట్టి జిహ్వచాపల్యాన్ని జయించాలనే జ్ఞానాన్ని నకారాత్మకంగా కూడా మనం నేర్చుకోవచ్చు.
భారతదేశం కొన్నివేల సంవత్సరాల క్రితం విశ్వగురువుగా ఉండేది. అందుకు మనకు నేటికీ అనేక ప్రత్యక్ష ఆధారాలు కనిపిస్తున్నాయి. ఆషాఢ పౌర్ణమి పేరు చెప్పగానే సుదీర్ఘమైన సాంస్కృతిక నేపథ్యం మనకు గుర్తుకువస్తుంది. దీనే్న గురుపూర్ణిమ అనికూడా అంటారు ‘గు’ అంటే చీకటి ‘రు’ అంటే వెలుతురు. చీకటిని పారద్రోలేవాడు గురువు. ఆషాఢ పౌర్ణమినాడు వేదవ్యాసుడు జన్మించినట్టు పౌరాణికమైన కథ ఉంది. ఇతని కాలం నేటికి సుమారు ఐదువేల సంవత్సరాలు. వేదవ్యాసుడు అప్పటికే దుర్గమంగా ఉన్న వేదాలను వింగడించి తన శిష్యులకు అందించి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయించాడు. వేదాలు భారతదేశంలోని సరస్వతీనదీ తీరంలో పుట్టినా అవి కేవలం భారతీయులకు మాత్రమే పరిమితమైనవి కావు. అవి విశ్వమానవాళికి చెందిన అనర్ఘ సంపద. విశ్వ శ్రేయస్సు వాటి పరమలక్ష్యం. గురుపూర్ణిమనాడు మన వ్యాసభగవానుని పూజిస్తాం. గురువులు రెండు, మూడు రకాలుగా ఉంటారు. ఒకటి మనకు పాఠం చెప్పిన గురువు. రెండు ఆధ్యాత్మిక గురువు. మూడు మనకు సాంస్కృతిక వారసత్వం అందించిన ఋషి. అందుకే ప్రతి మానవుడికి జన్మసిద్ధంగా మాతృ,పితృ ఋణాలతో పాటు ఋషి ఋణం కూడా సంక్రమిస్తుంది. దీన్ని తీర్చుకోవలసిన బాధ్యత జన్మసిద్ధంగా ప్రతిమానవుడి మీద ఉంటుంది.
గురువు ఒక గ్రహం. ఆంగ్లంలో జూపిటర్ అంటారు. ఇతడే బృహస్పతి. ఇతడు దేవతలకు గురువు. మహా మేధావి. బుద్ధిలో బృహస్పతి అనే సామెత తెలిసిందే. అంటే గురువును ఆరాధించే వారు దైవీ గుణాలు కలిగి ఉంటాన్నది అర్థం. సద్గురువులు దొరకడం కొంత దుర్లభమే. కొందరు లౌకిక గురువులు శిష్యుల విత్తాపహరణం, చిత్తాపహరణం చేయడం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి శిష్యులు మంచి ఆధ్యాత్మిక గురువును ఎంచుకోవాలి. స్వామి దయానంద సరస్వతి ఎంతో కష్టపడి ఎన్నో ప్రాంతాలు పర్యటించి విరజానంద అనే గురువును సంపాదించగలిగాడు. గురువుగారికి గుప్పె డు లవంగాలు గురుదక్షిణగా సమర్పించాడు. ‘‘నాకు కావలసింది ఈ లౌకిక వస్తువులు కాదు. వెళ్లి వేద ప్రచారం చేయాలి’’ అని గురువు ఆదేశించాడు.
రామకృష్ణ పరమహంస కూడా వివేకానందుని వంటి వ్యక్తిని శిష్యునిగా స్వీకరించడం వల్ల మానవాళికి ఎంతో సేవచేయడం జరిగింది. అలెగ్జాండరుకు ఆధ్యాత్మిక గురువు అరిస్టాటిల్. ఆయన తన శిష్యుడిని ఇలా కోరాడు. ‘‘గురు దక్షిణగా భారతదేశం నుండి గంగాజలాన్ని, భగవద్గీతను తెచ్చి ఇవ్వు’’ అని కోరాడు. నరేంద్రమోదీ ప్రతిపాదించిన యోగ దినోత్సవాన్ని ప్రపంచమంతా ఆమోదించడం అంటే భారతీయ సనాతన దర్శనాన్ని ప్రపంచం గుర్తించిందని అర్థం.
వాల్మీకి మహర్షి పుట్టకపోయినట్టయితే రాముడు ఎవరో ఎవరికి తెలుస్తుంది? వ్యాసుడు మహాభారతాన్ని రాయకపోయినట్టయితే ఘనశ్యాముడు ఎవరో ఎవరికీ తెలియదు. వ్యాసుడు అష్టాదశ పురాణాలను రచించాడు. భగవద్గీతను అందించాడు. శివ సహస్ర నామాలు, విష్ణు సహస్ర నామాలు, లలితా సహస్ర నామాలు ఇవన్నీ వ్యాసుడు అందించినవే కదా. అంటే మొత్తం భారతీయ సంస్కృతికి వ్యాసుడు పెట్టినదే బిక్ష. అందువల్లనే గురుపూర్ణిమను మనం వ్యాస పూర్ణిమ అనే పేరుతో ఆరాధిస్తున్నాం. అందువల్ల గురుపూర్ణిమ యొక్క ప్రాధాన్యాన్ని తెలియజెప్పే విధంగా ఈ అర్ష సంప్రదాయ మహోత్సవాన్ని దేశ విదేశాల్లో జరిపే బాధ్యత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.
భారతదేశంలో శైవ, వైష్ణవ, గాణాపత్య, సౌర, శాక్తేయ సిద్ధాంతాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఈ సంప్రదాయాలకు చెందినవారంతా వారి వారి గురువులను ఆషాఢ పూర్ణిమనాడు పూజించుకుంటారు. ఆషాఢ పూర్ణిమ నుండి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. అంటే గురువులు, పీఠాధిపతులు, నిరంతరం దేశ సంచారం చేసే పరివ్రాజకులు, స్థిరంగా ఒకచోట ఉండిపోతారు. అక్కడే వారు ధర్మ ప్రచారం చేస్తుంటారు. ఈనాడు దేశంలో ఉన్న వివిధ మార్గాలకు చెందిన భక్తులు ఆషాఢ పౌర్ణమినాడు తమతమ గురుస్థానాలకు వెళ్లి పూజలు జరుపుకొని ఆశీర్వాదాలు స్వీకరిస్తారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశమేమంటే ఈ గురువులందరికీ కన్నతల్లి ఎవరు? రామునికి వశిష్టుడు గురువు. మరి వశిష్ఠునికి ఎవరు గురువు? కృష్ణునికి సాందీపుడు గరువు. కానీ సాందీపునికి కూడా ఒక గురువు ఉన్నాడు కదా? ఆధునిక యుగంలో పాశ్చాత్య దేశాలకు భారతీయ సాంస్కృతిక సుధను అందించిన స్వామి వివేకానందుడికి రామకృష్ణ పరమహంస గురువు. ఆ రామకృష్ణునికి కాళీమాత గురువు. కాళీమాత, భారతమాత వేరు కాదు. లౌకికమైన మన గురువులందరికీ కన్నతల్లి భారతమాతయే. అందుకే ఋగ్వేదంలో ఈ పృధ్వి మాకు తల్లి. నేను ఆమెకు పుత్రుణ్ణి అనే ఒక మంత్రం ఉన్నది. అంటే ఈ భారతదేశాన్ని ప్రాచీన కాలం నుండి పరమ గురువుగా ఇక్కడి ప్రజలు భావించారు. ఇంతకీ భారతదేశం అంటే ఏమిటి? కేవలం 125 కోట్లమంది ప్రజలు మాత్రమేనా? ఇక్కడి నదీనదాలు, శైవ, వైష్ణవ, శాక్తేయ క్షేత్రాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అసంఖ్యాకమైన ధార్మిక పీఠాలు, ధర్మ గ్రంథాలు, పంచ ‘గ’కారములు అని చెప్పబడే గంగ, గోవు, గాయత్రి, గీత, గోపాలుడు. వీరిపై పూజ్యభావం ఇక్కడ సుజలములు, సుఫలాలు, సస్యశ్యామలాలు అయిన బంగారు భూములు కోటి కోటి కంఠములతో భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తించే ప్రజాశక్తి శ్రామిక సౌందర్యం. ఇక్కడి అజంతా, ఎల్లోరా, హళిబీడు, వేయిస్తంభాలగుడి, ఇక్కడి కూచిపూడి భరతనాట్యం, మణిపురి కథక్, పేరిణి శివతాండవం, ఇక్కడి బతుకమ్మ పండుగ, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పూర్ణిమ, హోలీ పండుగలు పబ్బాలు, ఆచార వ్యవహారాలు, ఇదంతా కూడ భారతీయత కిందికే వస్తుంది. ఈదేశంలోని భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, అందరి హృదయాలలో ఉన్న దివ్యశక్తి భారతమాతయే అన్న విషయం లోగడ రవీంద్రుడు, అరవిందుడు, వివేకానందుడు ఎన్నోసార్లు పునరుద్ఘాటించారు. గురుపూర్ణిమ మనకు మహత్తర సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తుకు తెస్తున్నది.
ఈ దేశంమీద గత వేయి సంవత్సరాలుగా ఎన్నో దండయాత్రలు జరిగాయి. దేవాలయాలు నేలకూలాయి. సంస్కృత గ్రంథాలను తగులబెట్టారు. భారత్‌మాతాకిజై అన్నవారిని జైల్లో పెట్టారు. భారతదేశాన్ని ప్రేమించేవారిని ఛాందసులు అన్నారు. ఫాసిస్టులు అన్నారు. గంగలో ఎవరైనా స్నానం చేస్తే అతడిని ఏం పాపం చేశావు? అంటూ సామ్యవాదులు, ప్రశ్నించారు. పుష్కర స్నానాలను ద్వేషించారు. కుంభమేళాలను అపహసించారు. ఇవ్వాళ పూర్తి మెజారిటీతో వచ్చిన భారత ప్రభుత్వానికి ఈ అవమానాన్ని అణచివేతను ఎదుర్కొనవలసి ఉన్నది. వందలాది సంవత్సరాలుగా తమ అస్తిత్వాన్ని కోల్పోయిన ఇజ్రాయిల్ దేశం భారత దేశం కంటే చాలా చిన్నది. కానీ తన జాతీయ శక్తితో అరబ్ దేశాలను గడగడలాడిస్తున్నది. మరి భారతదేశం ఆవిధంగా అన అస్తిత్వాన్ని ఎందుకు చాటుకోలేకపోతున్నది? లోపం ఎక్కడ ఉన్నది? ఈ వౌలికమైన అంశాన్ని గురుపూర్ణిమనాడు ప్రతి భారతీయుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
పాశ్చాత్యులు మన విద్యావిధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఆర్యులు విదేశాలనుంచి వచ్చారని ప్రచారం చేశారు. అలెగ్జాండర్ చేతిలో పురుషోత్తముడు ఓడిపోయాడని చరిత్ర గ్రంథాలు రాశారు. రాణాప్రతాప్, శివాజీ మహారాజుల పేర్లు లేకుండా అవమానించారు. అగ్బర్ ది గ్రేట్ అన్నారు. ఔరంగజేబు మత సహనానికి పర్యాయపదం అన్నారు. వందే కృష్ణం జగద్గురుం అని మనం విశ్వగురువుగా భావించిన కృష్ణుడిని, రాముడిని అవమానించారు. పాశ్చాత్యులు వచ్చిన తరువాతనే ఇక్కడ సాంస్కృతిక వికాసం ప్రారంభమైందని ప్రచారం చేశారు. ఇది నిజమా? అమెరికా పుట్టి మూడువందల సంవత్సరాలైంది. కానీ జగద్గురువైన భారతమాతకు మూడు లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్నది. గురుపూర్ణిమ పర్వదినం నాడు భారతీయులంతా ఈ సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తుచేసుకోవలసిన అవసరం ఉంది.

- ముదిగొండ శివ ప్రసాద్