ఎడిట్ పేజీ

‘కన్నుకొట్టే’వాడా భావి భారత ప్రధాని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక విషయాన్ని మనమంతా నేడు గమనిస్తున్నాం. ఏ రంగంలోనూ సంస్కారమనేది ఇప్పుడు కనపడడం లేదు. రాజకీయ నాయకులు ఈ విషయంలో మరీ ముందున్నారు. దురదృష్టమేమిటంటే- మిగతా రంగాలు కూడా దాదాపుగా రాజకీయ నాయకుల స్థాయికి చేరటానికి తహతహలాడుతున్నట్టు అనిపిస్తోంది.
మొన్నటికి మొన్న- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించే కొత్త జోనల్ విధానం ఆమోదించమని ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలసి విజ్ఞప్తి చేశానని తెలిపారు. మోదీని కలసినపుడు- ‘జోనల్ వ్యవస్థ గురించి మేం అడిగింది చేస్తవా లేక చస్తవా..? ఏదో ఒకటి చెప్పు..’ అని తాను గట్టిగా అడిగినట్టు స్వయంగా కేసీఆర్ చెప్పారు. ఈ సంగతిని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కొంగర కలాన్‌లో జరిగిన ‘ప్రగతి నివేదన’ సభలో గొప్పగా చెప్పారు. మీడియా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. కేసీఆర్ ధోరణిని ఏమనాలి?
ఇక మన ‘యువ సింహం’, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌జీ మరీ ప్రత్యేకం. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆయన చేస్తున్న అర్థరహిత వ్యాఖ్యలు మితిమీరి పోయాయి. ‘ఆర్‌ఎస్‌ఎస్, భాజపాలు దేశంలోని వ్యవస్థలకు చేసిన నష్టాన్ని ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే సరిదిద్దగలదు’ అని ఆయన అన్నారు. కానీ, ఎఐసీసీ నాయకుడు దీపక్ బాబారియా, ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి క్రమశిక్షణను నేర్చుకోండి. భారత్-చైనా యుద్ధ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ సేవలను నెహ్రూ వినియోగించుకున్నారు’ అని ప్రశసించారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో క్రమశిక్షణ గొప్పదని చాలామంది మెచ్చుకుంటున్నారు. ఏ సంస్థలోనైనా మంచి ఉంటే గ్రహించాలి. ఆ మంచిని అభినందిస్తే నష్టమేమీ ఉండదు. విదిశలో తాను పాల్గొన్న సభలో కొట్లాడుకుంటున్న కార్యకర్తలనుద్దేశించి దీపక్ బాబారియా ఆర్‌ఎస్‌ఎస్ క్రమశిక్షణను ప్రస్తావించారు.
మరో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే పరుష పదజాలంతో మాట్లాడుతూ, ‘ఆర్‌ఎస్‌ఎస్ విషం లాంటిది. దాన్ని రుచి చూస్తే ఎదురయ్యే పరణామాలు అందరికీ తెలుసు. ఆ సంస్థ తన భావజాలాన్ని దేశం మొత్తం మీద విస్తరించాలని చూస్తోంది. ఆ కుట్రలో రాహుల్ గాంధీ భాగం కాకూడదు. కాంగ్రెస్ పార్టీ మోదీపై పోరాడటం లేదు. ఆయనకు మద్దతిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంపై పోరాటం చేస్తుంది’ అన్నారు. కాగా, రాహుల్ గాంధీ ఇటీవల ఇంగ్లండ్, జర్మనీలలో పర్యటించారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ వోటర్లను ఆకర్షించేందుకు పర్యటిస్తున్నారు. తన హాంబర్గ్ ప్రసంగంలో- ‘గత పార్లమెంట్ సమావేశాల్లో నేను మోడీని హత్తుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే చాలామందికి అది నచ్చలేదు’ అని తెలిపారు. చైనాలో ఒక గంటకు 50,000 ఉద్యోగాలు కల్పిస్తున్నారని రాహుల్ అనడంపై బిజెపికి చెందిన సాంబిత్ పత్రా మాట్లాడుతూ- ఎప్పటినుంచి రాహుల్‌గాంధీ ‘చైనీస్ గాంధీ’గా ప్రవర్తిస్తున్నాడని ప్రశ్నించారు. రాహుల్‌జీ మానస సరోవర్ యాత్రకు బయలుదేరేటప్పుడు, చైనీస్ రాయబారి ఆయనకు వీడ్కోలు పలికాడు. దీనిని కూడా పత్రా ప్రశ్నించాడు. ఇంతకూ రాహుల్‌ది కేవలం మానస సరోవర్ యాత్రానా? చైనా నేతలను ప్రశంసించడానికా? అన్నది స్పష్టంగా తెలియడం లేదు.
‘మళ్లీ ఒకే వేదికపై ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో ప్రణబ్’ అనే వార్త మరోసారి చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీలో దిగ్గజ నేతగా పేరున్న ప్రణబ్ ఎన్నో ఉన్నత పదవులను నిర్వహించిన సంగతి తెలిసిందే. గత జూన్‌లో నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా వెళ్లటం తీవ్ర సంచలనమైంది. ఆ సమావేశానికి హాజరయ్యే విషయమై పునరాలోచించాలని, పలువురు కాంగ్రెసు నేతలు విజ్ఞప్తిచేసినా ప్రణబ్ వినిపించుకోలేదు. ఇప్పుడు ‘ప్రణబ్ ముఖర్జీ ఫౌండేషన్’ ఢిల్లీ సమీపంలోని గుర్గావ్‌లో ఒక కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో పాటు హర్యానా ముఖ్యమంత్రి మనోహరలాల్ ఖట్టర్‌ను ఆహ్వానించటం గమనార్హం. ‘స్మార్ట్ విలేజస్’ కార్యక్రమం కింద నయగావ్, హర్కిన్‌పూర్ గ్రామాలను, ముఖర్జీ ఫౌండేషన్ దత్తత తీసుకుంది. అక్కడ రక్షిత మంచినీటి పథకాలను, తాగునీటి ఏటీఎంలను, గోదాములను ప్రణబ్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన కొందరు గతంలో ఢిల్లీలోని ప్రణబ్ నివాసానికి వెళ్లి, తమ గ్రామాలను దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా ఆయన అందుకు అంగీకరించారు. ఆ రెండు గ్రామాల్లో తన ఫౌండేషన్ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేలా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలే పర్యవేక్షణ బాధ్యత తీసుకోవాలన్నది ప్రణబ్ ఆకాంక్ష.
ఇక- రాహుల్ గాంధీ విషయానికొస్తే- ఆయన ఈ దేశానికి సారథ్యం వహించగల నాయకుడా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. గత పార్లమెంట్ సమావేశాలలో- హఠాత్తుగా మోదీని రాహుల్ ఆలింగనం చేసుకోవడం అందరికీ విస్మయం కలిగించింది. రాహుల్ చేష్టకు మోదీ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ వెంటనే రాహుల్ తన స్థానం వద్దకు చేరుకుంటూ ఒక్కసారి ‘కన్ను గీటారు.’ ఈ ఘట్టాన్ని టీవీల్లో చూసిన ప్రజలెలా మర్చిపోగలరు? వందేళ్ల చరిత్ర కలిగిన ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఇంత దిగజారుడుగా ప్రవర్తించడం ఏమిటని జనమంతా హతాశులయ్యారు. భావి భారత నాయకుడు ‘కౌగలించుకోచగలడు.. కన్ను కొట్టగలడు’ అని ప్రపంచమంతా అనుకోవాలా?
ఈ దేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడే వేదాలు పుట్టాయి. ఈ దేశానికి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల చరిత్ర ఉండి, ఈనాడు కలియుగంలో మన జీవనయానం నడుస్తోంది. కృతయుగంలో సత్యహరిశ్చంద్రుడు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించారని, మనకు ‘్భగవద్గీత’ భగవానుడు అందించిన గొప్ప వరమని నమ్ముతాం. ప్రపంచంలో మిగతా దేశాలు ఎలా మనుగడ సాగిస్తున్నప్పటికీ- రామాయణం, మహాభారతం గాథలు మనకు నేటికీ మార్గదర్శనం చేస్తున్నాయి. ఈ కథ ‘వయా వంశాధిక శతం’ రాహుల్‌జీకి తెలుసా? జూదంలో పాండవులు ఓడారు, పందెం ప్రకారం 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. పాండవులు ద్వైతవనంలో అరణ్యవాసంలో ఉన్నారు. వారిముందు తన దర్పాన్ని ప్రదర్శించేందుకు దుర్యోధనుడు తన పరివారంతో, సర్వాభరణాలతో పాండవులున్న ద్వైతవనానికి బయలుదేరాడు. అక్కడ గంధర్వులకు చెందిన సరస్సులను కౌరవులు వినియోగించుకుంటారు. ఇది గంధర్వులకు ఆగ్రహం కలిగిస్తుంది. ఫలితంగా గంధర్వుల చేతిలో కౌరవులు శిక్షకు గురవుతారు. దీంతో ఆ పరివారంలోని వారంతా దిక్కుతోచని దశలో ధర్మరాజు దగ్గరకొచ్చి శరణు వేడుతారు. భీముడు సంతోషపడుతూ, ‘కాగల కార్యం గంధర్వులే చేశారు’ అంటూ సంతోషడతాడు. కానీ, ధర్మరాజు ధర్మం చెబుతాడు. ప్రపంచం దృష్టిలో మనం- వందమంది కౌరవులు, అయిదుగురు పాండవులతో 105 మందిమి. మనలోమనం లెక్క వేసుకుంటే వారు వందమంది, మనం అయిదుమంది మాత్రమే అని ప్రబోధిస్తాడు. ఆ తర్వాత పాండవులు బయలుదేరి కౌరవులను గంధర్వుల నుండి విముక్తి కలిగిస్తారు. ఇదీ మన ధర్మం.
మనం విదేశాలకు వెళ్లినపుడు చేయవలసింది, ఇక్కడి ఇతర పార్టీలను విమర్శించటం కాదు. మేమంతా ఒక్కటే సుమా, మాలో ఎన్ని అభిప్రాయ భేదాలున్నా, మీరు మా మీదకొస్తే, మేమందరమొక్కటే అనే విషయాన్ని స్పష్టం చేయాలి. స్వామి వివేకానందుల వారు- షికాగోలో జరిగిన ప్రపంచ ఆధ్మాత్మిక సభలో ఉపన్యాసం ఇచ్చి నేటికి 125 సంవత్సరాలు గడిచాయి. ఆ సభలు జరిగింది 1893 సెప్టెంబరు 11న. ఈ సందర్భాన్ని పురస్కరించుకునైనా వివేకానందుని బోధనలను మనం చదవాలి. వివేకానందుడు వంటి మహనీయులు చెప్పిన విషయాలు ప్రస్తుత రాజకీయ నాయకులకు నచ్చుతాయా? అన్నది ఎవరూ చెప్పలేరు. మనం మాత్రం యుగాల చరిత్ర కలిగిన భారతీయులమని ఋజువు చేసుకునేందుకు ప్రయత్నించాలి.

-చాణుక్య