మెయిన్ ఫీచర్

పెద్దలు ఆచరిస్తే పిల్లలూ పాటిస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి నవ నాగరిక యుగంలో చాలామంది దంపతులు ‘మేమిద్దరం... మాకిద్దరు...’ అనే కానె్సప్ట్‌లో బతికేస్తున్నారు. ‘చిన్న కుటుంబం... చింతలు లేని కుటుంబం...’ అనేది ఆర్థిక కోణంలో బాగానే ఉంటుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయవచ్చు. కుటుంబంలో ఒకరో, ఇద్దరో పిల్లలు ఉండడంతో ‘ఎవరికి వారు యమునాతీరే’ అన్నట్లు నేడు పరిస్థితులు మారిపోయాయి. పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన తల్లిదండ్రులే విలువలను పాటించడం అరుదుగా కనిపిస్తోంది. చాలా ఇళ్లలో వృద్ధులు, బంధుమిత్రుల పట్ల ఆదరణ కనిపించడం లేదు. సంపాదన యావలో పడే దంపతులు పిల్లల బాగోగులను సైతం అంతగా పట్టించుకోవడం లేదు. తాము మంచి విలువలను ఆచరిస్తే పిల్లలు తమను ఆదర్శంగా తీసుకుంటారన్న భావన కొందరు పేరెంట్స్‌లో కనిపించడం లేదు. వృద్ధులను పట్టించుకోకుండా రక్తసంబంధాలను సైతం నిర్లక్ష్యం చేసే దుస్థితి నెలకొంది.
ఒకప్పుడు ఎక్కడ చూసినా ఉమ్మడి కుటుంబాలు కళకళలాడేవి. నేడు చాలా ఇళ్లలో ఒక్క మనిషి ఎక్కువైనా భరించే సహనం ఉండడం లేదు. చుట్టాలు, పక్కాలు వస్తే వారు వచ్చిన దారినే వెంటనే వెనుదిరగాల్సిందే. ఒక్కపూట వారిని ఆదరించే సమయం, ఓపిక దంపతులకు ఉండడం లేదు. గతంలో ఏ ఇంటికైనా చుట్టాలు వస్తే రోజుల తరబడి ఉండిపోయేవారు. వారు తిరిగి వెళ్లిపోతుంటే ఆ ఇంటి వారే కాకుండా చుట్టుపక్కల వారు కూడా బాధపడేవారు. ఆనాటి ఆప్యాయతలు అలా ఉండేవి. నేడు అలాంటి బంధాలు మనకి ఎక్కడా కనిపించడం లేదు. చివరికి సొంత తల్లిదండ్రులను కూడా ఆదరించే పరిస్థితులు మృగ్యమైపోయాయి. ఉద్యోగాలు చేసే కొడుకులు తండ్రిని ఒకరు, తల్లిని ఒకరు పంచుకుంటున్నారు. తమకు జన్మనిచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా విడదీస్తున్న ఉదంతాలు కోకొల్లలు. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే అదో అందం. వారు తమ అనుభవ సారాన్ని రంగరించి అనేక సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతారు. సమయోచిత నిర్ణయాలు తీసుకుని ఇంటిని చక్కదిద్దుతారు. టివీ, వీడియో గేమ్‌లతో కాలం వెళ్లదీసే పిల్లలకి మంచి నీతికథలు చెప్పి వారిని చక్కటి మార్గంలో, మంచి నడవడిలో సాగేలా కృషి చేస్తారు. ఒంటరితనం కారణంగా పిల్లలకే కాదు, వృద్ధులకూ నేడు సమస్యలు తప్పడం లేదు. తల్లిదండ్రులను తమతో ఉంచుకోవడానికి చాలా ఇళ్లలో కొడుకులు ఇష్టపడడం లేదు. ఈ కారణంగానే ఎక్కడ పడితే అక్కడ వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి. నెలకో, రెండు నెలలకో ఒకసారి వెళ్లి మొక్కుబడిగా వృద్ధాశ్రమాలకు వెళ్లి వారిని పలకరించేసి వచ్చి ‘ఒక పనైపోయింది’ అనుకుంటున్నారు. ఇలా కన్నవారిని నిరాదరిస్తున్న వారు భవిష్యత్‌లో తమకూ అదే గతి పడుతుందని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు అందరూ యాంత్రికంగా బతికేయడానికి అలవాటు పడిపోయారు. తమ అవసరాలు, బాగోగులు చూసుకుంటే చాలనే స్వార్ధపు నీడలో జీవిస్తున్నారు. చాలా మంది తమ ఇంటికి బంధుమిత్రులెవరైనా వస్తే వారిని ఆప్యాయంగా పలకరించడం లేదు. ఒక కన్ను టీవీ మీద వేసి వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. టీవీ సీరియల్ ఎక్కడ మిస్సయిపోతామా?అన్నట్లు పొడిపొడిగా మాట్లాడుతూ వచ్చిన వారి మనసు చివుక్కుమనేలా ప్రవర్తిస్తున్నారు.
మన దేశం అతిథి మర్యాదలకు, ఆప్యాయతలకు పెట్టింది పేరు. ఇక్కడే ఇలా జరుగుతోందంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఊహించుకోవచ్చు. నిజానికి పిల్లలకు పెద్దలే రోల్‌మోడల్స్‌గా నిలవాలి. మనం ఎలా ప్రవర్తిస్తామో పిల్లలు కూడా రేప్పొద్దున్న అలాగే ప్రవర్తిస్తారు. వారు సక్రమ మార్గాన సాగిపోవాలంటే పేరెంట్స్ వారి తీరును ఎంతగానో మార్చుకోవాలి. గౌరవ మర్యాదలతో ఎదుటి వారిని పలకరించాలి. బంధుమిత్రులను ఆప్యాయంగా ఆదరించాలి. పెద్దలు ఇలా చేస్తే పిల్లలు కూడా అటువంటి మంచి వ్యక్తిత్వం సొంతం చేసుకుంటారు. తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, పిల్లలకు మంచి నడవడి, నైతిక విలువలు నేర్పితే ఆ కుటుంబాల్లో సుఖశాంతులు వర్ధిల్లుతాయ.

-చలన