మెయిన్ ఫీచర్

సర్వరోగ నివారిణి .. బాబా ఊది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా జీవితం వెలుపల, లోపల అత్యంత మధురం. బాబా నడిచినా, మాట్లాడినా. తిన్నా, ఏ పని చేసినా మధురమే! బాబా జీవితం మూర్త్భీవించిన ఆనందం. తన భక్తుల ఆనందయోగానికి బాబా పలు ఉపదేశాలు చేశారు. చక్కని నీతులు బోధించారు. వాటిని చదివి, ఆచరిస్తే ముక్తి, మోక్షం కలుగుతాయి.
లోకమంతా సుఖసంతోషాలతో వర్థిల్లాలని బాబా అభిలషించారు. అందుకు జాగ్రత్తగా ఆత్మసాక్షాత్కారం సంపాదించాలని చెప్పారు. మన పుణ్యంకొద్దీ మానవ జన్మ లభించింది. మన అదృష్టంకొద్దీ బాబా వంటి సద్గురువు లభించారు. క్షణమైనా వృథాచేయక, బద్ధకించక క్షణికమైన ఈ జీవితాన్ని ‘సాయి’పథంలో నడిపించుకుని జన్మరాహిత్యం పొందుదాం.
బాబా యొక్క అనంత ప్రేమను, వారి సహజ జ్ఞానమును, సర్వాంతర్యామిత్వాన్ని వర్ణించగల వారెవరు?
ఒక్కోసారి బాబా దీర్ఘవౌనం పాటించేవారు. అది వారియొక్క బ్రహ్మ బోధము. ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా ఉండేవారు.
ఒక్కొక్కసారి వౌనం వీడి నీతి కథలు చెప్పేవారు.
ఇంకొకసారి హాస్యము, తమాషాలతో చమత్కారాలను చేసేవారు.
ఒక్కోసారి సూటిగా మాట్లాడేవారు. మరికొన్నిసార్లు రుద్రమూర్తిగా కనిపించేవారు.
పలుసార్లు క్లుప్తంగా బాబా బోధనలు పెదవులనుంచి అమృతం స్రవించినట్టు జాలువారేవి.
బాబా ఉన్నట్టుండి ఒకోసారి దీర్ఘ వివాదాల్లోకి లాగేవారు. చాలాసార్లు ఉన్నదున్నట్టు మాట్లాడేవారు.
బాబా జీవితం అగోచరం. అది మన మేథాశక్తికి, భాషకు, భావానికి అందదు. బాబా ముఖారవిందాన్ని చూసేకొద్దీ తనివి తీరదు. బాబాను ఎన్నో అడగాలని, ముఖాముఖీ మాట్లాడాలని ఎందరు తలచేవారు. కానీ, ఎవరూ వారిష్టంమేరకు బాబా ఎదుట వ్యవహరించలేకపోయేవారు. చాలాసార్లు బాబా వారి అభీష్టాలను గ్రహించి అందుకు తగ్గట్టు మసిలేవారు. ఇంకొన్నిసార్లు వారి అభీష్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు.
చాలామంది బాబా దర్శనంతోనే అనంతమైన శాంతిని పొందేవారు. మనసులోని కోరికలు చెప్పుకోకుండా వాటిని నెరవేర్చుకునేవారు. బాబా సమక్షంలో నిత్యం సుఖశాంతులు స్రవిస్తూ ఉంటాయి. బాబా లీలలు ఎన్ని విన్నా తనివి తీరదు. సందర్భం, సమయం, అవసరాలకు తగినట్టు బాబా తన భక్తులకు ప్రబోధాలు చేసేవారు. సందేహాలను తీర్చేవారు. ఆకాశాన్ని గుడ్డతో మూయగలం. వర్ష బిందువులను లెక్కించగలం. కానీ, బాబా లీలల్ని వర్ణించలేం. లెక్కించలేం. మనం జీవిత పరమార్థాన్ని సాధించటానికి సద్గురు సాయి పాదాలను ధ్యానించటం తప్ప మరో మార్గం లేదు.
బాబా ఊదీ.. ఆరోగ్య సౌఖ్యప్రదాయిని
బాబా నిత్యాగ్నిహోత్రి. నిత్యం ఆత్మానుసంధానంలోనే మునిగి ఉండేవారు. ధుని ఎదుట కూర్చుని భక్తుల పాపాల్ని, కర్మల్ని కట్టెలుగా మార్చి, కాల్చి బూడిద చేసేవారు. అందుకే బాబాచేత రాలిన ఊదీకి అంత పవిత్రత. ఊదీ ద్వారా బాబా గొప్ప సత్యాన్ని చాటారు. నిజమైన వైరాగ్య భావనకు ఊదీ ప్రతీక. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతంకాదు. మనం కూడబెట్టిన ఆస్తిపాస్తులు, సంపదలు చివరికి ఎవరి పరమో అవుతాయి. చివరకు ఈ కాయం కట్టెగామారి బూడిదవుతుంది. అదే సత్యం. ఆ విషయానే్న బాబా పంచే ఊదీ నిత్యం గుర్తుచేస్తూంటుంది. అయితే మనిషి అసలు నిజాన్ని అంత తేలిగ్గా జీర్ణించుకోలేడు. అందుకే బాబా భక్తుల లౌకిక బాధల్ని, భావాల్ని, కోరికల్ని ఊదీద్వారా తీర్చి, దానిపై నమ్మకాన్ని పెంచేలాచేసేవారు. ఆ తరువాత నెమ్మదిగా వైరాగ్య భావాన్ని పొందేలా దారిలో పెట్టేవారు.
ఊదీనే విభూతి అని కూడా ఉంటారు. విభూతి అంటే పవిత్ర భస్మం. ఏదైనా వస్తువును కాల్చివేస్తే మిగిలేది బూడిద. దాన్ని మళ్లీమళ్లీ కాల్చినా అది బూడిదగానే మిగులుతుంది. దేహ, కాల, కారణ, పరిస్థితులకు అతీతంగా నిలిచి ఉండేది బూడిదే. మరో విధంగా చెప్పాలంటే భగవంతుడికి లేదా ఆత్మకు లేదా పరమాత్మకు అది ప్రతీక. ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ అశాశ్వతాలే. పంచభూతాల సాయంతో ఏర్పడిన శరీరాలన్నీ సౌకర్యాలన్నీ అనుభవించాక శిథిలమై బూడిదవుతాయి. బ్రహ్మము నిత్యం.. జగత్తు అశాశ్వతం. బంధాలు, బంధువులు, పిల్లలు, తల్లిదండ్రులు, భార్య... వీరంతా మనవెంట రారు. ఈ లోకంలోకి ఒంటరిగానే వచ్చాం. ఒంటరిగానే వెళతాం. ఈ సంగతిని గుర్తుచేసేందుకే బాబా భక్తులకు ఊదీని పంచిపెట్టేవారు. బాబా ఊదీ ద్వారా వివేకాన్ని, దక్షిణ ద్వారా వైరాగ్యాన్ని బోధించేవారు. ఈ రెండూ ఉంటే కాని సంసార సాగరాన్ని దాటలేం. అందుకే మసీదుకు వచ్చిన భక్తులను మొదట బాబా దక్షిణ అడిగి తీసుకునేవారు. తిరిగి వెళ్లేటపుడు ఊదీని ఇచ్చేవారు.
బాబా మధ్యాహ్న హారతి పూర్తికాగానే మసీదు గోడకు ఆనుకుని నిల్చుని భక్తులకు ప్రేమాభిమానాలతో ఊదీని ప్రసాదంగా పంచేవారు. ఆరోగ్యం కోరేవారికి ఊదీ ఔషధం. భోగ, భాగ్యాలు కోరే వారికి అది ఐశ్వర్యం. బాబా ఊదీ మహిమను వర్ణించతరంకాదు.

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566