మెయన్ ఫీచర్

మావోల దుశ్చర్యతో ఉలిక్కిపడ్డ తెలుగు రాష్ట్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టులు మరోసారి పంజా విసిరి ఇద్దరు ప్రజానాయకులను హతమార్చడం ఉభయ తెలుగు రాష్ట్రాలను ఒక్కసారి దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖ జిల్లా డుంబ్రిగుడకు సమీపంలో మావోయిస్టులు తుపాకులతో కాల్చివేసి తమ ఉనికిని చాటుకున్నారు. మావోల ప్రభావం ఏ మాత్రం లేదనుకుంటున్న సమయంలో ఈ ఘటన పోలీసులను సైతం నివ్వెరపరచింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1985 నుంచి 2005 వరకు రెండు దశాబ్దాల పాటు నక్సల్స్ (మావోలు) తూటాలకు ఎంతోమంది రాజకీయ ప్రముఖులు నేలకొరిగారు. ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లో మావోలు సమాంతర ప్రభుత్వం నడిపే స్థాయికి చేరారు. 2005లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డిని హత్యచేయడంతో వారి మీద వున్న నిషేధాన్ని ఎత్తివేసి మావోల ఏరివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ ప్రభుత్వ హయాంలో నక్సల్స్ ఏరివేత కార్యక్రమం పరాకాష్ఠకు చేరడంతో నాలుగేళ్లకే ఉమ్మడి రాష్ట్రంలో వీరి ఉనికి నామమాత్రమైంది. ఇక్కడి మావోయిస్టులు ఆత్మరక్షణకు ప్రక్కనున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్టల్రతోపాటు సుదూరంగా వున్న పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాలకు వెళ్లిపోయారు. 2005లో ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి హత్య తరువాత ఇన్ని రోజులకు మరో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోల కిరాతకానికి బలయ్యారు. అరకు మాజీ ఎమ్మెల్యే సోమ కూడా హతమవ్వడం గిరిజనుల్లో విషాదం నింపింది.
1983లో ప్రారంభమైన దాడులు...
చిత్తూరు జిల్లాలో తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లోని భూస్వాములకు, వారిని వ్యతిరేకిస్తున్న నక్సల్స్‌కు 1980-90 మధ్య అనేక దాడులు, ప్రతిదాడులు జరిగాయి. భూస్వామ్యవర్గానికి చెందిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే టి.ఎన్.శ్రీనివాసులురెడ్డి అనుచరుడైన టి.ఎన్.రెడ్డెప్పరెడ్డిని 1983లో మదనపల్లెలో నక్సల్స్ హత్య చేశారు. 1984 డిసెంబర్‌లో భూస్వాములకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని పుట్టు వెంకటరమణప్ప గుప్తాను నక్సలైట్లు బస్సులో హత్యచేశారు. నక్సల్స్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని వెంకట రమణప్ప అనుచరులు 24 గంటలు తిరగకుండానే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న టీడీపీకి చెందిన ఎ.వి.ఉమాశంకరరెడ్డిని దారికాచి కారులోనుంచి బయటకు ఈడ్చి ఖతం చేశారు. అదే సంవత్సరం పెనుకొండ మాజీ ఎమ్మెల్యే గంగుల నారాయణరెడ్డిని అనంతపురం సప్తగిరి సర్కిల్‌లో నక్సల్స్ హత్యచేశారు. ఈ హత్య కేసులో నిందితుల పేర్లలో మాజీ మంత్రి పరిటాల రవి పేరును కూడా చేర్చి అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు రిజిస్టర్ చేశారు. అప్పట్లో పరిటాల రవితోపాటు ఆయన తండ్రి శ్రీరాములు, సోదరుడు హరి కూడా నక్సల్స్‌కు అనుకూలంగా పనిచేశారు. శ్రీరాములును 1975 ప్రాంతంలో ప్రత్యర్థులైన భూస్వాములు హతమార్చారు. ఒక పెళ్లికి ప్రైవేట్ బస్సులో పోతున్నప్పుడు బస్సు ఆపి అతడిని చంపించారు. తరువాత కొన్నిరోజులకు హరిని ఆయన సొంత ఊరు వెంకటాపురంలోనే పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. పరిటాల రవి 1993లో నక్సల్స్ ఉద్యమం నుంచి బయటకువచ్చి జన జీవనస్రవంతిలో కలిశారు. రాజకీయాలలో ప్రవేశించి 1994లో టీడీపీ తరఫున పెనుకొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడాదిపాటు మంత్రిగా కొనసాగారు. 2005 జనవరి వరకు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లోనే ప్రత్యర్థులు ఆయనను హత్యచేశారు.
పరిటాల రవి నక్సల్‌గా ఉన్నప్పుడు ప్రతీకార దాడులలో భాగంగా ప్రత్యర్థి అయిన పెనుకొండ ఎమ్మెల్యే సానె చెన్నారెడ్డిని ధర్మవరంలో 1991 ఏప్రిల్‌లో అతని ఇంట్లోనే తూటాలకు బలిచేశారు. ఈ ఆపరేషన్‌లో రవికి కుడి భుజంలా పనిచేసిన ప్రముఖ నక్సలైట్ పోతుల సురేష్‌తోపాటు మరికొందరు పాల్గొన్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. సురేష్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకునిగా చెలామణి అవుతున్నారు. ఈయన 2002లో జనజీవన స్రవంతిలోకి వచ్చి టీడీపీలో చేరారు. సురేష్ భార్య పోతుల సునీత ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్స్ ఉద్యమం తీవ్రతరం అయిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో గుర్తేడు వద్ద ఐఏఎస్ అధికారులను నక్సలైట్లు కిడ్నాప్ చేసి, కొన్ని డిమాండ్లు పరిష్కరించుకొని వదిలేశారు. ఆ తరువాత అదే జిల్లాలో మల్హర్ మండలాధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేసి ఖతం చేశారు. 1990లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావును కిడ్నాప్ చేశారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సంప్రదింపుల తరువాత మరికొన్ని ప్రతిపాదనలతో నాలుగురోజుల అనంతరం ఆయనను వదిలేశారు.
1991లో పార్లమెంటు మధ్యంతర ఎన్నికలకు ప్రచారం ప్రారంభమవుతున్న సమయంలో హైదరాబాద్ నగరం నడిబొడ్డులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్‌కుమార్‌ను కిడ్నాప్ చేశారు. సుధీర్‌కుమార్ ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.శివశంకర్ కుమారుడు. కిడ్నాప్ అయిన సమయంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హైదరాబాద్ సందర్శనకు వచ్చారు. కొన్ని ప్రధాన డిమాండ్లు నెరవేర్చుకొని మూడు, నాలుగు రోజుల తరువాత ఆయనను నక్సల్స్ వదిలేశారు. అంతకు రెండు సంవత్సరాల ముందు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 1989లో ఆయన వియ్యంకుడైన దగ్గుపాటి చెంచురామయ్యను ప్రకాశం జిల్లా కారంచేడులో నక్సల్స్ తుపాకులతో కాల్చి చంపేశారు. చెంచు రామయ్య కుమారుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాష్టమ్రంత్రిగా పనిచేశారు.
చంద్రబాబు హయాంలో..
1999 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావును, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు బంధువైన మాజీ మంత్రి హయగ్రీవాచారిని నక్సల్స్ ఖతం చేశారు. విశాఖ మన్యంలో గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పసుపులేటి బాలరాజును కిడ్నాప్ చేసి కొన్ని రోజుల తర్వాత నక్సల్స్ వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మణికుమారి భర్తను మావోయిస్టులు హత్యచేశారు. ఈమె పాడేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఎన్నికల సమయంలో తెలంగాణలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమరావును, రాయలసీమలో మంత్రిగా కొనసాగిన బుడ్డా వెంగళరెడ్డిని, 2001లో మంత్రిగా వున్న ఎలిమినేటి మాధవరెడ్డిని, దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యా నాయక్‌ను మావోయిస్టులు హతమార్చారు. తెలంగాణలో హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే దుగ్గిరాల వెంకట్రావు, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి తండ్రి గోవిందరెడ్డి, 2010లో విశాఖ జడ్పీ వైస్ చైర్మన్ సోమలింగంకూడా నక్సల్స్ కాల్పుల్లో హతమయ్యారు.
మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో పరదేశి నాయుడు, హైదరాబాద్ నగరంలో ఉమేష్ చంద్ర, కె.ఎస్.వ్యాస్ అనే ముగ్గురు ఐపీఎస్ అధికారులను నక్సల్స్ చంపివేశారు. 2004-2005 మధ్య ప్రకాశం జిల్లా ఎస్‌పీగా ఉన్న మహేశ్ లడ్డా అనే ఐపిఎస్ అధికారి వాహనాన్ని మందుపాతరతో నక్సల్ పేల్చివేయగా అతడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
2003లో తిరుపతి నుంచి తిరుమలకు శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెళుతున్నప్పుడు అలిపిరి వద్ద నక్సల్స్ మందుపాతర పేల్చగా ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గతంలో భయానక వాతావరణాన్ని సృష్టించిన మావోలు కనుమరుగయ్యారని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ‘విశాఖ మన్యం’లో మావోయిస్టుల తాజా దుశ్చర్య అందరినీ విస్మయపరచింది. మున్ముందు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయోనని రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధినేతలు ఆందోళన చెందుతున్నారు. 2008లో ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులో ఇరు రాష్ట్రాల పోలీసులు నదిలో ప్రయాణిస్తున్న చిన్న పడవను బలిమెలవద్ద పేల్చగా 30 మంది నక్సల్స్ చనిపోయారు. ఆ తరువాత ఇన్ని రోజులకు ఈ విధమైన విధ్వంసం జరిగింది. తాజా దుర్ఘటనలో కిడారి, సోమలు కాల్పులకు గురైన ప్రాంతం ఒడిశాకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. మరోసారి మావోయిస్టులు పంజా విసరడంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

-తిప్పినేని రామదాసప్ప నాయుడు 99898 18212