మెయిన్ ఫీచర్

ఇది ‘కుల’కాలమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేగు తెంచుకు పుట్టిన బిడ్డ అన్న ఆలోచన లేకుండా తల్లులే బిడ్డల గొంతు నులిమి
చంపేస్తున్నారు. ఈ హత్యలన్నింటికీ కారణం ఒకటే.. పరువు కాపాడుకోవడమే.. నిజంగా
ఓ మనిషి ప్రాణం తీసేస్తే పరువు తిరిగొస్తుందా? ఇప్పుడు ఆ కూతురి పరిస్థితి ఏంటి? ఆరు నెలల గర్భిణి తను. మాతృత్వాన్ని ఆస్వాదించాల్సిన సమయంలో ఈ క్షోభను ఎలా తట్టుకోగలదు?

మనిషి కాలంతోపాటు పోటీ పడుతూ సాంకేతికంగా అభివృద్ధిలో దూసుకువెళ్తున్నా..
అనేక మంది మేధావులు, క్రీడాకారులు, అంతర్జాతీయంగా ఎన్నో రంగాలలో ప్రతిభ కనబరుస్తున్నా..
ప్రపంచంలో ఒకవైపు హిమాదాస్ లాంటి వారు దేశ ప్రతిష్టను ఇనుమడింపచేస్తుంటే.. కొందరు కసాయిలవల్ల దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతోంది. సమాజంలోని మనిషి మానవతా విలువలను కాపాడడంలో దిగజారిపోతున్నాడు. తండ్రీ కూతురుల మధ్యనున్న అనుబంధం అర్థం మారుతోంది. మానవత్వం మంటకలుస్తోంది. గర్భంలోనున్న శిశువు పెరిగి పెద్ద అయిన తర్వాత అతని మనస్తత్వంలో, మానసిక ప్రవర్తనలో చాలా మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. వీరు సమాజంపై ఏహ్యభావం పెంచుకొని భవిష్యత్తులో ఉన్మాదులుగా, శాడిస్టులుగా, తీవ్రవాదులుగా మారే ప్రమాదం ఉంది. ఇది దేశ మనుగడకు ముప్పు.
రక్తసంబంధం తెగిపోతోంది
అడవిలో ఉన్న మృగం సైతం తన కన్న పిల్లలను అతి గారాబంగా చూసుకుంటాయి. రోజురోజుకు మనిషిగా ఆలోచనలు తక్కువై.. మృగం కంటే ఎక్కువగా కుల పిచ్చి ఆలోచనలు మదిలో పెచ్చుమీరుతున్నాయి. ఆగడాలు పెరిగిపోతున్నాయి. వికృతమైన ఆలోచనలకు అడ్డు, అదుపులేకుండా పోతుంది. తల్లిదండ్రులు తాత్కాలిక భావోద్వేగాలకు లోనై ఇలాంటి దాడిలో పాల్గొంటున్నారు. మానవత్వం మంట కలుస్తోంది. చివరకు అల్లుడి ప్రాణాలను సైతం తీయడానికి దిగజారిపోతున్నారంటే ఇది మానవ మనుగడకు గొడ్డలిపెట్టు. రానున్న కాలంలో ఈ విష సంస్కృతి మహావృక్షంగా మారే ప్రమాదం ఉంది. మానవ సంబంధాల పట్ల విలువలు తగ్గుతున్నాయి. హత్య చేయడంవల్ల నీవు సాధించిందేమిటి? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? నీ కన్న కూతురు ప్రేమను పొందగలుగుతావా? నీ పరువును నీవే బజారుకు లాక్కొన్నావు కదా!?
కుల పిచ్చి
ప్రస్తుతం భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యాలు రెండు మతం, కులం. ఇందులో పెద్ద కులం, చిన్న కులం.. అన్న తేడాలు.. మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప అంటూ మానవీయ సంబంధాలను మంటగలుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే కులం కోసం మనిషా...? మనిషికోసం కులమా...? అనే అనుమానం కలుగుతోంది. ఎప్పుడో ఏర్పడిన ఈ కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ భారత సమాజాన్ని శాసిస్తుందంటే కులం, మతం ఎంతగా ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ఏ రంగాన్ని చూసినా ఈ అంశాలకు సంబంధించిన వివక్ష కనిపిస్తూనే ఉంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలన్ని ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా దూసుకెళ్తున్న తరుణంలో భారతదేశానికి మాత్రం ఈ కుల పిచ్చి అనే అంశం దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ప్రధాన సమస్యగా మారడం చాలా బాధాకరమైన విషయం.
కుల పిచ్చితో చివరకూ రక్త సంబంధాలను కూడా మంట గలిపే స్థాయికి దిగజారిపోతున్నారు తండ్రులు. గర్భిణిగా ఉన్న స్ర్తి అమ్మతనాన్ని మధురంగా అనుభవించాల్సిన సమయంలో, తీరని కోరికలు ఎన్నో భర్త ద్వారా తీర్చుకునే సమయంలో, ప్రేమాను రాగాలను పంచి ఇవ్వాల్సిన సమయంలో ఆ ఆడకూతురి భర్తను దూరంచేసే కసాయిగా ఎలా మారావు? ఆ ఆడకూతురి భవిష్యత్తును అంధకారం చేశావు.
తండ్రిగా చిన్నతనంలో కూతురిని నీ భుజాలపై ఎత్తుకుని ఆడిస్తూ, తను ఏడిస్తే నీ మనసు బాధ పడిన సందర్భం ఏదీ గుర్తుకు రాలేదా? అన్నం తినను అని మారాం చేస్తే కూతురికోసం చాక్లెట్‌లు, బిస్కట్లు కిరాణ షాప్‌లో కొనుక్కొచ్చి ఇవ్వలేదా..? చిన్నతనంలో కూతురు సంతోషపడితే నీవు సంతోషపడ్డావు. నవ్వుకుంటూ నాన్నా అని పిలిస్తే దగ్గరకువెళ్లి చేతిలోకి తీసుకుని లాలించావు. ఇవేవీ నీకు గుర్తుకు రాలేదా..? చిన్నప్పుడు కూతురు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషపడ్డావే.. పెద్దయ్యాక కూతురు సంతోషానికి పరువు అడ్డొచ్చిందా..? నీ కూతురిలాగా తన కూతురుకు తండ్రి అనురాగం, ఆప్యాయత తీసుకురాగలుగుతావా..? నీ కూతురు గర్భంలో ఉన్న శిశువు పెరిగి పెద్దయ్యాక తాతయ్యా మా నాన్నను పరువుకోసం చంపించావా? అని నీ ముందరికి వచ్చి ప్రశ్నిస్తే ఎలా...? రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అనే ఆలోచనను దరిచేరనీయకుండా కులం పిచ్చితో పూర్తిగా కసాయి వాడిగా మారి కూతురిని అనాథను చేస్తావా..? కూతురికి కష్టం వస్తే నాన్నా! అని పిలిస్తే ఆదుకోవాల్సిందిపోయి కూతురి సంతోషాన్ని మంటగలుపుతావా..? ఇదేనా మన భారత దేశ సంస్కృతి.
ఇలాంటి హత్యలతో కులం అనే విష బీజాన్ని నేటి యువతరం మెదడులో నాటుకుపోయి సమాజాన్ని ద్వేషించే స్థాయిలో తయారయ్యే ప్రమాదం ఉంది. సమాజంలో కులంతోటే బతుకు అనే స్థాయిలోకి వెళ్తుందేమో.. కుల నిర్మూలన ఆలోచన దిశగా మేధావులు కృషిచేయాలి. యువతను కాపాడుకోవాలి.
పరువు, ప్రతిష్ట అన్న మాయలోపడి కన్నబిడ్డల్నే చిదిమేస్తున్న తండ్రులున్నారు. అల్లుళ్లను హతమారుస్తున్న మామలున్నారు. అంతేకాదు.. పేగు తెంచుకు పుట్టిన బిడ్డ అన్న ఆలోచన లేకుండా తల్లులే బిడ్డల గొంతు నులిమి చంపేస్తున్నారు. ఈ హత్యలన్నింటికీ కారణం ఒకటే.. పరువు కాపాడుకోవడమే.. నిజంగా ఓ మనిషి ప్రాణం తీసేస్తే పరువు తిరిగొస్తుందా? ఇప్పుడు ఆ కూతురి పరిస్థితి ఏంటి? ఆరు నెలల గర్భిణి తను. మాతృత్వాన్ని ఆస్వాదించాల్సిన సమయంలో ఈ క్షోభను ఎలా తట్టుకోగలదు? పరువుకోసం తన భర్తను చంపారు. ఆడపిల్ల కడుపుతో ఉండగా భర్తను దూరం చేసి ఆమె జీవితాన్ని కోలుకోలేని దెబ్బతీశారు. ఆడకూతురిని ఒంటరిగా మార్చిందెవరు? మరికొద్ది నెలల్లో భూమిమీదకు వచ్చే బిడ్డ పరిస్థితేంటి?
వివాహం విషయంలోనే కులాల కోసం ఎందుకీ పాకులాట...? అందరికీ తెలుసు కులమేదీ మనం ఛస్తే మనతోపాటుగా వెంట తీసుకొని వెళ్లేది కాదు అని అందరికీ తెలిసిన అక్షర సత్యం. అయనా కానీ కులం కోసం ఎందుకీ వెంపరాట..? ఒక్కసారీ ఆలోచించండి. కులంకోసం చంపేస్తారా..? చంపి ఏం సాధించావ్..? అందరి ముందు కూతురి సుఖాన్ని హరించిన మృగంవలె దోషిగా నిల్చున్నావు.. పశువుల్లాకాదు మనుషుల్లా ఆలోచించండి.. మనుషుల్లాగా జీవించండి.
పడగ విప్పుతున్న పరువు హత్యలు
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రులే కాల యముళ్ళు అవుతున్నారు. పరువుకోసం పాకులాడుతూ అల్లారుముద్దుగా పెంచిన తమ పిల్లల జీవితాలను చిద్రం చేస్తున్నారు. ఆర్థిక అసమానతలు, కులం కుళ్ళుతో పరువుహత్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో సంచలనం ఘటనలతో కన్నప్రేమలు కనిపించకుండా పోతున్నాయా అనే ఆందోళన ప్రతీ ఒక్కరి మదిలో పరుగులు తీస్తోంది. సమాజంలో పరువు, ప్రతిష్టలకోసం కన్న కూతురి జీవితాన్ని తాకట్టుపెట్టిన ఒక్క కసాయి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో కూతురు బ్రతుకు బుగ్గిపాలుచేయడమే కాకుండా తన కూతురి బిడ్డ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృత్తం కాకుండా ఉండడానికి చట్టాలను పటిష్టంగా తయారుచేయాలి. ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా గుర్తించాలి. మనదంతా ఒకటే కులం అదే మానవులం. మనదంతా ఒకటే మతం మానవత్వం అనే నినాదాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరి హృదయంలో, మనసులో నాటుకునేలా ఒక గొప్ప మార్పురావాలి. కుల జాడ్యాన్ని సమాజం నుండి తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని చట్టాలు చేసినా, కఠిన శిక్షలు ఉన్నప్పటికీ దాడులు మాత్రం ఆపే పరిస్థితి కనిపించుట లేదు. కుల జాఢ్యానికి వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సమాజాన్ని కదిలించగల్గితే భావిభారత నిర్మాణం సాధ్యం అవుతుంది. పాశ్చాత్య సంస్కృతిలో ఎలాంటి కులం లేని సంస్కృతిని పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది.

- డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 9703935321