మెయన్ ఫీచర్

మాతృభాషలోనే నైపుణ్యాలు సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ ఒడిలో శిశువు ఆ, ఊ,లతో ప్రారంభించి నేర్చుకునే భాష మన మాతృభాష తెలుగు. అది పాల భాష, బాల భాష. పిల్లలు ఎదిగిన కొద్దీ భాషలో కొంత మార్పు వస్తుంది. ముద్దు మాటలు, ముద్దు మాటలుగా మిగిలిపోకుండా మనం పిల్లల భాషను తీర్చిదిద్దాలి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాట్లాడే భాషను శిశువు అనుకరిస్తుం టాడు. శిశువు తనకు పలకడానికి సౌలభ్యంగా ఉన్న మాటల్ని మొదటగా నేర్చుకుంటాడు. అమ్మ, అత్త, అక్క, తాత, పాలు, లాల, ఇలాంటివి. మొదట శిశువు ‘అమ్మ‘ అని పలికిన రోజు మన ఇంట్లో పండగే. శిశువు పలికే ప్రతిమాట మనల్ని అలరించి, ఆనందపరుస్తుంటుంది. వారి ముద్దు మాటల అర్ధం పరమార్ధం ముందు అమ్మకే బాగా అర్ధం అవుతుంది. అదొక భాషా సమ్మేళనమే. మగపిల్లలు, ఆడపిల్లలు కూడా తమ తమ ఆటలల్లో, జట్టులల్లో భాషా వినియోగం, మాటల ప్రయోగం చేస్తూ తమ మాతృభాషను విస్తృతపరుచుకుంటారు. బొమ్మలతో ఆడుకుంటూ కొన్నిసార్లు అమ్మను, నాన్నను, ఉపాధ్యాయుల్ని, డాక్టరును, తాతయ్య, అమ్మమ్మల్ని అనుకరిస్తూ ఉంటారు. మనల్ని భాగస్వాముల్ని చేస్తుంటారు. అప్పుడు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, వారిని విసుక్కోవడం, కసురుకోవడం, ఉపేక్షించడం చేయకుండా వారితో ఆడిపాడాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే వారి భాష పరివ్యాప్తమవుతుంది. పిల్లలు ఇల్లు వాకిలి, ఊరువాడ ఆటలు పాటలు మాటల ద్వారా వారి భాషాలోకపు పరిధులను పెంచుకుంటారు. భావ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటారు.
పిల్లల భాషా నిర్మితి పటిష్టం చేసే వ్యవస్థలో అమ్మ ఒడి తరువాత బడి చాలా ప్రా ముఖ్యతను సంతరించుకుంటుంది. బడిలో పిల్లలు తమ ఉపాధ్యాయులను అనుకరిస్తుంటారు. తమ భాషా యుగంలో, భావనా ప్రపంచంలో ముందే కొంత భాషను పిల్లలు నేర్చుకుని ఉంటారు గదా? మరి ఉపాధ్యాయుడు చేయవలసిన పని ఏంటి? చెప్పవలసిన అంశాలు ఏమిటి? ఆచరించాల్సిన అభ్యాస ప్రక్రియలు ఏమిటి? వాటిని మనం విద్యా ప్రణాళికా, పాఠ్య ప్రణాళిక, విషయ ప్రణాళికల ద్వారా నిర్మించుకుంటాం. వాటిని చిన్నారులు ఒక పద్ధతి, విధానం, రీతిలో అందించడానికి అనువుగా వాచకాలలో పొందుపరుస్తాం. ఆట, పాట, మాట, పని, రాత ప్రక్రియల ద్వారా అందిస్తాం. వాచకాలు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఒక సాధనంగా ఉపయోగపడతాయి. అవి బోధనాభ్యసనకు, శిక్షణకు, భాషా వ్యాప్తికి అనుసంధానంగా ఉంటాయి. భాషాభ్యసనకు పటిష్ట సాధనా సామగ్రిగా తోడ్పడుతాయి. అందువల్ల విద్యా వ్యవస్థలో వాచక రచనను ఒక పవిత్ర యజ్ఞంగా భావించాలి. భావి భారత పౌరులైన విద్యార్థులకు మాతృభాష పట్ల అనురక్తిని, ఆసక్తిని, అభిరుచిని కలిగించాలి. సర్వాంగ సంపూర్ణమైన మూర్తిమత్వ లక్షణాలను వారిలో కలిగించి ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దాలి. అదే విద్య పరమావధి.
అమ్మ కొంగు చాటున తిరుగుతూ, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గంతులేస్తూ హాయిగా కాలం గడపాల్సిన పిల్లల్ని మూడు సంవత్సరాల వయసులోనే మనం ప్లేస్కూలు, పూర్వ ప్రాథమిక పాఠశాలలకు పంపుతున్నాం. ‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం‘ అన్నట్టు పుట్టకముందే పేర్లు నిర్ణయించుకుని ఏ పాఠశాలలో పిల్లల్ని చేర్పించాలని ఆలోచిస్తున్నాం. వాళ్లు డాక్టర్ కావాలా, యాక్టర్ కావాలా, ఇంజనీరు కావాలా? మనమే నిర్ణయిస్తున్నాం. ఇక మాధ్యమం ఏదన్నది అందరికీ తెలుసు. ఈనాడు చాలామంది తల్లిదండ్రులు ఆంగ్లాన్ని ఒక హోదాగా భావించి, ఉన్నత ఉద్యోగాలను పొందే భ్రమలో తమ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అష్టకష్టాలకోర్చి, ఆంగ్ల భాషా వ్యామోహంతో అవాంఛనీయమైన కోరికలకు తెరతీస్తున్నారు. ఈరకమైన విద్యావిధానం ఫలితమేంటో మనందరకు తెలుసు. ‘రెంటికి చెడ్డ రేవల్లు’ పిల్లలు ఆటు తెలుగుకు, ఇటు ఆంగ్లానికి సరిపోవడంలేదు. భాషా నైపుణ్యాలు, సామర్ధ్యాలు, నిపుణతలు, సృజనాత్మక కౌశలాలు వారికి అబ్బడం లేదు. భాషా లక్ష్యాల సాధనకు అనుగుణంగా బోధన కూడా జరగడంలేదు. నిర్దేశిత గమ్యాలను విద్యార్థులు అందిపుచ్చుకోవడంలేదు. ఫలితం భావదాస్యం, భాషా దారిద్య్రం.
భాష ఏదైనా పాఠశాలలో, తరగతి గదిలో అది క్రమానుగతంగా జరగాల్సిందే. ముందుగా శ్రవణం, తరువాత భాషణం, ఆ పిదప పఠన లేఖనాదులు. ఇక ప్రారంభ దశలో వాచక నిర్మాణంలో అభ్యసనలో కూడా అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి, కథా కథన పద్ధతి, చూచి చెప్పు పద్ధతి ద్వారా బోధనాభ్యసన జరగాలి. అయితే ఈనాడు లక్ష్యాలను రూపొందించుకోవడంలో, బోధనాభ్యాసన రీతుల్లో, గమ్యాలను నిర్దేశించుకోవడంలో అనుసంధానత లోపించింది. మాతృభాష తెలుగు ఆంగ్లం మధ్యన వైరుధ్యమేర్పడుతున్నది. నిజ జీవితంలో పిల్లలు చూస్తున్న జంతువులు, పశువులు, పక్షులు, కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఫలాలు, వస్తు సామగ్రి అన్ని తెలుగు సంబంధితాలే. కాని పాఠశాల మాధ్యమం ఆంగ్లం. తరగతి గదుల్లో ఆంగ్ల భాషా వాచకాల అభ్యసన. ఆంగ్ల భాషా పరిజ్ఞానం లేనివారు, పనిమనుషులు, కార్మికులు, కర్షకులు, శ్రామికులు, అపార్టుమెంటు కాపలాదారులు, మురికివాడల్లో నివసించేవారు ఆర్థిక స్థోమత లేని మధ్యతరగతి కుటుంబీకులు ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఆంగ్ల భాషా వ్యామోహంతో తమ పిల్లల్ని ఆంగ్లమాధ్యమ పాఠశాలల్లో చేర్పించి ఎన్నో అగచాట్లకు గురవుతున్నారు. పిల్లలు కూడా తెలుగులో ఆలోచించి ఆంగ్లంలో సమాధానం చెప్పడం, ఆంగ్లంలో అనువదించుకుని తెలుగుకు రూపకల్పన చేయడంవల్ల వైరుధ్య భావనలేర్పడుతున్నాయి.
నేటి పిల్లలు తెలుగును సంకర భాషగా మార్చారు. అందరి నోళ్లల్లో నానుతున్న ఆంగ్ల భాషా పదాలు మన మాతృభాష తెలుగును కనుమరుగయ్యేట్టు చేస్తున్నాయి. తమిళులు, కన్నడిగులు, మళయాళీలు, మహారాష్ట్రీయులు అందరు తమ తమ మాతృభాషలకు ప్రాధాన్యమిస్తుంటే తెలుగు వారు మాత్రం ఆంగ్లానికి పట్ట్భాషేకం చేస్తున్నారు. ఇది మనకొక భాషా ప్రళయమే. ఒక అజ్ఞాత కవి వాపోయినట్టుగా ‘నా తెలుగు భాష నాణ్యమైన భాష, చక్కనైన భాష సరసమైన భాష...అమ్మా అనే నా భాష మమీగా మారింది, ఓయ్ అనే నా భాష హాయ్ కింద మారింది. పరభాషా మోహంతో పలుకలేని తెలుగువాని నరనరాల జీర్ణించిన నా తెలుగు భాష. నా మాతృభాష. ఇది ఒక తెలుగువాని వేదన. ఆ వేదనకు నిదర్శనం ప్రస్తుత సామాజిక వ్యవస్థలో ప్రస్ఫుటమవుతున్న విద్యా దృశ్య ప్రతిబింబం.
మాతృభాష ద్వారా విద్యాభ్యాసం విద్యా ర్థి వ్యక్తి వికాసానికి, మానసిక పరిణతికి, బౌద్ధిక పెంపుదలకు, ఆధ్యాత్మిక ఉన్నతికి, సృజనాత్మక అభివృద్ధికి కళాత్మక విద్యారంగాల కౌశలాలను, రాజకీయ, ప్రజాస్వామ్య, జ్ఞానాత్మక వృత్తి విలువలకు ప్రోదిగా నిలుస్తుందని గాంధీజీ, విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ మొదలైన విద్యావేత్తలు విశే్లషించారు. మాతృభాష తల్లిపాలు-పరభాష పోతపాలు అని చెప్పారు. కాని నేడు తల్లిపాలు చేదయ్యాయి. డబ్బాపాలు తీపి అయ్యాయి. ఆకర్షణీయమైన ఆంగ్లభాషకు అందరు సమ్మోహితులవుతున్నారు. ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిన తెలుగు భాష నేడు కొడిగట్టిపోతున్నది. ఉపాధ్యాయుల బోధనా పటిమ సన్నగిల్లింది. విద్యార్థుల భాషాభిరుచి, భాషాభిరతి, భాషాధ్యయనం, కళాప్రియత్వం కాటగలిసిపోయింది. భాషా ప్రయోగవైచిత్రి దెబ్బతింది.
ఒక విద్యావేత్త ‘కార్యక్రమం’ అనే పదాన్ని అనువదిస్తూ ‘కర్మకాండ’ అన్నారు. దానికి తెలుగువారు నవ్వాలో ఏడవాలో తెలియదు. అట్లే నిన్న మొన్నటి వరకు తెలుగు ఉపాధ్యాయ రచయితలు ప్రాథ మిక పాఠ్య గ్రంథాల్లో ‘ఉపాయం’ అనే పదానికి వ్యతిరేక పదం ‘అపాయం’ అంటూ వారి వైదుష్యాన్ని చాటారు. ‘ఉపాయం’ అనుపాయం, ‘అపాయం’ నిరపాయం అని రాయాలనే ధ్యాస వారికి లేదు. అట్లే ఒక వాచకంలో ‘బువ్వ తెల్లగా లేదు చల్లగా’ ఉందన్నారు. తెల్లగా, చల్లగా అనే పదాల సంబంధమేమిటి? పేరు కీర్తులార్జించిన ఒక విశ్వవిద్యాలయ తెలుగు ఆచార్యులు ప్రాథమిక పాఠ్య పుస్తకంలో రెండవ తరగతికి ‘అలవాట్లు’ అనే పాఠం రాస్తూ ‘అన్నం తినేముందు కాళ్లు చేతులు కడుక్కోవాలి. రెండుపూటల స్నానం చేయాలి. కాళ్లకు చెప్పులు వేసుకోవాలి, గోళ్లను కత్తిరించుకోవాలి’ అని రాసారు. దీనిలో పాఠ్యాంశ రచనలో వాక్య సంబంధం, అనుక్రమణత మృగ్యం. ఇలా మనలో పద ప్రయోగం, వాక్యానుసరణ సరిగా చేయలేని వారెందరో ఉన్నారు. అందుకోసం మన విద్యార్థులకు ప్రాథమిక స్థాయినుంచే పదవాక్య ప్రయోగ నైపుణ్యాలను సందర్భోచిత పద ప్రయోగ సామర్ధ్యాలను కలిగించాల్సిన అవసరం ఉంది. అది పాఠశాలలో ఉపాధ్యాయులు చేయవలసిన పని. ప్రణాళికేతర అంశాలైన సహ పాఠ్య కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యకలాపాల్లో వక్తృత్వ, వ్యాసరచన, పద్య పఠనం, గేయరచన మొదలైన వాటిని నిర్వహించాలి. మన విద్యార్ధుల్లో భావ సంపద ఎంతగా ఉన్నప్పటికీ వ్యక్తీకరణ సామర్ధ్యం లేకపోతే అదంతా వృధా అవుతుంది. కాబట్టి భాష-్భవనకు గల అవినాభావ సంబంధాన్ని గుర్తించి ఉపాధ్యాయులు విద్యార్థులలో విషయ, భాష, సాహిత్య, భావ సంపదను, భాషా వ్యక్తీకరణ సామర్ధ్యాలను పెంపొందించేందుకు నిరంతర ప్రయత్నం చేయాలి. పాఠశాల, తరగతి, కాలనిర్ణయ పట్టికలను అందుకు అనుగుణంగా రూపొందించుకోవాలి.
ముందు మన మాతృ భాషను సరిగా అభ్యసించి నైపుణ్యాలను పెంపొందించుకుంటే అది ఇతర భాషలను, విషయాలను నేర్చుకోవడానికి దోహదం చేస్తుంది. మానసిక శాస్త్రంలో దాన్ని శిక్షణ బదలాయింపు అంటారు. మన పూర్వీకులు ఉర్దు, ఆంగ్ల భాషలో విద్యనభ్యసించినా మాతృభాష తెలుగులో ఉన్నతమైన విలువల్ని సాధించి జాతి పతాకలుగా నిలిచారు. మరి ఈనాడు తెలుగు భాషను భ్రష్టు పట్టించడానికి కారణ భూతులెవరు? ఆలోచించవలసిన తరుణమిది. మానసిక శాస్తర్రీత్యా పటిష్టమైన అభ్యసనకు కొన్ని సూత్రాలున్నాయి. వాటిని అభ్యసనకు, బోధనా విధానానికి అనువర్తింపచేయడం సర్వదా ఆచరణీయం. తద్వారా విద్యార్థుల వైఖరులలో సముచిత మార్పులను కల్గించి భాషపట్ల ఆసక్తిని, అనురక్తిని కలిగించి, అవధానాన్ని కేంద్రీకరింపచేయడం తక్షణ కర్తవ్యం.

-డాక్టర్ సరోజన బండ (విశ్రాంతాచార్యులు, ప్రభుత్వ ఉన్నతస్థాయి విద్యా అధ్యయన సంస్థ)