మెయన్ ఫీచర్

నేరచరితులకు వోటుతో అడ్డుకట్ట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిమినల్ విచారణ ఎదుర్కొంటున్న చట్టసభల సభ్యులు దోషులుగా తేలకముందే వారిపై అనర్హత వేటు వేయలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పడం ప్రజాప్రతినిధులకు ఎంతో ఊరట కలిగించే అంశమే అయినా, సుప్రీం కోర్టు చేసిన పలు వ్యాఖ్యలు మాత్రం నేతలకు ఇబ్బందికరమే. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదైతే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కీలకమైన తీర్పునే వెలువరించింది. జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్, జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌లు ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నారు. ఇప్పటికే కేసులను ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులకు ఈ తీర్పు పెద్ద ఊరట. ఎందుకంటే సుప్రీం కోర్టు చేసిన పలు వాఖ్యానాలు చట్టరూపం దాల్చాలంటే ఇప్పట్లో అయ్యేపనికాదు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందు నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న నేతలకు సుప్రీం కోర్టు తీర్పు గట్టి భరోసానే. కేవలం అభియోగాలు నమోదైనంత మాత్రాన వారిపై అనర్హత వేటు వేయలేమని, వారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చునో లేదో అనే విషయం పార్లమెంటు తేల్చాలని ధర్మాసనం పేర్కొంది.
ప్రస్తుతం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలాక చట్టసభ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది. అయితే అభియోగాల దశ నుండే ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ప్రజాప్రయోజనాల సంస్థ (పిఐఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థతో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ 2011లో దాఖలు చేసిన పిటిషన్లపై ఎట్టకేలకు సుప్రీం కోర్టు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నవారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్నారని, ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకాలు ఉండాలని, నేరస్థులు ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొంటూ ఈ ఎన్‌జీఓ 2011లో కేసు దాఖలు చేసింది. ఆర్టికల్ 102 (ఎ, బి, సీ,డి) ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరింది. తొలుత ఈ పిటీషన్‌ను ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. మనోజ్ నరూలా వర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అభిప్రాయపడినా, ఈ సంస్కరణలకు ఆ తీర్పు సరిపోదని పిటిషనర్ వాదించడంతో పిల్‌ను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాగ ధర్మాసనానికి అప్పగించారు.
ఆగస్టు 9న ఈ పిల్‌పై విచారణ మొదలైంది. ఆగస్టు 28 వరకూ వాదోపవాదాలు జరిగాయి. చివరి రోజు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఆర్టికల్ 102 (1ఇ) ప్రకారం ఏదైనా శాసనాన్ని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది, పార్లమెంటు ఆమోదించిన ఏదైనా శాసనం కింద పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులైనపుడు మాత్రమే అటువంటి ప్రజాప్రతినిధులపై వేటు వేసేందుకు వీలుంటుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
ఇంకో పక్క ఆర్టికల్ 324 ప్రకారం ప్రజాప్రతినిధుల ఎంపిక, అర్హతలు, కొనసాగింపునకు సంబంధించి అన్ని అధికారాలూ ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగ పరంగా దఖలు పడ్డాయని, ఆ అంశాల్లో న్యాయస్థానం ‘లక్ష్మణరేఖ’ను దాటే ప్రసక్తే లేదని పేర్కొంది. ఆ మాటకొస్తే ప్రజాప్రతినిధులపై వేటు వేసేందుకు అవసరమైన అన్ని నిబంధనలూ ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్నాయని, అలాగే ఎన్నికల చిహ్నాలచట్టం 1968 ప్రకారం కూడా ఒక దశలో అభ్యర్ధుల ఎన్నికల చిహ్నాన్ని రద్దు చేసే వీలుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అవినీతి, అక్రమాలకు, తీవ్ర నేరాలకు పాల్పడే నేతలను ఎన్నికలకు దూరంగా ఉంచాలనే ప్రక్రియకు 2002లోనే బీజం పడింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తమపై ఉన్న అభియోగాలకు సంబంధించిన అఫిడవిట్‌ను ఎన్నికల బీ-్ఫరంతో పాటు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తమ నేతలకు సంబంధించిన విషయాలను తెలుసుకునే హక్కును ఓటర్లకు గుర్తుచేసింది. 2013 జూలైలో రెండేళ్లకు మించి శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలు కల్పించే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని క్లాజు 8(4)ను కొట్టివేసింది. రెండేళ్లకు మించి శిక్ష పడిన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే నిబంధనను వారు తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలను లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2013 జూలై 10న సుప్రీం కోర్టు అడ్డుకట్ట వేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల్లో ఎవరూ నచ్చని పరిస్థితి ఏర్పడితే ‘వీరెవరూ కాదు’ (నోటా) అనే అవకాశం పోలింగ్ సమయంలో ఓటర్లకు కల్పించాలని సుప్రీం కోర్టు 2004 మార్చిలో ఆదేశించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని మంత్రులుగా చేర్చుకోరాదని ప్రధానికి, ముఖ్యమంత్రులకు మనోజ్ నరూలా కేసులో సుప్రీం కోర్టు సూచించింది. ఐదేళ్లకు మించి శిక్ష పడేంత అత్యంత తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్న వారిని అనర్హులుగా ప్రకటించడం, జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించడంపై విచారణాధికారాన్ని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు అప్పగిస్తూ 2016 మార్చిలో ఆదేశించింది.
ప్రస్తుత విశే్లషణల ప్రకారం చట్టసభల్లో మూడో వంతు సభ్యులు నేరగాళ్లేనని 2017లో ఏడీఆర్ సంస్థ ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టం క్లాజు 8(4) ప్రకారం శిక్ష పడితే ప్రజా ప్రతినిధులు అనర్హులయ్యేవారు. ఆ విధంగానే ఎంపీ రషీద్ మసూద్ పదవిని కోల్పోయారు. ఈ క్లాజు సవరణకు అప్పటి న్యాయశాఖా మంత్రి కపిల్ సిబల్ 2013లో సవరణ చట్టాన్ని తీసుకువచ్చారు. ఒక ఆర్డినెన్స్ తీసుకువద్దామని అనుకున్నా, ఆ ఆర్డినెన్స్ ముసాయిదాను రాహుల్ గాంధీ 2013 సెప్టెంబర్ 24న పత్రికావిలేకరుల సమావేశంలో చించి వేయడంతో దాన్ని విరమించుకుంటున్నట్టు అక్టోబర్ 2న కేంద్రం ప్రకటించింది.
అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆనాడే నోటీసులు ఇస్తూ, నేర చరిత్ర ఉన్న నేతలు చట్టసభల్లోకి ప్రవేశించకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ కేంద్రాన్ని నిలదీసింది. 2014లో తీసుకున్న గణాంకాల ప్రకారం 13500 మంది నేతలపై తీవ్రమైన నేరాల కేసులున్నట్టు తేలింది. నేరచరిత్ర ఉన్నప్పటికీ వీరంతా మళ్లీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తేలడంతో ఇలాంటివారిని నిలువరించాలంటే వీరిపై ఉన్న కేసులను త్వరతిగతిన పరిష్కరించాలని భావించిన సర్వోన్నత న్యాయస్థానం కేసుల పరిష్కారానికి ఫాస్టు ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 2018 మార్చి 1 నుండి ఇవి పనిచేసేలా చూడాలని కూడా పేర్కొంది. దానికి అనుగుణంగా ఫాస్టు ట్రాకు కోర్టుల ఏర్పాటు వరకూ అంతా పద్ధతి ప్రకారమే జరిగినా, తర్వాతి ప్రక్రియ మాత్రం అనుకున్నంత వేగంగా జరగలేదు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్సు సంస్థ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను విశే్లషించింది. ఈ తీవ్రతను గుర్తించిన సుప్రీం కోర్టు ఎట్టకేలకు తన తీర్పును వెలువరించింది.
క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులపై అనర్హత వేటు వేసే స్థాయిలో న్యాయస్థానం లేదని , ఈ విషయంలో తాము లక్ష్మణ రేఖ దాటలేమని చెబుతూనే సుప్రీం కోర్టు కొన్ని నిబంధనలను మాత్రం విధించింది. నేరస్థులను చట్టసభలకు దూరంగా ఉంచాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించింది.క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనేది పార్లమెంటు తేల్చాల్సి ఉందని న్యాయమూర్తులు చెప్పారు. నేరచరిత్ర ఉన్న నేతలు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ధ్రువపత్రాలు సమర్పించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదై ఉంటే వాటికి సంబంధించిన వివరాలను తప్పనిసరి పేర్కొనాలని చెప్పింది. పార్టీలు కూడా తమ అభ్యర్ధుల కేసుల వివరాలను ఆయా పార్టీల వెబ్ సైట్‌లలో ఉంచాలని, ఈ మేరకు స్థానిక పత్రికల్లో రెండు మూడు మార్లు ప్రకటనలు జారీ చేయాలని కూడా సూచించింది. మరో పక్క ప్రభుత్వం ప్రజాప్రతినిధులపై నేరారోపణల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొంది. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ -8 ప్రకారం నేరం రుజువైన వ్యక్తి శిక్ష అమలులోకి వచ్చిన తేదీ నుండి జైలు నుండి విడుదలైన ఆరు సంవత్సరాల వరకూ ఎన్నికల్లోపోటీ చేయడానికి అనర్హుడవుతాడు. అయితే ఇదే చట్టంలోని 8 సబ్ సెక్షన్ -4 ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కొన్ని మినహాయింపులను ఇచ్చింది.
ఈ మినహాయింపుల ప్రకారం అప్పటికే ఎంపీ, ఎంఎల్‌ఏగా ఉన్న వ్యక్తి చేసిన నేరం రుజువై శిక్ష పడినా మూడు నెలల వరకూ అనర్హత నిబంధనలు అమలులోకి రావు. ఈ లొసుగును అడ్డం పెట్టుకుని ఉన్నతన్యాయస్థానాలకు అప్పీలు చేస్తూ నేరస్థులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ మినహాయింపే నేరస్తులు దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకునేందుకు ఊతం ఇస్తోంది. ఫలితంగా చట్టసభల్లో నేరస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 15వ లోక్‌సభలో 128 మంది సభ్యులపై క్రిమినల్ కేసలు ఉండగా, ప్రస్తుత లోక్‌సభలో ఆ సంఖ్య 162కు పెరిగింది. హత్యలు, కిడ్నాప్‌లు, మానభంగాలు వంటి తీవ్ర స్వభావం ఉన్న నేరారోపణలను గతంలో 58 మంది సభ్యులు ఎదుర్కొంటే, నేడు అది 76కు పెరిగింది. అంటే 18 శాతం పెరిగింది. పార్లమెంటుతో పాటు శాసనసభల్లో కలిపి 30 శాతం మందికి పైగా సభ్యులు నేరారోపణలు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెముక్రాటిక్ రిఫార్మ్సు సంస్థ పేర్కొంటోంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ కూడా నేరచరితులపై నివేదికను విడుదల చేసింది. అంతా బహిరంగంగానే జరుగుతున్నా దీనిని ఎదుర్కొనేందుకు ఒక్కో మారు అధికారపక్షం విపక్షాల నేతలపై తప్పుడు కేసులు బనాయించిన సందర్భాలు లేకపోలేదు. ఈ పోటాపోటీ వ్యవహారాలకు చరమగీతం పలకాలి.
భారత ప్రజాస్వామ్యం పటిష్టం కావాలంటే ఈ అంశాలపై మరింత బహిరంగ చర్చ జరగాలి. ప్రలోభాలను పక్కన పెట్టి బాధ్యతతో మెలిగినపుడే ఓటర్లకు విలువ పెరుగుతుంది. ప్రతి ఓటరు నిర్బంధంగా ఓటు వేసే నిబంధనలు రావాలి, నూరు శాతం పోలింగ్ జరగాలి. ఓటర్లు మనసుతో ఆలోచించి తమ ఓటుతోనే నేరచరితులను అడ్డుకోవాలి, ఎన్ని మాటలు చెప్పినా, ప్రజల్లో చైతన్యం రానంత వరకూ ఎన్ని చట్టాలు చేసినా వృధా అవుతుంది. ఈదిశలో విస్తృత స్థాయి చర్చకు మేధావులు, ప్రజాస్వామ్యవాదులు నడుం బిగించాలి. రాజకీయ పార్టీలు గతం మరచి, వర్తమానంతో ఆలోచించాలి.

-బీవీ ప్రసాద్ 98499 98090