ఎడిట్ పేజీ

తిరుగులేని మన న్యాయ స్వతంత్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునె్నన్నడూ లేనంతగా ఇపుడు కుల, మత, సైద్ధాంతిక విభేదాలతో జనం చీలిపోయారంటూ సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యా యమూర్తిగా బాధ్యతలు స్వీకరించే జస్టిస్ రంజన్ గొగోయ్ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆలోచనల్లో పడవేశాయి. ఏం చదవాలి? ఏం తినాలి? ఎలా మాట్లాడాలి? వంటి అంశాలు ఇపుడు ఎవరూ వ్యక్తిగతమైనవిగా భావించడం లేదని, ఇవన్నీ ప్రజలను దారుణంగా వేరు చేస్తున్నాయంటూ గొగోయ్ చేసిన వ్యాఖ్యలు- మార్కెట్ దృక్పథం, దానికి ఊతమిస్తున్న రాజకీయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ నిస్తేజాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
న్యాయస్థానం ప్రకటించిన తీర్పు పాఠం వాదికి, ప్రతివాదికి అందాలంటే ఒకప్పుడు నెలల సమయం పట్టేది. ఇపుడు కొద్ది గంటల వ్యవధిలోనే తీర్పు సమగ్ర పాఠం తెలుసుకునే వీలు కలుగుతోంది. రానున్న రోజుల్లో కొద్ది నిమిషాల వ్యవధిలోనే తీర్పు పాఠం తెలుసుకునేలా సర్వోన్నత న్యాయస్థానం కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా సుప్రీం కోర్టు ఇటీవల చేపట్టిన సంస్కరణల్లో ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ దీపక్ మిశ్రా సేవలు అనన్య సామాన్యం. సుప్రీంలో ప్రధాన న్యాయమూర్తికి, సీనియర్ న్యాయమూర్తులకు మధ్య ఉన్న విభజన రేఖను గిరిగీసి మరీ చెప్పిన ఘనత దీపక్ మిశ్రాదే.
రాజ్యాంగంలోని నాలుగో అధ్యాయం ఆర్టికల్-124 నుండి ఆర్టికల్ 147 వరకూ సుప్రీం కోర్టు కార్యకలాపాలపై చాలా స్పష్టత ఉంది. సుప్రీం కోర్టు ఏర్పాటు, నిర్మాణం, న్యాయమూర్తుల వేతనాలు, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను సుప్రీంలో న్యాయమూర్తులుగా నియమించే అంశం, ప్రాథమిక విచారణాధికారాలు, పున:సమీక్ష, రిట్లు జారీ చేయడం, అనుబంధ అధికారాలు అన్నింటిపైనా స్పష్టత ఉంది. అయినా సుప్రీం కోర్టులో అధికారాల విషయంలో రాజ్యాంగపరమైన అనుమానాలు వ్యక్తమైనపుడు కచ్చితంగా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలే తుదకు శాసనం అవుతాయి.
1977లో బార్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేసుకున్న తర్వాత న్యాయవాదిగా దీపక్ మిశ్రా వ్యవహరించిన తీరు అందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది. నాలుగు దశాబ్దాలుగా ఆయన న్యాయవాదిగా, న్యాయమూర్తిగా అందించిన సేవలు చరిత్ర కాబోతున్నాయి. ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఆయన ఇచ్చిన తీర్పులు కొంత మందికి ఆశ్చర్యాన్ని కలిగించగా, మరికొంత మంది పెదవి విరిచారు, ఇంకొంత మంది సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒకే తీర్పు పాఠంపై భారతీయులు విభిన్నంగా స్పందించారు. దీనికి కారణం దీపక్ మిశ్రా తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే. ఎన్నడూ ఎక్కడా వెరవని తత్వం ఆయనను ఒక ప్రత్యేక శైలిలో నిలిపింది. సుప్రీం కోర్టుకు మహామహులైన రాజ్యాంగ నిపుణులు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినా, అత్యంత వివాదాస్పద సమయంలోనూ, సంక్లిష్ట అంశాల్లోనూ సాహసోపేతంగా తీర్పులివ్వడంలో ఎన్నడూ వెరవలేదు. దీపక్ మిశ్రా 1996లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మధ్యప్రదేశ్, పాట్నా, ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2011 అక్టోబర్ 10న ఆయన సుప్రీం న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆరేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించాక, జస్టిస్ జేఎస్ ఖేహార్ తర్వాత 45వ భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగి 13 నెలల వ్యవధిలో సంచలన తీర్పులకు కేంద్ర బిందువై పదవీ విరమణ చేశారు. దీపక్ మిశ్రా హయాంలోనే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మధ్య తుఫానే్ల వచ్చాయి. కొంత మంది బహిరంగంగా ముందుకు వచ్చి మీడియాతో మాట్లాడటం సుప్రీం చరిత్రలో సంచలనం రేపింది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసఫ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ రంజన్ గొగోయ్ మీడియా ముందుకు రావడం న్యాయవ్యవస్థలో చరిత్ర. దీపక్ మిశ్రా స్థానంలో కొత్త ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్ అక్టోబర్ 3వ తేదీన బాధ్యతలు చేపడతారు.
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా, న్యాయమూర్తిగా ఉన్న సమయంలో దీపక్ మిశ్రా ఇచ్చిన తీర్పులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదని తేల్చి చెప్పిన ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహించారు. ఢిల్లీ ప్రభుత్వానికి , లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య వివాదం చెలరేగినపుడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు స్వతంత్ర నిర్ణయాధికారం ఉండదని మరో తీర్పులో చెప్పారు. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన, దేశం నుండి రోహింగ్యాలను వెనక్కు పంపడం, ఎస్సీ, ఎస్టీ చట్టం అమలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధం తగదంటూ ఇచ్చిన తీర్పులు విస్తృత చర్చకు దారితీశాయి. శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించి ధర్మాసనంలో ఉన్న మరో మహిళా న్యాయమూర్తి భిన్నమైన వాదనను వినిపించడమూ చర్చనీయాంశమైంది. ఇది మతపరమైన విశ్వాసాల్లోకి న్యాయవ్యవస్థ చొరబడటమే అని కొంత మంది ఆరోపించారు. ప్రార్థనలో లింగ వివక్ష ఏమిటి? అని మరికొందరు వాదించారు. 497 సెక్షన్ తొలగింపు, స్వలింగ సంపర్కం , అసహజ లైంగిక చర్యలకు సంబంధించిన ఐపీసీ 377ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడం పెను సంచలనానే్న రేపాయి. 2009లో స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వగా, సుప్రీం కోర్టు ఈ తీర్పును 2013లో రద్దు చేస్తూ , పార్లమెంటు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించింది. 497ను రద్దు చేయడం హిందూ సమాజంలో వైవాహిక సంబంధాలను దెబ్బతీసేలా ఉందనే భావన కూడా అందరిలో వ్యక్తమైంది. భర్త అనుమతి లేకుండా వివాహితతో లైంగిక సంబంధం నేరంగా పరిగణించేవారు. ఇది నేరం కాదన్న సుప్రీంకోర్టు తీర్పుపై సానుకూలంగా కూడా స్పందన వ్యక్తమైంది. ‘ఆధార్’ విషయంలోనూ అన్నింటికీ నిర్బంధం చేయడం సముచితంగా లేదని, అవసరం లేని విషయాలకు ఆధార్ కార్డుల అనుసంధానం నిలిపివేయాలని సుప్రీం ఇచ్చిన తీర్పు చాలామందికి ఉపశమనం కలిగించింది. అయోధ్య వివాదంపై న్యాయస్థానం ఆలోచన ఏమిటో కూడా స్పష్టం చేశారు. ముంబయి బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్‌కు విధించిన మరణ శిక్షను సమర్ధించారు. నిర్భయ కేసు నిందితుల శిక్షలోనూ ఆయన ప్రత్యేక శైలిని చాటుకున్నారు. జస్టిస్ మిశ్రా హయాంలోనే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు కోర్టు ధిక్కారం కింద ఆరు నెలల జైలు శిక్ష విధించారు. మూకహత్యల కట్టడికి ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బీసీసీఐ సంస్కరణలు, ఖాప్ పంచాయితీలపై నిషేధం వంటి తీర్పులు దేశ చరిత్రగతినే మార్చేశాయి.
పాలనాపరంగా దీపక్ మిశ్రా తీసుకున్న పలు నిర్ణయాలను జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సహా నలుగురు న్యాయమూర్తులు విభేదించారు. ఆరోపణలు ఎదుర్కొనే న్యాయమూర్తి స్వయంగా ఆ కేసులను విచారించడం లేదా తనకు అనుకూలురైన న్యాయమూర్తుల బెంచ్‌కు అప్పగించడం సరికాదనేది వీరి వాదన. దీంతో సీనియర్ల జాబితాలో ఉన్న మొదటి ఇద్దరి మధ్య బహిరంగంగానే వివాదాలు చెలరేగాయి. అలాంటి సమయంలోనూ మిశ్రా స్థితప్రజ్ఞతను పాటించారు. లఖ్‌నవూ కేంద్రంగా ఉన్న ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు చెందిన వైద్య కళాశాలకు ఎంసీఐ అనుబంధ గుర్తింపు రద్దు చేయగా, ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించాలని సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో అనేక అనుమానాలున్నాయంటూ ‘క్యాంపైన్ ఫర్ జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫార్మ్సు’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఇందులో ఒడిశా హైకోర్టు న్యాయమూర్తితో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల పాత్ర కూడా ఉందనేది పిటీషనర్ వాదన. ఈ వ్యాజ్యం చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు రావడంతో ప్రధాన న్యాయమూర్తి లేని ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా ఉత్తర్వులు జారీ చేసే అధికారం చలమేశ్వర్‌కు లేదని ‘మాస్టర్ ఆఫ్ ద రోస్టర్ ’ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మాత్రమేనని, ఏ కేసులు ఎవరికి కేటాయించాలనే విస్తృతాధికారం ఆయనకు మాత్రమే ఉంటుందని దీపక్ మిశ్రా పేర్కొన్నారు. చలమేశ్వర్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, ఈ కేసులను ముగ్గురు న్యాయమూర్తులున్న బెంచ్‌కు అప్పగించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ధర్మాసనంలో కొనసాగడానికి వీలు లేదంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొంత మంది ఎంపీలు జస్టిస్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని రాజ్యసభ చైర్మన్ అయిన ఉప రాష్టప్రతిని కోరారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు.
తీర్పులు చదివే సమయంలోనూ, విచారణ సమయంలోనూ, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నపుడు దీపక్ మిశ్రా తరచూ మానవీయ కోణాన్ని ప్రస్తావించే వారు. పనిలో పనిగా కార్యనిర్వాహక వ్యవస్థ నిస్తేజాన్ని ఎలాంటి సంకోచం లేకుండా ఎండగట్టేవారు. లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్న అంశం ప్రస్తావనకు వచ్చినపుడు భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే పకడ్బందీ న్యాయవ్యవస్థ అని కొనియాడారు. ఎన్ని కేసులు ఉన్నా పరిష్కరించే సత్తా న్యాయవ్యవస్థకు ఉందనే ధీమాను కూడా వ్యక్తం చేసేవారు. కేసు ఏదైనా న్యాయానికి తుదకు మానవీయ కోణం ఉండాలనేదే ఆయన భావన. ఎవరినైనా తాను- ‘వారి చరిత్ర ఆధారంగా కాకుండా వారి దృక్పథం ఆధారంగా’ అంచనా వేస్తానని ఆయన చెప్పిన మాటల్లో లోతైన ఆలోచన వ్యక్తమవుతోంది. న్యాయవ్యవస్థ ఎపుడూ ఫలానా వైపు మొగ్గుచూపదు, నిష్పాక్షికతకు సూచికగా న్యాయదేవత కళ్లకు గంతలు కడతాం. చిన్నది , పెద్దది అనే తేడా లేకుండా అన్ని కేసులను ఒకేలా చూస్తాం, ఎల్లపుడూ తీర్పులో మానవీయ కోణం ఉండాలి, ఒకొక్కరి చరిత్ర ఒక్కోలా ఉంటుంది అని చెప్పడం ద్వారా తన ధోరణిని స్పష్టం చేశారు.
కొత్త ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రంజన్ గొగోయ్ 2012 ఏప్రిల్ నుండి సుప్రీం కోర్టులో ఉన్నారు. రాజకీయ నేతల క్రిమినల్ కేసులపై విచారణను వేగవంతం చేయాలనే అంశంలో ప్రభుత్వాన్ని దీటుగా నిలదీసి ప్రత్యేక కోర్టుల ఏర్పాటులో తనదైన ముద్ర వేసుకున్నారు. దేశంలో అన్ని వ్యవస్థలూ గందరగోళానికి గురైనపుడు లైట్‌హౌస్‌లా మార్గాన్ని చూపించడంలో సుప్రీం కోర్టు ఎన్నడూ తన బాధ్యతలను విస్మరించలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని అంగాలూ తమదే పైచేయి అని వివాదాలకు దిగినపుడు కూడా తనదైన శైలిలో వ్యవహరిస్తూ పరిస్థితులను చక్కదిద్దిన ఘనకీర్తి సుప్రీం కోర్టుదే. తీర్పులు వెలువడినపుడు ఉన్న ఆవేశకావేశాలు తీర్పు అమలు ద్వారా పరిస్థితులను చక్కదిద్దినపుడు న్యాయమూర్తుల సూక్ష్మదృష్టి, దూరదృష్టి కూడా అర్ధమవుతాయి. ఈ క్రమంలో న్యాయవ్యవస్థ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ముద్రను దీపక్ మిశ్రా వేసుకున్నారనేది నిర్వివాదాంశం.

-బీవీ ప్రసాద్ 98499 98090